గ్రీసులో చోటుచేసుకున్న తాజా పరిణామాలు వంచనాశిల్ప కళను పరాకాష్టకు తీసుకుపోయాయి. ఏ ఆర్థిక సంస్కరణలు తమ జీవితాలను అతలాకుతలం చేస్తాయని అక్కడి ప్రజానీకం భావించిందో ఆ నరకకూపం వైపే తమ ప్రజలను నడిపించడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధపడిన తీరు దిగ్భ్రాంతికరం. ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా నో అంటూ గ్రీసు ప్రజానీకం ఇచ్చిన తీర్పును అక్కడి పాలకపక్షం తారుమారు చేస్తున్న తీరు దిగజారుడుతనానికి నిలువెత్తు నిదర్శనం. నిరుపేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకు పంచిపెట్టే విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకమంతా ఏకతాటిపై నిలిచిన తరువాత కూడా ఇంత లొంగుబాటు ప్రదర్శించడం దారుణం. ఏ విధానాలనైతే ప్రజలు తిరస్కరించారో అవే సంక్షోభానికి పరిష్కార మార్గాలుగా ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ మాట్లాడటం హాస్యాస్పదం. ఒక విధంగా ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజానీకం ఇచ్చిన అవకాశాన్ని ఆయన చేజేతులా పాడుచేసు కున్నారు. తాను కూడా కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మనని నిరూపించుకోవడానికే తాపత్రయపడ్డారు. వాస్తవానికి ఐరోపా యూనియన్ (ఇయు), ఐఎంఎఫ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇసిబి) ఆదేశిత విధానాలకు తాను వ్యతిరేకమన్నట్లు జులై 5 రెఫరెండంకు ముందు ఆయన ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే.
గ్రీసు ప్రజలనుద్దేశించి వివిధ సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు ఇదే రీతిన సాగాయి. దేశ ప్రజల మూలుగలను పీల్చివేసే విధానాలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన అనేక సందర్భాల్లో ప్రకటించారు. గ్రీసుతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గం, దాని అనుకూల శక్తులు ప్రధానమంత్రి వైఖరిని బాహాటంగానే వ్యతిరేకించినా, తమ చెప్పుచేతల్లో నడిచే సెంట్రల్ బ్యాంకు సహకారంతో చెల్లింపుల సంక్షోభానికి తెరతీసినా, ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ మీడియా ఆర్థిక స్థితిపై భయంగొలిపే కథనాలను వండివార్చినా, తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే భవిష్యత్‌లో రుణాలకు అవకాశమే లేదంటూ ఐఎంఎఫ్, ఐరోపా యూనియన్ నేరుగా బ్లాక్ మెయిల్‌కు దిగినా ఖాతరు చేయని ఆయన, రెఫరెండంలో విజ యం సాధించిన తరువాత అవే సంస్థలకు లొంగిన తీరు విస్మయం కలిగించకమానదు. రెఫరెండంలో 63 శాతానికి పైగా గ్రీస్ ప్రజలు ఇయు, ఐఎంఎఫ్ విధానాలను తిరస్కరిస్తూ 'నో' అని తమ తీర్పును ప్రకటించారు. తాము పనిచేసే కార్పొ రేట్ సంస్థల హెచ్చరికలకు భయపడి ఆమోదాన్ని తెలిపిన వారి సంఖ్య మిగిలిన వారిలో గణనీయంగానే ఉంది. ఏ ప్రజాస్వా మ్య సూత్రాల ప్రకారం చూసుకున్నా ఇది స్పష్టమైన తీర్పే! ఈ తీర్పు తరువాతే గ్రీసు పాలకపక్ష అవకాశవాదం బట్టబయ లైంది. సంక్షోభం నుంచి బయటపడేసే పేరిట ప్రజాతీర్పును తుంగలో తొక్కిన తీరు అన్ని విలువలను దిగజార్చింది.
వాస్తవానికి రెఫరెండం ప్రక్రియే ఒక ప్రహసనంలా సాగిందన్న విమర్శలు ఉన్నాయి. తాజా పరిణామాలు ఆ విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. దేశ ప్రజలపై 800 కోట్ల యూరోల మేర భారం మోపే ఇయు, ఐఎంఎఫ్, ఇసిబి ప్రతిపాదనలను ఆమోదించాలా, వద్దా అంటూ రెఫరెండంకు వెళ్లిన ప్రభుత్వం 'వద్దు' (నో) అని ఓటు వేయాలని పిలుపునిచ్చింది. దీనికి బదులుగా మరో ప్రతిపాదనను ఆ దేశ ప్రభుత్వం సిద్ధం చేసిందని, 55 పేజీల ఆ ప్రత్యామ్నాయంలో ఎనిమిది పేజీల్లో ప్రజలకు ఇచ్చే సబ్సిడీల కోతలు, నూతన భారాలు వంటివి ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ప్రజలు నో అని చెబితే దానిని తాము రూపొందించిన ప్రతిపాదనలకు అనుకూలమని ప్రభుత్వం చెప్పుకుంటున్నదన్న ఆందోళనలు వచ్చాయి.
రెఫరెండంకు కొద్ది రోజుల ముందు గ్రీస్ పార్లమెంటులో ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) ఇదే విషయాన్ని ప్రస్తావించింది. రెఫరెండంకు ముందే ప్రభుత్వం రూపొం దించిన ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని, ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ రద్దు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. దీన్ని పాలకపక్షం తిరస్కరించడంతో ఇయు, ఐఎంఎఫ్, ఇసిబిల ప్రతిపాదనతో పాటు ప్రభుత్వ ప్రతి పాదనకు నో చెబుతూ బ్యాలెట్ పేపర్‌పై రాయాలని పిలుపు నిచ్చింది. దాదాపుగా నాలుగు కోట్ల మంది ప్రజలు గ్రీసు కమ్యూనిస్టు పార్టీ పిలుపునకు స్పందించినట్లు రెఫరెండం ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ భయాలే నిజాలవ ుతుండటం దురదృష్టకరం. ద్రవ్య సంస్థలు రూపొందించిన షరతుల ప్రతిపాదనలకు, ప్రభుత్వం రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు పెద్దగా తేడా లేకపోవడం ప్రజానీకాన్ని నిలువునా మోసం చేయడమే! సామాజిక ఫించన్లలో కోత పెట్టడం, 2019 నాటికి కొన్నింటిని పూర్తిగా నిలిపివేయడం, ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంచడం, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించడం, పన్నులు పెంచడం వంటి చర్యలకు ప్రతిపాదనల్లో స్థానం కల్పించడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే! దీంతో పాటు ఇంధన, సహజ వాయువు రంగాలను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం తలూపిన తీరు విస్మయం కలిగించకమానదు.
ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటానికి, ఆర్థిక సంస్థల నుంచి 8,600 కోట్ల యూరోలను రుణంగా పొందడానికి ఇంతకు మించి మార్గం లేదని తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి చెబుతుండటం పచ్చి అవకాశవాదమే! తమను మించిన ప్రజాస్వామ్య వాదులు లేరని చెప్పుకునే ఐఎంఎఫ్, ఇయుల వాస్తవ స్వరూపాన్ని కూడా ఈ పరిణామం బట్టబయలు చేసింది. అత్యధిక ప్రజలు తిరస్కరించినా బేఖాతరు చేసి గ్రీస్‌ను తమ దారికి రప్పించుకున్న తీరు ఆ సంస్థల వాస్తవ స్వభావాన్ని, లాభం తప్ప మరేమీ పట్టని కార్పొరేట్ శక్తులకు వంతపాడుతున్న తీరును ప్రపంచానికి చాటిచెప్పింది.2015 జనవరిలో జరిగిన ఎన్నికలకు ముందు ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకించి తమను తాము వామపక్షంగా ప్రకటించుకున్న సిరిజా పార్టీకి, దాని అధినేత సిప్రాస్‌కు గ్రీస్ ప్రజలు పట్టంకట్టారు. కొన్ని జాతీయ, మితవాద పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన కొన్ని నెలల్లోనే స్వవచనా ఘాతుకానికి పాల్పడటం, ద్రవ్య సంస్థలకు వంతపాడటం దుర్మార్గం. ఆర్థిక సంస్కరణల అసలు స్వభావమేమిటో గ్రీసు ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. కొందరి ఆస్తులు అనూహ్యంగా పెరుగుతుంటే, అంతకు రెట్టింపు సంఖ్యలో పేదలు నిరుపేదలుగా మారి రోడ్ల మీద పడటాన్ని కళ్లతో చూశారు. కారణాలు ఏవైనా దొడ్డిదోవన అవే విధానాలు అమలు చేసే నయవంచన ఎక్కువ కాలం సాగదన్న విషయాన్ని అక్కడి అధికారపక్షం గమనించాలి. పేదలకు అనుకూలమైన పాలన అందించాలి.