ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి

ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల గురించిన చర్చ గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ ప్రముఖ వస్తు తయారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ చెప్పటం లేదు. గణనీయమైన సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించిన భయాలు వారికెందుకు ఉండాలి? అంతేకాక గత 15 సంవత్సరాల్లో ఉద్యోగుల నియామకం తగ్గిన విషయాన్ని కూడా ఈ పత్రం ప్రస్తావించలేదు. సిఐఐ, అసోచెమ్‌ల విజ్ఞాపన పత్రం తప్పించుకునే ఉద్దేశంతో సమర్పించింది. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్న హామీని అది ఇవ్వలేదు.

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించు కొని పెద్ద ఎత్తున ఉత్స వాలు నిర్వహిం చాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి దళితులు, గిరిజనుల్లోకి చొరబడాలని ప్రయత్ని స్తోంది. కానీ పది సంవత్సరాల నుంచి చర్చనీయాం శంగా ఉన్న ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం పట్టించుకోలేదు. గతంలో యుపిఎ ప్రభుత్వం అనుసరించిన విధంగానే బిజెపి కూడా అనుసరి స్తోంది. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి ఈ నినాదం ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. సిఐఐ, అసోచెమ్‌ లాంటి పారిశ్రామిక సంస్థల ఒత్తిడికి లొంగి బిజెపి వ్యవహరిస్తున్నది. పారిశ్రామి కాధిప తుల వాదనలను పరిశీలిస్తే ఈ ధోరణి స్పష్టం అవుతుంది. గత యుపిఎ ప్రభుత్వంలో సిఐఐ, అసోచెమ్‌ సంస్థలు చేసిన వాదనలనే నేడు కూడా చేస్తున్నాయి.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను కల్పించాలన్న భావనను కనీస ఉమ్మడి కార్యక్రమంలో యుపిఎ ప్రభుత్వం చేర్చడం పట్ల పరిశ్రమాధిపతులకు కంటగింపుగా ఉండడంతో యుపిఎ దీన్ని పక్కనపెట్టింది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసినా అమలుకు నోచుకోలేదు. రిజర్వేషన్ల కారణంగా ప్రయివేటు రంగంలో సామర్థ్యం దెబ్బతినగలదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అంతేకాక ప్రభుత్వరంగ అసమర్థతకు రిజర్వేషన్లు ఒక కారణమని కూడా వారు వాదిస్తున్నారు. దళిత విద్యార్థులు మధ్యలోనే చదువును ఆపివేస్తున్నారంటే అందుకు కారణం వారికి చదువంటే ఆసక్తి లేకపోవడం కానేకాదని, కేవలం దారిద్య్రం, పేదరికం కారణంగా వారు పాఠశాలలకు వెళ్లడం లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పేర్కొన్నది. ప్రభుత్వరంగ సంస్థల్లో సైతం రిజర్వేషన్లు లేనట్లయితే ఈ రంగంలో కూడా దళితులు, ఆదివాసీలు చాలా నామమాత్రంగానే ఉండేవారు. జాతీయోద్యమ కాలం నుంచి ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వ రంగంలో దళితులకు, ఆదివాసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వం అమలు పరుస్తున్నది. ప్రపంచీకరణ దశలో పనిలో ఉన్న ఉద్యోగులను తీసివేయటమే ప్రభుత్వ లక్ష్యంగా మారింది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడంతో కొత్తగా వచ్చిన యజమానులు రిజర్వేషన్లను అమలు చేయడం లేదు. ప్రభుత్వ సర్వీసులలోనూ, ప్రభుత్వ రంగ సంస్థలలోనూ ఉద్యోగుల నియామకంపై నిషేధాన్ని విధించడంతో ఎస్సీ, ఎస్టీల ఉపాధిపై దీని దుష్ప్రభావం పెద్దగా పడింది. బ్యాక్‌లాగ్‌ పోస్టులు వేలాది ఖాళీగా ఉండిపోయాయి. వేలాది పోస్టులను అర్ధంతరంగా రద్దుచేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల సమస్యను యుపిఎ ప్రభుత్వం తన కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేర్చినా ఈ తరగతి ఉపాధికి న్యాయం జరగలేదు. కాగా ఈ అంశానికి సంబంధించిన శాసనం లేకుండా దీన్ని అమలుచ ేయడానికి బడా పారిశ్రామిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే భారత పారిశ్రామిక సంస్థ (సిఐఐ), అసోసియేటెడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (అసోచెమ్‌)లు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి. ఈ టాస్క్‌ఫోర్స్‌ ఒక ముసాయిదా విజ్ఞాపన పత్రాన్ని తయారు చేసి నాటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు అందజేసింది. 2007-08లో అందుబాటులో ఉన్న వివరాలను అనుసరించి ప్రైవేటు రంగంలో సంఘటిత రంగ ఉద్యోగులు దాదాపు 80 లక్షల మంది ఉంటే వారిలో రిజర్వేషన్లను వినియోగించుకొన్నవారు 2 శాతం మాత్రమే. దాదాపు 92 శాతం ఎస్సీ, ఎస్టీ శ్రామికులు అసంఘటిత రంగంలో అనాథ వేతనాలతో పని చేస్తున్నారు. ఉద్యోగ కల్పనలో కుల గుర్తింపులను ప్రయివేటు రంగం పరిగణనలోకి తీసుకోదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సమాచారం మేరకు ప్రైవేటురంగ పరిశ్రమలలో ఎస్సీ, ఎస్టీలు గణనీ యమైన సంఖ్యలోనే ఉన్నారని ఈ సిఐఐ, అసోచెమ్‌ విజ్ఞాపన పత్రం పేర్కొన్నది. గణనీయమైన సంఖ్య అని చెప్తున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎంత మంది ఉన్నదీ కచ్చితంగా చెప్ప లేదు.
ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల గురించిన చర్చ గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ ప్రముఖ వస్తు తయారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ చెప్పటం లేదు. గణనీయమైన సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించిన భయాలు వారికెందుకు ఉండాలి? అంతేకాక గత 15 సంవత్సరాల్లో ఉద్యోగుల నియామకం తగ్గిన విషయాన్ని కూడా ఈ పత్రం ప్రస్తావించలేదు. సిఐఐ, అసోచెమ్‌ల విజ్ఞాపన పత్రం తప్పించుకునే ఉద్దేశంతో సమర్పించింది. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్న హామీని అది ఇవ్వలేదు. పైగా ''ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉండే సమైక్య, సమగ్ర సమాజాన్ని పారిశ్రామిక రంగం కోరుతున్నది అని, అభివృద్ధిని, ఆర్థిక పెరుగుదలను, పోటీతత్వాన్నీ పెంచుకునే సమాజంగా ఉండాలి'' అన్న వాదనను ముందుకు తెచ్చింది. అంటే సామాజికంగా వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన ్లను నిరాకరిస్తోంది. ఇంతటితో ఆగకుండా సార్వత్రిక విద్యను ప్రవేశపెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించ వచ్చునని చెప్పింది. స్వాతంత్య్రం అనంతరం ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ విద్యావకాశాలకు దూరమైన ఎస్టీ, ఎస్సీలకు ప్రైవేటు రంగం చేసిన సేవలు అత్యల్పం. మన సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ప్రాథమిక హక్కులు లేవు. దీనిని ఈ పత్రం కావాలనే విస్మరించింది. ఇలాంటి పరిస్థితిలో అణగారిన తరగతులకు విద్యావకాశాలు లభించగల వనడం భ్రమే అవుతుంది. నిజానికి ప్రాథమిక విద్య సైతం ఎస్సీ, ఎస్టీలకు అందని ద్రాక్షగా మిగిలింది. అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలను ఇస్తున్నట్లుగా ప్రైవేటు రంగం యజమానులు చెప్పడం హాస్యాస్పదం. మొత్తం మీద చూస్తే తమ రంగంలో ఉద్యోగులను నియమించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని ప్రైవేటురంగం కోరుతున్నది. నాడు ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనపత్రంలో ఈ విషయమే స్పష్టమైంది. కుల వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలను నిరాకరి స్తున్నది. ''మరింత నిర్మాణాత్మక పాత్రను'' పారి శ్రామిక రంగం నిర్వహించగలదని మాత్రం చెబుతు న్నాయి. అయితే ఈ ''నిర్మాణాత్మక పాత్ర'' ఏమిటో వివరించలేదు. స్వచ్ఛందంగా నిర్మాణాత్మక పాత్రను నిర్వహించే అవకాశాన్ని పరిశ్రమలకు ఇవ్వాలని ఆ పత్రం చెప్పింది. ఇప్పుడు బిజెపి పాలనలో కూడా ఇదే వాదనలు వీరు బలంగా వినిపిస్తున్నారు.
నల్లధనాన్ని వెల్లడించే పథకం వంటి వాటిని మనం ఇప్పటికే చూశాము. కార్పొరేట్‌ సంస్థల రుణాల ఎగవేత 2013 నవంబర్‌ నాటికి రూ.1.93 లక్షల కోట్లకు చేరింది. వీటిని పారు బకాయిలు అంటూ మనం గౌరవంగా పిలుస్తున్నాము. ఈ రుణాల ఎగవేత 2014-15లో ఇంకా పెరుగుతుందని రిజర్వుబ్యాంకు గవర్నరు రఘురాం రాజన్‌ ఆందోళన వెలిబుచ్చారు. స్వయం నియంత్రణ కలిగిన ప్రయివేటు రంగం ఈ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదు? ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ను సకాలంలో చెల్లించవలసిందని సిఐఐ, అసోచెమ్‌లు తమ సభ్యులకు ఎందుకు చెప్పడం లేదు. ప్రస్తుతం దాదాపు రూ.3,000 కోట్ల మేర ప్రావిడెంట్‌ ఫండ్‌ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను సకాలంలో చెల్లించేలా పరిశ్రమాధి పతులపై ఎందుకని చర్యలు చేపట్టడం లేదు? ఇప్పుడు పన్ను బకాయిలు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయాలను దాటి పోయాయి. కార్మిక హక్కు లను పరిశ్రమాధిపతులు దారుణంగా ఉల్లంఘి స్తున్నా అదుపుకు చర్యలు ఎందుకు చేపట్టడంలేదు. ఇలాంటి పరిస్థితిలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలను ప్రయివేటు రంగం తనంతట తాను ఇస్తుందంటే నమ్మాలా?
నాణ్యత, ఉత్పాదక శక్తిని నిలబెట్టుకోవాలంటే పారిశ్రామిక రంగంలో పోటీతత్వం ఉండాలని సిఐఐ, అసోచెమ్‌ ఇప్పుడు చెపుతున్నది. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు ఇస్తే అది పరిశ్రమల రంగంలో పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పటమే దీని అర్థం. నిజానికి లాభాల వేటలో పడిన పెట్టుబడిదారులకు సామాజిక లక్ష్యాలు అంటూ ఏమీ లేవు. కనుకనే స్వచ్ఛందంగా తామే ఎస్సీ, ఎస్టీలకు ఉపాధిని కల్పిస్తామని చెప్పే పారిశ్రామిక రంగం మాటలను కార్మిక సంఘాలు నమ్మటం లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలకు హామీ ఇవ్వకుండా విద్యా కార్యక్రమాల ద్వారా వారికి ఉద్యోగ అర్హతను కల్పిస్తామని చెప్పడం మోసం తప్ప మరొకటి కాదు. ఐఐటి, ఐఐఎంలలో స్కాలర్‌షిప్పులను కల్పిస్తామని చెబుతున్నది. అలాగే విదేశీ చదువులకు కూడా ఇతోధిక సహాయం చేయగలమని హామీలు ఇస్తున్నది. అయితే వీరు చెప్పేవన్నీ మేనేజర్‌ కేటగిరీకి చెందినవి మాత్రమే. సాధారణ కార్మికులకు ఏ మాత్రం సంబంధం లేదు. అదే విధంగా ప్రభుత్వ, మున్సిపల్‌ పాఠశాలల్లో ప్రాథమిక విద్యా స్థాయిని పెంచేటందుకు గాను స్వచ్ఛంద సంఘాలతో కలిసి పని చేయగలమని కూడా సిపిఐ, అసోచెమ్‌ చెబుతున్నది. పరిశ్రమా ధిపతులు చెప్పే నిర్మాణాత్మక చర్యలు ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలను ఇవ్వకుండా చేసేటందుకు మాత్రమే అన్నది స్పష్టం. రిజర్వేషన్లకు అవసరమైన చట్టం లేని పక్షంలో సుసంఘటితమైన ప్రైవేటురంగ పరిశ్రమా ధిపతులు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగావకాశాలను ఏ మాత్రం కల్పించరు. ఇందుకు గాను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేయాలి. రిజర్వేషన్ల కోసం పోరాడిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం తేవాలి. అప్పుడే కొంతైనా సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది.
 - పెనుమల్లి మధు