ప్రజావంచన..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంక్షిస్తూ బెంగళూరు ముని కామకోటి ఆత్మ బలిదానం అత్యంత విషాదకరం. శనివారం తిరుపతిలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం కాగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఒక రోజల్లా కొట్టుమిట్టాడి మరణించడం కలచివేసే అంశం. కోటి ఆత్మార్పణం అతని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారంతో ముడిపడలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన బిజెపి, టిడిపిల విద్రోహ వైఖరికి నిరసనగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. హోదాపై పూటకో మాట రోజుకో అబద్ధం వల్లిస్తూ ప్రజలను గందరగోళంలో అమోమయంలో పడేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధీశులు, వారి పార్టీలే కోటి మృతికి ముమ్మాటికీ బాధ్యులు. ప్రభుత్వంలోకొచ్చి పదిహేను నెలలైనా ప్రత్యేక హోదాపై పరస్పర విరుద్ధంగా మాట్లాడటం వలన ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అంతకంతకూ నిరాశా నిస్పృహలు పెరుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినా నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా, రాజకీయ లబ్ధినాశించి నిట్టనిలువునా చీల్చడంపై యువత తట్టుకోలేకపోయింది. గుడ్డిలో మెల్లలా ఇస్తామన్న ప్రత్యేక హోదా అయినా వస్తుందనుకుంటే దానికీ దిక్కు లేకుండా పోయింది.

హైదరాబాద్‌ను కోల్పోయి, వ్యవసాయం సంక్షోభంలో నెట్టబడి, పరిశ్రమలు రాక అచేతన స్థితిలో ఉన్న నిరుద్యోగులు ప్రత్యేక హోదా అయినా వస్తుందేమోనని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలలుగా హోదాపై వంకర టింకరగా మాట్లాడుతున్న బిజెపి, టిడిపి నేతలతో రోసి పోయారు. పార్లమెంట్‌ సాక్షిగా మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళనలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వకుండా నమ్మక ద్రోహానికి, నయవంచనకు ఒడిగట్టడంతో యువత విశ్వాసం కోల్పోయారు. ఆత్మన్యూనతకు గురయ్యారు. ఆ పర్యవసానమే కోటిని ఆత్మహత్యకు పురిగొల్పింది. అతని మరణంతో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో బంద్‌లు, ధర్నాలు తదితర నిరసనలు ఎగసిపడుతున్నాయి. 
ప్రత్యేక హోదాతో సహా విభజనపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరతామని వారు నమ్మే తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, రాష్ట్ర ప్రజానీకాన్ని నమ్మించారు. ఆ నేతల వాగ్దాన భంగాన్ని తట్టుకోలేక అదే గడ్డపై కోటి ఆత్మహత్యతోనైనా తప్పు ఒప్పుకొని లెంపలేసుకోవాల్సింది పోయి వారు, వారి పార్టీ నేతలు రాజకీయాలు చేయడం అఘాయిత్యమే. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో భాగస్వాములయ్యి టిడిపి నేతలు తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడం దుర్మార్గం. తాను తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవారెవరూ లేరని ప్రతి రోజూ చెప్పుకునే చంద్రబాబు, రాష్ట్రాభివృద్ధికి ఇరుసుగా పని చేసే ప్రత్యేక హోదాపై ఎందుకు కేంద్రాన్ని నిలదీయట్లేదు? పైగా హోదా వస్తుందని ఒకసారి, రాదని మరోసారి, ప్యాకేజీ అని ఇంకోసారి ఎందుకు మభ్య పెడుతున్నట్లు? తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఎందుకు ఢిల్లీలో మోకరిల్లుతున్నట్లు? సగటు పౌరులను సైతం వేధిస్తున్న ఈ ప్రశ్నలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌ పార్టీ చట్టంలో పెట్టకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు వంటి వారు చెప్పడం తెంపరితనమే. ఆనాడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేత తామే రాజ్యసభలో ప్రకటన చేయించామంటూ ఎన్నికల్లో బిజెపి చేసిన ప్రచారాన్ని ప్రజలు మర్చిపోయారనుకుంటే ఎలా? పార్లమెంట్‌లో కట్టుబడ్డ హామీకి విలువ లేదా? చట్ట సభలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
భూసేకరణ చట్టం సహా అనేకానేక చట్ట సవరణలకు బిజెపి సర్కారు కోకోల్లలుగా ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను అలానే ఆగమేఘాల మీద కలిపింది. ప్రత్యేక హోదాను కూడా అలాగే చట్టంలో పొందుపర్చవచ్చుకదా? ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వొద్దందంటూ 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపడమూ అంతే. కేంద్ర కేబినెట్‌లో హోదా ఇస్తామని తీర్మానం చేస్తే ఆర్థిక సంఘం అడ్డుకుంటుందా? ఆర్థిక సంఘం కేవలం సిఫారసులు మాత్రమే చేస్తుంది. విశేషణాధికారాలేమీ ఉండవు. ఎపి హోదాను బీహార్‌, పశ్చిమబెంగాల్‌ ఎన్నికలతో లింక్‌ పెట్టడం కూడా బోడి గుండుకు మోకాలికీ ముడి పెట్టడంలాంటిది. ఎపి పరిస్థితి వేరు. ఆ రాష్ట్రాల పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా సీమాంధ్రుల హక్కు. కోటి ఆత్మార్పణతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. కల్లబొల్లి మాటలతో పొద్దుపుచ్చకుండా హోదా కల్పించాలి. కేంద్రంపై టిడిపి ఒత్తిడి తీసుకురావాలి. తానొక్కడితోనే హోదా వస్తుందన్న ఆత్మస్తుతిని చంద్రబాబు వదిలిపెట్టి అన్ని పక్షాలనూ కలుపుకొని కేంద్రం మెడలు వంచాలి. ఆత్మహత్యలు సమస్యలకు ఎంతమాత్రం పరిష్కారం కావు. ప్రభుత్వాలపై పోరాడి ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలను సాధించుకునేందుకు ప్రజలు, ముఖ్యంగా యువత పూనుకోవాలి.