బలమైన సిపిఐ(ఎం)ను నిర్మిద్దాం..

ఇరవైఒకటవ పార్టీ మహాసభ ఆదేశాల మేరకు సిపిఐ(ఎం) ప్లీనం సమావేశమయింది. తన పనిని '2015 చివరికల్లా' పూర్తిచేసింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో పార్టీ మహాసభ ఆదేశాలను సిపిఐ(ఎం) నెరవేర్చ గలగటం గౌరవప్రదమైన విజయం. ప్లీనం నిర్వహించటానికి ఒక సమగ్రమైన, సవివర మైన విధానాన్ని, టైంటేబుల్‌ను పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత పార్టీ నిర్మాణం, పనితీరులను గురించి రాష్ట్ర కమిటీల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించటం కోసం ఒక వివరణాత్మక మైన ప్రశ్నావళిని పార్టీ కేంద్రం రూపొందించింది. రాష్ట్ర కమిటీ లు పంపిన సమాధానాలను పరిశీలించిన మీదట వాటి ఆధారంగా నిర్మాణంపై 'ముసాయిదా నివేదిక', 'ముసాయిదా తీర్మానం'లను తయారు చేసింది. పార్టీ మహాసభకు, ప్లీనం జరగటానికి మధ్యకాలంలో పొలిట్‌బ్యూరో ప్రత్యేకంగా నాలుగు సార్లు, కేంద్ర కమిటీ మూడు సార్లు సమావేశమయ్యా యంటే దీనిలో ఎంత తీవ్ర స్థాయిలో సన్నాహక శ్రమ ఉందో అర్థం చేసుకోగలం. కొల్‌కతా బ్రిగేడ్‌ పేరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన మహా ప్రదర్శన అనంతరం 2015 డిసెంబర్‌ 27 మధ్యాహ్నం తరువాత ప్లీనంలో చర్చలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో బ్రిగేడ్‌ మైదానంలో ఇంత పెద్ద ప్రదర్శన జరగలేదని బూర్జువా మీడియా కూడా అంగీకరించవలసి వచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ దాడులను, అడ్డంకులను అధిగమించి ప్రదర్శనలో పాల్గొన్నవారిని చూస్తే సిపిఐ(ఎం) యువకులను ఆకర్షించలేకపోతున్నదని మన వర్గశత్రువులు, బూర్జువా మీడియా చేస్తున్న ప్రచారం ఎంత అసత్యమనే విషయం తెలుస్తున్నది. ఈ ప్రదర్శనలో పశ్చిమబెంగాల్‌లోని అన్ని ప్రాంతాల నుంచి యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పార్టీ నిర్మాణం ప్రాధాన్యతను ఒక కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ తక్కువగా చూడటం జరగదు. అశేష భారత ప్రజానీకానికి పార్టీ అవగాహనను, రాజకీయ పంథాను చేరవేయటంలో అది పార్టీకి ప్రధాన ఆయుధంగా ఉంటుంది. సజీవమైన, సమర్థవంతమైన పార్టీ నిర్మాణం లేనిదే భారత ప్రజలతో బలమైన అనుబంధాన్ని పెంపొందించుకుని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడజాలదు.
ప్రజాపంథాతో విప్లవపార్టీ
మన లక్ష్యాలను వేగవంతంగా సాధించేందుకు పార్టీ శ్రేణులను పునరుత్తేజపరిచే, పార్టీ నిర్మాణాన్ని పునఃపటిష్టం చేసే ప్రక్రియ ప్లీనం విజయవంతంగా ముగియటంతో ప్రారంభమయింది. పార్టీ రాజకీయ-ఎత్తుగడల పంథాను సమీక్షించి వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను నిర్మించవల సిన ఆవశ్యకతను ప్రాథమ్య లక్ష్యంగా పునరుద్దరిస్తూ రాబో యే మూడు సంవత్సరాలకు రాజకీయ-ఎత్తుగడల పంథాను 21వ పార్టీ మహాసభ ఆమోదించింది. కాబట్టి ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు, క్రమబద్ధీకరించేందుకు నిర్మాణంపై జరిగిన ఈ ప్లీనం తన దృష్టిని సారించింది. బలమైన ప్రజాపోరాటాలను నిర్వహించటం ద్వారా ప్రస్తుత సవాళ్ళను ఎదుక్కోవాలని సిపిఐ(ఎం) కృతనిశ్చయంతో ఉంది. అంటే మనం మన పార్టీ స్వంత బలాన్ని పెద్ద ఎత్తున పెంచుకోవలసి ఉంటుంది. భారత ప్రజలలోని వర్గ శక్తుల పొందిక వామపక్ష, ప్రజాతంద్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌)కు అనుకూలంగా మార్చవలసిన అవసరాన్ని పునరుద్ఘాటించిన రాజకీయ-ఎత్తుగడల పంథాను అనుసరించి ఇది జరగాలి. ఏదో ఒక బూర్జువా కూటమిని ఎంచుకునే దయనీయ స్థితి నుంచి బయటపడేసి, ఒక ప్రత్యామ్నాయ విధాన ప్రాతిపదికన ఏర్పడే వర్గ ప్రత్యామ్నాయాన్ని భారత ప్రజల ముందుంచగలిగేంత బలంగా ఎల్‌డిఎఫ్‌ ఉండాలి. భారత ప్రజలలోని వర్గ శక్తుల పొందికను మార్చటం ద్వారా ఎల్‌డిఎఫ్‌ దేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవం నుంచి సోషలిజానికి పరివర్తన చెందేం దుకు నాయకత్వం వహించే జనతా ప్రజాతంత్ర సంఘటనకు అగ్రగామిగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత దశలో దాని పంథా భారత ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడం అంటే ప్రజా మార్గంతో ఉన్న విప్లవ పార్టీ గనక మార్క్సిజం- లెనినిజం సైద్ధాంతాలపై ఆధారపడిన ఒక విప్లవ పార్టీగా సిపిఐ(ఎం) స్వభావాన్ని ప్లీనం పునరుద్ఘాటించింది.
నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయటం
పార్టీ నిర్మాణ సామర్థ్యాలను విస్తారంగా అభివృద్ధి చేస్తే తప్ప ఈ విప్లవ లక్ష్యాలను సాధించజాలం. అందువల్ల చాలా కఠినమైన సవాళ్ళు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగానూ, దేశం లోనూ, సమాజంలోనూ నెలకొన్న సంక్షోభం శీఘ్రంగా తీవ్రతరమౌతోంది. 'ప్రతి సంక్షోభ సమయంలోనూ ఏదో ఒక అవకాశం అందుబాటులో ఉంటుంది' అనే పాత నానుడి ఉంది. పురోగమించేందుకు అలాంటి అవకాశాలను అంది పుచ్చుకోవాలని ప్లీనంలో సిపిఐ(ఎం) నిర్ణయించింది.ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొన్న స్థితిలో ఆ వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రజలను తీవ్రమైన దోపిడీ నుంచి విముక్తి చేయలేవు. అలాంటి పరిస్థితిలో దోపిడీకి గురవు తున్న వర్గాల మద్దతును కూడగట్టే కార్మికవర్గ పార్టీగా సిపిఐ (ఎం) ముందుండాలి. సోషలిజం అనే రాజకీయ ప్రత్యామ్నా యంతోనే ఇది చేయటం సాధ్యపడుతుంది. అంతేకాక భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధాన ప్రణాళిక సిపిఐ(ఎం)కు ఉన్నది. దాని ఆధారంగా మెరుగైన భారత దేశాన్ని సృష్టించటం సాధ్యమేనని ప్రజలు గుర్తించేందుకు వీలుకలుగుతుంది. ఆర్థిక అసమానతలను విపరీతంగా పెంచే ప్రస్తుత విధానాలకు బదులుగా దేశ వనరులను ఉపయోగించి నాణ్యమైన విద్యను, మంచి ఆరోగ్యాన్ని, సుస్థిర ఉపాధిని కల్పించి భారతీయ యువతకు మంచి భవితను ఈ ప్రత్యామ్నాయం అందిస్తుంది. మన బహుళ మత, భాష, సంస్కృతి, జాతుల ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నంచేసి మతపరమైన కేంద్రీకరణను రెచ్చగొట్టి, అసహన ఫాసిస్టు హిందూ రాజ్యాన్ని మనదేశంపై రుద్దేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపిలు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడే రాజకీయ శక్తిగా సిపిఐ(ఎం) ఉంటుంది. ఉగ్రవాదానికి, అన్ని రకాల మతమౌఢ్యాలకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) ఏకకాలంలో నికరంగా పోరాడుతుంది. మెజారిటీ మతతత్వం, మైనారిటీ మత మౌఢ్యం ఒక దానిని మరొకటి బతికించుకుంటూ బలోపేతం చేసుకుంటాయి. అన్ని రకాల వివక్ష, సామాజిక అసమానతలతోపాటు కుల ఆధారిత అంటరానితనాన్ని రూపుమాపేందుకు సిపిఐ(ఎం) ఉద్యమాలను తీవ్రతరం చేస్తుంది. వేగంగా దిగజారుతున్న రాజకీయ నైతికత బురదలో అవినీతి, ప్రజా జీవితంలో నైతిక దిగజారుడుకు వ్యతిరేకంగా పోరాడే ఉదాహరణగా సిపిఐ(ఎం) ఉంటుంది. సిపిఐ(ఎం)కు ఉన్న ఈ రికార్డు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశం కల్పిస్తుంది.
నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట విశ్లేషణ
'నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట విశ్లేషణే గతితార్కిక నియమాల జీవసారం' అనే లెనిన్‌ సూత్రీకరణను సిపిఐ(ఎం) ఎల్లవేళలా సమర్థిస్తుంది. ఈ సూత్రీకరణను అనుసరించి గత రెండు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాల ప్రభావం వల్ల ఎలాంటి నిర్దిష్ట మార్పులు జరిగాయి అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు సిపిఐ(ఎం) మూడు స్టడీ గ్రూపులను నియమించింది. ఈ స్టడీ గ్రూపుల నిర్దారణల ఆధారంగా భూస్వాములు, గ్రామీణ ధనికుల కూటమికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికుల, పేదల, మధ్యతరగతి రైతుల, వ్యవసా యేతర రంగాలలో పనిచేసే గ్రామీణ కార్మికుల, ఇతర గ్రామీణ పేదల విశాల ఐక్య సంఘటనను నిర్మించి వర్గ, ప్రజా ఉద్యమాలను బలోపేతం చెయ్యాలని ప్లీనం నిర్ణయించింది. ప్రధానమైన వ్యూహాత్మక పరిశ్రమలలో కార్మికులను సమీకరిం చటం, సంఘటిత, అసంఘటిత రంగాలలోని ఒప్పంద కార్మికులను సమీకరించటం, ట్రేడ్‌ యూనియన్ల, యువత, మహిళల సహకారంతో ప్రాదేశిక ఆధారిత నిర్మాణాలను స్థాపించటం, పట్టణాలలోని బస్తీలలో పట్టణ పేదలను సమీకరించటం, వృత్తి ఆధారిత బస్తీ కమిటీలను స్థాపించ టం, పౌర వేదికల వంటి వాటిని, సాంస్కృతిక కార్యకలాపా లను ప్రోత్సహించే వేదికలను, వారి జీవితాలలో, పనిలో శాస్త్రీయ దృక్పథం అలవర్చే కార్యకలాపాలను, రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు, పింఛనర్ల అసోసియేషన్లు, వృత్తి సంఘాల ను స్థాపించి మధ్యతరగతి వర్గాలలో పనిని ప్రధానంగా భావ జాల సంబంధిత కార్యకలాపాలను బలోపేతం చెయ్యాలి.
సరైన క్యాడర్‌ విధానాన్ని అమలు చెయ్యాలి
ఒక కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా పైనుంచే నిర్మించ బడుతుంది. కాబట్టి మన నిర్మాణాన్ని బలోపేతం చెయ్యా లంటే పార్టీ కేంద్రాన్ని బలోపేతం చెయ్యటంతో ఈ ప్రయ త్నాలు మొదలవ్వాలని, ఆ తరువాత పార్టీలోని అన్ని స్థాయిల్లో నాణ్యతను మెరుగుపర్చాలని ప్లీనం స్పష్టంగా పేర్కొన్నది. దీనిని సాధించటానికి తీసుకోవలసిన అనేక చర్యలలో యువ కామ్రేడ్స్‌ను గుర్తించి, ప్రోత్సహించి, సంబంధిత కమిటీల సమిష్టి నిర్ధారణ ఆధారంగా బాధ్యతలను అప్పజెప్పటం, వారిని విప్లవ పరివర్తన కోసం జరిగే పోరాటాలలో భావజాల నిబద్ధతకు, త్యాగానికి ప్రతీకలైన పూర్తి కాలం కార్యకర్తలుగా తీర్చిదిద్దటం, పూర్తి కాలం కార్యకర్తలకు తగిన వేతన నిర్మాణం ఉండేలా చూసి, వారికి సకాలంలో వేతనాలు అందేలా చూడ టం వంటి సరియైన క్యాడర్‌ విధానాన్ని అమలు చేయవలసిన అవసరాన్ని ప్లీనం ప్రముఖంగా పేర్కొన్నది. పటిష్టమైన శ్రేణులను నిర్మించటంలో భాగంగా క్రమం తప్పకుండా పార్టీ పాఠశాలలను నడపవలసిన అవసర ముందని, స్వీయ అధ్య యనం కోసం చదువవలసిన అవశ్యక గ్రంథాల పట్టికతో పాటు కేంద్ర స్థాయిలో సిలబస్‌ను తయారు చెయ్యాలని, పార్టీ పత్రికల, ప్రచురణల నాణ్యతను గణనీయంగా మెరుగుపర్చి, వాటి రూపం, సారాల స్థాయిని పెంచి అశేష ప్రజానీకానికి చేరేలా చర్యలు తీసుకోవాలని ప్లీనం భావించింది. 
సామాజిక అణచివేతపై  పోరాటాలను తీవ్రతరం చెయ్యడం
ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత అనే 'రెండు కాళ్ళ' మీద భారతదేశంలోని వర్గ పోరాటాలు ముందుకు సాగాలనే సిపిఐ(ఎం)అవగాహనను అనుసరించి జండర్‌ అణచివేత, దళిత, ఆదివాసీ, వికలాంగుల, మతసంబంధిత అల్పసంఖ్యా కుల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలను తీవ్రతరం చేయటానికి పార్టీ నిర్మాణ సామర్థ్యాన్ని బలోపేతం చెయ్యాల ని ప్లీనం ప్రముఖంగా పిలుపునిచ్చింది. సిపిఐ(ఎం) ఈ రెండు కాళ్ళ మీద ముందుగా నడవాలి. ఆ తరువాత పరుగెత్తాలి.
మతతత్వంపై పోరాటం
మతతత్వ శక్తుల ప్రస్తుత భావజాల దాడిని తిప్పికొట్టేం దుకు పార్టీ నిర్మాణ సామర్థ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్లీనం పేర్కొన్నది. ఇందుకోసం సాహిత్య వేత్తలను, శాస్త్రవేత్తలను, చరిత్రకారులను, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న మేధావులను, ఇతర రంగాలకు చెందిన మేధావులను సమీకరించాలి. పాఠశాల పూర్వ, పాఠశాల స్థాయిలో శాస్త్రీయ దృక్పథాన్ని, లౌకిక విలువలను వ్యాప్తిచేసేందుకు సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించేందుకు అధ్యాపకులను, సామాజిక సంస్థలను భాగస్వాములను చెయ్యాలి. దళిత, ఆదివాసీల వంటి దోపిడీకి గురవుతున్న వర్గాలలోకి మతతత్వ ధోరణులు చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యకలాపాలను రూపొందించాలి. ప్రగతిశీల, లౌకిక విలువలను, సాంస్కృతిక రూపాలను విస్తృతపరచటానికి విశాల సాంస్కృతిక వేదిక లను ఏర్పాటు చెయ్యాలి. ట్రేడ్‌ యూనియన్లు, ఇతర ప్రజా సంఘాలు తమతమ ప్రాంతాలలో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. ఆరోగ్య కేంద్రాలు, విద్యా శిక్షణ సెంటర్లు, రీడింగ్‌ రూమ్స్‌, సహాయ కార్యక్రమాల వంటి సామాజిక సేవా కార్యకలాపాలను నిర్వహించాలి. వీటితో పాటు జనరంజకమైన సైన్స్‌, సాంస్కృతిక ఉద్యమాలను బలోపేతం చేయవలసిన అవసరం చాలా ఉన్నది.
తక్షణ అత్యవసర పనులు
గొప్ప ప్రజా ఉద్యమాలను నడిపేందుకు సిపిఐ(ఎం) దేశ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలి. పార్టీ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటానికి ఇది అవసరం. ప్రజలతో సజీవ సంబంధాలను బలోపేతం చేయటానికి ముందుగా పార్టీ ప్రజా పంథాను అమలుచేయాలి. అంటే అనేక రకాల స్థానిక పోరాటాలను నిర్వహించటానికి స్థానిక పార్టీ శాఖలను బలోపేతం చేయటంతోపాటు ప్రజాతంత్ర విప్లవానికి ఇరుసుగా ఉన్న వ్యవసాయిక విప్లవాన్ని ముందుకు తీసుకు పోయే విషయంపై మనం దృష్టి సారించాలి. ఇందుకోసం దోపిడీకి గురవుతున్న గ్రామీణ ప్రజలు చేసే పోరాటాలలో మమేకమవడం ద్వారా కార్మిక-కర్షక మైత్రిని బలోపేతం చేయాలి. పార్టీ పలుకుబడి పెరగటానికి, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కూడదీయటానికి ఆర్థిక, సామాజిక సమస్యలపై వర్గ, ప్రజా పోరాటాలను నిర్వహించటంపై తక్షణమే దృష్టిని సారించాలి. ప్రజాపంథాను అవలంబించి ప్రజలతో సజీవ సంబంధాలను ఏర్పరచుకోవాలి. మంచి నాణ్యతగల సభ్యత్వాన్ని కలిగిన విప్లవ పార్టీని నిర్మించటానికి పార్టీ నిర్మాణాన్ని క్రమబద్ధం చేయాలి. యువతను పార్టీలోకి ఆకర్షించటానికి, మతతత్వానికి, నయా ఉదారవాదానికి, ప్రతీఘాత భావజాలాలకు వ్యతిరేకంగా భావజాల పోరాటం చేయటానికి ప్రత్యేక కృషి జరగాలి.
ఆమోదింపబడిన డాక్యుమెంట్లలోని నిర్ణయాలు- తీర్మానం, నివేదికలను తప్పనిసరిగా ఒక కాలపరిమితిలో అమలుచేయాలని ప్లీనం నిర్ణయించింది. ఇది పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీలతో మొదలవుతుంది. కొన్ని రాష్ట్రాలలో అసెం బ్లీ ఎన్నికలు జరగనున్నందున అన్ని రాష్ట్ర కమిటీలూ తమ తమ నిర్దిష్ట పరిస్థితులను అనుసరించి తమ ప్రణాళికలను ఒక కాలపరిమితిలో అమలుచేయాలి. వాటిని ఒక సంవత్సర కాలంలో సమీక్షించాలి. అత్యావశ్యక సంకల్పంతో ఈ నిర్ణయా లను అమలు చేసేందుకు మొత్తం పార్టీని, కార్యకర్తలను, సానుభూతిపరులను, పార్టీ క్షేమాన్ని కాంక్షించేవారందరినీ సమీకరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్లీనం ముగిసింది. మన దేశం లో విప్లవాత్మక సామాజిక పరివర్తనను ముందుకు తీసుకెళ్ళే బాధ్యతను సిపిఐ(ఎం) నిర్వర్తించేందుకు ఇదొక్కటే మార్గం.
(అనువాదం : నెల్లూరు నరసింహారావు)
- సీతారాం ఏచూరి