ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న వారి సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పిలుపునిచ్చారు. విజయవాడ కానూరు పప్పుల మిల్లు సెంటర్ శ్రీనివాసా కళ్యాణమండపంలో సిపిఎం కృష్ణాజిల్లా కమిటీ విస్తృత సమావేశం గురువారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ, రాజధాని ప్రాంత భూముల్లో పంటలు లేకపోవడంతో ఉపాధిపోయి వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెక్కులివ్వకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. క్రిడా పరిధిలో జోన్ల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయని, మరికొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సామాన్యుల ఇబ్బందులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రూ. 2 వేల కోట్ల మేర పారిశ్రామిక వేత్తలకు రాయితీలిస్తున్న ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలకు, ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం లేదన్నారు. ఆర్థిక అంశాలతోపాటు సామాజిక సమస్యలపైనా ఉద్యమించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ, పేదలకు నివేశనా స్థలాల కోసం ప్రభుత్వం జిల్లాలో 800 ఎకరాలు సేకరించినా పంపిణీ చేయడం లేదన్నారు. అటవీ భూముల సమస్య ముందుకు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై కేశవరావు తదితరులు మాట్లాడారు.