ప్రమాదం తొలగిపోలేదు..

మన్యం ప్రజల బతుకుల్లో విషం చిమ్మే బాక్సైట్‌ జిఒ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందువల్లే అయిష్టంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. మంత్రి మండలి సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు స్థానికంగా వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను సుదీర్ఘంగా వివరించిన తరువాత, నిఘా వర్గాల నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించాక మరో మార్గం లేకే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నారన్నది దాచినా దాగని సత్యం! అయితే, ప్రజా సంక్షేమం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసే బాబు సర్కారు బాక్సైట్‌ ఖనిజాన్ని వెలికితీసే విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చుకోలేదు. అధికారంలోకి వచ్చినప్పటినుండి బాక్సైట్‌ను వెలికితీసి తీరుతామని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజా నిర్ణయం విషయంలోనూ అటువంటి మెలికే పెట్టారు. వెల్లువల్లా కళ్లముందు కనపడుతున్న ప్రజాభిప్రాయానికి కొలతలు పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామనడం కొత్త సందేహాలకు తోవ తీసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం పల్లవి ఎత్తుకోగానే టిజి వెంకటేష్‌ వంటి అధికార పార్టీ నేతలు బాక్సైట్‌ తవ్వకాలు జరిపి తీరాలంటూ రాగాలాపన చేయడం ఆ అభిప్రాయాన్నే బలపరుస్తోంది. ప్రజా వ్యతిరేకతకు తాత్కాలికంగా వెనకడుగు వేసినప్పటికీ భవిష్యత్‌లో బరితెగించే ప్రమాదం ఉందన్న ఆందోళనను తేలికగా తీసి వేయడానికి వీలులేదు. 
మన్యంపై పాలక వర్గాలు విషపు దృష్టి సారించడం, ప్రజా పోరాటాలతో వెనక్కి తగ్గడం ఇదే మొదటి సారి కాదు. దశాబ్ద కాలంగా కుటిల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఐక్య పోరాటాలతో ప్రజలు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. బాక్సైట్‌ భూతాన్ని మొదటిసారి ప్రజలపై ఉసికొలిపింది చంద్రబాబు ప్రభుత్వమే! గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ పనికి విపక్షంలో ఉన్నప్పుడు ఆయన మన్యం వెళ్లి మరీ చెంపలేసుకున్నారు. పొరపాటు నిర్ణయం తీసుకున్నామని బాహాటంగానే ప్రకటించారు. తవ్వకాలను కొనసాగించాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గిరిజన సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ అంటూ భారీ ఉపన్యాసాలే ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా కప్పదాటు వేశారు. బాక్సైట్‌ తవ్వకాలతోనే అభివృద్ధి జరుగుతుందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. పాలకవర్గాల ఈ కుటిల విన్యాసాలతో సంబంధం లేకుండా మన్యం ప్రజానీకం పదేళ్లుగా తన అభిప్రాయాన్ని ఐక్యంగా, గట్టిగా వినిపిస్తోంది. అంధులకు, బధిరులకు కూడా స్పష్టంగా కనిపించి, వినిపిస్తున్న ప్రజాభిప్రాయాన్ని ఏ కొలమానాలతో ప్రభుత్వం కొలవనుందో అర్థ్ధం కాని పరిస్థితి. పోరాడే ప్రజలను చీల్చడానికి సామ, దాన భేదోపాయాలను ఉపయోగించి కుట్రలు పన్నుతోందని, దీనికోసం తాబేదార్లనూ రంగంలోకి దించుతున్నారంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
గతంలో ఎప్పుడో చేసుకున్న దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, దానిని యథాలాపంగా అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రులతో పాటు, ముఖ్యమంత్రి కూడా చెప్పుకోవడం హాస్యాస్పదం. మంత్రుల సంగతి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రికి తెలియకుండా ప్రభుత్వంలో ఏమీ జరగదన్నది బహిరంగ రహస్యమే! ఎక్కడికక్కడ నిఘాలు, సొంత మనుష్యుల పహరాలో పాలన సాగుతూంటే బాక్సైట్‌ వంటి కీలక జిఒ తెలియకుండానే జారీ చేశారనడం అక్షరాల మసిపూసే ప్రయత్నమే! ప్రమాణ స్వీకార సభ నుండి జిఒ జారీ అయిన తరువాత ఢిల్లీ పర్యటనలోనూ బాక్సైట్‌పై ముఖ్యమంత్రి చేసిన రాగాలాపనే దీనికి నిలువెత్తు సాక్ష్యం! ఇప్పుడంతా తలకిందులు కావడంతో అటవీశాఖపై, ఆ శాఖలోని ఒకరిద్దరు అధికారులపై నెపాన్ని వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా నిజంగానే జిఓ జారీ అయివుంటే దానిని సరిదిద్దుకోవడానికి ఇన్ని రోజులు, ఇంత ప్రజాందోళన అవసరం లేదు. 
గిరిజనుల సంక్షేమం, వాస్తవాభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికే జారీ అయిన జిఒను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉండాల్సింది. బేషరత్తుగా తవ్వకాలను ఆపి వేస్తున్నట్లు ప్రకటించాల్సిఉంది. అయితే, ప్రభుత్వంలో ఆ దిశలో చర్యలకు బదులుగా షరతులతో ముందుకెళ్ళాలని నిర్ణయించడం రహస్య అజెండాలో భాగమేనన్న అనుమానాలను రేకేత్తిస్తోంది. శ్వేతపత్రాల వ్యూహంతో వంచనకు ప్రయత్నించి, ఐక్యతకు గండికొట్టే వికృత చర్యలకు దిగే ప్రమాదం పొంచి వుండనే వుంది. ఇదంతా బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమం అమ్రత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియచేస్తోంది..