బిజెపికి చెంపపెట్టు..

దేశంలో అధిక ధరలు, ఉపాధి హామీకి కరువు, కనీసవేతనాలు వంటి అనేక సమస్యలతో సామాన్యుడు సతమతమవుతుంటే అవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ల సేవలో, మత చిచ్చు రేపడంలో మునిగి తేలుతున్న బిజెపికి యుపి, మహారాష్ట్ర ప్రజలు మున్పిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక. యుపి స్థానిక ఎన్నికలు గ్రామీణ ప్రజల నాడిని తెలియజేస్తుండగా, మహారాష్ట్ర మున్సిపల్‌ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజల మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బిజెపికి ఎదురైన ఘోర పరాజయం చిన్నదేమీ కాదు. అందులోనూ ఆయన దత్తత తీసుకున్న జయపూర్‌ గ్రామ పంచాయతీలో కాషాయ పార్టీ చావుదెబ్బ తింది. మరో ఏడాదిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వెలువడిన ఈ ఫలితాలు బిజెపి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గాను 71 స్థానాలను గెలుచుకుని ఇక తనకు ఎదురే లేదని విర్రవీగిన బిజెపికి ఓటర్లు సరిగ్గానే కీలెరిగి వాత పెట్టారు. యుపిలో నాలుగేళ్ల అఖిలేష్‌ పాలన కన్నా, మోడీ ప్రభుత్వ పదిహేడు మాసాల పాలనతో ప్రజలు ఎక్కువగా విసిగిపోయారనడానికి వారణాసి ఫలితాలే నిదర్శనం. విదేశీ వేదికలపై ఉపన్యాసాలు దంచుతూ, తన వందిమాగధుల నుంచి ఆహా ఓహో అని పొగడ్తలందుకుంటూ, దేశంలో మత విద్వేషాల విషాన్ని చిమ్ముతున్న కాషాయ మూకలకు మౌనంగా తన తోడ్పాటునందిస్తున్న నరేంద్ర మోడీకి ఇదొక కనువిప్పుకావాలి. యుపిలో మారిన ఈ రాజకీయ పరిస్థితే, పొరుగున వున్న మరో ప్రధాన హిందీ రాష్ట్రం బీహార్‌లో ప్రతిబింబించే అవకాశాలున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. రేపు బీహార్‌లో గనుక బిజెపి ఓడిపోతే దాని ప్రభావం వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న మరో అయిదు కీలక రాష్ట్రాలపై పడుతుంది. ఆ తరువాత యుపి అసెంబ్లీ ఎన్నికలపైనా వుంటుంది. అందుకే యుపి, మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు చిన్నవే అయినా దేశానికి పెద్ద సందేశాన్ని ఇచ్చాయి. యుపిలో మొత్తం 74 జిల్లాల్లో 3,112 జిల్లా పంచాయతీ వార్డులకు, 77,576 బ్లాక్‌ పంచాయతీ స్థానాలకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. వీటిని బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆదిత్యనాథ్‌ 'హిందూ వాహిణి'ని, విహెచ్‌పికి అనుబంధమైన బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను రంగంలోకి దించింది. పార్టీ గుర్తులు లేకపోయినా బిజెపి చాలా చోట్ల తన అభ్యర్థులను బాహాటంగా ప్రకటించింది. స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం ధనబలం, కండబలంతో సహా సర్వ శక్తులూ ఒడ్డింది. వారణాసిలో మొత్తం 48 జిల్లా పంచాయతీ వార్డులకుగాను బిజెపికి దక్కింది కేవలం తొమ్మిదే.. సమాజ్‌వాది పార్టీకి 26స్థానాలు లభించగా, బిఎస్పీకి మూడు, కాంగ్రెస్‌కు రెండు, ఇతరులకు 8 స్థానాలు దక్కాయి. రాష్ట్రం మొత్తం మీద 17శాతం వార్డులు తమకు దక్కాయని కమలనాథులు చెప్పుకుంటున్నా ఈ ఎన్నికల్లో బిజెపి చతికిలపడిన మాట కాదనలేని సత్యం. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన (ఎస్‌ఎజివై) కింద ప్రధాని దత్తత తీసుకున్న జయపూర్‌ గ్రామంలో పాలక పార్టీ అభ్యర్థి బిఎస్‌పి కి చెందిన ఓ అనామక అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. బజరంగ్‌ దళ్‌ బ్లాక్‌ కన్వీనర్‌, హత్యలు, అక్రమ మారణాయుధాలు కలిగివున్నారన్న నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తిని తీసుకొచ్చి జయపూర్‌లో నిలబెట్టినందుకు ఓటర్లు ఆ పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్పారు. 
మహారాష్ట్రలోనూ బిజెపికి ఇదే విధమైన చేదు అనుభవం ఎదురైంది. బిజెపి నేతృత్వంలోని ఫడ్నవీస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర పట్టణ మధ్య తరగతిలో గూడుకట్టుకున్న వ్యతిరేకతకు ఈ మున్సిపోల్స్‌ దర్పణం పట్టాయి. కల్యాణి దోంబివాలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కెడిఎంసి) లో శివసేన 52 వార్డులను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్‌ స్థానాన్ని చేజిక్కించుకోవాలంటే ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు తన అధీనంలో వున్న హింగానా, కుహి కార్పొరేేషన్లను కూడా బిజెపి కోల్పోయింది. వీటిలో హింగానా కార్పొరేషన్‌ను ఎన్‌సిపి కైవసం చేసుకోగా, కుహి కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విదర్భ ప్రాంతంలోని 29 మున్సిపల్‌ కౌన్సిళ్లలో కేవలం మూడింటిలో మాత్రమే బిజెపి అతి కష్టం మీద గెలిచింది. గత సారితో పోల్చితే కాంగ్రెస్‌, ఎన్‌సిపి వంటి లౌకిక పార్టీలు, శక్తులు ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ రెండు స్థానిక తీర్పులు ఇస్తున్న సందేశం ఒక్కటే: ప్రజా సమస్యలను గాలికొదిలి, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే పార్టీలను ప్రజలు ఎంతమాత్రం సహించరు.. బిజెపికి ఇది తలకెక్కుతుందో లేదో చూడాలి మరి.