రాజధాని పరిసర ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు, చిన్న, సన్నకారు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. సోమవారం విజయవాడలోని అటవీ శాఖ డిఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్), ఎంసిపిఐ(యు)లతో కలిపి ఆరు వామపక్ష పార్టీల నేతృత్వంలో భారీ ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమంలో విజయవాడ రూరల్, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల నుండి ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో మధు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు పచ్చటి పంట పొలాలను లాక్కోవడం జరుగుతోందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అటవీ భూములను సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న సన్నకారు రైతులను తరిమేసి ఆయా భూములను కార్పొరేట్లు, పారిశ్రామిక వేత్తలు, బాబాలకు కట్టబెట్టేందుకు ప్రయతించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాన్ని పెంచాల్సి ఉండగా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, తక్షణమే చంద్రబాబు సర్కారు రైతుల వద్ద నుండి అటవీ భూములను లాక్కోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో వామపక్షాల నేతృత్వంలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ నాయకులు జెల్లీ విల్సన్ మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో పేదల భూములు లాక్కోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అటవీ భూములను కేటాయించడం ప్రభుత్వం మానుకోవాలన్నారు. సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి జి.సత్యనారాయణ మాట్లాడుతూ, అటవీ భూములను సాగుచేసుకుంటున్న పేదవారిని అదే భూముల్లో కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని, వనసంరక్షణ సమితులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి జి.ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె.రామారావు మాట్లాడుతూ, విజయవాడ రూరల్, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో సాగులో ఉన్న భూములను అటవీశాఖ అధికారులు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు మాట్లాడుతూ, దశాబ్దాలుగా రైతు రుణమాఫీ, డ్వాక్రా, చేనేత రుణమాఫీ చేస్తామని అధికారంలోకొచ్చిన టిడిపి, నేడు ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలు అమల్జేయకుండా ప్రజల జీవితాలతో చెలగాట మాడుతోందని విమర్శించారు.