ప్రభుత్వరంగరక్షణకు మరో స్వాతంత్య్రపోరాటం

ఫిక్కీ (పారిశ్రామిక యజమానుల సంస్థ) సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా చెప్పిన మాటలివి. సాక్షాత్తు ప్రధాన మంత్రి చెప్పిన దానికి అనుగుణంగానే బిజెపి ప్రభుత్వ విధానాలున్నాయని స్పష్టంగా అర్థమౌతుంది. నవరత్న ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని రూ.69 వేల కోట్ల విలువ కలిగిన వాటాలను అమ్మాలని 2015-16 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వాస్తవానికి వీటి విలువ నాలుగు రెట్లకుపైగానే ఉంటుంది. ఉదహరణకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 10 శాతం వాటాలు రూ.489 కోట్లకు అమ్మాలని నిర్ణయించారు. వాస్తవ విలువ దీనికి 10 రెట్లుపైగానే ఉంటుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలను బలహీనపరిచే చర్యలన్నీ చేపట్టారు. హిందూస్థాన్‌ పెట్రోలియం వాటాలను ఇప్పటికే 49 శాతం ప్రైవేట్‌ వారికి అమ్మారు. గతంలో ప్రతి ప్రభుత్వరంగ పరిశ్రమకూ విస్తరణకు బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయించేవారు. నేడు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పైగా విస్తరణకు అనుమతులివ్వడానికి కూడా విపరీతంగా జాప్యం చేస్తున్నారు. ప్రైవేటు సెల్‌ఫోన్‌ కంపెనీలన్నింటికీ అనుమతులుచ్చిన పదేళ్ళ తరువాత కానీ బిఎస్‌ ఎన్‌ఎల్‌కు సెల్‌ అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ వర్కు ఆర్డర్లు ప్రభుత్వరంగ కంపెనీలకు ఇవ్వకుండా ప్రైవేట్‌ ఎల్‌ఎన్‌టి, రిలయన్స్‌లకు ఇస్తున్నారు. దీనివల్ల విశాఖలోని షిప్‌యార్డు, బిహెచ్‌పివి పరిశ్రమలు ఆర్డర్లు లేక వెలవెల బోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెడుతున్నారు. విశాఖ పోర్టు ట్రస్టులోని 80 శాతం బెర్తులను ప్రైవేట్‌ కంపెనీలకు ఇప్పటికే అప్పగిం చారు. విదేశాలతో వాణిజ్యం విశాఖ కేంద్రంగా నడిపిన ఎంఎంటిసి వాణిజ్య రంగం నుంచి మూసి వేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (ఐడిపియల్‌) ప్రాథమిక మందుల కంపెనీని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హెచ్‌యంటి వాచ్‌ కంపెనీని మూసివేశారు. నిర్మాణ రంగంలో ప్రఖ్యాతిగాంచిన హెచ్‌ఎస్‌సిఎల్‌, ఎన్‌పి సిసి కంపెనీలను మూసేశారు. పై పరిశ్రమలన్నీ అవి ఏర్పడినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి. మంచి లాభాలతో నడిచాయి. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్రభుత్వరంగ పరిశ్రమలన్నీ నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర óప్రదేశ్‌ రాష్ట్రానికే ఈ పరిణామాలు మరింత హానికరం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రభుత్వరంగ పరిశ్రమల విస్తరణే నేటికీ ప్రధానంగా ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇటీవలే సుమారు రూ.13 వేల కోట్ల పెట్టుబడితో 63 లక్షల టన్నుల సామర్థ్యానికి వచ్చింది. హిందూస్థాన్‌ పెట్రోలియం రూ.17 వేల కోట్ల పెట్టుబడితో 1.7 కోట్ల టన్నుల సామర్థ్యం స్థాయికి విస్తరించడానికి సిద్ధమైంది. పూడిమడకలో 4 వేల మెగావాట్ల సామర్ధ్యంతో ఎన్‌టిపిసి పరిశ్రమ రూ.27 వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణానికి సిద్ధమౌతున్నది.
గత 24 సంవత్సరాల నుంచి సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో ప్రభుత్వం ఎంత ప్రచార ఆర్భాటంచేసినా వచ్చిన ప్రైవేట్‌ కంపెనీలు నామ మాత్రం. సెజ్‌ల పేరుతో విదేశీ ఎగుమతుల లక్ష్యంతో ఏర్పడిన కంపెనీలు. బ్రాండిక్స్‌ లాంటి కంపెనీలకు వెయ్యి ఎకరాలకు సంవత్సరానికి రూ.1,000 (ఎకరానికి రూపాయ) చొప్పున ప్రభుత్వం లీజు కిచ్చింది. ఇవి సర్కస్‌ కంపెనీలాంటివి. యజమా నులు ఆధునిక జైళ్లలాగా నడుపుతున్నారు. యూని యన్‌ పెట్టాలని భావిస్తే ముందుగా ఉద్యోగాలు ఊడ బెరుకుతారు. అతి చౌకగా పనులు చేయించు కొని అత్యధిక లాభాలు గడిస్తారు. దీన్ని చీప్‌ లేబర్‌ (చౌక కార్మికులు) అంటాం. ప్రైవేట్‌ రంగం ఎప్పుడూ ప్రభుత్వరంగతో సమానం కాదు. ప్రైవేట్‌ అంటే లాభాలు. దేశంలోని పెద్ద ప్రైవేట్‌ సంస్థలుగానీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలుగానీ లాభాల కోసం వస్తాయి. కానీ భారత ప్రభుత్వం సేవా రంగాలైన రైల్వే, రక్షణ, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో సైతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం దేశ ప్రయోజనాలకు తీవ్ర హానికరం.
సరళీకరణ విధానాల ఫలితంగా భూములు, గనులు, సముద్ర తీరాన్ని కార్పొరేట్లు కబళించేదానికి వీలుగా ప్రభుత్వాలు తమ విధానాలను అమలు చేస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి అశేష త్యాగా లతో నిర్మించిన ప్రభుత్వరంగ పరిశ్రమలను కార్పొ రేట్లకు కైవశంచేయడానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తు న్నాయి. ఈ విధానం దేశ సంపదను కొల్లగొట్టడం తప్ప మరొకటికాదు. స్వాతంత్య్రం వచ్చేనాటికి పారిశ్రా మికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నాం. మౌలిక పరిశ్రమలైన స్టీలు, పెట్రోలియం, రసాయనిక ఎరువులు, ప్రాణావసర మందులు అన్నింటికీ విదే ేశాలపై ఆధారపడ్డాం. సోషలిస్టు దేశాల సహాయంతో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాం. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడంలో కూడా నేడు అగ్రస్థాయిలో ఉన్నాం. దేశంలో ప్రభుత్వరంగం బలోపేతం కావడంవల్లనే ఇది సాధ్యమైంది. దేశ పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక స్వాలంబనకు లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పన్నులు, డివిడెంట్ల రూపంలో ప్రభుత్వ బడ్జెట్‌కు నిధులు సమకూర్చుతున్నాయి. ఇటువంటి బంగారు బాతును కోసి తినే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ప్రభుత్వరంగం ఏర్పాటు ఫలితంగా దేశం ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. అత్యధిక భారీ పరిశ్రమలను వెనుక బడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధిచెందాయి. 18 లక్షల మందికి పర్మినెంట్‌ ఉపాధి రావడంతో కార్మిక కుటుంబాల ఆర్థికస్థాయి పెరిగింది. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలుకావడం వల్ల సామాజిక న్యాయం సాధించు కున్నాం. ''దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుజులోరు'' అనే గురజాడ అక్షర పలుకులకు ఆచరణలో ప్రభుత్వరంగ సంస్థలు రుజువు చేసి చూపించాయి. నేడు ప్రైవేట్‌ పరిశ్రమల్లో రిజర్వేషన్లు పాటించడంలేదు. ప్రైవేట్‌ పరిశ్రమల్లో రిజర్వేషన్లు అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వా నికి ఉంది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, రోడ్లు, నీరు, విద్యుత్‌ లాంటి సకల సౌకర్యాలు సమకూర్చబడ్డాయి. నేడు ప్రైవేట్‌ పరిశ్రమలేవీ ఈ సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదు. వారి లాభాలే వారికి ప్రధానం. వారి లాభాల సాధన కోసం యూనియన్‌లు లేకుండా చేయడం, కాంట్రాక్టీకరణ విధానాన్ని అమలు చేయడం, పిఎఫ్‌, పెన్షన్‌ సౌకర్యాన్ని కుదించడం వగైరా చేస్తున్నాయి.
కార్మివర్గం నేడు అనుభవిస్తున్న హక్కులు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై దాడిచేయడానికి నేడు తీవ్రంగా పూనుకుంటున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరే కంగా జరిగే పోరాటాలను అణచడానికి చట్టాల్లో తీవ్ర మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వరంగ కార్మికులకు ముఖ్యంగా బేరసారాలాడే ద్వైపాక్షిక కమిటీలు కీలక పాత్ర వహిస్తున్నాయి. వీటి ఫలితంగా జీతభత్యాలు, హక్కులు మిగిలినవారి కంటే నేటికీ మెరుగ్గా ఉన్నాయని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు తెస్తున్న చట్ట సవరణల ఫలితంగా కార్మికులకు సంకెళ్ళు విధించి బానిసలుగా నెట్టాలని చూస్తున్నారు. సమ్మె హక్కు, ఇతర పోరాటాల హక్కులు పూర్తిగా నాశనం చేయడానికే ఈ చట్ట సవరణలు ఉద్దేశించబడ్డాయి. ఈ చట్టసవరణలను అడ్డుకోగలిగితేనే మనం నిజమైన కార్మికులుగా ఇప్పటిలాగే తలెత్తుకొని గర్వంగా జీవించగలం.
సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?
ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవడం నేడు కార్మికవర్గ కర్తవ్యం. సమ్మె చేయకపోయినా తన జీతం తనకొస్తుందని ఎవరైనా భావిస్తే అంతకంటే తప్పు మరొకటిలేదు. మన ఇంటి చుల్టూ మంటలు మండు తుంటే నా ఇల్లు కాలిపోదు అని భావించి నట్లుగా ఉంటుంది. సమ్మె చేస్తే జీతం, ప్రోత్సాహకం, వగై రాలు నష్టపోవడం వాస్తవం. సమ్మె చేయకపోతే అంతకంటే ఎక్కువ నష్టపోతాం. కంపెనీలే ప్రైవేట్‌ పరం అవుతాయి. ఉద్యోగాలే ఊడిపోతాయి. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రభుత్వం సృష్టించిన పరిస్థితుల వల్ల నేడు సమ్మె చేయడం అనివార్యం. బిజెపి ప్రభు త్వం కేంద్రలోనూ, టిడిపి ప్రభుత్వం రాష్ట్రం లోనూ సుమారు మరో నాలుగేళ్ళు అధికారంలో ఉంటాయి. ఇవి పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు. కార్మికవర్గం తమ హక్కుల కోసం, తమ పరిశ్రమలు రక్షణ కోసం పోరాడడం అనివార్యం. 2016 నాటికి బిజెపి రాజ్య సభలో కూడా మెజార్టీ సాధిస్తుంది. బిజెపి దూకు డును పార్లమెంటులో అడ్డుకోవడం సాధ్యం కాదు. రాష్ట్ర టిడిపి గుడ్డిగా బిజెపి పల్లకీని మోస్తున్నది. పార్ల ్లమెంటు బయట భారీ పోరాటాలు, కార్మికవర్గం ఐక్యం గా నడపడం ఒక్కటే బిజెపి, టిడిపి ప్రభుత్వాలకు సరైన గుణపాఠం.
1991లో సరళీకరణ విధానాలు ప్రవేశ పెట్టినప్పుడు ప్రభుత్వరంగాన్ని కేంద్ర ప్రభుత్వమే ''తెల్ల ఏనుగుగా వర్ణించింది''. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రభుత్వరంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తు న్నాయి. ఆనాడు రెండేళ్ళలోనే ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరిస్తామని మన్మోహన్‌సింగ్‌ బీరాలు పలి కాడు. ఐదేళ్ళు వామ పక్షాలు మన్మోహన్‌ సింగ్‌ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుకు న్నాయి. ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఒక్క శాతం వాటాను కూడా అమ్మని వ్వలేదు. కానీ నేడు మోడీ మరింత బరితెగింపు విధానాలతో ముందుకు వస్తున్నారు. గతం కంటే మరింత పట్టుదలతో కార్మిక వర్గం ఈ విధానాలను తిప్పికొట్టాలి. ఎన్‌డిఎ-1 ప్రభుత్వ కాలంలో విశాఖ జిల్లాలో కార్మికవర్గం పెద్దఎత్తున పోరాటాలు నడిపి ంది. ఫలితంగా హిందూస్థాన్‌ జింక్‌ మినహా మిగిలిన కంపెనీలను కాపాడుకోగలిగారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను నేటికీ ఒక్క శాతం వాటా కూడా ప్రైవేట్‌వారికి అమ్మకుండా అడ్డుకోగలిగాం. బిహెచ్‌పి విని ఎల్‌ అండ్‌ టిి కొనాలని ప్రయత్నిస్తే కార్మికులు ఎల్‌అండ్‌టి ప్రతినిధులను కంపెనీ లోపలికి కూడా రాకుండా అడ్డు కున్నారు. ఆ విధంగా హిందూస్థాన్‌ జింక్‌లో వేదాంత గ్రూపును రాకుండా అక్కడి సంస్కరణ సంఘాలు అడ్డుకోలేక పోయాయి. పర్యవసానంగా జింక్‌లో కార్మికులను తొలగించడం, కంపెనీ లాభాల్లో ఉన్నా అన్యాయంగా మూసి వేయడం జరిగింది. 1999 నుంచి 2004 వరకు బిజెపి, టిడిపి ప్రభుత్వాలు అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడవలసి వచ్చింది. తమిళనాడులో లక్ష మంది పర్మినెంట్‌ రాష్ట్ర ఉద్యోగులను ఒక కలంపోటుతో నాటి ముఖ్యమంత్రి జయలలిత తొలగించారు. సుప్రీం తీర్పుతో ఉద్యోగులు తిరిగి పనిలో చేరారు. కానీ 2004 ఎన్నికల్లో బిజెపి కేంద్రలోనూ, జయలలిత తమిళనాడులోనూ, ఎపిలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. పోరాడితే విజయం కార్మిక వర్గానిదే. కార్మికులందరూ ఐక్యతతో 2015 సెప్టెం బర్‌ 2 సమ్మె పోరాటాన్ని జయప్రదం చేయాలని కోరు తున్నాం.
 - సిహెచ్‌ నరసింగరావు