సాధారణంగా విత్తసంస్థలు (ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్) తమ ప్రాథమిక విధులు; సమాజంలో ఏర్పడే పొదుపు సమీకరించి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ఉపయోగపడే సంస్థలుగా, వ్యక్తుల పొదుపులను వారి జీవితకాలంలో ఆ తర్వాత నూతన తరాలకు మేనేజ్ చేసే సంస్థగా, క్రమానుగత చెల్లింపు చేసే సంస్థగా, నష్టభయాలను (రిస్క్) మేనేజ్‌చేయటం, బదిలీ చేయటం వంటి విధులు నిర్వహిస్తుంటాయి. కానీ ప్రపంచీకరణ, ఉదారీకరణ ఆర్థిక విధానాల ద్వారా బడా విత్తసంస్థలు నిజ ఆర్థిక వ్యవస్థ రంగాలకు వాటి వృద్ధికి దోహదపడే విత్తవనరులు సమకూర్చటం లేదు. అత్యధికంగా వారి విధులలో ఇతర విత్త సంస్థలతో విత్తపత్రాల మారకం చేయడటం ద్వారా డెరివేటీస్, స్వాప్స్ అనే విత్తపత్రాలు (క్లెయిమ్స్) మార్కెట్‌ను విస్తరింపచేసుకోవటం జరుగుతుంది. వీటిలో అనేక రకాల కొత్తదనం, నవకల్పనల (ఇన్నోవేషన్స్) ద్వారా ప్రభుత్వ అజమాయిషీ, నియమాల నుండి తప్పించుకోగలుగుతున్నారు. ధనిక దేశాలలోని ఈరకమైన అత్యంత పెద్ద విత్తసంస్థలు, తమ వద్ద ఏర్పడిన లాభాలు, నూతన ఆర్థిక సంపదల నుండి ఉత్పన్నం కావడం లేదు. దీనిలో ప్రధాన భాగం ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన లాభాలను కబ్జాచేయటం ద్వారా జరుగుతుంది. విత్తమార్కెట్‌లలో కొనసాగే సంస్థలు ధనిక దేశాలలో పెద్ద ఎత్తున నష్టభయాలను (రిస్కీనెస్) అనుసరించటం అనేక రకాల సంక్లిష్ట రుణసాధనాలను (ఫైనాన్షియల్ ప్రొడెక్ట్స్) ప్రవేశపెట్టడం వలన ఆర్థిక అస్థిరత ప్రపంచ వ్యాపిత సంక్షోభం ఏర్పడటానికి దారితీస్తుంది.
నిరర్ధక రుణాలు కారణాలు
ఉదారీకరణ ఆర్థిక నియమాలను అనుసరించి విత్తరంగంలో ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ల రుణవిధానం రెండురకాల మార్పులకు దారితీసింది. ఒకటి చిల్లర (రిటైల్) రుణాలు, క్రెడిట్‌కార్డు, అడ్వాన్సు, గృహ, వ్యక్తిగత రుణాలు. ఒక విధంగా చెప్పాలంటే వినియోగ ఖర్చుకోసం (కంజమ్‌సన్ ఎక్స్‌పెండీచర్) తీసుకునే బ్యాంక్ అప్పులు. రెండవది ప్రభుత్వ వత్తిడి విధానాలతో ఏర్పడిన బ్యాంక్ అప్పు. ఇవి ప్రధానంగా రహదారులు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తులకు సంబంధించినవి. కేంద్ర ప్రభుత్వం 3శాతానికి మించి విత్తలోటు ఫిజికల్ డెఫిసిట్ ఉండవద్దనే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టనియమం అమలు చేస్తుంది. ఫలితంగా పబ్లిక్- ప్రయివేట్ భాగస్వామ్యాలు అనే పద్ధతికి శ్రీకారం చుట్టింది. మన ఆర్థిక వ్యవస్థలో బాండ్ మార్కెట్ పరిపక్వత లేనందున ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు ప్రభుత్వ బ్యాంక్ రుణాలపై ఆధారపడటం జరిగింది. కేంద్రప్రభుత్వం బ్యాంక్‌ల ద్వారా ఈరకమైన రుణాలు పొందే అవకాశం కల్పించింది. గత దశాబ్దంలో గణనీయంగా పెరిగిన ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ బ్యాంక్ రుణాల ఆధారంగా జరిగిందే.
అమెరికా, ఇతర ధనిక దేశాలు సబ్‌ఫ్రైమ్ సంక్షోభానికి ముందు రుణ నిధుల సరళీకరణ (క్వాంటేటీవ్ ఈజింగ్) ద్వారా అక్కడ విత్తసంస్థలు అతితక్కువ వడ్డీరేటు రుణసదుపాయ ఆకర్షణ విధానాలు అనుసరించాయి. దీనికనుగుణంగా భారత రిజర్వుబ్యాంక్ కంపెనీలు విదేశీ రుణాలను పొందే అర్హతలను రెండు విధాలుగా రూపొందించింది. 1 ఆటోమెటిక్ నియమ పద్ధతి, 2. పూర్వానుమతి నియమ పద్ధతి. పరిశ్రమ లేక కంపెనీ ఏ రంగంలోనిది, దాని పరిమాణం విదేశీ విత్తసంస్థల వడ్డీరేటు మొదలయినవి. ఆర్‌బీఐ నవంబర్ 2015లో వీటిని తొలగించింది. ఫలితంగా ప్రయివేట్ కంపెనీలు అంతర్జాతీయ రుణాలు పొందటానికి అతి ఉత్సాహం ప్రదర్శించాయి. ఒక రిలయెన్స్ కంపెనీ 2015 నాటికి 25 బిలియన్ల డాలర్లు రుణాలను తీసుకొంది. అంతేకాదు 30కి పైగా భారత్‌లోని బడాకంపెనీలు ఒక బిలియన్ డాలర్లకు పైగా డాలర్ రుణాలు పొందాయి.
ప్రయివేటీకరణ
మొట్టమొదటిసారిగా 1991 ఉదారీకరణలో భాగంగా ప్రయివేట్ బ్యాంక్‌లకు అనుమతించారు. ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సీ, ఏక్సిస్ బ్యాంక్‌లు ప్రయివేట్ రంగంలో ఏర్పడ్డాయి. నూతన ప్రయివేట్ బ్యాంక్‌ల విధానం ఫిబ్రవరి 2013లో ఆర్‌బీఐ విడుదలచేసింది. దీంతో బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్‌లు ఏర్పాటు చేసుకునే విధానం అమలులోకి వచ్చింది. ఫలితంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐడీఎఫ్‌సి బ్యాంక్), బంధన్ మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ప్రయివేట్‌రంగంలో ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. వీటితో పాటు చెల్లింపు బ్యాంక్‌లు (పేమెంట్ బ్యాంక్స్), చిన్నతరహా బ్యాంక్‌లు మంజూరు చేయబడ్డాయి. చెల్లింపు బ్యాంక్‌లు 11 సంస్థలకు అనుమతులు లభించాయి. పది చిన్నతరహా బ్యాంక్‌లకు లైసెన్సులు ఇవ్వబడ్డాయి. పేటీఎం ఈకోవకు చెందినదే.
నష్టరుణాల పరిమాణం
ప్రభుత్వ బ్యాంక్‌లలో నష్టరుణాలు (ఎన్‌పీఏ) తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. మొత్తం జాతీయ ఆదాయంలో గత దశాబ్దకాలంలో 29శాతం నుండి 59శాతానికి నష్టరుణాలు పెరిగాయి. ఈ స్థితి మరింతగా పెరిగే అవకాశం ఉంది. నష్టరుణాలు (బ్యాంక్‌లకు ఎలాంటి వడ్డీ ఆదాయం కానీ, తీసుకున్న రుణం తిరిగిరావడం జరగదు), మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలలో (అడ్వాన్స్) 2013-14 నాటికి 4.6శాతానికి చేరింది. దీని స్వభావం మరింత లోతుగా అర్థం కావడానికి పునర్‌విభజన రుణాలు (రీస్ట్రక్చర్డ్ లోన్స్) పాత మొండి రుణాలను నూతన రుణాలుగా మార్పుచేసే పద్ధతి 7.1 శాతానికి ఉంటాయని అంచనా వేయబడింది. మొత్తం వత్తిడికి లోనైన (డౌట్‌ఫుల్ ఎసెట్స్) రుణాలు 11.7శాతానికి చేరుతుంది. ఈ రకమైన మొండిరుణాలు ప్రధానంగా ఐదు పారిశ్రామిక రంగాలలో కేంద్రీకృతమయ్యాయి. దాదాపు 51శాతం అనుమానాస్పద రుణాలు ఈ రంగాలలోనే ఉంటాయని అంచనా. మైనింగ్, టెక్స్‌టైల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విమానయాన సర్వీస్‌రంగం వీటిలో ప్రముఖంగా వున్నాయి. ఒక పంజాబ్‌నేషనల్ బ్యాంక్ నష్టాలు 5,367 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసంలోనే 20 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం నష్టాలు 14,287 కోట్లు. ప్రముఖ బడా కంపెనీలు (అత్యధికంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని) యధేచ్ఛగా భారీస్థాయి రుణాలు పొంది, రుణ ఎగవేత దారులుగా మారడమైంది. మొత్తం రుణపరిమాణం 56వేల కోట్ల నుండి 5లక్షల కోట్ల వరకూ ప్రజాధనం ఉంటుందని అంచనా.
అంతర్జాతీయ స్థితుల మార్పు
ఈ కంపెనీలు ఎందుకు చెల్లించే స్థితిలో లేవు. వీటిలో అత్యధికులు విదేశీరుణం డాలర్ రూపంలో తీసుకున్నారు. అమెరికాలో ఏర్పడిన సంక్షోభం తరువాత ప్రపంచ వ్యాపితంగా వ్యాపారం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ఈ కంపెనీలు భారీరుణాలు చెల్లించే స్థితిలో లేవు. దీని ప్రభావం ప్రభుత్వరంగ బ్యాంక్‌లపై పడింది. దీంతో ప్రభుత్వరంగ బ్యాంక్‌లు మొత్తం 1.14 లక్షల కోట్లు 2013-15 సంవత్సరాలలో పనికిరాని రుణాలను తమ ఖాతాల నుండి తొలగించుకోవడం జరిగింది. అంతర్జాతీయంగా బాసిల్ - 3 నియమాలను పాటించాలనే ఒత్తిడి వస్తుంది. దీనికారణంగా బ్యాంక్‌లు మూలధనం పెంచుకోవాలనే నిబంధన అమలు చేయటం, నష్టరుణాల భారీ నుండి ప్రభుత్వ బ్యాంక్‌లను తప్పించడానికి 27 ప్రభుత్వ బ్యాంక్‌లను ఆరు బ్యాంక్‌లుగా విలీనం చేసి అతిపెద్ద బ్యాంక్‌లుగా ఏర్పడే ప్రక్రియ ద్వారా పై సమస్యలను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వరంగ బ్యాంకులు తమ లావాదేవీలు సరిగ్గా నిర్వహించడానికి బడ్జెట్రీ సపోర్టు ద్వారా మూలధనం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల వద్ద ఏర్పడిన భారీనష్టాలు ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాల ఫలితంగానే ఏర్పడినాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రభుత్వమే నేరుగా పెట్టుబడులను సమకూర్చడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల్లో వున్న ప్రజాధనంపై ఆధారపడింది. అంతర్జాతీయంగా చౌకగా లభించే డాలర్ రుణాలు కూడా పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వడంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభ దుష్ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడ్డాయి. ప్రభుత్వ విధానాలలో మార్పుల ఫలితంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ప్రయివేట్ బ్యాంక్‌ల నుండి పోటీనే గాక నష్టరుణాల స్థితికి గురికావడం జరుగుతుంది.
ప్రయివేటీకరణ వైపు అడుగులు
వీటికి పరిష్కార మార్గంగా పెద్దఎత్తున పెట్టుబడులు సమకూర్చేవిధంగా బ్యాంక్‌లు విలీనం చేయాలనే ప్రయత్నం ఆర్థిక సమస్యలను మరింతగా జఠిలం చేయొచ్చు. అతిపెద్ద బ్యాంక్‌ల ఏర్పాటుతో భవిష్యత్‌లో నష్టరుణాలు ఏర్పడవనేది వాస్తవం కాదు. ఈ రకమైన స్థితిలో అతిపెద్ద బ్యాంక్‌లను సులభంగా ప్రయివేటీకరణ చేయొచ్చు. ఇప్పటికే అమెరికాలాంటి ధనికదేశాలలో అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్‌లు ప్రభుత్వ అజమాయిషీ పరిధిలోకి రాని విత్తపోకడల ద్వారా చేసే ఆర్థిక అరాచక వాస్తవం అందరికీ తెలిసిందే. అత్యధిక క్రెడిట్ (రుణాలు) విధానాలు అమెరికన్ బ్యాంక్‌లు అనుసరించి సంక్షోభంలో పడ్డాయి. దీని ప్రభావం ప్రపంచ మంతా అనుభవిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం 2014లో పీజే నాయక్ కమిటీ వేసింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల స్వభావం ఇలాగే కొనసాగితే వాటిలో మెరుగుదల ఏర్పడదని ఈ రంగం బ్యాంక్‌లకు ప్రభుత్వం మూలధనం సమకూర్చే స్థితికి దారితీసిందని ప్రయివేటీకరణ వైపుగా నాయక్ రిపోర్టులో తెలిపింది. గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచంలోని ఏ ఒక్క సంక్షోభం ప్రభుత్వ బ్యాంక్‌లకు తాకలేదు. కేవలం వత్తిడికి గురైన ప్రభుత్వ లోటుబడ్జెట్‌ను విత్తీకరణ చేయబడిన మొండిపద్దులతోనే ఈ బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ బ్యాంక్‌లు అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ సామాజిక, ఆర్థిక విలువ ఏర్పడే పరపతి (క్రెడిట్ రుణాలు) కల్పించే ప్రక్రియ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడం జరుగుతుంది.
- డా|| బి రాజేందర్