కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య గారి శత జయంతి సందర్భంగా ఈరోజు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడమని కోరారు. ఇంతకుముందు భాషా వికాసం గురించి మాట్లాడిన కొత్తపల్లి రవిబాబుగారు నాకో కరపత్రం ఇచ్చారు. మాతృభాష ప్రాధాన్యత గురించి ఛాయారాజ్‌గారు రాసిన మంచి కవిత్వం దానిలో ఉంది. అందులోని చివరి చరణాలు.
''అమ్మా నీ భాష కావాలి.
నిప్పులు చెరగటానికి..
చెమటను జల్లెడ పట్టి సంపదలను తీయడానికి..
తెలుగు పౌరుషాగ్నిని రాజేయడానికి.. మాతృభాష కావాలి..''
అలాంటి తెలుగు పౌరుషాగ్నిని రాజేయడంలో దిట్ట కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య. ఎక్కడకు వెళ్లి ఏ అంశం మీద మాట్లాడినా ప్రజలను ఉర్రూతలూగించి, నిప్పులు కురిపించి, వారిని కదన రంగానికి కదిలించడంలో వీర సారథిలా పనిచేసేవారు బసవపున్నయ్య. ఆరోజుల్లో ఆయన ఉపన్యాసాలంటే చెవులు కోసుకునేవారు. ఒకసారి ఆయన ప్రసంగం విన్న తరువాత 'పోరాటంలో దుమికి తాడో పేడో తేల్చుకుందాం. ఈ దోపిడీ సమాజాన్ని తుత్తునియలు చేసేదాకా వదలకూడదు' అన్నంత పట్టుదల ఆయన ఉపన్యాసాలద్వారా కలిగేది. అదే భాషా పటుత్వమంటే. ఏ సామాజిక, సాంస్కృతిక ఉద్యమానికైనా ఓ లక్ష్యం ఉంటుంది. అది వ్యక్తి వికాసానికీ, సామాజిక వికాసానికీ తోడ్పడాలి. ఇక్కడో చర్చ నడుస్తోంది. వ్యక్తి వికాసం అంటే ఏమిటీ, సామాజిక వికాసం అంటే ఏమిటీ అని? 'వ్యక్తులు మారితే సమాజం మారుతుంది. ముందు నువ్వు మారు' అని చాలామంది చెబుతుంటారు. ఇంకొంతమంది 'సమాజం మారేదాకా వ్యక్తి మార్పును చూడలేము' అంటారు. వాస్తవం ఈ రెండింటి మధ్యా ఉంది. రెండూ పరస్పర సంబంధమూ, అనుబంధమూ కలిగినవి. వ్యక్తి దేనికి మారాలి? సమాజాన్ని మార్చడానికి మారాలి. సమాజ చోదకుడుగా మారాలి. ఆ వ్యక్తి తనను తాను మార్చుకొని సమాజాన్ని మార్చడానికి ఉద్యుక్తుడయితే మొత్తం సమాజం మారుతుంది. సమాజం మారితే సమాజంలోని వ్యక్తులూ మారతారు. అలా చొరవ చేసేవారూ, నడుంకట్టేవారూ ముందు తమను తాము తీర్చిదిద్దుకోవాలి.
బసవపున్నయ్య, సుందరయ్య, రాజేశ్వరరావుగారలు ఎవరయినా ముందు తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొని ఆ విధంగా సమాజాన్ని ప్రభావితం చేసి, ప్రజల్లో తిరుగుబాటు భావాలను రగిల్చి, అనేక ఉద్యమాలకు నాంది పలికారు. ఆ ప్రభావం సమాజంపై పడి అనేక మంది మారారు. ఈ రకమైన పరస్పర సంబంధం వ్యక్తి వికాసానికీ సామాజిక వికాసానికీ మధ్య ఉంది. నేడు సమాజంలో లంచగొండితనం ఉంది. ఈ వ్యవస్థలో ఒక భాగం అయ్యింది. సమాజం మారకుండా లంచగొండితనం పోదని కొందరి అభిప్రాయం. ఎవరు లంచమిచ్చినా, తీసుకున్నా చూస్తుండాలి. సమాజం మారిందాకా మనమేం చేయలేం అనుకుంటే మనకు తెలియకుండానే మనలో నిష్క్రియాపరత్వం ఏర్పడుతుంది. లంచగొండితనంతో సమాజం బాధపడుతున్నా మనకేం సంబంధం లేదు. లేదూ వ్యక్తి మారాలంటే లంచం ఇచ్చేవారినీ, తీసుకునేవారినీ నిర్మూలించాలని ఒక తహశీలుదారు ఆఫీసు గుమాస్తానో, గేటు దగ్గర ఉండే అటెండరో పదో పరకో తీసుకుంటేనో లేదా బస్సు కండెక్టరు చిల్లర ఇవ్వలేదనో అవినీతిపై పోరాడే పేరుతో వారిమీద తిరుగుబాటు చేస్తే అది గందరగోళమూ, అరాచకమూ అవుతుంది. అలా అని భూరికార్డులు తారుమారు చేసే అధికారులను చూస్తూ వదిలేయలేం. మరి ఈ రెంటికీ మధ్యన ఏమిటి? గుడినీ, గుడిలో లింగాన్నీ, దేశాన్నీ మింగేస్తున్న అవినీతిపరులపైనా, ప్రజల సంపదను మెక్కేస్తున్నవారిపైనా పోరాడాలి. అదే సందర్భంలో అవినితికి మూలమైన వ్యవస్థనూ మార్చడానికి కృషి చేయాలి. వ్యక్తికీ సమాజానికీ మధ్య సంబంధం లాంటిదే ఇది కూడా. అలా అయినప్పుడే మొత్తం సాంస్కృతిక, సామాజికోద్యమాలు, వ్యక్తి వికాసం ముందుకుపోతాయి.
సంస్కృతి అనేది ప్రజల మధ్య భావ సమైక్యతను సృష్టిస్తుంది. అది భావాల్లోనూ, భాషలోను, ఆచార, సంప్రదాయాల్లోనూ కనిపిస్తుంది. పండుగలు, ఉత్సవాలు, పెండ్లిండ్లు, శవసంస్కారాలు-ఇలా సందర్భం ఏదైనా ప్రజలు ఒక వర్గంగానో, తరగతిగానో, జాతిగానో, తెగగానో భాగస్వాములవుతారు. ఇది ఒక ఉమ్మడి తత్వాన్ని తీసుకొస్తుంది. వివిధ చారిత్రక దశల్లో ఈ సంస్కృతి విభిన్నంగా పనిచేస్తుంది. అది నిరంతరం చలనంలో ఉంటుంది. మారుతుంటుంది. సంపర్కం చెందుతుంది. ప్రగతిశీలంగా ఉంటుంది. ప్రగతి నిరోధకంగానూ ఉంటుంది. నేడు మంచిగా ఉన్నదే రేపు చెడుగా మారుతుంది. చారిత్రక, తార్కిక దృష్టితో ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. మన సౌలభ్యం కోసం నేను వీటిని మూడు భాగాలుగా చెప్పదలుచు కున్నాను. ఒకటి : స్వాతంత్య్రోద్యమ ప్రభావం. రెండోది : కమ్యూనిస్టుల ప్రభావం. మూడోది : ఈనాటి ప్రపంచీకరణ ప్రభావం. ప్రజలమీదా, సమాజం మీద ప్రగాఢముద్ర వేసిన ప్రభావాలివి.
స్వాతంత్య్రోద్యమ కాలంలో చాలా ఉద్యమాలు నడిచాయి. బ్రిటీష్‌వారు దేశం నుంచి వెళ్లిపోవాలి, స్వతంత్రం కావాలీ అన్నది ప్రధానమైన అంశమే అయినా ప్రజలను కదిలించడానికీ, ప్రభావితం చేయడానికీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల నాయక్వంలో కావచ్చు, గాంధీ ప్రభావంతో కావచ్చు చాలా ఉద్యమాలు కొనసాగాయి. ప్రత్యేకించి అంటరానితనానికి వ్యతిరేకంగానూ నడిచాయి. దళితులనూ, మైనారిటీలను, ఇతర వెనుకబడిన తరగతులనూ భాగస్వాములను చేయడానికి ఉద్యమాలు నడిచాయి. మహిళల అక్షరాస్యత కోసమూ, మద్యపానానికి వ్యతిరేకంగానూ ఉద్యమాలు నడిచాయి. శ్రమదాన, సేవా కార్యక్రమాల కోసం ఉద్యమాలు నడిచాయి. కలరా వంటి అంటు వ్యాధులు వచ్చినప్పుడు వాటిని నిర్మూలించడానికి కార్యకర్తలే నేరుగా రంగంలో దిగేవారు. అందరూ భయపడి పారిపోయి ఊళ్ల నుంచే వారిని వెలివేసే పరిస్థితుల్లో వారి దగ్గరకు పోయి సేవ చేశారు. ఆఖరికి కుష్టు వ్యాధిగ్రస్తులను సైతం చేరదీసి మనుషుందరూ ఒకటే అనే నిరూపించడానికి ప్రయత్నించారు. ఇలాంటి అనేక ఉద్యమాలు స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రభావితం చేశాయి. వాటిని చూసి ప్రభావితమైన అనేకమంది స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములయ్యారు..
స్వాతంత్య్రోద్యమంలో ఖద్దరు ధరించడమే పెద్ద ఉద్యమంగా సాగింది . ఇది బ్రిటీషువారికి ప్రతిఘటన. ఖద్దరు వేసుకొని కాలేజీకి వెళ్లారంటే ప్రత్యక్షంగా తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లే. ప్రిన్సిపాల్ వెంటనే ఆ విద్యార్థిని పిలిపించి కళాశాల నుంచి సస్పెండ్ చేసేవారు. అప్పుడు ఖద్దరు చొక్కా ధరించడమే తిరుగుబాటుకూ, ప్రతిఘటనకూ చిహ్నంగా మారింది. ఇది సామాజిక సాంస్కృతికోద్యమ ప్రభావమే. గాంధీ ఉప్పు మీద పన్ను వేసినం దుకు సత్యాగ్రహం నడిపారు. ఉప్పు మీద పన్ను ఇప్పుడూ మనం కడుతూనే ఉన్నాం. పన్నుల మీద పన్నులు పెంచేస్తున్నారు. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో సర్వీసు టాక్స్ 14 శాతం పెంచారు. చివరికి శిరోముండనం చేయించుకోవాలన్నా టాక్స్ కట్టాల్సిందే. తిరుపతి వెళ్లి క్యూలో నుంచున్నా సర్వీసు టాక్స్ కట్టాల్సిందే. కాని ఆ రోజుల్లో ఉప్పు మీద పన్ను వేస్తే ప్రజలను కదిలించగలిగారు. దండి సత్యాగ్రహంలో మనుషుల తలలు పగులగొడుతున్నా ఖద్దరు ధరించి, సంచి తగిలించుకొని ముందుకు పోయారు. ఇదొక ఉద్యమ సంస్కృతి. ప్రతి ఒక్కరినీ కదిలించి తిరుగుబాటుకు పురికొల్పిన సంస్కృతి ఆరోజు సాతంత్య్రోద్యమంలో అంతర్భాగంగా నడిచింది.
అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా గాంధీ, అంబేద్కర్ ఉద్యమాలు నడిపారు. కమ్యూనిస్టులు దానిలో అగ్రభాగాన ఉన్నారు. కమ్యూనిస్టులంటే మాలమాదిగల పార్టీ అనేవారు. సున్నితంగా చెప్పేవారయితే లేబరోళ్లనీ, లేబర్‌పార్టీ అనీ అనేవారు. అగ్రకులాల నుంచీ, ధనిక రైతు కుటుంబాలను నుంచీ వచ్చినవారు కూడా బసవపున్నయ్య, సుందరయ్య వంటి నాయకులతో కలిసి దళితవాడల్లో పడుకొని వారు పెట్టింది తిని, వారిని కదిలించడానికి చేసిన కృషి అసమాన్యం. ఈ మధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమం చూస్తున్నాం. ఈ రోజు బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్ తాము సాధించిన ఘనవిజయాల్లో గొప్పదని అరుణ్‌జైట్లీ చెప్పాడు. ఏమిటీ స్వచ్ఛ భారత్ అంటే? వీధుల్లోకి వెళ్లి చీపురు పట్టుకొని ఒక ఫొటో దిగడంతో స్వచ్ఛ భారత్ అయిపోతుంది. ఆ రోజుల్లో చూసుకోవడానికి ఏ ఫొటోలూ లేవు. అంటరానితనమే అతి పెద్ద సాంఘిక దురాచారం. అంటరానితనాన్ని నిర్మూలించ కుండా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడకుండా స్వచ్ఛ భారత్‌కు అర్థమేమిటి? నీ తోటివాడినే అంటరానివాడిగా చూస్తుంటే, వీధుల్లో నడవనివ్వకుండా, నీళ్లు తాగనివ్వ కుండా చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా నేను వీధులను శుభ్రం చేస్తాను, మరుగుదొడ్లు కడతాను అంటున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు అశుద్ధం ఎత్తివేయడానికి కూడా సిద్ధపడ్డారు. సాంస్కృతిక సామాజికోద్యమాలకు స్వాతంత్య్రోద్యమం ఒక నమూనాగా నిలబడింది. అయితే స్వాతంత్య్రోద్యమంలో కాంగ్రెస్ అనుసరించిన రాజీ పద్ధతులు యువతరాన్ని స్ఫూర్తివంతంగా, ఉత్సాహంగా కదిలించలేకపోయాయి. భగత్‌సింగ్ వంటివారిని ఉరితీస్తున్నా మాట్లాడలేకపోవడం వంటి అనేక అంశాలు యువతరాన్ని ప్రభావితం చేశాయి. ఇది మార్గం కాదు, కమ్యూనిస్టు పార్టీ అయితేనే సమాజం మారుతుంది. కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అనేకమంది కాంగ్రెస్‌ను వదిలేసి కమ్యూనిస్టుపార్టీలో చేరిపోయారు.
1940, 50, 60ల్లో మూడు దశాబ్దాలపాటు తెలుగు రాష్ట్రాలను అత్యంత ప్రభావితం చేసింది కమ్యూనిస్టు ఉద్యమం. వారు చెప్పిన భాషా వికాసం, జాతి వికాసం, సామాజిక న్యాయం, సామాజిక వికాసం. ఒక అంశం కాదు. అన్ని అంశాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ ప్రభావం చూపింది. 1950 నాటి సినిమాలు చూడండి. అది ప్రేమ, క్రైం, పౌరాణిక సినిమా ఏదైనా కావచ్చు. అందులో ఒక అభ్యుదయ గీతం లేకుండా, అందులో కుల మతతత్వాలను చీల్చి చెండాడకుండా, అందులో అవినీతినీ, అన్యాయాలనూ, అక్రమాలనూ ప్రశ్నించకుండా ఏ సినిమా ఉండదు. అటువంటి ప్రభావం రచయితలమీదా, నిర్మాతల మీద ఉంది. ఈ మాటలు ఇలా చెబితేనే ప్రజలు స్వీకరిస్తారనే అంతటి తీవ్రమైన ప్రభావం ఉండేది. ప్రజానాట్యమండలి, అభ్యదయ రచయి తల సంఘం, ఆరోజు ప్రతిఒక్కరూ, కమ్యూనిస్టులనే కాదు భావావేశం ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యుదయ ఉద్యమాల వైపు చూశారు. ఆ రోజు అతి పెద్ద ఉద్యమం, కమ్యూనిస్టులు శాసించిన ఉద్యమం సామాజికోద్యమం. తెలుగువాళ్లంతా ఒకటిగా ఉండాలని, జాతినీ భాషనూ ఏకం చేసి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పోరాడాలనే నినాదానికి అక్షర రూపం ఇచ్చి, మద్రాసు రాష్ట్రంలో ఉన్నా, నైజాంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగువాళ్లు ఒకటి కావాలని ఉద్యమానికి శ్రీకారం చుట్టి దాన్ని సాధించిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. మిగతా అన్ని పార్టీలూ ఉండొచ్చు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. కొంతమంది కాంగ్రెస్‌వారు కూడా పాల్గొన్నారు. కానీ దానికి ఊపిరిపోసి నడిపించింది మాత్రం కమ్యూనిస్టు పార్టీయే. అంతకుముందు ఎప్పట్నించో తెలుగువారు చీలిపోయారనే భావన ఉంది. అప్పటికే తెలుగు భాషా వికాసానికి తోడ్పడినవారున్నారు. ఛాంతసత్వంపై ఎదురుదాడి చేసినవారున్నారు. కాని వారి కృషంతా వ్యక్తులకు సంబంధించినదిగానే మిగిలిపోయింది. దానికి ఉద్యమ రూపం ఇచ్చినవారు లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమం మొత్తం దేశ భౌతిక స్వరూపాన్నే మార్చేసింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎవరి భాషలో వారు చదువుకోవచ్చు. ఎవరి భాషలో వారు మాట్లాడుకోవచ్చు. ఎవరి భాషలో వారు చట్టాలు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రం ఏర్పడక ముందు ఢిల్లీ వెళితే అక్కడ తెలుగువారిని మదరాసీలనేవారు. తెలుగువారికి ఒక అస్థిత్వం కల్పించింది కమ్యూనిస్టు పార్టీ. ఇది అతి పెద్ద సామాజిక ఉద్యమం.
సామాజికోద్యమాల్లో ముందుకొచ్చిన రెండో అతి పెద్ద ఉద్యమం దళితవాదం. 1980లో ఇది ఒక వాదం కింద పుట్టుకొచ్చింది. దళితులు మొత్తం ఒక ప్రజాస్వామ్య స్రవంతిలో 1940, 50ల్లో ఒక భాగంగా ఉన్నారు. దళితులంటే కమ్యూనిస్టులూ, కమ్యూనిస్టులంటే దళితులూ అన్న పద్ధతిలో ఆనాడు కలిసిపోయారు. వారికోసం కమ్యూనిస్టులు తప్ప మరెవరూ కృషి చేయలేదు. ఇది కమ్యూనిస్టు కార్యకర్తలకు ఒక గుర్తింపునిచ్చింది. అమెరికాలో, బ్రిటన్‌లో, రష్యాలో ఏం జరుగుతోందీ అన్నది, ప్రపంచంలోని విషయాలన్నీ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు మాట్లాడేవారు అని ఊళ్లలోకి పోతే పెద్దవాళ్లు చెప్పేవారు. అసలు వీళ్లకీ జ్ఞానం ఎక్కణ్ణుంచి వచ్చింది అనే ప్రశ్న వచ్చింది. కమ్యూనిస్టులు కాబట్టే వచ్చింది. కమ్యూనిస్టులం అయితే మనం వికాసవంతులమవుతాం. ప్రశ్నించగలుగుతాం అనే భావాలు విస్తరించాయి. మామూలు వ్యవసాయ కూలి అమెరికా గురించో, రష్యా గురించో, రెండో ప్రపంచ యుద్ధం గురించో, సామ్రాజ్యవాదం గురించో మాట్లాడుతుంటే, వీళ్లకు ఇన్ని విషయాలెలా తెలుసు అని ఆ ఊళ్లో తలనెరిసిన మోతుబరి రైతులు నోళ్లు వెళ్లబెట్టుకొని వింటుండేవారు. అంటే విజ్ఞానంలో ఒక మామూలు మనిషిని, ఒక మట్టి మనిషి, రాతి మనిషినుకున్నవాణ్ణి కమ్యూనిస్టు పార్టీ ఒక చైతన్యవంతమైన ఆయుధం కింద మలిచింది. ఇదేం చిన్న విషయం కాదు. ఈ మధ్య విజ్ఞాన్ రత్తయ్యగారు రాసిన ఓ పుస్తకం చదివాను. మిగతా విషయలెలా ఉన్నా ఒక విషయం మాత్రం ఆయన స్పష్టంగా రాశారు. తెలుగునాట విద్యాభివృద్ధికి మొట్టమొదట పునాది వేసింది కమ్యూనిస్టులు అని. అది వాస్తవం. ఊళ్లో చదువు అనేది ఒక హక్కుగా ఉండేది. ఎందుకురా మట్టి పిసుక్కునేవాడికి చదువు? చదువుకొని ఊళ్లేలతారా? ఎందుకు బడికి పంపడం? అనుకునే రోజుల్లో చొరవ చేసి, పిల్లలను చదివించడానికి రాత్రిబడులు పెట్టి, లాంతర్ల కింద చదువు చెప్పిన ఘనత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలది. మహిళలకు చదువేంటనుకునేకునే రోజుల్లో చదువుకు ప్రోత్సహించి, వారిని విద్యాలయాలకు పంపిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. కమ్యూనిస్టుపార్టి మహిళలను వీధుల్లోకి తీసుకొచ్చి పోరాటాల్లో భాగస్వాములను చేసింది. మోటూరు ఉదయం గారి నాయకత్వంలో ఒక బుర్రకథ దళం ఏర్పడింది. బహిరంగ ప్రదర్శనలివ్వడంపై భూస్వాములు అసహ్యంగా మాట్లాడేవారు. దాన్నెదుర్కొనే ధైర్యాన్నీ, తెగువనూ మహిళల్లో కల్పించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకని భాషా వికాసంలో, జాతీయ వికాసంలో, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగాన ఉంది. రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రజల చరిత్రను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికారంలోకి రాకపోవచ్చు. మామూలుగా అయితే భావాల గురించి చెప్పుకున్నప్పుడు ఎవరయితే అధికారంలో ఉంటారో వారి భావాలే ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయని చెప్పుకుంటాం. స్థూలంగా అది సరైనది. కానీ అధికారంలో లేకుండానే కమ్యూనిస్టు పార్టీ తన భావాలతో ప్రజలందరినీ ప్రభావితం చేసింది. కాంగ్రెస్ వాళ్లు భూస్వామ్య వ్యవస్థను బలపరిస్తే, ఆ వ్యవస్థకు, దాని కుళ్లు సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే.
ఈ రోజు రాజకీయ సంస్కృతి గురించి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వారు ఎలా ఉంటారు. ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు. ఖరీదైన ఖద్దరు ధరించాలి. లెదర్ చెప్పులేసుకోవాలి. ఆధునికమైన కారు, హంగూఆర్భాటం, మందీ మార్బలం, గన్‌మెన్‌లు...అదో ప్రత్యేకమైన స్టయిల్ లేదా బ్రాండ్. ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉంటాడనే భావన ఉంది. అలా ఉంటేనే రాజకీయ నాయకుడి కింద లెక్క. కానీ మామూలుగా నిరాడంబరంగా ఉండి, చేతిలో సంచి పట్టుకుని, అందులో ఓ పేపరు పెట్టుకొని, ఎక్కడబడితే అక్కడ పేపరు పరుచుకొని పడుకోవడం వంటి ఒక నూతన రాజకీయ సంస్కృతిని 1950లో కమ్యూనిస్టుపార్టీ ప్రవేశపెట్టింది. దాని ప్రభావం కూడా ఇతర పార్టీల మీద ఉంది. కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్నచోట్ల ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. కేరళలో కాంగ్రెస్ వాళ్లు కూడా కమ్యూనిస్టులు మాట్లాడే భాష మాట్లాడేవాళ్లు. కమ్యూనిస్టుల్లాగానే మేమూ ఉన్నాం అని చెప్పుకోవడానికీ, పోటీ పడటానికీ ప్రయత్నిస్తుండేవాళ్లు. ఇతర పార్టీలను కూడా ప్రభావితం చేయగలిగింది కమ్యూనిస్టు జీవన విధానం. అది నీతి, నిజాయితీ, నిరాడంబరత్వంతో కూడిన జీవన విధానం.
అలాగే సంస్కరణోద్యమాలు కూడా. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ఆ రోజు బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం వంటి ఉద్యమాలు నడిపారు. వాటి ప్రభావం ప్రజల్లో ఒక భాగానికే పరిమితమయింది. దాన్ని సాధారణ ప్రజల్లోకి తెచ్చింది కమ్యూనిస్టుపార్టీ. వివాహ పద్ధతిలోనే ఒక ప్రత్యామ్నాయాన్ని చూపింది. అదర్శ వివాహం అంటే అది కమ్యూనిస్టు పార్టీ పెళ్లి అనీ, మీటింగుల పెళ్లనీ, దండలు మార్చుకుంటే పెళ్లయిపోయినట్లేననీ అనేవారు. ఇప్పుడంటే రిజిస్ట్రేషన్లు కావాలి. అప్పుడు రిజిస్ట్రేషన్లు అవసరం లేదు. దండలు మార్చుకుంటే పెళ్లియిపోయినట్లే అనే సాదాసీదా పద్ధతిలో ఖర్చు లేకుండా వివాహం జరిపించేవారు. ఆడపిల్లల పెళ్లంటే సగం ఆస్తి అమ్ముకోవాలనేటువంటి రోజుల్లో పెళ్ళంటే చాలా సులభంగా చేసే ప్రక్రియగా మార్చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీది. కొన్ని స్వఛ్చంద సంస్థలు, అభ్యుదయవాదులు కూడా హంగూఆర్భాటం లేని వివాహ వేడుకల్ని ప్రోత్సహించారు. కమ్యూనిస్టుపార్టి ఆ రోజు నుంచి ఈ రోజుదాకా ఒక ప్రత్యామ్నాయ వివాహ పద్ధతిని ప్రోత్సహిస్తున్నది. తన సొంత కుటుంబంలో కమ్యూనిస్టులు విభిన్నంగా వ్యవహరిస్తారు. ఒకళ్లకొకళ్లు తోడ్పడటం అందరూ చేయకపోవచ్చు. కానీ ఆ సంస్కృతిని మాత్రం ప్రవేశపెట్టింది కమ్యూనిస్టు పార్టీయే. వంటలో సహాయపడటం, పిల్లల పెంపకంలో సహాయం చేయడం వంటివి. వారిని ఎడ్యుకేట్ చేయడానికీ, వారు కూడా జెండా పట్టుకొని ఉద్యమాల్లోకి రావడానికీ, కుటుంబం కుటుంబాన్నే పిల్లలతోసహా వీధుల్లోకి తీసుకురావడానికీ తోడ్పడింది. బహుశా ఆనాడున్న ఫ్యూడల్ విశ్వాసాలు కూడా దీనికి దోహదపడి ఉండొచ్చు. అన్నిటికన్నా మించి స్వాతంత్య్రోద్యమం తరువాత అధికారంలోకి వచ్చి పదవీలాలస పెరిగిన రోజుల్లో సమాజం కోసం త్యాగం చేయాలి. ఈ ఆస్తులూ ఆదాయాలూ, సంపదా ఇవి కాదు. ఉద్యమమే ప్రధానం అని ఎవరికి వారు తెగించి ఇంట్లో ఉన్న తల్లులు, అక్కలు, అమ్మలు వాళ్లందరూ ఉమ్మడిగా అనుకొని సుందరయ్యను చూసో, ఇఎంఎస్ నంబూద్రిపాద్‌ను చూసో స్ఫూర్తి తెచ్చుకొని ఉద్యమాల కోసం త్యాగం చేయడం ఒక సంస్కృతిగా మారింది. ఆ రకమైన ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని సృష్టించడంలో 1950లలోనే కమ్యూనిస్టు పార్టీ చరిత్ర సృష్టించింది.
దాని తరువాత మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా. ప్రజలకు హానిచేసే కొన్ని సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమూ, కేవలం శాస్త్రీయంగా ప్రచారం చేయడమే కాదు. శాస్త్రబద్ధంగా ఆలోచించడమూ, జీవించడమూ అనే విధానానికి నాంది పలికింది కమ్యూనిస్టుపార్టీ. మూఢనమ్మకాలకు వ్యతిరేకమంటే ప్రజలకు హానిచేసేవాటికి వ్యతిరేకం. ముఖ్యంగా మూఢనమ్మకాలకు బలయ్యింది సామాన్య పేద ప్రజలు, దళితులు, గిరిజనులు, మహిళలే. వీరే ఎక్కువ భాగం నష్టపోయారు. వాటిని ప్రశ్నించి నిరోధించేందుకు కమ్యూనిస్టు పార్టీ కృషి చేసింది. మానవ పరిణామం నుంచి అనేక శాస్త్రీయ గ్రంథాల వరకూ ప్రచురించి ప్రచారంలో పెట్టేందుకు కృషి చేసింది. సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు పెద్దఎత్తున చేపట్టబడ్డాయి. తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా యువతరాన్ని ఆకర్షించింది. ఒక శక్తిగా ముందుకొచ్చింది.
సమాజంలో ఫ్యూడలిజం బలంగా ఉన్న రోజుల్లో కూడా (కమ్యూనిటీ) ఉమ్మడితత్వం ఉండేది. 1950-60 కాలాల్లో పెళ్లి జరుగుతోందనుకోండి. పెళ్లి పందిళ్లు వేయడం, వంటలు చేయడం, ఇల్లిల్లూ తిరిగి పాలూ పెరుగూ తేవడం, ఒక విధంగా ఒకరింట్లో పెళ్లి అంటే ఊరు మొత్తం పెళ్లిలాగుండేది. ఎవరింట పెళ్లి జరిగినా ఇతర కులాల వాళ్లూ వెళ్లేవాళ్లు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లో సహపంక్తి భోజనాలు సాగేవి. భూస్వాములు బలంగా ఉన్న చోట దళితులకు విడిగా పెట్టేవారు. భోజనాల వడ్డింపులో అవమానాలు ఎదురయ్యేవి. అందుకే కమ్యూనిస్టులు విభ్నింగా కనిపించేవారు.
1960-70ల తరువాత కమ్యూనిస్టు ఉద్యమం బలహీన పడ్డాక సాంస్కృతిక, సామాజికోద్యమాల రూపురేఖల్లో మార్పులు వచ్చాయి. అక్కణ్నుంచి సాహిత్యంలో మూఢ నమ్మకాలకు పెద్దపీట వేయడం ప్రారంభమైంది. అభ్యుదయకరపాత్ర పోషించిన సినిమాలు, మీడియా స్వభావమే మారిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన నేపథ్యంలో 1980 నాటికి కొన్ని కొత్త రకాల ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో దళితవాదం ఒకటి. ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో అది పుట్టుకొచ్చింది. భూస్వాముల ఆధిపత్యాన్ని సవాల్ చేసి దళితల ఆత్మగౌరవాన్ని నిలబెడతామనే ఉద్దేశంతో పుట్టుకొచ్చిన ఉద్యమం అది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ గుర్తించిందీ, గౌరవించింది. దానికి సంఘీభావమూ తెలిపింది. కానీ దళితవాదం మొత్తం ప్రజాస్వామిక ఉద్యమ స్రవంతి నుంచి వేరుపడి మేం వేరు, మిగతావాళ్లు వేరు, మిగతా సెక్షన్లతోనూ, మిగతా ప్రజలతో కలవం అనే అస్థిత్వవాదం వారిలో పుట్టుకొచ్చింది. అలాగే మహిళల్లో ఫెమినిజం పేరుతో ఒక అస్తిత్వ వాదం ముందుకొచ్చింది. ప్రాంతీయత కూడా ఒక అస్తిత్వవాదం. మా ప్రాంతం వేరు, మేం వేరు అనే వాదం దానిది. మా గురించి మాకు అర్థం అవుతుంది తప్ప ఇతరులు అర్ధం చేసుకోలేరు అనేది వివిధరకాల అస్థిత్వవాదాల సారాంశం.
దళితవాదం భూస్వామ్య సంస్కృతితో పోరాడటానికి బదులుగా సమస్య నుండి తప్పించుకునే (ఎస్కేప్) దారులు వెతికింది. గుడిలోకి అందరినీ అనుమతించాలనేదాని కన్నా, నీళ్ల బావిలో తోడుకోడానికి అవకాశం ఇవ్వాలనే దాని కన్నా, ప్రభుత్వాల మద్దతుతో ప్రత్యేకంగా గుడులు కట్టించుకోవడం, బోర్లు వేయించుకోవడం, విడిగా స్కూళ్లు పెట్టించుకోవడం ద్వారా వివక్షను అధిగమించాలన్న ఆలోచనకు వచ్చారు. వ్యవసాయ దోపిడీ నుండి బయటపడటానికి సుదూర ప్రాంతాలకు వలసలు పోవడం ఆరంభమైంది. ఇలా భూస్వామ్య వ్యవస్థతో పోరాడటానికి బదులుగా దూరంగా పారిపోయే విధానాన్ని అనుసరించింది. అయినా మారిన సామాజిక పరిస్థితులలో దళితుల్లో వస్తున్న ప్రజాస్వామిక భావాలను సహించలేని భూస్వామ్యవర్గాలు దాడులకు తెగబడ్డాయి. కారంచేడు ఘటనతో దళిత ఉద్యమానికి కొత్త అస్థిత్వం వచ్చింది. అయితే ఈ అస్థిత్వవాదాల కారణంగా వర్గ ఐక్యత చెదిరిపోయింది. కమ్యూనిస్టుపార్టీ ప్రవేశపెట్టిన ఉమ్మడి సంస్కృతి దెబ్బతిన్నది. కులాలవారీ సాంస్కృతిక ఐక్యత ఏర్పడింది. అది ఉప కులాలకూ పాకింది. తద్వారా వర్గఐక్యతకు తూట్లు పడ్డాయి.
అస్థిత్వవాదం ప్రారంభకాలంలో ముందుకొచ్చిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తించి, దాన్ని అందిపుచ్చుకొని లీడ్ చేయడంలో కమ్యూనిస్టు పార్టీ వెనుకబడిపోయింది. 1980ల్లో దళిత ఉద్యమం ఒక అభ్యుదయకరమైన పాత్ర పోషించింది. 1990-2000 మధ్య ప్రపంచీకరణ కారణంగా దాని రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచీకరణతో దళిత ఉద్యమాలు సమ్మిశ్రితం అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ సహకారంతోనే సామాజికోద్యమాలు నడపాలి. ఏ ప్రభుత్వం అయితే సామాజిక వెనుకబాటుకు కారణమయ్యిందో, ఏ పాలకవర్గాలయితే భూస్వాములకు వత్తాసుగా నిలబడ్డారో వారి సహకారంతోనే సామాజికోద్యమాలు నడిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారు తమ అస్థిత్వాన్ని వెదుక్కునే పనిలో పడ్డారు. ఇలాంటి స్థితిలో తిరిగి మరలా 2000 సంవత్సరం నుంచి సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకొచ్చి నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్టు పార్టీయే. ఎక్కడ అన్యాయం, అక్రమాలు జరుగుతున్నా, వివక్ష పాటిస్తున్నా, అక్కడ వాలి తెగబడి పోరాడుతున్నది కమ్యూనిస్టు కార్యకర్తలే. 1980ల్లో వెనకబడినా, ఈ సంధి యుగంలో దాన్ని అందిపుచ్చుకొని నూతన అవగాహనతో కమ్యూనిస్టు పార్టీ ముందుకు తీసుకుపోతోంది.
1980ల్లో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఎన్‌టి రామారావు ముందుకొచ్చారు. దానికి మూలం కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే. వారి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అవమానించడం, తెలుగువారిని గుర్తించకపోవడం వల్ల అప్పుడా అస్థిత్వం ముందుకొచ్చింది. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి: కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే రాజకీయ చైతన్యం ఉంది. రెండోది తెలుగువారి ఆత్మగౌరవాన్ని గుర్తించాలనే సాంస్కృతిక, సామాజిక వాంఛా ఇమిడి ఉంది. నాటి ప్రజాస్వామ్య ఉద్యమ స్ఫూర్తిలో వెంటనే కలవకపోయినా ఆ తరువాత భాగసామ్యం వహించింది కమ్యూనిస్టు పార్టీ. తెలుగువారిని కేంద్ర గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా కదిలించడంలో కమ్యూనిస్టుపార్టీ ముందుకొచ్చింది. అయితే తెలుగువారిని రెండు రాష్ట్రాలుగా విడగొట్టడంలో టిడిపి అవకాశవాద పాత్ర పోషించింది. తెలుగుదేశం ప్రారంభ దశలో ఎన్టీఆర్ మొదట అభివృద్ధికరమైన పాత్ర నిర్వహించినా ఆ తరువాత అది అభివృద్ధి నిరోధక పాత్రకు మారిపోయింది. ఎన్టీఆర్ చనిపోయాక అదే చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచబ్యాంక్‌కు తాకట్టుపెట్టాడు.
మూడోది ప్రపంచీకరణ. సామాజిక, సాంస్కృతికోద్యమాలను పూర్తిగా తిరోగమింప చేయడం, ప్రతిదాన్నీ వాణిజ్యీకరించటం దీని లక్షణం. సాహిత్యం, కళలు, మీడియా, సినిమా, పెళ్లి, చావు, ఆఖరికి అవి నైతిక విలువలైనా, ప్రతిదాన్నీ వ్యాపారసరుకుగా మార్చింది. 'కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవిత కనర్హం' అని శ్రీశ్రీ అన్నట్లుగా అమ్మడానికీ కొనడానికీ ఈ ప్రపంచీకరణలో అనర్హమైనదేమీలేదు. సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు చాలా మార్పులకు గురవుతున్నాయి. భాషా వికాసం చెందాలంటే ఆ జాతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమనం సాధిస్తుందో ఆ భాష అంత పురోభివృద్ధి సాధిస్తుంది. ఉదాహరణకు భాషా వికాసానికి 1980ల్లో ఈనాడు దినపత్రిక ముఖ్య పాత్ర నిర్వహించింది. జనం వాడుక భాషలో అది వార్తలనందించింది. ప్రత్యేకంగా స్థానిక వార్తలను ప్రవేశపెట్టింది. అంతకుముందు (1950-60ల్లో) అంతర్జాతీయ,జాతీయ వార్తల విషయంలో కమ్యూనిస్టులు మీడియాను ఎంతగానో ప్రభావితం చేశారు. అమెరికాలో ఏం జరుగుతోందో, రష్యాలో ఏంజరుగుతోందో మామూలు వ్యక్తి చెప్పగలిగాడంటే అది కమ్యూనిస్టు జర్నలిజం వల్లనే. వారి పత్రికల వల్లనే. కానీ ఈనాడు దినపత్రిక వార్తల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి వీధుల్లోకి తెచ్చింది. అది మంచి పనే. మన సమస్యలు, మన వీధి, మన ఇరుగు పొరుగు ఇలా. దాన్నే కమ్యూనిస్టు జర్నలిస్టులు కూడా అనుసరించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితేమిటి? ప్రతిదీ ప్రపంచీకరణ గురించే. ప్రపంచంలో జరిగే ప్రతి మార్పూ మనల్ని ప్రభావితం చేస్తోంది. ప్రపంచం గురించీ, దేశం గురించీ చెప్పకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ ఊరి గురించి నువ్వాలోచించుకో, దేశం గురించి నువ్వాలోచించొద్దు అంటే కళ్లున్న కబోదులమైపోవడమే. ఆరోజు ప్రగతిశీల పాత్ర నిర్వహించిన 'ఈనాడు' ఈ ప్రపంచీకరణ యుగంలో స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వస్తున్న మార్పుల నుండి ప్రజలను దూరంగా ఉంచుతోంది. తద్వారా సామాజిక పురోగమనానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తోంది. సాధారణ భాషతో పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా భాషను ప్రజల దగ్గరకు తెచ్చిన ఈనాడు పాత్ర ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ఈమధ్య కంప్యూటరును అంతర్జాలం అని రాస్తున్నారు. అంతర్జాలం అంటే అర్థమేమిటో తెలుసుకోవడానికి నిఘంటువును వెదకాలి. అంతర్జాలం అనే పదం సంస్కృతమా, పార్శీకమా, తమిళమా, మళయాలమా అని తెలుగువారు తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి. అంతర్జాలం అనడం కన్నా కంప్యూటరు అంటే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. దీన్ని చాదస్తమందామా లేక వ్యవహారిక భాష అనాలా? గిడుగు రామ్మూర్తి పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు భాషా వికాసానికి ఎంతగానో పోరాడారు. వ్యవహారిక భాషా వ్యాప్తి కోసం వారు రాసిన పుస్తకాలు ఇప్పుడు చదివితే మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కందుకూరి రాజశేఖర చరిత్ర నవల, గురజాడ కన్యాశుల్కం నాటకం చదివితే అప్పటికీ ఇప్పటికీ భాష చాలా మారిపోయిందని అర్థంమవుతుంది.
కంప్యూటరును మనమే కనుక్కున్నామనుకోండి. దానికి అంతర్జాలం అని పేరు పెట్టామనుకోండి. దాన్ని ప్రపంచమంతా అంతర్జాలం అనే అంటుంది. మన భాష ప్రపంచ భాషగా మారిపోతుంది. అందుకే భాషా వికాసాభివృద్ధికీ, శాస్త్ర సాంకేతికాభివృద్ధికీ సంబంధం ఉంది. మనం శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందకుండా అన్నీ అమెరికా నుంచో, యూరోపు నుంచో దిగుమతి చేసుకుంటూ మన భాషలో వాటికి పేర్లు పెడితే మన పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు? పిల్లలు అభివృద్ధి కావాలన్నా, మాతృభాషాభివృద్ధి కావాలన్నా కచ్ఛితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అభివృద్ధి కావాలి. ఇప్పుడు 'మేకిన్ ఇండియా' అంటే మన డబ్బు పెట్టి అమెరికా నుంచి విడిభాగాలు కొని, వాటిని ఇక్కడ అసెంబ్లింగ్ చేయడమే. కారు పార్టులన్నీ అక్కడ కొంటాం. వాటిని ఇక్కడ కూర్పుచేసి కారును తయారు చేస్తాం. అది 'మేకిన్ ఇండియా' అయిపోతుంది. దానివల్ల శాస్త్ర సాంకేతికాభివృద్ధి రాదు. మనందరి దగ్గరా సెల్ ఫోన్లు ఉన్నాయి. దానిలో ఉండే చిన్న చిప్‌ను మనం ఇక్కడ తయారు చేసుకోలేం. ఒక వెబ్‌సైట్‌కు అవసరమైన సర్వర్లను నిర్వహించలేం. దీనికోసం అమెరికా మీదనో, యూరోపు మీదనో ఆధారపడాలి. మనం సర్వర్ అని అంటున్నాం. దానికేం పేరు పెట్టాలి? ఆ సర్వర్ అమెరికాలో ఉంటుంది. అదే సర్వర్‌ను మనం ఇక్కడ తయారు చేసుకుంటే ఒక తెలుగు పేరు పెట్టుకుంటే? మన తెలుగువాళ్లే ఇంజనీర్లు. తెలుగు ఇంజనీర్లయినా ఇంగ్లీషు పేరు పెట్టాల్సిందే. లేకపోతే వాళ్లకు అమెరికా జీతం రాల్చదు. అదే మన ప్రభుత్వం వాళ్లను ప్రోత్సహించి అవే సర్వర్లను, చిప్‌లను ఇక్కడ తయారు చేయించుకొని తెలుగు పేర్లు పెట్టుకుంటే అవి ప్రపంచవ్యాప్తం అవుతాయి. అప్పుడు తెలుగువారి కీర్తి ఖండఖండాంతరాలకూ వ్యాపిస్తుంది. ఈ రెంటి మధ్య సంబంధాన్ని విడదీయలేము.
ఈ మధ్య హైదరాబాద్ వెళ్లినప్పుడు ఒక పాప టైం ఎంతయింది అని అడిగింది. పదయ్యిందని చెప్పా. అంటే ఎంతా అని అడిగింది. టెన్ అన్నా. ఓ అప్పుడే టెన్ ఓ క్లాక్ అయ్యిందా అన్నది. రాబోయే కాలంలో యువతరం తెలుగుభాష కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందనీ, దాన్ని కమ్యూనిస్టులే లీడ్ చేస్తారనీ నాకనిపించింది. అలాంటి కొత్త పరిస్థితి ఈ రోజు తలెత్తుతోంది. ఇక భాషా వికాసంలోనూ ఛాందసత్వం ఉంది. కొన్ని సందర్భాల్లో కొత్త పదాలు పుట్టుకొని వస్తుంటాయి. ఉదాహరణకు జరీబు భూములంటున్నాం. ఇది ఉర్దూ పదం. మాగాణి అని అర్థం. ఉర్దూ పదాన్ని మన భాషలో భాగంగా చేసుకున్నాం. ఇటువంటివి వ్యవసాయ సంబంధమైన పదాలు ఉర్దూ నుండి తెలుగులోకి చాలానే వచ్చాయి. రెవెన్యూ పదజాలం కూడా ఎక్కువగా ఉర్దూలోనే ఉంటుంది. పహణీ వంటి పదాలు అందుకు ఉదాహరణ. ఇలా భాషా వికాసంలో వస్తున్న మార్పులను కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
ప్రపంచీకరణలో వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో జాతుల ప్రత్యేకతను గుర్తించకపోవడం ఒకటి. ఇంగ్లీషులో 'నేషనల్ స్టేట్' అంటారు. మన జాతీయోద్యమం కూడా దాని ఆధారంగానే నడిచింది. ఇప్పుడు సరిహద్దులు చెరిపేసి ప్రపంచం అంతా ఒకటే అంటున్నారు. ప్రపంచమంతా ఒకటి కావాలని కమ్యూనిస్టులు అందరికన్నా ముందు కోరుకున్నారు. కానీ కమ్యూనిస్టులు కోరుకున్నది వేరు, నేడు జరుగుతున్నది వేరు. ఇపుడు జరుగుతున్నది ప్రపంచ సరిహద్దులు చెరిపేసి అందరూ ఉమ్మడిగా ఒక ప్రపంచ రాజ్యాన్ని ఏలడం కాదు. అమెరికా ఆధిపత్యంలో ఉన్న సంపద్వంతమైన జాతులు కొన్ని ప్రపంచం మీద పెత్తనం చేస్తున్నాయి. వారు శాసిస్తారు. మనం అనుసరించాలి. ఆ రకంగా జాతుల నిర్మూలనకు దారితీసే ప్రమాదం కూడా ప్రపంచీకరణలో మనకు కనిపిస్తోంది. మతం పేరుతో పెద్ద అలజడి సృష్టిస్తున్నారు. మతాన్ని విషగుళికలుగా మార్చి, దానికి భక్తి అనే తీపి ముసుగు తొడిగి సమాజంపై చల్లారు. జనానికి మత్తెక్కించి చీలగొట్టారు. వారిలో వారికి తగాదాలు పెట్టారు. పెత్తందారీ వర్గాలను అందలమెక్కించారు. బలపరచారు. దేవుడు ఉద్యమాలకు కానీ, సమాజాభివృద్ధికిగానీ ఎప్పుడూ అడ్డం రాలేదు. దేవుని పేరు చెప్పుకునే మనుషులు అడ్డం వచ్చారు. లాటిన్ అమెరికాలోని పరిణామాలు చూస్తే, వారి సహజ సంపదను అమెరికా వాళ్లు దోచుకుపోతుంటే, వాళ్లను అణిచిపెట్టి బికారులను చేస్తుంటే దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలతోపాటు క్యాథలిక్కులు, క్రిష్టియన్లు, థియాలజిస్టులు కూడా కలిసి వచ్చారు. మత పెద్దలు కలిసి వచ్చారు. ఈ రోజు వాటికన్ సిటీకి పోప్ ప్రాన్సిస్ అధినేతగా ఉన్నాడు. ఆయనీరోజు పేదల గురించి మాట్లాడుతున్న పాపానికి 'మార్క్సిస్ట్ పోప్' అంటున్నారు. ప్రజల ఒత్తిడి వల్ల కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు, ఈనాడు మతం అక్కడ సానుకూల పాత్ర పోషిస్తోంది. కానీ ఈరోజు మన దేశంలో మతం ప్రతికూల పాత్ర పోషిస్తోంది. మతం పేరుతో మతో న్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు. భారతీయులు అంటే హిందువులు మాత్రమే అంటున్నారు. మన పురాణాల్లో, రామాయణ, భారతాల్లో హిందూ అనే పదం ఎక్కడా కనపడదు. భరత వర్షే, భరత ఖండే అన్నారు తప్ప హిందూ దేశే, హిందూ ఖండే, హిందూ వర్షే అని ఎక్కడా అనలేదు . హిందూ అన్నది విదేశీయులు పెట్టిన పేరు. ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్, హిందువులు ప్రార్థన చేయడం ముస్లింలు వచ్చాకే నేర్చుకున్నారని చెబుతున్నాడు. ఇన్నాళ్లకు ఆయనకు రియలైజేషన్ వచ్చింది. దీనర్థం ప్రార్థన చేయడం అన్నదే మనకు తెలియదని అంగీకరించడమేగా కదా! కనీసం ముస్లింల నుంచి హిందువులు నేర్చుకున్నారనే సత్యాన్నయినా గ్రహించాడు. మోడీ కుర్తా, పైజామా, కోటు ధరిస్తున్నాడు. అది హిందువుల డ్రస్సా? పురాణాల్లో ఉందా? మొఘలాయిలు తెచ్చిన డ్రస్సు అది. మోడీ ఎలా ధరిస్తున్నాడు? దళితుల అంటరానితనాన్ని ముస్లింలు తీసుకువచ్చారట. అంతకుముందు అంటరానితనం లేదట. ఎవరైనా నవ్వుతారు. అంటే మొత్తం చరిత్రను వక్రీకరించి, చెడును ముస్లింలకు ఆపాదించి దళితులకూ, ముస్లింలకూ తగాదాలు పెడుతున్నారు. డిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో చాలా చోట్ల జరుగుతున్న మతఘర్షణలు మనం చూస్తున్నాం. ఈరోజు మత ఘర్షణలన్నింటిలో దళితులను ముస్లింల మీదకు మళ్లిస్తున్నారు. గుడి దగ్గరో, గోపురం దగ్గరో, ప్రేమ దగ్గరో, పెళ్లి దగ్గరో తగాదా సృష్టించి ముస్లింల మీదకు రెచ్చగొడుతున్నారు. ఆ రకంగా వారిని బలిపశువులను చేస్తున్నారు. మనవారి మధ్య తగాదా పెట్టి, ఒకగౄపును ఆయుధంగా మార్చి మనవారిమీదే ప్రయోగిస్తున్నారు. ఇదే గుజరాత్ నమూనా.
అనేక రకాల పండుగలు జరుగుతున్నాయి. ఈ పండుగల్లో కూడా జాతీయమైనవీ, మత సంబంధమైనవీ, స్థానికంగా ఉండేవీ, ప్రకృతి పరమైనవీ, పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చేవీ ఉన్నాయి. పండుగలన్నీ మూడనమ్మకాలని, పనికిరానివీ అని ఒకే గాటన కట్టలేం. ఒకప్పుడు 1950ల్లో పండగొస్తే కమ్యూనిస్టులు ప్రభలు కట్టి అభ్యుదయ పాటలు పాడుకుంటూ తిరుణాళ్లు, జాతర్లలో పాల్గొనేవారు. ఆరోజు అభ్యుదయ గీతాలు కూడా పండుగల్లో భాగమై పోయాయి. సంక్రాంతి వస్తే ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఊరుఊరంతా పండుగ వాతావరణం వచ్చేది. అలాంటి ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని పండుగలతో మమేకం చేసి నిర్మించింది కమ్యూనిస్టు ఉద్యమం. మరలా అలాంటి సాంస్కృతికోద్యమాన్ని బీజం తొడిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేడే ఉంది. అది కార్మికుల పండుగ. జెండా ఎగురవేసి డప్పుకొట్టి నినాదాలిస్తేనే పండుగకాదు. ప్రతి ఇంట్లో దీపం వెలిగించవచ్చు. జెండా ఎగురవేయవచ్చు. అదొక ఉమ్మడి పోరాట ప్రతిజ్ఞాదినం. ప్రజా పండుగ. కార్మికుల పర్వదినం. ఓ ప్రమాణం స్వీకరించే దినంగా భావించాలనుకుంటే అప్పుడు కొత్త వెల్లువ, కొత్త సంస్కృతి వచ్చేస్తుంది. ఈ రోజు ప్రపంచీకరణ వాణిజ్యీకరణగా మారింది. సాంస్కృతిక రంగంలో ప్రజలకుండే జాగా క్రమంగా తగ్గిపోతోంది. ఇంతకుముందు పిల్లలను పార్కులకు తీసుకొని వెళ్లి అలా తిప్పి తీసుకువచ్చేవాళ్లు. పార్కుల్లోకి పోవాలంటే అప్పుడు ఉచితం. కానీ ఇప్పుడు పార్కులకు పోవాలంటే ఫీజు కట్టాలి. ఫీజు కన్నా మించిన పెద్ద ఖర్చుంది. పార్కు మొత్తం ఇప్పుడో కమ్మర్షియల్ మాల్ అయిపోయింది. అన్నీ రకాల షాపులు ఉంటాయి. అక్కడ రకరకాల వస్తువులు అమ్ముతారు. అయితే పిల్లలను తీసుకుపోయినప్పుడు వెంట ఒక ఆటం బాంబును పట్టుకుపోయినట్లే. వెయ్యో, రెండు వేలో తీసుకుపోతేనే పిల్లలను సంతృప్తిపరచగలం. లేకుంటే లేదు. అటువంటి చోటకు పోయి ఏం చేస్తాం? కాబట్టి పార్కులకు పోయే సమస్య లేదు. మరి ఓ ఉయ్యాల లేకుండా, ఓ జారుడు బండ లేకుండా పిల్లల వికాసం ఏమిటి? గ్రామాల్లో కూడా కోతికొమ్మచ్చాటలు, బిళ్లంగోడులు కనిపించడం లేదు. వినోదాల కోసం పట్నాలకు పోతున్నారు. స్కూలు బస్సే పిల్లలకు ఆటస్థలంగా మారిపోయింది. 24 గంటలూ తోమి వారిని మర మనుషులుగా మార్చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అప్పుడు ఆ జాతి ఎలా ఉంటుంది? ఒక భౌతికపరమైన, మానసికపరమైన వికాసంలేని జాతి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది? సాంస్కృతిక శూన్యం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద సవాల్‌గా మారుతుంది. టర్కీలో పార్కుల కోసం పెద్ద ఉద్యమం నడిచింది. కమ్యూనిటీ హాలు కోసం కేటాయించిన స్థలంలో పెద్ద మాల్ కట్టబోతుంటే మాకు ఈమాల్ వద్దని ప్రజలు తిరుగుబాటుచేశారు. అది ప్రభుత్వాన్ని గడగడలాడించిన పెద్ద ఉద్యమంగా మారింది. ఇటువంటి ఉద్యమాలు ప్రపంచమంతా నడుస్తున్నాయి. మన దేశంలోనూ ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, బొంబాయిల్లో ఇలాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటివి అనేకమైనవి ప్రతిదీ డబ్బుతో ముడిపడిపోతాయి. పార్కుకు పోయినా డబ్బు. సినిమాకు పోయినా డబ్బే. కానీ సినిమాకు పోయినట్లు ఉండదు. మాల్‌కు పోయినట్లు ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లినా, రైల్వే స్టేషన్‌కు పోయినా కమ్మర్షియల్ మాల్స్‌కు పోయినట్లుంటుంది. దానికి డబ్బు కావాలి. అందుకే మోడీ ధన్‌జన్ యోజన ప్రవేశపెట్టాడు. జన్‌ధన్ యోజన కింద ఐదు వేల రూపాయలు ఓవర్‌డ్రాప్ట్ ఇస్తాడట. అంటే అప్పు తీసుకో. అనుభవించి, దివాళా ఎత్తు. ఎవరైనా ప్రజల ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వం మార్గాలు చూపాలి. పథకాలు పెట్టాలి. కానీ జన్‌ధన్ యోజన ప్రజలను అప్పులపాలు చేసే పథకం. ఈ పథకాన్నిపెట్టి నాది ఘన విజయం అని చెబితే ఉపయోగమేమిటి? ఈ ఐదు వేలు దేనికి పనికి వస్తాయి? ఏమైనా ఒక వ్యాపారం పెట్టుకోవడానికి పనికి వస్తుందా? ఏదో ఒకటి కొనుక్కోవడానికి మాత్రమే పనికి వస్తుంది. కొనుకున్న తరువాత మళ్లీ ఎలా తీర్చాలి? వారు కట్టలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే పెద్ద వాళ్లు లక్షల కోట్లు ఎగవేశాక వీరి ఐదువేలు పోతే పోయిందిలే మాఫీ చేస్తామంటారు. ఎందుకంటే జనాన్ని అవినీతిపరుల్ని చేస్తేనే కదా వారి అవినీతి కూడా మూడుపువ్వులు,ఆరుకాయలుగా వర్ధిల్లేది. కాబట్టి ఈ రకమైన సాంస్కృతిక శూన్యత రాబోయే రోజుల్లో పెరగబోతున్నది.
ఇప్పుడు భాష గురించి చెప్పుకున్నాం. భాషల్లో చాలా భాషల గురించి చెప్పారు రవిబాబుగారు. ఓ కొత్త భాష వచ్చింది. అది రాజకీయ భాష. రాజకీయ సంస్కృతి మాదిరిగానే రాజకీయ భాష కూడా. ఈ రాజకీయ భాష ప్రత్యేకత ఏమిటంటే వారుచెప్పేది జనానికి అర్థమయినట్లే ఉంటుంది కానీ అర్థం కాదు. అంటే అస్పష్టంగా ఉంటుంది. ఇచ్చినట్లే ఉంటుంది. నేను చెప్పానా ఆమాట అంటాడు. అప్పులు రద్దు చేస్తానంటాడు. రూ.పదివేలు కూడా రద్దు కాలేదు అని రైతులు అడిగితే అప్పులన్నీ రద్దు చేస్తానని చెప్పానా అంటాడు. అదన్నమాట రాజకీయ భాష అంటే. తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసి నెత్తిమీద పదిపైసలు పెట్టి నిన్ను పావలాకు అమ్మేస్తామని చెప్పే మాటలు ఇక్కడున్న భాషా పండితులు, సాహితీవేత్తలు రాజకీయ నాయకుల వద్ద, మోడీ దగ్గర, చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. ప్రజలను మోసం చేసి, వంచన చేసే నయవంచక భాష ఒకటి రాజకీయ రంగంలో ప్రవేశపెట్టారు. సాహిత్య రంగంలో దీన్ని కూడా చీల్చి చెండాడాలి. ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి రావాల్సి ఉంది. కేజ్రీవాల్ కూడా అదే చెబుతున్నారు. విఐపి కల్చర్ వద్దు. అవినీతి లేని రాజ్యం రావాలి. గుడ్‌గవర్నెస్- అంటే మంచి పాలన కావాలి. అంటే కష్టం లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రజలకు సర్టిఫికెట్లు వచ్చేయాలి. ఆసుపత్రికి పోతే వెంటనే పనికావాలి. స్కూల్లో వెంటనే సీటు కావాలి. ఇవన్నీ మంచి ఆశయాలే. కమ్యూనిస్టులు కోరుకునేవి కూడా ఇవే. వామపక్షాలు అధికారంలో ఉన్నచోట ఎవరికన్నా బాగా వీటిని అమలు చేస్తున్నారు. కానీ ఒకటే తేడా. ఈ వ్యవస్థను ఇలా ఉంచి దీనినే సంస్కరించి అన్నీ సమృద్ధిగా సమకూర్చి పెడతానని కేజ్రీవాల్ అంటున్నారు. ఈ వ్యవస్థను ఇలాగే ఉంచి అన్నీ సమకూర్చాలంటే అసాధ్యం. అన్ని సౌకర్యాలూ సమకూరాలంటే వ్యవస్థను సమూలంగా పునర్నిర్మించి కొత్త వ్యవస్థను నిర్మిస్తేనే సాధ్యమవుతుందని కమ్యూనిస్టులు చెబుతున్నారు. తక్షణం భారాలకు వ్యతిరేకంగానో, కాలేజీల్లో ఫీజుల పెంపుకు వ్యతిరేకంగానో, ఆసుపత్రిల్లో వైద్యం కోసమో, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు కల్పించాలనో, సబ్సిడీల కోసమో పోరాడుతూనే ప్రజలను కదిలించి, సమూల మార్పుల కోసం పెద్ద ఉద్యమాలు నిర్మిస్తే, దానికో రాజకీయ రూపమిస్తే అప్పుడు ఈ సమాజాన్ని మార్చొచ్చు.
ఈ మధ్య హైదరాబాద్‌లో పార్టీ ఇంటింటికీ వెళ్లి ఓ సర్వే నిర్వహించినప్పుడు 30 ఏళ్లలోపు యువకుల్లోలో ఒక ధోరణి కనిపించింది. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ గురించి వారికి తెలియదు. అందులో రాజకీయాలు మాకనవసరం. అన్ని పార్టీలూ ఒకటే. కమ్యూనిస్టు పార్టీ కూడా అందులో ఒకటి. 40, 50 ఏళ్ల వాళ్లలో కమ్యూనిస్టు వ్యతిరేకత ఉంది. (సోవియట్ యూనియన్ కూలిపోయిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన దాని ప్రభావం వారి మీద ఉంటుంది
). అందుకని కమ్యూనిస్టులంటే కొంత ద్వేషం ఉంటుంది. కానీ యువకుల్లో కమ్యూనిస్టులంటే ద్వేషం లేదు. రాజకీయాలంటేనే వ్యతిరేకం. రాజకీయాలకు వ్యతిరేకమంటే కమ్యూనిస్టు పార్టీ కూడా రాజకీయ పార్టీ కాబట్టి ఆ వ్యతిరేకత వచ్చింది. మీరేదన్నా మాకోసం పని చేయండి. నచ్చితే నిధులిస్తాం అన్నవాళ్లున్నారు. రాజకీయాలంటే తెలియకపోయినా, రాజకీయాలంటే వ్యతిరేకత ఉన్నా, కమ్యూనిస్టు పార్టీ ఈ కొత్త తరంలో పనిచేస్తే అభివృద్ధి అయితీరుతుంది. ఈ తరంలో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలత వుందని కాదు. దాన్ని సృష్టించుకోవాలి.
రాబోయే కాలంలో నిరుద్యోగం విపరీతంగా పెరగబోతోంది. కంప్యూటర్ ఉద్యోగాలు వస్తాయి అని యువ ఇంజనీర్లు ఆశగా ఎదురు చూస్తుంటే నాస్‌కాం 16 శాతం ఉద్యోగాలు పడిపోతాయని ప్రకటించింది. ఇప్పటికే చాల కంపెనీల్లో రిట్రెంచ్‌మెంట్లు చేసేస్తున్నారు. 25 వేల ఉద్యోగులను తొలగించి 5 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగంవల్ల యువకుల్లో నిస్పృహ వస్తుంది. దానికి నమూనానే మోడీ వేవ్, డిల్లీలో కేజ్రీవాల్ వేవ్ వచ్చాయి. ఇది శాశ్వతం అనుకుంటే పొరబాటు. ఈ తరంలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏమిటంటే తక్షణ ఫలితాలను కోరుతున్నారు. వెంటనే మాకు ఫలితం కావాలి. ఎక్కడకు పోయినా అంతేకదా. ఇంతకుముందు కేథలాబ్‌కు వెళ్లి బ్లడ్ ఇచ్చి వచ్చేవాళ్లమనుకోండి. మూడు రోజుల తరువాత రమ్మంటారు. ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా గంటలో అయిపోతోంది. ఆ ప్రభావం యువకులపైన కూడా ఉంటుంది. అందుకని ఏడాదిలో రెండేళ్లలో వారు అనుకున్నది నెరవేర్చకపోతే, మోడీనీ, క్రేజీవాల్‌ను ఎంత ఎత్తుకు లేపారో అంత ఎత్తునుంచీ పడేస్తారు.
అప్పుడు ప్రజలకు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం అవుతుంది. కేజ్రీవాల్ కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. క్షేత్రస్థాయిలో ప్రజలను కదిలించి వారిలో పనిచేశాడు. అవినీతిలేని రాజ్యాన్ని అందిస్తానన్నాడు. ఆశయం మంచిదే. అతడు నిజాయితీపరుడే. కానీ ప్రభుత్వ అధికారాలు చాలా తక్కువగా ఉన్న ఢిల్లీ వంటి చోట అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందా? సాధ్యం కానప్పుడు యువకులు ఎలా ఆలోచిస్తారు? ఆయనను ప్రశ్నిస్తే సమాధానం ఏమని చెబుతారు? రాబోయే కాలంలో ఇలాంటి ప్రశ్నలకు మోడీ అయినా, కేజ్రీవాల్ అయినా సమాధానాలు చెప్పాలి. రాబోయే కాలంలో ఓ రాజకీయ శూన్యత కూడా ఏర్పడబోతోంది. దీన్ని భర్తీ చేయడంపైనే భారతదేశ, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
కొత్త రాజకీయ సంస్కృతిని కమ్యూనిస్టు పార్టీ ప్రజల ముందుకు తీసుకువచ్చి జాతి వికాసం కోసం, భాషా వికాసం కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక వికాసం కోసం, సామాజిక మార్పు కోసం పోరాడేందుకు ఈ తరాన్ని ముందుకు నడిపించాలి. 1950ల్లో ఏ చరిత్రనయితే సృష్టించి మొత్తం ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేసి, అధికారంలో లేకపోయినా ఒక ట్రెండ్‌ను సృష్టించిందో ఆ విధంగానే రాబోయే కాలంలో కూడా మరలా ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించడానికి కమ్యూనిస్టు ఉద్యమం పూనుకోవాలి.
- వి. శ్రీనివాసరావు
రచయిత సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు
(ఈ ఉపన్యాసాన్ని వ్యాసరూపంలో రాసినవారు: యు.రామకృష్ణ)