మత నియంతృత్వం దిశగా దేశం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌యస్‌యస్‌) హిందూత్వ ప్రచారానికి కేంద్రంగా ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ స్థితిలో మనం ఈ కింది విధంగా ప్రశ్నించుకోవచ్చు. ''మనదేశం హేతుబద్ధత, తార్కికతతో పాటు ప్రజాస్వామ్యం నుంచి కూడా దూరంగా వెళ్తూ, హిందూ మత నియంతృత్వం వైపు ప్రయాణిస్తున్నదా?'' దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తున్నది. ప్రజాస్వామ్యం, తర్కబద్ధత, హేతు వులపై ఆధారపడిన సమాజంలో భిన్నాభి ప్రాయాలను వ్యక్తం చేయటానికి అవకాశాలు ఉండాలి. హేతుబద్ధమైన భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించాలి. ప్రస్తుతం భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానంలో భాగంగా, హేతుబద్ధమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికున్న అవకాశాలు రోజురోజుకు కుంచించుకు పోతున్నాయి. ఫలితంగా ఏ విధమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినా సహించలేని స్థితి పెరుగుతున్నది. హిందూ దేవతల పట్ల అమర్యాద చూపినందుకు, కుల అసమానతలను గురించి రాసి నందుకు కర్ణాటకలో దళిత యువకుడైన విద్యార్థి, రచయిత హుచంగి ప్రసాద్‌ను అక్టోబరు 22వ తేదీన కొందరు అపహరించుకుపోయి కొట్టారు. హిందూ సమాజానికి కుల వ్యవస్థ అవమానకరంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తీవ్రమైన పట్టుదలతో దానిని అమలు చేస్తున్నారు. దేశంలో దళి తులపై పెరుగుతున్న నేరాలు, గత నెలలో ఫరీదాబాద్‌లో ఒక గుంపు వారి ఇంటిపై దాడిచేసి ఇద్దరు దళిత బాలలను సజీవ దహనం చేసిన భయంకరమైన ఘటనలు దీనిని స్పష్టం చేస్తున్నాయి.
తమకున్న భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయటానికి సాహసించినందుకు ప్రఖ్యాతి చెందిన గ్రీన్‌పీస్‌ లాంటి సంస్థలు, తీస్తా సెతల్వాద్‌ లాంటి వ్యక్తులపై హింసకు పాల్పడటంతో పాటు, కేసులు బనాయిస్తున్నారు.
తర్కవిరుద్ధతకు ప్రోత్సాహం
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఎ(హెచ్‌)ను అనుసరించి శాస్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, అన్వేషణ, సంస్కరణల దృక్పథంతో వ్యవహరించటం ప్రతి వ్యక్తి బాధ్యత. తర్కబద్ధత, హేతుబద్ధమైన శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించటానికి ప్రస్తుతం ప్రభుత్వమే పెద్ద ఆటంకంగా ఉన్నది. శాస్త్రాభివృద్ధి పట్ల గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇంత అవగాహనా లోపంతో, చిన్న చూపుతో వ్యవహరించలేదు. ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాపై ఇది తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తుంది.
మన గతాన్ని గురించి మూర్ఖత్వంతో కూడిన వాదనలు చేస్తున్నారు. పురాతన కాలంలోనే మనకు గ్రహాంతర ప్రయాణాలు చేసే పెద్ద విమానాలు ఉండేవని, మానవ శరీరానికి ఏనుగు తలను అతికించగల సామర్థ్యం ఉందని ప్రచారం చేస్తున్నారు. పురాణ గాథలపై ఆధారపడిన నమ్మకాలకు, పౌరాణిక వ్యక్తులకు, దేవుళ్ళకు అనుగుణంగా చరిత్రను వక్రీకరిస్తూ, వాటిని చారిత్రక వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. తర్కబద్ధతను, లౌకికవాదాన్ని మాత్రమే కాక, చట్టాన్ని కూడా అంగీకరించని సంస్థల మద్దతుతో దేశవ్యాప్తంగా హిందూత్వ ఎజెండాను అమలు చేయటానికి ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో బిజెపితో కలిసి అధికారంలో ఉన్న శివసేన పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి కుర్షీద్‌ మహమ్మద్‌ కసూరి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించటానికి పూనుకున్న అబ్జర్వర్‌ రీసెర్చి ఫౌండేషన్‌ అధ్యక్షుడు సుధీంద్ర కులకర్ణి ముఖంపై నల్ల సిరా పోశారు. పాకిస్థానీ సంగీత విద్వాంసుడు గులాం ఆలీ సంగీత కచేరీని ముంబాయిలో జరగకుండా నిరోధించారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారులతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల సమావేశం జరుగుతుండగా, సమావేశం జరుగుతున్న భవనాన్ని చుట్టుముట్టడం ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వేచ్ఛాప్రియులపైనా, దళితులపైనా దాడులు జరపటంతో పాటు మైనారిటీలను కూడా రెండవ తరగతి పౌరులమని భావించే విధంగా చేస్తున్నారు. చర్చీలపై దాడులు చేస్తున్నారు. ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఈ మధ్యనే ఢిల్లీకి సమీపంలోని దాద్రిలో వడ్రంగిగా పనిచేస్తున్న మహమ్మద్‌ అక్లాఖ్‌ను గొడ్డుమాంసం తిన్నాడనే అనుమానంతో కొట్టి చంపారు. ఆయన కుమారుణ్ణి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనను బిజెపి శాసనసభ్యులు సంగీత్‌ సోమ్‌, సాక్షి మహరాజ్‌లు బలపరిచారు.
ముస్లిం జనసంఖ్య హిందువుల జనసంఖ్య కన్నా వేగంగా పెరగకుండా నిరోధించేందుకు ఐదుగురు, అంత కన్నా ఎక్కువ మంది పిల్లలను కనే హిందువులకు బహుమ తులు అందజేస్తామని ఒక హిందూ సనాతనవాద సంస్థ ప్రకటించింది. గాంధీని హత్య చేసిన గాడ్సే వర్ధంతి రోజైన నవంబరు 15వ తేదీని అమరవీరుల దినంగా జరుపుకోవా లని హిందూ మహాసభ ఈ మధ్యనే ప్రకటించింది.
అత్యవసర సేవల ప్రయివేటీకరణ
ఏ ఉత్తమ ప్రజాస్వామ్య దేశంలోనైనా 12వ తరగతి వరకు విద్యను, (18వ సంవత్సరం వరకు), ఆరోగ్య పరిరక్షణను ప్రభుత్వమే నిర్వహించాలి. భారతదేశంలో విద్య, వైద్యాలను అంతకంతకు ఎక్కువగా ప్రయివేటీ కరించటం, వాణిజ్యీకరించటం చేస్తున్నారు. వాటిలో కేవలం ధనికులు మాత్రమే ప్రవేశించగలిగేలా చేస్తున్నారు. దీన్ని కూడా నియంతృత్వంలో భాగంగా పరిగణించాలి. దేశంలో ఉన్నత స్థాయి పదవులను భర్తీ చేసే సందర్భంలో శక్తిసామర్థ్యాల కన్నా రాజకీయ ప్రయోజనాలను, ఆర్‌యస్‌ యస్‌తో వారికున్న సంబంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తు న్నారు. దీనికి ఒక ఉదాహరణ గజేంద్రచౌహాన్‌ను ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అధ్యక్షునిగా నియమిం చటం. ఈ చర్య ఆ సంస్థ విద్యార్థులు, సినీరంగ ప్రముఖుల నుంచి తీవ్ర నిరసనలకు కారణమైంది. 
ప్రస్తుత ప్రభుత్వ పనితీరులో సాంస్కృతిక అసహనం ప్రధానాంశంగా ఉంది. మనం ఏమితినాలో, ఏ బట్టలు కట్టుకోవాలో, ఎవరిని ప్రేమించాలో, ఏ పుస్తకాలు చదవాలో, ఏ సినిమాలు చూడాలో ప్రభుత్వమే నిర్ణయిస్తా నంటున్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరించలేదు. పురాతన భారత సమాజంలో గొడ్డు మాంసం తినటానికి అనుమతించారనే విషయాన్ని అంగీకరించటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆయుర్వేద గ్రంథం చరక సంహితలో గొడ్డుమాంసం ప్రయోజనాలను గురించి ఈ విధంగా చెప్పారు. ''అధిక వాయువు, కడుపులో మంట, వివిధ కారణాల వల్ల తరచుగా వచ్చే జ్వరం, పొడిదగ్గు, ఆయాసం, అధిక శారీరక శ్రమచే స్తూ తగినంత ఆహారం తీసుకోలేక శారీరక బరువు కోల్పో యి బాధ పడుతున్నవారికి గొడ్డుమాంసం ఎక్కువ ప్రయో జనం కలిగిస్తుంది''. ఏ మతం కూడా మరో మతం కన్నా గొప్పది కాదని, అన్ని మతాలూ శాస్త్రీయ దృక్పథానికి, హేతు బద్ధతకు వ్యతిరేకంగా ఉండే అంశాలను కలిగి ఉంటాయని హిందూత్వ సిద్ధాంతకారులు అర్థం చేసుకోలేరు.
అన్ని నిరంకుశ ప్రభుత్వాలూ విజ్ఞానాభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నాయని చరిత్ర మనకు స్పష్టం చేస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వం 300 మంది ప్రముఖులు ప్రభుత్వం నుంచి తాము పొందిన అవార్డులను తిరిగి ఇవ్వటంపై ఆత్మవిమర్శ చేసుకోకపోగా, వీరిని జాతి వ్యతిరేకులని, అసమ్మతిని రెచ్చగొట్టేవారని ముద్రవేయటం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు.
పైన ఉదహరించిన అంశాలన్నీ అక్కడక్కడా జరుగుతున్న కొన్ని పాక్షిక సంఘటనలు మాత్రమే. భారతదేశ మౌలిక ప్రజాస్వామిక వ్యవస్థను నాశనం చేసి, హిందూ మత నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే బిజెపి, ఆర్‌యస్‌యస్‌ కూటమి ప్రధాన లక్ష్యమని రుజువు చేసేందుకు విస్తారమైన సాక్ష్యాలు ఉన్నాయి. వృత్తిపరమైన జీవశాస్త్రజ్ఞునిగా జీవశాస్త్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని ఉదహరించి, నా వ్యాసాన్ని ముగిస్తాను. విస్తరణ, అభివృద్ధికి వైవిధ్యం దోహదపడితే, ఏకత్వం వినాశనానికి దారితీస్తుంది. భారతదేశ గొప్ప సంపద ప్రతి ప్రాంతంలోనూ విస్తారంగా ఉన్న వైవిధ్యంలో ఉంది. భారతదేశం హిందూ మతోన్మాద నియంతృత్వ దేశంగా మారకుండా ఉండాలంటే మనం ఆచరణలో ఈ వైవిధ్యాన్ని గౌరవించటాన్ని నేర్చుకోవాలి.
- - పుష్ప యం భార్గవ