బిసి సబ్‌ప్లాన్‌ ఎందుకు?

అన్ని స్థాయిల్లోని నిర్ణాయక స్థానాల్లో, ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న అన్ని వ్యవస్థల్లో, సంపద, మౌలికరంగాలపై ఆధిపత్యంలో బిసిలు పూర్తిగా అధమస్థానంలోకి నెట్టబడ్డారు. ఇప్పటికీ ఉత్పాదకను అందిస్తూ అత్యధిక స్వయం ఉపాధితో దేశ అభివృద్ధికి బిసిలు తోడ్పడుతున్నారు. దానికి తోడు చట్టసభల్లో కేవలం 18 శాతం స్థానాలు, పాలనా వ్యవస్థ లోని పై స్థాయి ఉద్యోగుల్లో 8 శాతం, న్యాయశాఖలో 6 శాతం, దేశంలోని అతిపెద్ద వెయ్యి కంపెనీల్లోని నిర్వహణా బోర్డులలో 3 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యానికి పరిమితమయ్యారు. 
భారత రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలం దరికీ జాతి, వర్ణ, కుల, వర్గ, లింగ వివక్ష లేకుండా సమాన త్వాన్ని, సమాన అవకాశాలను కల్పిస్తానని హామీ నిచ్చింది. ఈ లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు, బడ్జెట్‌లలో వారి జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు రాజ్యాంగం అమలులోకి వచ్చిన దగ్గరి నుంచి కల్పించింది. అయితే జనాభా దామాషా సగానిక ిపైగా ఉండి, అందులో అరవై శాతంపైగా దారిద్య్రరే ఖకు దిగువన ఉన్న బిసిల గురించి మాత్రం పట్టించుకున్న దాఖలా లు లేవు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో 25 సంవత్సరాలకు, కేంద్ర స్థాయిలో 45 సంవత్సరాల తర్వాత విద్య, ఉద్యోగాల్లో బిసిలకు రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. చట్ట సభల్లో బిసిలకు రిజర్వేషన్లు లేవు. బడ్జెట్‌ కేటాయింపులు గడిచిన సంవత్సరాలలో కేంద్రంలో 0.3 శాతం, రాష్ట్ర స్థాయిలో 4.0 శాతం ఎప్పుడూ దాటలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు పది శాతం కూడా అక్షరాస్యత లేని వేలాది బిసి కులాలు వాళ్ళ వృత్తుల్లో తప్ప మిగతా రంగాల్లో రాణించే అవకాశం లేవు. రాజ్యాంగం స్పష్టంగా తన లక్ష్యాన్ని ప్రకటించి ప్రభుత్వాలపై ఆ లక్ష్యాన్ని సాధించే బాధ్యత మోపి నా బిసిల అభివృద్ధికి సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటానికి ప్రధానంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, పక్ష పాత ధోరణి, బాధ్యతారాహిత్యం కారణమని స్పష్టంగా చెప్పవచ్చు.
స్వాతంత్య్రం వచ్చిన అనేక సంవత్సరాల తర్వాత అంటే పది పంచవర్ష ప్రణాళికలు, అనేక వార్షిక ప్రణాళికలు రూపొందించిన తర్వాత, పదకొండవ పంచవర్ష ప్రణాళిక మిడ్‌ టర్మ్‌ అప్త్రజల్‌ నివేదికలో(విభాగం-6, పేజీ 118) ఇలా పేర్కొన్నారు. ''రాష్ట్రాలవారీ, ఒబిసి కులాల వారీ, జనాభా గణాంక వివరాలు, అదే విధంగా వారికి సంబంధించిన ప్రాణాధార వివరాలు, సామాజిక, ఆర్థిక నేపథ్యం గణాంకాలు మా వద్ద అందుబాటులో లేవు. ఆ కారణంగా ఒబిసిల అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించలేకపోయాము'' అన్న చావు కబురు చల్లగా చెప్పింది. అందుకే ప్రతీ ఆర్థిక సంవత్సరం లక్షల కోట్ల బడ్జెట్‌ను రూపొందించిన కేంద్ర ప్రభుత్వం గత అనేక సంవత్సరాల్లో కేవలం ఒక ఒబిసి ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, కొన్ని స్కాలర్‌ షిప్‌లు, కొన్ని కేంద్రీయ సంస్థల ఏర్పాటు తప్ప ఎలాంటి ఇతర కార్యక్రమాలూ రూపొందించలేదు. ప్రణాళికా బడ్జెట్‌లో అన్నీ కలిపి అర్ధ శాతం(0.5) ఎన్నడూదాటలేదు. కేంద్రం వేసిన కాకా కాలేల్కెర్‌, మండల్‌ కమిషన్లు, ఒబిసిల అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన సచార్‌ కమిషన్‌ సూచనలు, సంచార జాతుల్లోని అనేక బిసి కులాలకు సంబంధించిన బాలకృష్ణ రెనకే కమిషన్‌ సూచలను కూడా చెత్తబుట్టకే పరిమితం చేసింది. ఆయా నివేదికల్లో ఒబిసిలకు సంబంధించిన వేలాది కులాలు దారిద్య్రరేఖకు దిగువన ఉండటం, సామాజికంగా, ఆర్థికంగా అత్యంత దయనీయ మైన పరిస్థితుల్లో ఉన్నారన్న అంశాన్ని స్పష్టంగా చెప్పినప్ప టికీ వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, వ్యూహాలు రూపొందించలేదు. ఆ క్రమంలో బిసిల పరిస్థితి ''గాలిలో దీపం''గా మారింది. కేంద్రంలో యుపిఎ కానీ, ఎన్‌డిఎ కానీ బిసిల విషయంలో వారి జనాభా గణాంకాలను సేకరించ డం దగ్గర నుంచి వారి సమస్యల పరిష్కారం వరకు, వారి కనీస అవసరాలను తీర్చే క్రమంలో కనీస కార్యక్రమాల నుంచి దీర్ఘకాలిక ప్రాతిపదికపై వారి అభివృద్ధి ప్రణాళికలు వేసే వరకు, వారి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి తమ అగ్రకులతత్వాన్ని స్పష్టంగా చాటుకున్నట్లు కనబడుతుంది. అయితే ఇంత జరిగినా 12వ పంచవర్ష ప్రణాళికలో కూడాలొబిసిలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు లేకపోవడం కొసమెరుపు.
ఈ దేశంలో కులాలు పుట్టిన దగ్గరి నుంచి ఒకప్పుడు శూద్రులుగా పిలువబడిన ఇప్పటి బిసి కులాలు వ్యవసాయం, పశుపోషణ, వస్తూత్పత్తి, వ్యక్తిగత సామాజిక సేవలందించడం, వినోదాన్నందించడం ఇలా అనేక వృత్తులను వంశపారంపర్యంగా నిర్వహిస్తూ వచ్చాయి. చారిత్రకంగా కుల వ్యవస్థలో వారేం చేయాలి? ఏం చేయకూడదు? అన్న ఆంక్షల ఫలితంగా వారు చదువుకు దూరం చేయబడ్డారు. చదువుతో అభివృద్ధి ముడిబడి ఉండడం వల్ల వారు అభివృద్ధికి దూరం చేయబడ్డారు. యూరోపియన్‌ దేశాలు మన దేశం ముడి సరుకుపై, మార్కెట్లపై, చౌకగా దొరికే శ్రామికులపై కన్నేయడం మూలంగా వ్యవసాయంతో సహా ఉత్పత్తి వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఆ వృత్తులను పట్టించుకోకపోవడంతో పాటు గత ఇరువై అయిదు సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాల వల్ల వృత్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగింది. ఆ క్రమంలో వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు విపరీతంగా కొనసాగాయి. అయినా వారి వృత్తులను ఆధునీకరించి లేదా ప్రత్యామ్నాయాలను చూపించి వారికి ఉపాధి, గౌరవప్రదమైన జీవితాన్నందించే వ్యూహాలను, కార్యక్రమాలను రూపొందించేందుకు కనీస ప్రయత్నం జరగలేదు. ప్రభుత్వాలు వేసిన కమిషన్లు ఒబిసిల వెనుకుబాటుతనాన్ని శాస్త్రీయంగా నిర్ధారించి వారి కులాలను బిసి జాబితాలో చేర్చినప్పటికీ వారి అభివృద్ధికి చేసిన సిఫార్సులను మాత్రం ఆమోదించి అమలు చేయడం జరగలేదు. పైగా ప్రభుత్వ ఇతర అభివృద్ధి విధానాల వల్ల వారికి అదనంగా నష్టం ఏర్పడడం కానీ లేదా గత కాలంగా జరిగిన అభివృద్ధి ఫలాలు వారికందక పోవడం కానీ జరిగింది. ఫలితంగా వారు అభివృద్ధికి దూరమై వారి స్థితిగతులు మరింత అధ్వానంగా మారిపోయాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం బిసిల్లో పేదల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేదరిక రేఖ దిగువన ఉన్నవారిలో 62 శాతం బిసిలే. బిసి యువకుల్లో, స్త్రీలలో అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు కన్నా చాలా తక్కువ. విద్యా సాధనలో పైకెదగడం విషయంలో అందరి కన్నా అధమ స్థాయిలోనూ వారే ఉన్నారు. ఇప్పటికీ భౌతిక శ్రామికులు, తాత్కాలిక చెల్లింపుల్లేని అసంఘటిత రంగాల కార్మికుల్లో బిసిలే అత్యధికులు. వ్యవసాయ రంగంలోని బిసిల్లో ఆదాయ వ్యత్యాసాలు అత్యధికం. దేశంలోని అత్యధిక శాతానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో అత్యధికులు బిసిలైనప్పటికీ వారిలో 70 శాతం పైగా అప్పుల ఊబిలో దిగజారి పోయారు. మరోవైపు వ్యవసాయేతర ఉపాధిలో ఉన్న 90 శాతంలో నాలుగు శాతం మందికి మాత్రమే వ్యవస్థీకృత ఆర్థిక సహకార మందుతున్నది. ఇతరులు ఇప్పటికీ వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడవలసిందే. కార్పొరేట్‌ వ్యవస్థలు అన్నీ ప్రభుత్వ వసతులు పూర్తి స్థాయిలో పొందినప్పటికీ వాటి యాజమా న్యాలలో బిసిలు లేరు. ఆ యాజమాన్యాలు బిసిలను పట్టించుకున్న దాఖలాలెక్కడా లేవు. ఇప్పటికీ ఈ దేశంలో ప్రభుత్వ సహాయానికి దూరంగా పొట్టకూటికి బిసిలు స్వయంగా ఉపాధి కల్పించుకుంటున్నారు. ఆ విధంగా మొత్తంగా అనియత ఉత్పత్తి రంగంలో 48 శాతం పైగా బిసిలే. అంటే మూడు కోట్ల మందికి పైగా వారు చిన్న చిన్న స్వయం ఉపాధి యూనిట్లతో క్షీణిస్తున్న చేతివృత్తులను కొనసాగించి పొట్టపోసుకుంటున్నారు. అందులో 71 శాతం ఉత్పత్తి రంగంలో, 60 శాతం చిరు స్థాయి వ్యాపార రంగంలో ఉన్నారు. అయితే వారిలో 7 శాతం మందికి మాత్రమే బ్యాంకు రుణాలందాయి. మిగతా వారు మళ్ళీ వడ్డీవ్యాపారులపై ఆధారపడవలసిందే. ఇంత పెద్ద ఎత్తున వృత్తుల్లో ఉన్న అనేక బిసి కులాలకు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో అసలు కేటాయింపులే లేవు. వారిని 'గుర్తించి' దీర్ఘకాలిక పథకాల ద్వారా, వ్యవస్థీకృత విధానాలతో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం వల్ల బిసిలు పెద్ద ఎత్తున 'ఆర్థిక వివక్ష'కు గురవుతున్నారు.
ఒబిసిల విషయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలూ ఒకే విధంగా ప్రవర్తిం చాయి. అన్ని స్థాయిల్లోని నిర్ణాయక స్థానాల్లో, ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న అన్ని వ్యవస్థల్లో, సంపద, మౌలిక రంగాలపై ఆధిపత్యంలో బిసిలు పూర్తిగా అధమస్థానంలోకి నెట్టబడ్డారు. ఇప్పటికీ ఉత్పాదకను అందిస్తూ అత్యధిక స్వయం ఉపాధితో దేశ అభివృద్ధికి బిసిలు తోడ్పడుతు న్నారు. దానికి తోడు చట్టసభల్లో కేవలం 18 శాతం స్థానాలు, పాలనా వ్యవస్థ లోని పై స్థాయి ఉద్యోగుల్లో 8 శాతం, న్యాయశాఖలో 6 శాతం, దేశంలోని అతిపెద్ద వెయ్యి కంపెనీల్లోని నిర్వహణా బోర్డులలో 3 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యానికి పరిమితమయ్యారు. పై సమాచారాన్ని పరిశీలిస్తే ఒబిసిలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ ంగా వెనుకబడి వున్నారని స్పష్టంగా గమనించవచ్చు.
అరవై ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న బిసిల ఈ పరిస్థితిని అధిగమించడానికి, వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి వారి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించడం తప్ప ఈ పరిస్థితుల్లో వేరే మార్గం లేదు. ప్రభుత్వ సాధారణ అభివృద్ధి పథకాల ద్వారా బిసిల అభివృద్ధి సాధ్యమన్న ప్రభుత్వ వాదన పూర్తిగా విఫలమైంది. కనుక ఇప్పటికైనా వారి అభివృద్ధికి ప్రత్యేకంగా 'బిసి సబ్‌ప్లాన్‌'ను రూపొందించాల్సి ఉంటుంది. బిసి సబ్‌ప్లాన్‌లో భాగంగా బిసిల కనీస అవసరాలు ముందుగా గుర్తించి వాటిని తీర్చడం దగ్గరి నుంచి వారి అభివృద్ధికి ప్రాధాన్యతా క్రమాన్ని ఏర్పాటుచేసి అమలు చేయాల్సిన అవసరముంది. బిసి కులాల్లోన్ని అత్యంత వెనుకబడ్డ కులాలైన సంచార జాతులు, యంబిసిలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి అన్ని కులాలకూ వరుసగా ప్రత్యేక అభివృద్ధి పథకాలు వేసి అమలు పర్చాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీ వేసి సైద్ధాంతిక భూమికను, సమగ్రమైన ప్రణాళికాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాల్సి ఉంది.
- ప్రొఫెసర్‌ కె మురళీమనోహర్‌