ప్రజాసమస్యలు గాలికి - ప్రశ్నిస్తే నిర్బంధం

 రాష్ట్రంలో 16 మాసాల క్రితం ఏర్ప డిన తెలుగుదేశం ప్రభుత్వం హామీ లను ఉల్లంఘించింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి భారా లను మాత్రం పెంచింది. ప్రైవేటీక రణకు పెద్దపీట వేస్తున్నది. కనీసపు ప్రజా స్వామిక హక్కులను కూడా అనుమతించ కుండా తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నది.
వైద్యం
ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రధాన ఆస్పత్రులను ప్రయివేటు వారికి ధారాదత్తం చేస్తున్నది. ప్రయివేటు వైద్య కళాశాలలు స్థాపించాలను కునే వారికి క్లినికల్‌ అటాచ్‌మెంట్‌గా ప్రభు త్వాస్పత్రులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించలేక నిర్వీర్యం చేసింది ప్రభుత్వమే. పైగా ప్రభుత్వాస్పత్రులను ప్రజలు వినియోగించుకోవడం లేదని ఆరోపిస్తున్నది. వాటి మెరుగుకోసం ప్రయివేటువారికి ఇవ్వా లని నిర్ణయించింది. ప్రయివేటువారు ప్రభుత్వాస్పత్రులను మెరుగుపరచి ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారని ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతు న్నది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రయివేటువారు వ్యాపారం చేసుకొని ఉన్న కొద్దిపాటి వైద్య సౌకర్యం లేకుండా చేయడం తప్ప మరొకటి కాదు.
విద్య
14 సంవత్సరాల వయసు దాకా అందరికీ విద్యనందించడం ప్రభుత్వ బాధ్యతగా రాజ్యాంగంలో చెప్పబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో రిటైరైనవారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఎలాంటి సదుపాయాలకు నిధులు విడుదల చేయకుండా వాటిని ప్రజలకు దూరం చేసింది. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో క్లస్టర్‌ స్కూల్స్‌ పేరిట మూడు వేల పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించింది. అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా నిలిపివేసింది. మరొక వైపు సంక్షేమ హాస్టళ్ళు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని బాగు చేయడానికి బదులు 220 హాస్టళ్ళను మూసివేసింది. ప్రభుత్వ చర్య ప్రధానంగా దళిత, బలహీనవర్గాల పిల్లలను చదువుకు దూరం చేస్తున్నది. ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. నేటి ప్రభుత్వ విద్య, వైద్య సంస్థలన్నీ స్వాతంత్య్రానంతర కాలంలో నెలకొల్పినవే. ప్రభుత్వం సంస్కరణల బాటపట్టిన అనంతరం నిధులు తగ్గించి ప్రయివేటు రంగానికి, లాభాపేక్షలకు అవకాశాలు కల్పించింది. మళ్ళీ నేడు చంద్రబాబు సంస్కరణలను వేగంగా అమలు చేసి రాష్ట్రాన్ని కార్పొరేట్ల పరం చేస్తున్నారు.
బలవంతపు భూ సేకరణ
అవసరానికి మించి అనేక రెట్ల భూములను ప్రభుత్వం సేకరిస్తున్నది. ప్రభుత్వమే లక్షల ఎకరాలతో భూ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. భూ సేకరణ వల్ల కూలి, నాలి చేసుకునే వ్యవసా య కార్మికులు పనులు కోల్పోయి వీధుల పాలవుతున్నారు. ప్రభుత్వం సేకరించిన భూమి కార్పొరేట్లకు కారుచౌకగా ధా రాదత్తం చేసి, రైతుల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నది. దీనికి అభివృద్ధి అని ముద్దుపేరు పెట్టింది. అవస రాల మేరకే భూములు సేకరించాలని, బలవంతపు భూ సేక రణ చేయరాదని, తగినంత పరిహారం చెల్లించి తీసుకోవా లని చెబితే అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ముద్ర వేస్తోంది.
హామీల ఉల్లంఘన
అనేక ఆందోళనల తర్వాత అంగన్‌వాడీ ఉద్యోగుల వేత నాలు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. కానీ నేటికీ వేతనాలు పెంచలేదు. ఎన్‌జివోలకు పిఆర్‌సి అమలు చేసినా 2014 జూన్‌ నుంచి 2015 ఏప్రిల్‌ వరకు 10 నెలల బకాయిలు నేటికీ చెల్లించలేదు. వివిధ రకాల అలవెన్సులకు సంబంధించిన జీవోలు విడుదల చేయలేదు. హెల్త్‌కార్డ్స్‌ అందరికీ ఇంకా రాలేదు. వచ్చిన వారికి కూడా నగదు రహిత వైద్య సేవలు అమలు కాలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షలమంది ఉద్యోగులు అవుట్‌సోర్సింగ్‌ పనిచేస్తున్నారు. పిఆర్‌సికనుగుణంగా వీరి వేతనాలు పెంచుతానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినా అమలు చేయలేదు. మున్సిపాలిటీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు వేల మంది కంటింజెంట్‌ స్వీపర్స్‌ పనిచేస్తున్నారు. వీరికి అత్యంత హీనంగా నెలకు కేవలం రూ.1,623 మాత్రమే ఇస్తున్నారు. వీరి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలోని వివిధ శాఖలలో 30 వేల మంది కంటింజెంట్‌ ఎన్‌ఎంఆర్‌లుగా సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరికి వేతనం ఇస్తున్నది నెలకు రూ. 3,850 మాత్రమే. గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్రంలో 10 వేల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల లోపు ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా ఇస్తున్నారు. అది కూడా గత ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వలేదు.
ఐదు సంవత్సరాలు పనిచేసిన కంప్యూటర్‌ టీచర్స్‌ 12 వేల మందిని స్కీము ముగిసిందని తొలగించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల పాఠశాలల్లో కంప్యూటర్‌ టీచర్స్‌కు గాను 75 శాతం గ్రాంటు విడుదల చేసింది. కనీసంగా ఆ నాలుగు వేల మందిని కూడా ఇప్పటిదాకా నియమించలేదు. ఫలితంగా కేంద్రం విడుదల చేసిన గ్రాంటు మురిగిపోతు న్నది. అంతా ''ఈ-పరిపాలన'' అని ప్రచారం చేసుకునే ప్రభుత్వం కంప్యూటర్‌ నేర్పే టీచర్లను నియమించకుండా ప్రజలను మోసం చేస్తున్నది.
కరువు
రాష్ట్రంలో కరువు భయంకరంగా ఉంది. లక్షలాది హెక్టార్లలో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఇప్పుడే వందలాది గ్రామాల్లో తాగునీరు, పశువుల మేతకు తీవ్ర కరువు ఏర్పడింది. కరువు సహాయక చర్యలు ప్రభుత్వం ప్రకటించలేదు. వ్యవసాయ కార్మికులు పనులు లేక గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి పోతున్నారు. మరొక వైపు రాష్ట్రంలో డెంగ్యూ, ఇతర విషజ్వరాలు విజృంభించాయి. గత సంవత్సరం కంటే పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైంది. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. అవసరమైన మందులు, కనీస వైద్య సదుపాయాలు కూడా కల్పించలేదు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే 68 మంది హెల్త్‌ వర్కర్స్‌ను తొలగించడంతో పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. పేదలు ముఖ్యంగా గిరిజనులు వైద్యం చేయించుకోలేక మృత్యువు పాలవుతున్నారు.
ఇసుక మాఫియా రాష్ట్రంలో విలయతాండవం చేస్తు న్నది. డ్వాక్రా మహిళలకే ఇసుక రీచ్‌లు అని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వట్టి బూటకమని రుజువయింది. చివరకు ముఖ్యమంత్రే దాన్ని పునస్సమీక్షిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళా అధికారిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడే చేయిచేసుకున్నాడు. దోషులను శిక్షించడానికి బదులు మహిళా అధికారినే ముఖ్యమంత్రి మందలించారు.
ప్రజలపై భారాలు
గత 18 నెలల కాలంలో ధరలు తగ్గకపోగా మరింతగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై అమ్మకం పన్నుకు అదనంగా లీటరుకు రూ.4 వ్యాట్‌ విధించడం ధరల పెరుగుదలకు ఒక కారణం. ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో రూ.7 వేల కోట్ల విద్యుత్‌ ఛార్జీల భారాన్ని మోపనుంది. ఆర్టీసీ బస్‌ ఛార్జీలను పెంచింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో కూడా యూజర్‌ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున భారాలు మోపడానికి పథకాన్ని సిద్ధం చేసింది. స్వచ్ఛ భారత్‌ కోసం దేశవ్యాప్తంగా సెస్సులు విధించాలని స్వచ్ఛ భారత్‌ కన్వీనర్‌గా చంద్రబాబు కేంద్రానికి సిఫారసు చేశారు.
నిర్బంధం
కార్మిక హక్కుల చట్టాలకు సవరణలు తేవడంతో పాటు విధి నిర్వహణలో ప్రమాద కారణంగా మరణించిన కార్మికుల కుటుంబానికి నష్టపరిహారం కోసం విశాఖలో కార్మిక సంఘాలు ఆందోళన చేస్తుంటే పరిశ్రమాధిపతుల సమావేశంలో ముఖ్యమంత్రి కార్మిక సంఘాల ఆందోళనల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు కేసులు నిత్యకృత్యం అయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనాలు. సమస్యలు పరిష్కరించాలని వీధుల్లోకి వచ్చిన విద్యార్థులపై విశాఖలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. వెంటపడి పరుగెత్తి మరీ లాఠీఛార్జీ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారు. విజయవాడలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ క్రింద పడిన విద్యార్థి తలను బూట్‌ కాలుతో తన్నాడు. 
అనంతపురం, కర్నూలులో నష్టపరిహారం చెల్లించకుండానే సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రైతులు ఆందోళన చెందుతుంటే రైతులతో మాట్లాడటానికి వెళ్ళిన రైతు నాయకులను అరెస్టులు చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా వివిధ జిల్లాల్లో సిఐటియు నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారు. ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రజల సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, హుదూద్‌ తుఫాను సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ప్రజల సహకారం తీసుకునే ప్రయత్నం చేయలేదు. రాజధాని నిర్మాణం, రాష్ట్ర విభజన సంర్భంగా ఇచ్చిన హామీ అమలు, తదితర అంశాలలో కూడా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది.
ఈ ఒకటిన్నర సంవత్సర పాలనంతా ఏకపక్షం, నియంతృత్వ ధోరణితోనే సాగింది. ప్రజా సమస్యలు గాలికొదిలి రాజధాని నిర్మాణం చుట్టూ తిప్పింది. తెలుగు దేశం పాలన ఎడల ప్రజల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పడం, ఆయా తరగతుల సమస్యలపై ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగానూ, బాధితులందరూ ఐక్యంగానూ సాగిం చడం ద్వారా ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలి.
పెనుమల్లి మధు