ప్రాంతీయవాదం-ప్రజలపై భారం..

             కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిందంటూ సంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర పాలకుల తీరు సంతోషంలో చావు మరిచిపోయి నట్లున్నది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాల ప్రజలపై, గడిచిన సంవత్సర కాలంలో వందల కోట్ల రూపాయల భారం మోపిన విషయం పాలకులకు గుర్తురావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. చెయ్యని వాగ్దానాలు అమలు జరుపుతున్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తిగా అమలు జరపలేదు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాయితీల పేరుతో వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు జీత, బత్యాలు పెంచి ఖాజానాపై కోట్ల రూపాయల భారం వేశాడు. మంత్రులు, ముఖ్యమంత్రి విదేశీ, స్వదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.
             రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాజధాని నిర్మాణం, 13 జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్లు లాంటి అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేర్చడంలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారు. కొత్తగా నిర్మించబోయే రాజధాని నగరం చుట్టూ మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రజలందరిపై దాదాపు రూ.1,000 కోట్ల పన్నుల భారాన్ని వేయడానికి పథకం తయారు చేసినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన మమకారంతో కాబోలు ఆయన కేంద్ర ప్రభుత్వంపై మెతక వైఖరి అవలంబిస్తున్నారు.
             గత సంవత్సరం సకాలంలో తగినంత వర్షాలు కురవక పోవడంతో పాటు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు రుణాలు సకాలంలో రద్దు కానందున రైతులకు బ్యాంకులు కొత్తరుణాలు ఇవ్వలేదు. ప్రకృతి నిరాదరణ, ప్రభుత్వ అసమర్థత వల్ల గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం వల్ల పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలు దెబ్బతిని చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాలు వేస్తున్నది. గత నాలుగు నెలల క్రితం దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు అదనంగా రూ.4ల పన్ను (వ్యాట్‌) పెంచాడు. వ్యవసాయానికి డీజిల్‌ ఇంజన్లను ఉపయోగించే రైతులు, ప్రజలను గమ్యానికి చేర్చే వాహనదారులపై పెను భారం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీజిల్‌పై పన్నులు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి.
            విజయవాడ మెట్రో రైలు నిర్మించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకటన విని రాష్ట్ర ప్రజలు కొత్త రాష్ట్రంలో కొత్తగా మెట్రో రైలు వస్తుందని ఆనందపడ్డారు. అయితే మెట్రో రైలు నిర్మాణం కోసం తమపై ఐదు రకాల అదనపు పన్నుల భారం పడబోతోందని ప్రజలకు తెలిస్తే లబోదిబో అనే పరిస్థితి ఏర్పడుతున్నది. విజయవాడ మెట్రో పనులు చేపట్టేందుకు విజయవాడ మెట్రో రైలు కార్పొరేషన్‌ పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసినట్లు తెలిసింది. మెట్రో రైలు నిర్మాణానికి రూ.7,212 కోట్లు (రాష్ట్ర ప్రభుత్వ పన్నులతో సహా) ఖర్చు అవుతుంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు, జపాన్‌కు చెందిన ఓ ఆర్థిక సంస్థ నుంచి రూ.1,993 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. మిగిలిన నిధులు మొత్తం ఇతర మార్గాల ద్వారా సమీకరించుకోవాలని సవివర నివేదిక (డిపిఆర్‌) ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విక్రయమయ్యే డీజిల్‌, పెట్రోల్‌పై మెట్రో సెస్సు విధించడంతోపాటు ఆస్తి (ఇంటి) పన్నుపై అదనంగా రుసుం వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని కూడా వదలకుండా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచడంతోపాటు ఇప్పటికే వినియోగంలో ఉన్న వాహనాలపై గ్రీన్‌ సెస్సు విధించాలనే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిసింది. అన్ని రకాల నిత్యావసర సరుకులు పెరగడం, విద్య, వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలపై భారాలు ఎలా వేయాలనే ఆలోచనలు మానుకోవాలి. విజయవాడ సిపిఎం నాయకులు సూచించినట్లు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిపి వారి సలహాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధికి నిధులు రాబట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- ఇరిగినేని పుల్లారెడ్డి
(వ్యాసకర్త సిపిఎం  కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు)