ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అవశ్యం..

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 1950 జనవరి 26న రాజ్యాంగ సభలో మాట్లాడుతూ మనం వైరుధ్యాలతో కూడిన జీవితం ప్రారంభిస్తున్నాము. మనకు రాజకీయాలలో సమానత్వం ఉంది కానీ, సామాజిక, ఆర్థిక జీవితాలలో అసమానతలున్నాయి. రాజకీయాలలో ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాము. కానీ మనం సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరికీ ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరిస్తున్నాము. ఎంతకాలం ఈ వైరుధ్యాల జీవితం. ఈ వైరుధ్యాలను వీలైనంత త్వరగా అంతం చేయాలి. లేదంటే రాజ్యాంగ సభవారు కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలకు గురైనవారు పెకలించి వేస్తారని చెప్పిన మాటలను మన పాలకులు గుర్తుంచుకోవాలి. వారు పరిపాలనా విధానంలో మార్పులు చేస్తూ రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక అనే పదాలకు అర్థం మార్చేశారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఉన్న సంగతి మరిచిపోయారు. సహజ వనరులు గాని, దేశ సంపదగాని ఏ ఒక్కరి చేతుల్లోనో కేంద్రీకృతం కాకూడదని, దాన్ని అందరూ సమానంగా అనుభవించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒక పక్క రాజ్యాంగం ఆదేశిస్తుంటే మరో పక్క దానికి భిన్నంగా సంపదనంతా ఎవరో బహు కొద్ది మంది చేతుల్లో పెడుతున్నారు.
అందరికీ విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఉపాధి, సమాన అవకాశాలు అని రాసుకున్న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను మన పాలకులు మరచిపోయారు. ప్రయివేటు రంగాన్ని 85 శాతానికి పెంచి ప్రభుత్వ రంగాన్ని 15 శాతానికి కుదించి సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ఆరాచక శక్తులు రిజర్వేషన్‌ విధానంపై దాడులు ప్రారంభించాయి. మరికొన్ని మతపరమైన దాడులు రిజర్వేషను వర్గం పైనే జరగడంతో లౌకికతత్వ స్ఫూర్తిని కోల్పోతున్నాం. ఇది కప్పిపుచ్చుకోవడానికి అంబేద్కర్‌ విగ్రహాలు పెడతామని, మరొకరు అంబేద్కర్‌ స్మారక సంస్థలు కడతామని చెప్పుకుంటున్నారు. అంబేద్కర్‌ విగ్రహాల ముందు మోకరిల్లుతున్నారు.
2001 జనాభా లెక్కల ప్రకారం ఉద్యోగుల్లో ఎక్కువ మంది దళితులు నాల్గవతరగతి ఉద్యోగులుగా ఉన్నారు. మొత్తం దళితుల్లో ఉద్యోగం చేస్తున్నవారు 3 శాతం మాత్రమే అని అంచనా. దేశంలో 4.42 కోట్ల దళిత కుటుంబాలలో 20 శాతం కుటుంబాలకు ఇళ్లు లేవు. 89 శాతం కుటుంబాలు మురికివాడల్లో జీవిస్తున్నారు. గిరిజనులలో 2.30 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరుగానీ, విద్యుత్‌ సౌకర్యం గానీ, మరుగుదొడ్లు గానీ లేవు. గిరిజన మహిళలలో 50 శాతం నిరక్ష్యరాస్యత, 76.8 శాతం మంది పిల్లలకు పోషకాహార లోపం, రక్తహీనత, ప్రసూతి సౌకర్యాలు అందక 82.3 శాతం మంది గిరిజన మహిళలు ఇంటి దగ్గర ప్రసవిస్తున్నారు. మహాత్మా జ్యోతిరావుఫూలే అకాడమీ ఆఫ్‌ బ్యాక్‌ వర్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ సర్వే ప్రకారం వెనుకబడిన వారిలో 62 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వీరందరికీ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం జరిగిందని భావిస్తున్నారా?
అమర్త్యసేన్‌ దృష్టిలో సామాజిక ఆర్థిక, రాజకీయ ప్రక్రియలో పాల్గొనడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచే నైపుణ్యం, బడుగు బలహీన వర్గాల జీవితాలకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు అందించే సాధనం విద్య కాబట్టి బలహీన వర్గాల వారు విద్యను అభ్యసించడానికి అడ్డంకులుగా ఉన్న సామాజిక, ఆర్థిక, అసమానతలు తొలగించాలి. నాడే సుస్థిరమైన, దీర్ఘకాలిక అభివృద్ధి సాధనకు ఉపయోగపడుతుంది. మన రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయి. మన పాలకులు ప్రయివేటు రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక బాధ్యతలు మరిచారు. ప్రభుత్వ రంగాన్ని మరిచినారు. ఎమ్‌ఆర్‌టిపి చట్టాలు, కార్మిక చట్టాలను మారుస్తున్నారు. మన ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను ప్రభుత్వ రుణాలు, సబ్సీడీలుగా ప్రయివేటు రంగానికి అందిస్తున్నాయి. కానీ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. మన ప్రభుత్వాలు ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో భూ సంస్కరణలు అమలు చేయలేదు. ఎవరి చేతుల్లో విద్య, భూమి ఉంటుందో వారి చేతుల్లో అధికారం ఉండటమే కాదు. శాశ్వతంగా నిలిచిపోయింది. విద్య ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉండడం మూలంగా సాంస్కృతికంగానూ, మానసికంగానూ, మతపరంగానూ వారు ప్రజలను పాలిస్తున్నారు. అలాగే అగ్ర వర్ణాలవారు ఉన్నత పదవుల్లో ఉండగా దళితులు, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు నాల్గవ తరగతి ఉద్యోగులుగానూ, అటెండర్లు, స్వీపర్లుగానూ ఉంటున్నారు.
తక్షణమే ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకత ఉంది. ప్రభుత్వ రంగం తగ్గిపోయి ప్రయివేటు రంగం 85 శాతం పెరిగిపోవడం వల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు ఉద్యోగ అవకాశాలకు దూరమై నిరుద్యోగులుగా ఉన్నారు. యుపిఎస్‌సి, సివిల్‌ సర్వీసు, ఎపిపిఎస్‌సి వంటి పరీక్షలలో మంచి ర్యాంకులు వచ్చినవారికే ఉద్యోగం వస్తుంది. తరువాత ర్యాంకులవారికి ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించడం లేదు. అలాగే ప్రభుత్వ పథకాలు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు నేరుగా అందడం లేదు. బ్యాంక్‌ రుణాలకు కూడా ష్యూరిటీ దొరక్క వారు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. పెరిగిన జనాభాకు, చదివిన చదువుకు అనుగుణంగా ఉద్యోగాలు దొరకక ఎస్‌సి, ఎస్‌టి, బిసిలే నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్రైవేటు, కార్పొరేటు రంగాలవారు లక్షల, కోట్ల రూపాయల సబ్సిడీలు, రాయితీలు, పన్ను ప్రయోజనాలు, బాంకుల్లో లోన్లు, ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే భూములు పొందుతున్నారు. కాబట్టి సామాజిక బాధ్యతగా ప్రభుత్వం ప్రయివేటు రంగంలో రిజర్వేషన్‌పై చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
కామాల శేషగిరిరావు