ప్రమాద ఘంటికలు

సేద్యం గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, రుణగ్రస్తులై నిరాశా నిస్ప్రుహలతో జీవితాలు చాలిస్తున్న రైతులను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వేధింపులు భరించలేక రోజుకో రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న దుర్మార్గం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కింద భూమి కోల్పోయిన ఒక రైతు కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాశిత రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు బాధితులదీ అదే దారి. రాజధాని అమరావతిలో ఒకరిద్దరు ఆత్మహత్యలకు ప్రయత్నించినా ప్రభుత్వం బయటికి రానీయలేదు. ప్రభుత్వ శాఖల నిర్వాకం వలన రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఘోరం.

విజయనగరం జిల్లాలో రెవెన్యూ అధికారుల వాలకంతో ఒక రైతు నిండు ప్రాణం తీసుకోవడం ఆందోళకరం. వివాదాల పరిష్కారంలో రెవెన్యూ విభాగం సకాలంలో స్పందించని ఫలితమిది. అదే జిల్లాలో ఇలాంటి కారణంతోనే మరో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గుంటూరు జిల్లాలో దేవాలయ భూములను ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న కౌలు రైతుల భూములను దేవాదాయశాఖ వేలం వేయడంతో సామూహిక ఆత్మహత్యలకు ప్రయత్నించిన ఘటనలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో బ్యాంక్‌ మేనేజర్‌ వేధింపులకు యువ రైతు బలయ్యాడు. ఈ ఆత్మహత్యలన్నీ సేద్యం అచ్చిరాక పాల్పడ్డవి కావు. ప్రభుత్వ విధానాలు, పలు విభాగాల్లో నెలకొన్న అవినీతికి ప్రతి రూపాలు. ప్రాణాధారమైన భూములను బలవంతంగా లాక్కుంటున్న వైపరీత్యాన్ని తాళలేక మనసికంగా కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దీన గాధలివి. వ్యవసాయ సంక్షోభం సృష్టిస్తున్న రైతుల ఆత్మహత్యల పరంపర ఆందోళకరం కాగా నవ్యాంధ్రప్రదేశ్‌ 'అభివృద్ధి' చక్రాల వేగానికి, ప్రభుత్వ శాఖల నిర్వాకానికి తాళలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతల ఉందంతాలు మరింత బాధాకరం. రాజధాని నిర్మాణం, కొత్త విమానాశ్రయల ఏర్పాటు, ఉన్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన ఇత్యాది కార్యక్రమాలకు సర్కారు పెద్ద ఎత్తున భూములు సేకరిస్తోంది. భూముల సేకరణలో అత్యధికంగా సమిధలయ్యేది రైతులే.

వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ తరతరాలుగా భూమిపై మమకారంతో జీవనం వెళ్లదీస్తున్న కర్షకులకు భూసేకరణ గోరుచుట్టుపై రోకలిపోటు వంటిది. అభివృద్ధి కోసం భూములు అనివార్యమైనప్పుడు నిర్వాసితులు మెచ్చేలా సహాయ పునరావాస ప్యాకేజీ ఇవ్వడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి)లో కార్పొరేట్ల కోసం సర్కారే భూములను బలవంతంగా గుంజు కోవడం రైతులను మరింత నిరాశా నిస్ప్రుహలకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. తమను రక్షించాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు తమపై దాడికి దిగడంతో చేసేది లేక ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరం. భూములు దక్కకకుండా పోతాయన్న మనస్థాపంతో భవిష్యత్తు కానరాక ఆత్మహత్యలకు పాల్పడే రైతులకు భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వమే. భవిష్యత్తు ప్రమాద ఘంటికలుగా భావించి సర్కారు తగు చర్యలు తీసుకోవాలి. రైతులు సైతం మనో నిబ్బరాన్ని కోల్పోకుంగా ప్రభుత్వంపై పోరాడి హక్కులు సాధించుకోవాలి.