బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు నితీష్ కుమార్ సారధ్యంలోని లౌకిక మహా కూటమికి తిరుగులేని ఆధిక్యంతో పట్టం కట్టి తమ విలక్షణతను చాటుకోవడం అభినందనీయం. జనం మధ్య చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర మతతత్వ శక్తులను అధికారానికి ఆమడ దూరంలో పెట్టి బుద్ధుడు జన్మించిన గడ్డ వారసత్వాన్ని కొనసాగించడం హర్షణీయం. ఒక విధమైన ఉద్రేక భరిత వాతావరణం మధ్య జరిగిన బీహార్ ఎన్నికలు యావత్ దేశాన్నీ ఆకర్షించడమే కాకుండా నరాలు తెగే ఉత్కంఠ రేపాయి. అందుక్కారణం ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు, ప్రభుత్వానికి పరీక్షగా మారడమే. మోడీ సైతం బీహార్ ఎన్నికలను వ్యక్తిగతంగా తీసుకొని ప్రధాని హోదాలో గతంలో మరెవ్వరూ తిరగనంతగా కాలికి బలపం కట్టుకొని మరీ ఎన్‌డిఎ గెలుపు కోసం ప్రచారం చేశారు. రాష్ట్రంలో 38 జిల్లాలుంటే 24 జిల్లాల్లో 30 సభల్లో పాల్గొని ఓట్లు అభ్యర్ధించినా ఫలితం దక్కలేదు. అంతేనా మతతత్వ ఎజెండాకు పదునుపెట్టి ఓట్లు రాబట్టుకోవడంలో ఆరి తేరినవాడుగా, వ్యూహకర్తగా కమలనాధులే అభివర్ణిస్తున్న అమిత్‌షా ఎత్తులను ఇక ఎంత మాత్రం సాగనివ్వబోమని బీహార్ ప్రజలు ఆయన తలకు బొప్పి కట్టించారు. మోడీ, అమిత్‌షా ద్వయం సంఫ్‌ు పరివారాన్ని వెంటేసుకొని బీహార్‌లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు తొక్కని అడ్డదారే లేదు. భౌగోళికంగా, ఆర్థికంగానే కాక అన్నింటా వెనుకబడి 'బీమార్' స్టేట్స్‌లో ఒకటైన బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ సర్కారు, ఆ రాష్ట్ర ప్రజానీకం ఎప్పటి నుంచో కోరుతుండగా సంవత్సరం నుంచీ పట్టించుకోని మోడీ, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హోదా స్థానంలో ప్యాకేజీని వేలం పాట మాదిరి ప్రకటించి జనాన్ని అవహేళన చేశారు. అంత ఆర్భాటం కనబర్చిన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ కొత్తదేం కాదు. రాబోయే కొన్నేళ్లలో కేంద్రం సాధారణంగా రాష్ట్రానికి ఇచ్చే నిధులన్నింటినీ ఒక చోటకు చేర్చి భారీ అంకెను వల్లె వేశారంతే.
ఎన్నికల ముంగిట మతపరంగా జనాభా లెక్కలు వెల్లడించి ముస్లిం జనాభా పెరుగుతోందని విష ప్రచారం చేశారు. యుపి దాద్రిలో గోమాంసం తిన్నాడన్న అభియోగంపై అఖ్లాక్ హత్య, హర్యానాలో దళిత కుటుంబంపై దాష్టీకం, రిజర్వేషన్లపై పునఃసమీక్ష, వంటి వివాదాస్పద అంశాలు, సాధ్విలు, స్వాముల ఉద్రేకపూరిత వ్యాఖ్యలను తెర మీదికి తెచ్చి ఉద్రిక్తతలను మండించి ఆ మంటల్లో ఓట్లు ఏరుకునేందుకు ఒడిగట్టిన ఘాతుకాలకు అంతే లేదు. ఇంత చేసినా బిజెపికి, మత శక్తులకు బీహార్ ప్రజలు కీలెరిగి వాత పెట్టి విజ్ఞత చాటుకున్నారు. సమాజంలో చీలికలు పెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టారు.
ఏడాదిన్నర క్రితం సార్వత్రిక ఎన్నికల సమయంలో సమ్మోహన శక్తిగా, వికాస పురుషునిగా, నమో సునామీగా కాషాయదళంచే కీర్తించబడిన మోడీ ఆకర్షణ అంతలోనే ఎందుకు వికర్షించిందో కమలం పార్టీ గుర్తెరగాలి. పది నెలల క్రితం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మోడీ పరివారం ఘోర పరాభవం చవి చూసింది. అప్పుడూ ఇలాగే మతమౌఢ్యం మూర్తీభవించిన నేతల అవాకులు చెవాకులకు గట్టి గుణ పాఠం నేర్పారు. నిన్న యూపిలో స్థానిక ఎన్నికల్లో బిజెపి భంగపడింది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ పరిధిలో బిజెపి అడ్రస్ గల్లంతైంది. ఆదివారం వెలువడ్డ బీహార్ ఫలితాలూ చెంపపెట్టయ్యాయి. మొత్తం 243 స్థానాల్లో జెడి(యు) కూటమి 41.9 శాతం ఓట్లతో 178 సీట్లు కైవసం చేసుకోగా ఎన్‌డిఎకి 34.1 శాతం ఓట్లతో 58 స్థానాలు మాత్రమే వచ్చాయి. రెండు కూటముల మధ్య ఎనిమిది శాతం ఓట్ల తేడా ఉంది. లెఫ్ట్‌కు మూడు స్థానాలు రావడం హర్షణీయం. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో 40 లోక్‌సభ సీట్లకు ఎన్‌డిఎ 31 గెలిచింది. అప్పుడు 174 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత కనబరిచిన ఎన్డీఎ ఇప్పుడు 58కి దిగజారింది. ఆ మేరకు ఆర్‌జెడి, కాంగ్రెస్ లాభపడ్డాయి. జెడి(యు) పార్టీకి గతం కంటే తక్కువ సీట్లొచ్చినా నితీష్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
తామొస్తే ప్రజలకు 'అచ్చేదిన్' అని మోడీ ఊదరగొట్టగా 'అచ్చేదిన్' జన బాహుళ్యానికి కాదు స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకని పదిహేడు నెలల పాలనలో తేలిపోయింది. అభివృద్ధి మంత్రం పని చేయడం లేదు. మేక్ ఇన్ ఇండియా నినాదం బక్కెట్ తన్నింది. ప్రజలపై భారాలు అంతకంతకూ పెరుగుతుండగా ధనవంతులకు ఇబ్బడిముబ్బడిగా రాయితీలు కైంకర్యమవుతున్నాయి. ఈ ధోరణికి మతతత్వం తోడై ప్రజలను నిట్ట నిలువునా చీల్చి విద్వేషాలు పెంచుతున్నాయి. దేశంలో నెలకొన్న ఈ సంక్లిష్ట, సంక్షోభ పరిస్థితుల్లో బీహార్‌లో ఎన్‌డిఏను ఓడించి 'అసహన'వాదులకు చావుదెబ్బ కొట్టడం శుభ పరిణామం. ఎగ్జిట్‌పోల్స్‌ను తల్లకిందులు చేసి బీహార్ ప్రజలిచ్చిన విస్పష్ట తీర్పు లౌకిక ప్రజాతంత్ర శక్తులకు త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఊతం ఇస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం వారసత్వంగా కలిగిన జాతి మనోభావాలను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. మతతత్వ రాజకీయాలకు చోటు లేదని సందేశమిస్తున్నాయి. లౌకిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం ఆవస్యకతను నొక్కి చెబుతున్నాయి. నితీష్-లాలు జోడీ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా లౌకిక మహా కూటమి నడుచుకోవాలి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.