ప్రజారోగ్యంలో మేటి క్యూబా

క్యూబాలో ప్రజారోగ్యం అగ్రరాజ్యా లను తలదన్నే విధంగా ఉంది. 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రాధాన్యతల్లో ఆరోగ్యానికి అగ్రస్థానం ఇచ్చింది. రాజ్యాంగంలో ఉన్న 'ఆరోగ్య హక్కు' అక్షరాలా అమలవుతున్నది. ప్రపంచ దేశాలు క్యూబాలోని ప్రజారోగ్యాన్ని ఒక ఆదర్శంగా భావిస్తున్నాయి. క్యూబాలోని ఆరోగ్య వ్యవస్థను శత్రువులైనా, మిత్రులైనా కొనియాడక తప్పడంలేదు. 1.5 కోట్ల జనాభా కలిగిన క్యూబా దేశం ఆరోగ్యంలో గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నది. 1959 క్యూబా విప్లవం జయప్రదం అయినప్పటి నుంచి ''సార్వత్రిక ఆరోగ్య రక్షణ'' ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత పథకంగా సోషలిస్టు క్యూబాలో అమలు జరుగుతున్నది. ప్రతి ఒక్కరికీ కుటుంబ డాక్టరు అందుబాటులో ఉంటారు. ఆరోగ్యవంతులు కూడా సంవత్సరానికి ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు విధిగా చేయించుకోవాలి. చేయించుకోని వారు శిక్షార్హులౌతారు.
క్యూబా రాజధాని హవానాలోని ప్రభుత్వ వైద్యశాలలను, విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన వైద్యశాలను కూడా స్వయంగా పరిశీలించాను. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు ఉచిత వైద్యం, ఉచిత ఆహారం, ఉచిత మందులు అందించబడుతున్నాయి. ఒపిల్లో ఎక్కడా రద్దీ కనిపిం చడంలేదు. రోగుల కంటే సిబ్బందే అధికంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో అందని వైద్యం పట్టణాల్లో అందించి రెఫరల్‌ హాస్పటల్స్‌ ద్వారా పెద్ద జబ్బులకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తున్నది. అందువల్ల ప్రజలు తమ సొంత డబ్బులు వైద్యం కోసం వినియోగించడం ఉండదు. వయసుమళ్ళినవారు, వృద్ధులు ఎక్కువగా కనిపించారు. దేశంలోని ప్రజలకే కాకుండా ఇతర దేశాల ప్రజలకు కూడా వైద్యం అందిస్తున్నారు. విదేశీ ఆస్పత్రులను కూడా నేను స్వయంగా పరిశీలించాను. అక్కడ సీరా గార్షియా హాస్పటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గార్షియా సలభారియా ద్వారా వివరాలు తెలుసుకున్నాం. విదేశీ రోగులను కూడా కలవడం జరిగింది. వారి ఆరోగ్యం గురించి విచారించినప్పుడు పెరూ దేశం నుంచి వచ్చిన ''ఫ్రాన్సికో'' అనే రోగి వయస్సు 65 సంవత్సరాలు. శ్వాసకోశ వ్యాధితో క్యూబా వైద్యశాలలో చేరారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగినప్పుడు తన ఆరోగ్యం ఎంతో మెరుగుపడిందని, క్యూబాలో తగ్గకపోతే ప్రపంచంలో ఎక్కడ తగ్గుతుంది? అని ఎదురు ప్రశ్న వేశారు. 43 పడకల ఈ ఆస్పత్రిలో 63 మంది డాక్టర్లు, 83 మంది నర్సులు మొత్తం 594 మంది సిబ్బందితో పనిచేస్తున్నారు. సాధారణ కార్మికులకు సుమారు 500 సియుసి (క్యూబా కరెన్సీ) భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.30 వేలు చెల్లిస్తారు. నర్సలకు 1,600 సియుసిలు, డాక్టర్లకు 2,000 సియుసిలు చెల్లిస్తారు. నర్సులకు, డాక్టర్లకు మధ్య వేతన వ్యత్యాసం తక్కువ. దేశంలో అన్ని రకాల పనుల్లోనూ ప్రభుత్వరంగ కార్మికులే ఉంటారు. వీరి జీతాల మధ్య తేడాలు తక్కువ. విదేశీ వైద్య విద్యార్థులకు క్యూబాలో స్టయిఫండ్‌ కూడా ఇచ్చి వైద్య విద్య నేర్పిస్తారు. రష్యాలో సోషలిజం కూలిపోయిన తరువాత క్యూబాలో 1991 తరువాత గడ్డు కాలంలో కూడా విదేశీ వైద్య విద్యార్థులకు స్టయిఫండ్‌ కొనసాగించామని ఫైడల్‌ కాస్ట్రో ఆకాలంలో గర్వంగా చెప్పారు. ప్రపంచంలో ముఖ్యంగా లాటిన్‌ అమెరికా దేశాల్లో ఎక్కడ విపత్తులు సంభవించినా ''మేమున్నాము'' అని క్యూబా డాక్టర్లు ఆఘమేఘాల మీద ఆ దేశంలో వాలిపోవడం నేటికీ చూస్తున్నాం. ఇటీవల ఈక్విడార్‌ దేశంలో సంభవించిన భూకంప బాధితులకు క్యూబా వైద్యులు అద్భుతమైన వైద్య చికిత్సలు అందించారు.
ప్రభుత్వ ఆరోగ్య విధానంలో ప్రధానమైనది వ్యాధి నిరోధక చర్యలు చేపట్టడం. క్యూబా అంతా 14 రకాల వ్యాక్సినేషన్లు అమల్లో ఉన్నాయి. దీని వల్ల అత్యధిక వ్యాధులు రాకుండానే అరికట్టగలుగుతున్నామని డాక్టర్లు ధీమా వ్యక్తపరిచారు. మంచినీరు, పారిశుధ్యం, సొంత మరుగుదొడ్లు అమల్లో ఉన్నాయి. హవానా నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ సదుపాయం నగరమంతా ఎంతో కాలం నుంచి అమల్లో ఉంది. దోమల గురించి విచారించినప్పుడు హవానాలోనే కాదు దేశంలో ఎక్కడా దోమ కనిపించదని చెప్పారు. దీని ఫలితంగా మలేరియా, డెంగ్యూ లాంటి దోమకాటు జబ్బులు నివారించబడ్డాయి. దీనివల్ల ఆరోగ్యం రంగంలో వేల కోట్ల ఆదా జరుగుతున్నది. ఏ దేశంలోనైనా ప్రజల కాళ్ళు చూస్తే దేశంలో దారిద్య్రం గురించి తెలుస్తుందంటారు. క్యూబాలో నేను పర్యటించిన 10 రోజుల్లోనూ బూట్లు, చెప్పులు లేని మనిషే కనిపించలేదు. ప్రజలు నడక, వ్యాయామం లాంటి ఆరోగ్య సూత్రాలు దేశమంతటా అమలు చేస్తున్నారు. జాతీయ రహదారి మధ్యలో 20 అడుగుల వాకింగ్‌ ట్రాక్‌ రెండు వైపుల ఉన్న ప్రజానీకం నడవడానికి, పరిగెత్తడానికి, స్కేటింగ్‌ చేయడానికి వీలుగా ఉంది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో కాలుష్యకారక పరిశ్రమలు కనబడవు. చుట్టూ ఉన్న సముద్ర తీరంలో 5,746 కిలోమీటర్ల లోపల కాలుష్య రసాయనాలు కలవడం ప్రభుత్వం అనుమతించదు. వ్యవసాయ దేశం కూడా అవడంతో సహజంగానే పర్యావరణాన్ని పరిరక్షించు కోగలుగుతున్నారు. వేసవిలో సగటు వాతావరణం 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌గాను, శీతాకాలంలో సగటు 23 డిగ్రీల సెంటీగ్రేడ్‌గాను ఉంటుంది. ఇంత మంచి వాతావరణం ఉన్నందు వల్ల ప్రపంచ యాత్రికులను కూడా క్యూబా ఆకర్షించగలుగుతున్నది.
అమెరికాకు చెందిన వైద్య నిపుణులు ''ఎరిక్‌వీవర్‌'' ఇటీవల క్యూబాలో పర్యటించి విడుదల చేసిన వ్యాసం క్యూబా ఆరోగ్య పరిస్థితికి అద్దంపడుతుంది. వీరి మాటల్లో క్యూబాలో వైద్యం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రకటించారు. క్యూబా ఆస్పత్రుల్లోని సౌకర్యాలు నాణ్యంగాను, మెరుగ్గాను ఉన్నాయన్నారు. దీని ఫలితంగా క్యూబాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రకారం ప్రపంచ దేశాల్లో 37వ స్థానంలో ఉంది. శిశు మరణాలు భారతదేశంలో ప్రతి వెయ్యి మందికి 38 ఉండగా, చైనాలో తొమ్మిదిగాను, అమెరికాలో ఆరుగాను, క్యూబాలో నాలుగుగాను ఉంది. బిడ్డ తల్లిగర్భంలో ఉండగానే ఎటువంటి ఖర్చు లేకుండా తనిఖీలు చేయించడం ద్వారా విటమిన్లు, ఖనిజ లవణాలను ప్రతి గర్భిణీ స్త్రీకి సకాలంలో అందిస్తున్నారు. క్యూబా దేశంలో జిడిపిలో 10 శాతం వైద్యం కోసం ఖర్చు పెడుతుండగా భారతదేశంలో 1.2 శాతం మాత్రమే ఖర్చుపెడుతున్నారు. క్యూబా ప్రజల సగటు ఆయుర్దాయం 79.4 సంవత్సరాలు కాగా, అమెరికా సగటు వయస్సు 79.8 సంవత్సరాలుగా ఉంది. క్యూబాలో ప్రాథమిక వైద్యం తరువాత ఉన్నత వైద్యం పొందవలసి వస్తే ప్రాథమిక వైద్యశాల నుంచి డాక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే స్పెషాలిటీ వైద్యం పొందుతున్నారు.
క్యూబాలో సోషలిస్టు రాజ్యం గత 57 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణను చూడటం, ప్రజల ఆరోగ్య హక్కును చిత్తశుద్ధితో అమలుచేయడమే క్యూబా దేశ ఆరోగ్య రహస్యం.
- సిహెచ్‌ నరసింగరావు  (వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు)