పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై అనేక దేశాలతో చర్చించటం ద్వారా ఒక సరికొత్త ప్రపంచ పాలనా నిర్మాణాన్ని అమెరికా చేపడుతున్నది. ఈ ఒప్పందాలన్నీ అమలులోకి వస్తే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 80 శాతం వీటి పరిధిలోకి వస్తుంది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా వీటి ఆధీనంలోకి వస్తుంది. అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు(బిట్సి, ట్రాన్స్‌అట్లాంటిక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్టనర్‌షిప్(టిటిఐపి), ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్(టిపిపి)వంటివి) వీటిలో ఉన్నాయి. ఇందులో చేరాల్సిందిగా భారత్‌ను ప్రేరేపిస్తున్నందున ఈ నిర్మాణాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంది.
మూడు ముఖ్య లక్షణాలు
ఈ ఒప్పందాలలో కనీసం మూడు ముఖ్యమైన లక్షణాలున్నాయి. వీటిలో అత్యంత ప్రధానమైనది పెట్టుబడిపెట్టే రాజ్య వివాదాల పరిష్కార (ఐఎస్‌డిఎస్) యంత్రాంగం. దీన్ని అనుసరించి ప్రయివేటు పెట్టుబడిదారులు ప్రభుత్వంపై ఒక ప్రయివేటు మధ్యవర్తిత్వ కోర్టులో దావా వేయగలుగుతారు. మరోవిధంగా చెప్పాలంటే ప్రజాహితంకోరి ఒక సార్వభౌమ ప్రభుత్వం ఒక విదేశీ పెట్టుబడిదారును నియంత్రించలేదు. ఒకవేళ అలాచేసినా తన దేశంలో తన రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన కోర్టుకు ప్రభుత్వాన్ని లాగటం జరగదు. అందుకు బదులుగా ఇదే ఒప్పందం ప్రకారం ఏర్పాటైన కోర్టు ప్రభుత్వ ప్రమేయం నుంచి ప్రయివేటు పెట్టుబడిదారును 'రక్షిస్తుంది'. అంటే ఏమిటో చూద్దాం. 1970వ దశకం ప్రారంభంలో భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం(ఫెరా) తెచ్చారు. ఈ చట్టం విదేశీ కంపెనీలను అనేక విధాలుగా నియంత్రించింది. ఆ కాలంలో భారత్ ఇలాంటి పెట్టుబడుల ఒప్పందాన్ని ఆమోదించి ఉంటే రాజ్యాంగానికి కట్టుబడనవసరంలేని విదేశీ కంపెనీలు తమ హక్కులను కాలరాసిందని ప్రభుత్వాన్ని ఒక ప్రయివేటు కోర్టుకు ఈడ్చగలిగేవే. అలాంటి కేసుల్లో అవి ప్రభుత్వం మీద నెగ్గే అవకాశమే ఎక్కువ. నిజానికి అలాంటి అవకాశం ఉంటుంది గనుక ఫెరాలాంటి చట్టాన్ని తేవటంతో ప్రయోజనం ఏమీ ఉండదని ప్రభుత్వం భావించేది. కాబట్టి దీనర్థం ఏమంటే ఒక దేశంలో ఏ ప్రభుత్వమైనా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపితే ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు కూడా దీనికి బద్ధులై ఉండాల్సి ఉంటుంది. ఆవిధంగా ప్రభుత్వాల చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా, ప్రజాహితంలో ఉన్నాయా అనే దృష్టితో కాకుండా ఈ ఒప్పందం ప్రకారం ఉన్నాయా, లేదా అనే విషయం ఆధారంగానే కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే అలాంటి ఒప్పందం వల్ల జాతి-రాజ్య సార్వభౌమాధికారాన్ని అతిక్రమించటమే కాకుండా నియమానుసారంగా చూస్తే ప్రభుత్వ రాజ్యాంగ విధుల నిర్వహణకు కూడా ఆటంకం కలుగుతుంది. అంతేకాక ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉండే ప్రజా సార్వభౌమాధికార నియమాన్ని కూడా ఇది అతిక్రమిస్తుంది. తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాయనే ఆశతో ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. అయితే అందుకు తగిన చర్యలను తీసుకోవటం వల్ల విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం కలుగుతుంటే ప్రభుత్వం ఆ పని చేయజాలదు. విదేశీ పెట్టుబడిదారులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇబ్బంది కలిగించని ప్రధాన ఆర్థిక సంబంధ నిర్ణయాన్ని ఊహించటం కష్టం. అలాంటి ఒప్పందం వల్ల భూమి పునఃపంపిణీ చేయటం కూడా కష్టం. విదేశీ పెట్టుబడిదారుల ఆధీనంలోని భూమిని స్వాధీనం చేసుకోవాలన్నా లేక కనీసం వారు కన్నేసిన భూమిని పంపిణీ చెయ్యాలన్నా ఈ ఒప్పందం అడ్డుగా నిలుస్తుంది. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల వ్యక్తీకరణను బలహీనపరుస్తూ తమ హక్కుల 'సంరక్షణ' విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా చూసుకోవటం విదేశీ పెట్టుబడిదారులకు అవసరమౌతుంది. ఇలా జరగటానికి ప్రపంచ ద్రవ్య పెట్టుబడి ప్రవాహాల సుడిగుండంలో దేశాన్ని చిక్కుకునేలా చేయటం ఒక స్పష్టమైన మార్గం. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం చర్యతీసుకుంటే పెట్టుబడి దేశాన్ని విడిచిపోయే ప్రమాదాన్ని ఆ ప్రభుత్వం ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ 'రక్షణ' విదేశీ పెట్టుబడిదారులకు సరిపోయినట్లు కనబడటం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయినప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కేవలం ప్రజలకే కాకుండా ఆ దేశంలోని విదేశీ పెట్టుబడిదారులతోసహా 'భాగస్వాములందరికీ' ప్రమేయం ఉండాలని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వ్యాఖ్యానించింది. అమెరికా తొందరపెట్టే ఒప్పందాల వల్ల ప్రజలు ఒక నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ ఆ మార్పుతో విదేశీ పెట్టుబడిదారులకు ఎటువంటి సమస్యలూ ఉండదు.
ఈ ఒప్పందాల రెండవ లక్షణం ఏమంటే ఏ కారణంచేతైనా విదేశీ పెట్టుబడిదారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే 'తగినంత నష్టపరిహారం తక్షణం' ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి ఒత్తిడి వస్తుంది. సాధారణంగా అలాంటి నష్టపరిహారం న్యాయమైన రేటుతో కాకుండా అప్పటి మార్కెట్ రేటు ప్రకారం ఉండాలని ఒప్పందాలు సూచిస్తాయి. ఒకవేళ విదేశీ పెట్టుబడిదారు ఒక భూమిని కారుచౌకగా పొందినప్పటికీ అదే భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసివస్తే నష్టపరిహారం 'మార్కెట్ రేటు'ను అనుసరించి ఇవ్వవలసి ఉంటుంది. వనరులు తగినంతగా లేనందున అంత నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించే స్థితిలో ఉండదు గనుక అలాంటి భూమిని స్వాధీనం చేసుకోవటం ప్రభుత్వానికి కష్టతరమౌతుంది. ఉదాహరణకు అలాంటి ఒప్పందాలకు ఆమోదం తెలిపిన దేశాలలో భూమిలేని నిరుపేదలకు పంచటానికి విదేశీయుల యాజమాన్యంలోని తోటలను తగినంత వనరులు అందుబాటులోలేని కారణంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోజాలదు. అంతేకాక నిర్వచనపరంగా ఆస్తుల పునఃపంపిణీ అంటే కొందరి ఆస్తులను స్వాధీనంచేసుకుని ఇతరులకు పంపిణీ చేయటం అనే అర్థంలో జరుగుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే కొందరి ఆస్తులు తగ్గితేనే మరికొందరి ఆస్తులు పెరుగుతాయని అర్థంచేసుకోవలసి ఉంటుంది. ఆస్తి స్వాధీనం చేసుకున్న ప్రతిసారీ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే ధనికుల ఆస్తులు తగ్గటమంటూ ఉండదు. అది ఆస్తుల యాజమాన్య రూపాన్ని మాత్రమే మారుస్తుంది. భూమి రూపంలోని ఆస్తి డబ్బుగా మారటంతో దాని యజమాని ఆస్తి విలువలో ఎటువంటి మార్పూ ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇలాంటి ఒప్పందాలు అమలులోగల దేశంలో కనీసం విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా ఆస్తుల పునఃపంపిణీ జరుగదు. దేశంలోని భూమి, ఖనిజ వనరుల యాజమాన్యం విషయంలో విదేశీ పెట్టుబడిదారులను దేశీయ పెట్టుబడిదారులతో సమానంగా చూడటం అలాంటి ఒప్పందాల మూడవ విశిష్ట లక్షణం. ఉదాహరణకు ఇది టిపిపి స్వభావంగా ఉంటుంది. 'దేశీయ పెట్టుబడిదారుల'లో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టినవారు కూడా ఉంటారు కాబట్టి అలాంటి ఒప్పందాల వల్ల స్వయం సమృద్ధిని సాధించటానికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించటం కుదరదు. విదేశీ పెట్టుబడిదారు తెచ్చే సాంకేతిక పరిజ్ఞానానికి బదులుగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక దేశం ఎంచుకోజాలదు. అలాంటి ఒప్పందాలను ఆమోదించిన దేశం సాంకేతికంగా స్వయం సమృద్ధిని సాధించలేదు. విదేశీ కంపెనీల యాజమాన్యాలకు డివిడెండ్లను, విదేశీ అప్పులకు వడ్డీలు, రాయల్టీల చెల్లింపులను, దేశంలో పనిచేస్తున్న కంపెనీలకు చెందిన విదేశంలోని మూల కంపెనీలకు చెల్లించే ఫీజులను విదేశీ మారకంలో చెల్లించటం వల్ల ఆ దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకోజాలదు.
అసమానతల పెంపుదల
అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ దేశాలకు సాంకేతిక పరిజ్ఞానంపై ఇప్పటికే గుత్తాధిపత్యం ఉండటం వల్ల, తృతీయ ప్రపంచ దేశాల్లోని ధనికుల్లో తమ సంపదను పెట్టుబడిదారీ దేశాలలో దాచుకునే ధోరణి వల్ల భూగోళంలోని ఈ రెండు విభాగాల మధ్య ఒకవైపు ధనిక పెట్టుబడిదారీ దేశాలు, మరోవైపు పేద దేశాల మధ్య అసమ అధికార సంబంధాలు నెలకొంటాయి. అంటే ఈ రెండు విభాగాల మధ్య ద్వైధీభావం నిరంతరం కొనసాగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే దేశీయ పెట్టుబడిదారులను, విదేశీ పెట్టుబడిదారులను సమానంగా చూడాలని అనేక తృతీయ ప్రపంచ దేశాలపై అమెరికా రుద్దే ఒప్పందాలు ఈ రెండు విభాగాల మధ్య అసమానతలను కొనసాగేలా చేస్తాయి. పెట్టుబడికి తానున్న ప్రదేశంలో రాజ్యం మద్దతు, రక్షణ అవసరమౌతుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పనిచేస్తున్నప్పుడు దానికి ప్రపంచ స్థాయి రక్షణ అవసరమౌతుంది. అయితే జాతి రాజ్యాలు విడివిడిగా అలాంటి రక్షణను అందించజాలవు. అత్యంత శక్తివంతమైన జాతి రాజ్యమైన అమెరికా కూడా అలాంటి రక్షణను అందించలేదు. ఎందుకంటే అలా చేయటానికి ఉన్నత స్థాయి మానవ, ఇతర వనరులను ప్రపంచ స్థాయిలో వినియోగించాలి. అలా చేయటం అమెరికాకు ఇష్టం ఉండదు. ప్రపంచీకరింపబడిన పెట్టుబడిని రక్షించటానికి ప్రపంచ రాజ్యంగాని, కనీసం అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల కూటమి గానీ కనుచూపు మేరలో లేదు. ఒకవేళ అలాంటి కూటమి ఉన్నా కూడా అది పనిచేయటానికి కావలసిన చట్టపరమైన యంత్రాంగం, అమోదించబడిన నియమనిబంధనలు ఉండాలి.
అమెరికా రూపొందిస్తున్న పెట్టుబడి ఒప్పందాలు అలాంటి యంత్రాంగాన్ని సృష్టించేందుకు ఉద్దేశించబడ్డాయి. ప్రపంచీకరించబడిన పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు, అది ఎక్కడ పనిచేస్తున్నా దానికి 'రక్షణ' కల్పించేందుకు కావలసిన జాతిరాజ్యాతీత సంస్థల ఆవిర్భావానికి జరిగే పరివర్తనకు ఈ ఒప్పందాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించవలసిన వాస్తవమేమంటే ఇవి అంతర్జాతీయ న్యాయస్థానంలాగా జాతి రాజ్యాల కూటమి కాదు. ఇవి ప్రయివేటు సంస్థలు. వేరే మాటల్లో చెప్పాలంటే జాతిరాజ్యాతీత ప్రభుత్వ సంస్థల ఆవిర్భావ పరివర్తనను మనం చూడటం లేదు. ఈ ఒప్పందాల ద్వారా జాతిరాజ్యాతీత ప్రయివేటు సంస్థల ఆవిర్భావాన్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం ప్రపంచీకరించబడిన పెట్టుబడి ప్రపంచ కార్పొరేట్ పాలనను సుస్థాపన చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
- ప్రభాత్ పట్నాయక్