భారత పత్రికారంగం భవిష్యత్తేమిటి?

             అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ డిజిటల్‌ యుగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలలోని వార్తా పత్రికలూ, సమాచార టెలివిజన్ల భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్‌ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ వార్తా పత్రికల మహాసభ, ప్రపంచ సంపాదకుల ఫోరంలలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికారంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా అటూ ఇటూగా అందరం నిలకడలేని అనిశ్చితిలోకి అడుగుపెడు తున్నామన్న భావన కలిగింది. పాఠకుల ప్రవర్తనలోనూ, వార్తలను స్వీకరించే తీరులోనూ పెనుమార్పులు వస్తున్నాయి. వెబ్‌, మొబైల్‌ వేదికలు వేగాన్ని పుంజుకుంటున్నాయి. ప్రాణాంతకమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు జారిపోతున్న పాఠకలోకాన్ని తిరిగి చేజిక్కించు కోవడం సంప్రదాయ వార్తాపత్రికా రంగానికి పెను సవాలైంది. పరిశ్రమకు సంబంధించిన ఇటువంటి ధోరణులతోపాటు అభివృద్ధి చెందిన దేశాలలో ఒత్తిళ్ళు, నిరాశ నిర్వేదాలు, గందర గోళాలతో ఇప్పటికే స్వతంత్రమైన, సమర్థ వంతమైన జర్నలిజం భారీగా దెబ్బతింది. కొలంబియా యూనివర్శిటీలోని మా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన ''అమెరికా జర్నలిజం పునర్నిర్మాణం'' అన్న సమకాలీన నివేదికలలో ప్రస్తావించినట్లు, '' దేశానికి పట్టుగొమ్మలైన వార్తాపత్రికలు, కొద్దిమంది జర్నలిస్టులతో, కొద్ది పేజీలకు పరిమితమై, కొన్ని కథనాలతో వాస్తవంగా కుంచించుకుపోతున్నాయి.
            ఈ దుస్థితితో భారతదేశ వార్తా పత్రికా రంగాన్ని పోల్చిచూస్తే, అది అభివృద్ధి బాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాని ఎగిసిపడుతున్న మన అభివృద్ధి వృత్తాంతం, దాని పర్యవసా నాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించుకోవా ల్సివుంది. గణాంకాలు అందుబాటులో ఉన్నా వాటిని అంతగా పట్టించుకోదలచలేదు. 2012 న్యూయార్కర్‌ పత్రికలో కెన్‌ ఔలెట్ట తన వ్యాసంలో భూమండలంలో వార్తాపత్రికలు బతికి బట్టకడుతున్న దేశాలలో భారతదేశం ఒకటని, ఇక్కడ జర్నలిస్టులకు, ప్రత్యేకించి యువకులకు పుష్కలంగా నైపుణ్యావకాశాలు ఉన్నాయని వ్రాశారు.
ఇండియన్‌ ప్రెస్‌, ప్రత్యేకించి భారతదేశ భాషా వార్తా పత్రికలూ మరియు ఉపగ్రహ వార్తా టెలివిజన్‌ వృద్ధిపథంలో కొనసాగుతు న్నాయి. ఈ అభివృద్ధి కథనంతో కొంతభాగాన్ని విశేషంగా పరిశోధించి, విశ్లేషించిన అంశాల్ని 15 సంవత్సరాల క్రితమే రాజకీయ శాస్త్రవేత్త అయిన రాబిన్‌ జఫ్రీ తన ''భారతదేశ వార్తా పత్రికా విప్లవం'' అన్న పుస్తకంలో పొందు పరిచారు. దీనితోపాటు ఈ అంశంపై ఎకనామిక్‌ మరియు పొలిటికల్‌ వీక్లీలో 1987, 1993, 1997లలో సీరియల్‌గా ఆయన వ్యాసాల్ని ప్రచురించారు. అభివృద్ధి చెందిన సాంతికే విజ్ఞానం, నిలకడగా విస్తరిస్తున్న అక్షరాస్యత, మెరుగైన కొనుగోలుశక్తి, వైవిధ్య భరితమైన కథనాలు, వీటన్నింటిని మించి రాజకీయ ఉత్సుకతలు-భారత వార్తా పత్రికా విప్లవం వెనుకనున్న కీలకాంశాలుగా రాబిన్‌ జఫ్రీ పేర్కొన్నారు. ఇక్కడ వార్తల దాహార్తి పుష్కలంగా ఉండి, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, వినోదం, వాటి సంకర ఆవిష్కరణ అయిన ''వినోదాత్మక సమాచారం'' అన్నీ వార్తల ముసుగు క్రింద చలామణి అవుతున్నాయి. ఈ మూసలో పలుకుబడి కలిగిన భారత భాషా వార్తా దినపత్రికలు పుంఖాను పుంఖాలుగా విస్తరించాయి. అందులో చాలా పత్రికలు అత్య ధిక సర్క్యులేషన్‌, భారీ పాఠక లోకాన్ని కలిగి ఉన్నాయి.
అయినప్పటికీ భారత పత్రికారంగం ప్రదర్శిస్తున్న ఎగసిపడే అభివృద్ధిని, వాటి పర్యవసానాల్ని ఆరాధనా స్థాయికి తీసుకు వెళ్ళకూడదు. భిన్నత్వాలు కలిగిన ప్రజల అవసరాలు, ప్రత్యేకించి గ్రామీణ ప్రజలు, మహిళల అవసరాలకు న్యాయం చేయకలిగే సామాజిక దృక్కోణం కలిగి ఉండటానికి భారతదేశ వార్తా పత్రికారంగం ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉన్నది. ఈ అంశాలపై సంపాదకీయాలు వ్రాయటానికి వాస్తవంలో అనేక ఇబ్బందులు ఇమిడే ఉన్నాయి. 
         భారత టెలివిజన్‌ భారీ ప్రేక్షకలోకాన్ని కలిగివుండి ఇంకా వృద్ధి చెందుతూనే ఉంది. అయినప్పటికీ ఈ సామూహిక ప్రేక్షక లోకంలో అత్యధికభాగం వినోద ఛానళ్ళకు సంబంధిం చినవారే. ఇంగ్లీష్‌ మరియు ఇతర భాషా వార్తాపత్రికలతో పోటీ పడగలిగిన 24×7 ఉపగ్రహ టెలివిజన్‌ వార్తా ఛానళ్ళు డజన్లలో ఉన్నా, మొత్తం టీవీ మార్కెట్లో వారి నిష్పత్తి చాలా స్వల్పంగా ఉంది.
భారత పత్రికారంగం ప్రదర్శిస్తున్న ఎగసిపడే వృద్ధిని పెద్దదిగా చేసి చూపించ వద్దనటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కవర్‌పేజీ ధరలకంటే తక్కువ ధరలకు పత్రికలను అమ్మడం, వందల వేలాది కాపీలను ముద్రించి, వాటిని పాత కాగితాల మార్కెట్‌కు తరలించడం లాంటి అనైతిక పద్ధతులతో భారీ సర్క్యులేషన్‌ లేబిల్‌ పొందడం వార్తా పత్రికలకు పరిపాటి అయ్యింది. వీటిలో రెండవ పద్ధతి వాణిజ్య ప్రకటనల సముపార్జనకు ఒక విధాన ప్రక్రియగా మారింది. ఇది చాలదన్నట్లు టెలివిజన్‌ ప్రేక్షకుల కొలమాన విధానం (టి.ఎ.ఎం.) విస్తృతమైన విమర్శలకు గురై, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నది.
ప్రింట్‌, సమాచార రంగ వ్యవస్థలన్నీ క్రమంగా ఆర్థిక సంక్లిష్టతను ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా వాణిజ్య ప్రకటనల రంగం కుంచించుకుపోతున్నది. పత్రికాప్రచురణ రంగంలో వృద్ధి మందగించింది. 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇందుకు దోహద పడినట్టుంది. అది భారత పత్రికారంగ వృద్ధిని దెబ్బతీసింది. సంక్షోభ పూర్వకాలంలో చవిచూసిన, కీలకమైన వాణిజ్య ప్రకటనల రెవెన్యూను మనం తిరిగి చూడలేమని నిపుణులు చెబుతున్నారు. 
           భారతదేశం డిజిటల్‌ యుగ వైరుధ్యాలను ఎదుర్కొని ఎలా మనగలుగుతుంది? పరివర్తనా యుగానికి కేంద్రమైన ఈ వైరుధ్యాన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను. ఒక ప్రక్కన అత్యధికంగా ప్రజలు డిజిటల్‌గా వార్తాపత్రికల్ని చదివేందుకు ముందుకొస్తున్నారు. మొట్ట మొదటిసారిగా చరిత్రలో ఉత్తమ ప్రచురణలకు ప్రపంచవ్యాప్త సజీవ పాఠకలోకాన్ని కలిగి వున్నాము. బహుముఖమైన శీర్షికలతో, మల్టీ మీడియా హంగులతో సుసంపన్నమైన అనేక అత్యుత్తమ వార్తాపత్రికలూ, వార్తా వెబ్‌సైట్లు లభ్యమౌతున్నాయి. లభ్యమౌతున్న ఈ స్థలంలో అందించగలిగే సమర్థతకు ఆకాశమే హద్దుగా ఉన్నది. మరోప్రక్క, పాత వార్తాపత్రికారంగాన్ని అతలాకుతలం చేస్తున్న ''అస్తిత్వ సంక్షోభం'' ఇంకా పరిష్కరింపబడలేదు. భారీ నష్టాన్ని చవిచూస్తూ అది కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ అద్భుతమైన పరిణామం అటు అంతర్జాలానికి గాని లేదా ఇటు డిజిటల్‌ జర్నలిజానికి గాని మనగలిగే ఆదాయాన్ని మరియు వ్యాపార నమూనాని ఇవ్వలేక పోతున్నది.
అంతర్జాల వినియోగంలో, బ్రాడ్‌ బ్యాండ్‌ లభ్యం కావడంలో మన దేశం సాపేక్షంగా వెనుకబడి ఉన్న కారణంగా వార్తా పత్రికారంగం సమాచార టెలివిజన్‌ ఆ మేరకు ప్రయోజనాల్ని పొందగలగడంలో ఎవరికీ లేశమాత్రమైన సందేహం కూడా లేదు. ఈ విషయంలో చైనా అత్యద్భుత ప్రగతిని సాధిం చింది. జులై 2014 అంతానికి ఆ దేశంలో 63.2 కోట్లమంది అంతర్జాల వినియోగ దారులున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో అత్యధికభాగం బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు కావడం విశేషం. మనదేశ అంతర్జాల అభివృద్ధిపై అధికారికంగా ఇంతవరకు ఏవిధమైన శాస్త్రీయ సర్వే నిర్వహింపబడలేదు. చిత్తు అంచనాలలో భారతదేశంలో 24కోట్ల మంది అంతర్జాల వినియోగదారు లున్నట్లు తెలుస్తున్నది. వీరిలో అత్యధికులు లోప భూయిష్టమైన బ్యాండ్‌విడ్త్‌తో సతమతమౌ తున్నారు. పోల్చదగ్గ జనాభా కల్గిన ఈ రెండు దేశాల్లో అంతర్జాల విస్తరణ పోలిక ఆసక్తికరమైన విశేషాల్ని తెలియజేస్తుంది. భారతదేశంలో కంటే చైనాలోఅంతర్జాల విస్తరణ రెండున్నర రెట్లకుపైగా ఉంది. 
దీనర్థమేమంటే వార్తాపత్రికారంగం మరియు సమాచార టెలివిజన్లపై డిజిటల్‌ విప్లవ ప్రభావం పడటం ఇంకా ప్రారంభం కాలేదు. మనదేశంలో ప్రతి వార్తాపత్రిక వెబ్‌సైట్‌ కలిగి ఉండి, అందులో అనేక పత్రికలు సమా చారాన్ని, ఆకర్షణీయమైన డిజిటల్‌ హంగులను దేశ, విదేశీ పాఠకుల కోసం నిర్వహిస్తు న్నప్పటికీ, అవి ప్రింట్‌ మీడియాకు లోబడే ఉన్నాయి. ది గార్డియన్‌ పత్రిక సంపాదకులు ఎలన్‌ రుస్‌ బ్రిడ్జర్‌ ఇలా చెప్తున్నారు. 'జర్నలిజం కాంతి తరంగాల వేగంతో సమానంగా మార్పుకు గురౌతున్నది. (దాదాపు సెకనుకు 3 లక్షల కి.మీ.) మీడియాను పరివర్తింప చేస్తున్న డిజిటల్‌ టెక్నాలజీల నూతన విజ్ఞానాన్ని, నవీన సత్యాలను తప్పనిసరిగా ప్రతి వారం తెలుసు కుంటున్నాము'' ఈ మార్పు మన దేశంలో శబ్ద తరంగాల వేగంతో (సెకనుకు 342.29 మీటర్లు) ఉన్నట్లు మన దేశ వార్తా పత్రికా పరిశ్రమ అంతర్గతంగా అభిప్రాయపడు తున్నట్లుంది.
ఈ పరిస్థితి ఉదాసీనతను పుట్టిస్తున్నది. డిజిటల్‌ యుగానికి ముఖ్యమైన నూతన విజ్ఞానాన్ని, నవీన సత్యాలను తెలుసుకోవాలనే నిజమైన చొరవ ఉండటం లేదు. అమెరికా ప్రింట్‌మీడియా ఎదుర్కొంటున్న పరిస్థితిని భారత వార్తా పత్రికారంగం 2040 నాటికి ఎదుర్కోవలసి ఉంటుందని, ప్రకటనలపైన, ఇతర అంశాలపైన ఆర్జించగలిగే రెవెన్యూలో అత్యధికభాగం మనం సొంతం చేసుకోవటానికి సంసిద్ధులం కావాలని భారతదేశంలో కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. డిజిటల్‌ ప్రభావం తక్షణం కాకపోయినా సమీపంలో ఉంటుందన్న వాస్తవాల్ని గుర్తించలేని వారి జోస్యాలు, అంచనాలు సత్య దూరాలనిపిస్తుంది. 2040 వరకు పరివర్తన సమయం రాకుండటం అసాధ్యమనిపిస్తుంది. 
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఏకీకరణల ప్రక్రియతో రాజీపడటం, ఇక్కడ మన ముందు పెద్ద సవాలుగా నిలిచింది. 'మార్పు' యొక్క నడకను నిశితంగా అంచనా వేసుకొని, సంక్లిష్ట పరిస్థితులను గమనంలో ఉంచుకొని భవిష్యత్‌ మార్పులకు సిద్ధం కావలసి ఉంది.
      భారత వార్తా పత్రికల రంగంలో పలుకు బడి కలిగిన వర్గాలు చాలాకాలంగా రాజ కీయాలలో నిర్వహిస్తున్న ప్రజాతంత్ర పాత్ర ప్రశ్నించలేనిది. దురదృష్టవశాత్తూ, ఆర్థిక సమస్యలు, విధానాలు వచ్చేసరికి ప్రధాన స్రవంతి మీడియా అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నది. కానీ ఎప్పుడూ ఇదే విధానం కొనసాగటం లేదు. ఆకలి చావుల సమస్యల్లో క్షేత్రస్థాయిలో తీవ్ర బాధితుల వాస్తవ జీవితాల్ని బహిరంగపరచటంలోను, ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాల అమలును నివారించి, తీవ్ర ఆకలి, క్షామ పరిస్థితుల నుండి విముక్తిపరిచే గ్యారంటీలు పొందటంలోను ఇతర ప్రజాతంత్ర సంస్థలతో కలిసి భారత దేశ మీడియా నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను అమర్త్యసేన్‌ కొనియాడారు. 
          గత రెండు దశాబ్దాలుగా తీవ్ర దుష్ప్ర భావాల్ని కలిగించిన నయా ఉదారవాద విధానాలను సవాలు చేసే వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాల్ని భారత వార్తా పత్రికా పరిశ్రమను నిర్వహిస్తున్న అనేక శక్తులు బహిష్కరించాయి. ప్రధాన స్రవంతి పత్రికలు మరియు సమాచార టెలివిజన్‌ ఆ విధానాలను నెత్తికెత్తుకొని, వాటిపై వస్తున్న విమర్శల్ని, అభ్యంతరాల్ని ప్రచురణకు నోచుకోకుండా చేయటమో లేదా విమర్శల పదును తగ్గించడమో చేస్తున్నారు. సామాజిక ఆర్థిక ప్రతికూల ప్రభావాల్సి సెన్సార్‌ చేస్తున్నారు. ఆర్థిక నిపుణులతో పాటు ఈ విధానాలపై పటిష్టమైన విమర్శలు చేసే వారి గొంతుకలకు కూడా ప్రచురణలో స్థానం కల్పించడం లేదు. 
ప్రజల దైన్యస్థితుల వాస్తవాలను ప్రముఖంగా చెప్పటం కంటే ''అంతా బాగానే ఉంది'' అన్న భావనకు ప్రచురణలలో ప్రాధాన్యత నివ్వాలని పత్రికా యజమానులు, ప్రకటనకర్తలు, మార్కెటింగ్‌ అధికారులు, కార్పొరేట్‌ మేనేజర్లు, చివరకు సీనియర్‌ జర్నలిస్టుల నుండి కూడా భారతదేశ జర్నలిజం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొం టున్నదని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. ''పేదరికం, ప్రత్యేకంగా గ్రామీణ పేదరికం, వార్తలకుగాని, సంపాదకీయాలకుగాని కథనా వస్తువుగా ఉండకలిగే అర్హత లేదంటున్నారు. పేదరికంలో ఉన్న యువకులకు, ఈ వార్తాసేకరణ వారి ఆకాంక్షల్ని ఎలా నెరవేర్చగలదని, వ్యాపార తాత్వికత నుండి ఉద్భవించిన వార్తాపత్రిక సంపాదకీయ తాత్వికత, ఆశావాదాలలో ఒకటిగా ఎలా మనగులుగుతందనే అంశాల గూర్చి భారతదేశ వార్తా పత్రికా ఎగ్జిక్యూటిర్లతో 'ఔలెట్ట' నిర్హొహమాటంగా జరిపిన సంభాషణల నుండి తెలుసుకొన్నారు.
చెన్నైలోని ఆసియా స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం విద్యార్థులకు 2002 సంవత్సర స్నాతకోత్సవం సందర్భంగా ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌, ''మార్కెట్లు, నైతికత, మీడియా'' అనే అంశంపై తన స్వతసిద్ధమైన, అసాధారణమైన అవగాహనతో ప్రసంగించారు. ఆయన ఆ సందర్భంగా చేసిన ప్రసంగ పూర్తి పాఠం ఆన్‌లౌన్‌లో లభ్యమౌతున్నది. ఇక్కడ దాని ముగింపును మాత్రం ప్రస్తావిస్తాను. 
ఆర్థిక అంశాలకు సంబంధించి మీడియా శక్తిపై, పై ప్రసంగాన్ని మనం ''పట్నాయక్‌ చట్టం''గా అభివర్ణించవచ్చును. ''అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, మీడియా ఒకే సరసన ఉన్నప్పుడు, మీడియా శక్తివంతంగా కనిపిస్తుంది. కానీ దానంతటదిగా మీడియా మానవ విలువల్ని సమర్ధిస్తూ, పేదలు నిర్భాగ్యుల వేదనల్ని వాస్తవంగా వ్యక్తం చేసినప్పుడు అది శక్తివిహీనంగా కనిపిస్తుంది. ఈ శక్తి విహీనత ఒక ప్రక్రియ ద్వారా ఉద్భవిస్తుందని ఆయన సూత్రీకరించారు. ఆర్థికవ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రాబల్యం సాధించడమే ఆ ప్రక్రియగా చెప్పారు. వైరుధ్యపూర్వకమైన, గౌరవనీయమైన కొన్ని మినహాయింపులు తప్పించి, స్థూలంగా ఈ ప్రాబల్యాన్ని మీడియా మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నది. పేదరికం, సామూహిక నిరాకరణ, మౌలిక జీవనాధార సమస్యలు, ఈ సమస్యలపై ప్రభుత్వ విధానాల ప్రభావం, వ్యవసాయం స్థితిగతులు, గ్రామీణ సమస్యలు భారతదేశ వార్తాపత్రికల్లో, సమాచార టెలివిజన్‌లో అతి తక్కువస్థాయిలో ప్రచురణకు నోచుకుంటున్నాయి. పట్నాయక్‌ ప్రస్తావించిన 'గౌరవనీయ మినహాయింపులు' చాలా సార్థకమైనవి. గ్రామీణ దుస్థితి, రైతుల ఆత్మహత్యలు, సామూహిక వలసలులాంటి సామాజిక అంశాలపై పి. సాయినాథ్‌ పరిశోధన వ్యాసాలు, ప్రజాహితమైన, పరిశోధనాత్మకమైన, కార్యాచరణను రూపొందించే జర్నలిజం యొక్క విలువైన సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాయి. ఇటువంటి జర్నలిజానికి విలువనివ్వకలిగే ప్రజా సంస్కృతిని నిర్మించగలిగి, ప్రతిభావంతమైన పై కృషికి వివిధ భారతీయ భాషల్లో ఈ అంశాల పైనే ఆదర్శ భావాలు గల యువ విలేకరుల రచనలు తోడైతే ప్రస్తుత సంక్లిష్ట స్థితినుండి బయటపడటానికి మార్గం దొరకగలదు.
           భారత వార్తా పత్రికా రంగం చర్చలలో తరచూ ఉపేక్షింప బడుతున్న క్లిష్టమైన అంశం దగ్గరకు వచ్చాను. రెండురకాలైన పరిస్థితులు, వార్తా పత్రికా పరిశ్రమ అదృష్టాలు, జర్నలిజం స్థితి. ఈ రెంటిని కలుపకూడదు. యాజమాన్యాల ఆర్థిక రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చడం కోసం వార్తల్ని, విశ్లేషణల్ని, వ్యాఖ్యానాల్ని మార్చుతున్నారు. ప్రముఖ వార్తాపత్రికలూ, వార్తా టెలివిజన్‌ సంస్థలలో సంపాదకీయ విషయాన్ని, సంపాదకీయ కార్యకలాపాల్ని తక్కువచేయడం, విలువలేకుండా చేయడం, మార్కెట్‌ పరిశోధన పేరుమీద క్రమపద్ధతిన నోరు మూయించడం చేస్తున్నారు. యాజమాన్యాలు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంపాదకీయాల స్థాయిని దిగజార్చే పద్ధతులను ఇష్టపూర్వకంగా అంగీకరించడం, సంపాదకీయ సమాచారం ముసుగులో అందించే అడ్వర్‌టైజ్‌మెంట్‌ సమాచారంలో వార్తలకు చెల్లించే వివరాలను పూర్తిగా ఇవ్వకపోవడం, అసలు ఇవ్వకపోవడం చేస్తున్నారు. ప్రైవేటు ఒప్పందాలు, ఎన్నికల ప్రచార వార్తలకు చెల్లింపులు స్వీకరించడం, అనుకూల వార్తల ప్రచురణలకు లంచాలు తీసుకోవడం, ఈ రకమైన పద్ధతులలో వార్తా పత్రికలూ, ఇతర వార్తా మీడియా వర్ధిల్లుతుంటే భారత దేశ మీడియా రంగం తీవ్రమైన అక్రమాలతో కూడిన అభివృద్ధిబాటలో పయనిస్తున్నదని భావించాల్సి వస్తున్నది.

(అనువాదం: కొండముది లక్ష్మీ ప్రసాద్‌)
-ఎన్‌. రామ్‌
రచయిత హిందూ పత్రిక మాజీ సంపాదకులు