పెరిగిపోతున్న అరాచక ధోరణులు..

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశమంతటా కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అరాచక చర్యలకు పూనుకుంటు న్నాయి. బిజెపికి చెందిన దళాలు, పరిషత్తులు, వాహినులు వీటిలో ముందెత్తున పాల్గొంటున్నాయి. కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ శక్తులకు మద్దతిస్తున్నారు. శివసేన కూడా బిజెపి కంటే తానే ఒక ఆకు ఎక్కువ చదివాననే చందం గా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. మైనారిటీలు, దళితులు, అభ్యుదయవాదులు, చింతనాపరులు, కవులు ఈ శక్తుల చేతుల్లో చంపబడుతున్నారు. అవమానాల పాలవుతు న్నారు. మైనార్టీల ప్రార్థనాలయాలు ధ్వంసమ వుతున్నాయి. తమకు ఇష్టం లేనిది ఏదీ జరగకూడదని ఈ శక్తులు భావిస్తున్నాయి. ఏమి తిన కూడదో, ఏమి రాయకూడదో, ఏమి మాట్లాడకూడదో ఈ శక్తులే నిర్ణ యిస్తాయి. మన దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ శక్తులు వెక్కిరిస్తు న్నాయి. అనేకమైన భాషలు, మతాలు, ఆచారాలు, కట్టుబాట్లు, అలవాట్లు, ఆలోచనలతో కూడిన విభిన్న సంస్కృతుల సంగమం మన దేశం. ఇటువంటి గొప్ప సంస్క ృతిని నాశనం చేయటానికి ఈ శక్తులు నడుం కట్టాయి.
మనది లౌకికరాజ్యం. అంటే రాజ్యం ప్రభుత్వ పాలనను మతాచారాల నుంచి విడగొడుతుంది. రాజకీయాలకు, మతానికి సంబంధం లేకుండా చేస్తుంది. మతాచారాన్ని వ్యక్తిగతమైందిగా చూస్తుంది. వామపక్ష పార్టీలు మినహా మిగతా రాజకీయ పార్టీలు మన లౌకికతత్వానికి తూట్లు పొడుస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం మతం, కులం, ప్రాంతీయ భావాలను వాడుకుంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను ఒక మతాచార స్థాయికి దిగజారుస్తున్నాయి. ఈ విషయంలో బిజెపి ముందు స్థానంలో ఉంది. మైనార్టీలపై దాడులు, విషం చిమ్మటం ద్వారా అది అధికారంలోకి రాగలిగిందనేది నగ సత్యం.
మతోన్మాదాన్ని రెచ్చ గొట్టటంతోపాటు కాంగ్రెసు పార్టీ మీద వచ్చిన అసంతృప్తిని కూడా ఆధారం చేసుకుని బిజెపి అధి కారంలోకొచ్చింది. కాంగ్రెసు ప్రభుత్వమైనా, బిజెపి ప్రభుత్వ మైనా ప్రజావ్యతిరేక విధానాలలో మార్పుండదు. ప్రజల అసంతృప్తిని మతోన్మాదం వైపు మళ్ళించే కార్యక్రమం బిజెపి చేస్తుంది. కార్పొరేట్‌ అనుకూల విధానాలను యథాతథంగా, వేగంగా కొనసాగిస్తుంది. అందుకే దేశ, విదేశీ, కార్పొరేట్‌ కంపెనీలు, మీడియా పని గట్టుకొని మోడీని గెలిపించాయి. వాటి రుణం తీర్చుకునేలా మోడీ ప్రభుత్వం కార్మికులు, ప్రజల హక్కులను, పొందుతున్న ప్రయోజనాలను రద్దు పరుస్తున్నది.
మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనలు
సమాజం ఎప్పుడైనా వాస్తవం మీద, శాస్త్రీయత మీద ఆధారపడి అభివృద్ధి చెందుతుంది. నమ్మకం ఆధారంగా అభివృద్ధి జరగదు. నమ్మకం ఆధారంగా ఆచరణ ఉంటే సమాజం వెనక్కి పోతుంది. శాస్త్రీయుత మీద ఆధారపడి అభిప్రాయాలు ఉండాలని, కార్యాచరణ ఉండాలి, కానీ నమ్మకాల మీద, భావోద్వేగాల మీద ఆధారపడి ఉండకూడదని చెప్పిన గోవింద పన్సారే, ప్రొఫెసర్‌ యంయం కల్బుర్గీ, డాక్టర్‌ నరేంద్ర దాభోల్కర్‌ వంటి ప్రఖ్యాత వ్యక్తులను, సంఘసేవకులను మూఢత్వాన్ని తలకెక్కించుకున్న అరాచక శక్తులు హత్యచేశాయి. కల్బుర్గి హత్యకు నిరసనగా సాహిత్య అకాడమి అవార్డులు పొందిన రచయితలందరూ తమ అవార్డులను అకాడమీకి వెనక్కి తిప్పిపంపించారు. చాలా కాలంపాటు మౌనం వహించిన సాహిత్య అకాడమీ నిరసనలు మిన్ను ముట్టటంతో అత్యవసరంగా సమావేశమై తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు రచయితలకు ఉంటుందనీ, వారి మీద దేశంలో ఎక్కడ దాడులు జరిగినా ఖండిస్తామనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దోషుల్ని పట్టుకుని శిక్షించాలనీ, రచయితలకు రక్షణ కల్పించాలని కోరుతూ తీర్మానించింది.
దేశం తల దించుకోవాల్సిన మరో సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని దాద్రి గ్రామంలో జరిగింది. గోమాంసం తినకూ డదనే నిషేధం దేశంలో ఎక్కడా లేదు. ముస్లిం వ్యతిరేక ఉన్మా దాన్ని సృష్టించి బీహార్‌ ఎన్నికల్లో హిందువుల ఓట్లు కాజేయా లన్న బిజెపి ప్లాను ప్రకారం ఇది జరిగింది. ఒక మైనార్టీని హత్య చేయటం ఒక దారుణమయితే, ఆ హత్యను బిజెపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వెనకేసుకురావటం దేశానికి పట్టిన చీడ వంటిది. ఇదే బిజెపికి చెందిన ఒక ఎంపికి గొడ్డు మాంసం ఎగుమతి చేసే కంపెనీలో భాగస్వామ్యమున్నట్లు హిందూ పత్రిక బయటపెట్టింది. తన వ్యాపారానికి గోవధ చేయొచ్చు. కానీ మైనార్టీలు మాత్రం గోవు మాంసం తినకూడదు. రెండోది రాజకీయ వ్యాపారమా?
హర్యానా ముఖ్యమంత్రి గొడ్డు మాంసం తినేవారెవరూ దేశంలో ఉండటానికి వీల్లేదని పరోక్షంగా తాఖీదిచ్చారు. ఇదే హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్‌ దగ్గరలోని ఒక గ్రామంలో నిద్రి స్తున్న దళిత కుటుంబం ఇంటికి అగ్రకులస్తులు నిప్పుపెట్టారు. ఇద్దరు పసి పిల్లలు మంటల్లో కాలి బూడిదయ్యారు. వారి తండ్రి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. దేశమంతటా ఈ హత్యలకు చలించింది. ఎటువంటి శషబిషలు లేకుండా తీవ్రంగా ఖండిం చింది. అయినా ప్రధాన మంత్రి నోరు విప్పలేదు. ఎన్‌డిఏ ప్రభు త్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన అరాచకాలకు పాల్పడటం లో బిజెపితో పోటీ పడుతున్నది. ఎవరితో ఎవరు మాట్లాడాలో, ఎవరు మాట్లాడకూడదో శివసేన నిర్ణయిస్తుంది. ప్రత్యేకించి పాకిస్తాన్‌ వ్యతిరేకతను రెచ్చగొడుతుంది. ఇంత పెద్ద దారు ణాలు దేశమంతా జరుగుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నా రు. అయినా ఎక్కడా, ఎప్పుడూ స్పందించలేదు. ఈ దారుణా లను ఖండించిన పాపానపోలేదు.
ఐక్యతను కాపాడుకోవాలి
కార్మికులను, ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన తరుణంలో మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చుపెట్టాలని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నది. మతోన్మాద శక్తులు లేనిపోని పుకార్లు లేవదీసి మైనార్టీలను, దళితులను లక్ష్యంగా పెట్టుకొని దాడులకు పురికొల్పుతున్నాయి. ఈ శక్తులకు ప్రజాస్వామ్యమన్నా, లౌకికతత్వమన్నా, మతసామరస్యమన్నా, అభ్యుదయమన్నా గిట్టదు. మూఢత్వంతో సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ శక్తుల పట్ల కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలి. కార్మిక ఐక్యతను కనురెప్పలా కాపాడుకోవాలి.
- పి అజయ్‌కుమార్‌ 
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర కార్యదర్శి)