భారత జనాభా 127,42,39,769

భారత దేశ జనాభా శనివారం నాటికి 127,42,39,769కు చేరుకుంది. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశ జనాభా ఇది. దేశ జనాభా ఏడాదికి 1.6 శాతం చొప్పున పెరుగుతోందని, ఇదిలాగే కొనసాగితే 2050 నాటికి మన దేశం చైనాను సైతం దాటి పోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘జనసంఖ్య స్థిరతా కోశ్’ (ఎన్‌పిఎస్‌ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చైనా జనాభా దాదాపు 139 కోట్లు ఉంది. భారత దేశంలో జనాభా చైనాకన్నా ఎక్కువ వేగంగా పెరుగుతోందని ఈ సంస్థకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఇదేస్థాయిలో జనాభా పెరిగితే 2050 నాటికి మన దేశ జనాభా 163 కోట్లకు చేరుకుంటుందని, అప్పటికి చైనా జనాభాకన్నా ఇది ఎక్కువ ఉంటుందని ఆ అధికారి తెలిపారు.