మరో 'థర్మల్‌' కుంపటి

 'మాకొద్దీ తెల్లదొరతనం/ దేవా, మా ప్రాణాలను త్రుంచి/మా మానాలను హరియించే/మాకొద్దీ తెల్ల దొరతనం' అన్న ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ పుట్టిన గడ్డ మీదే జపాన్‌ కంపెనీ సుమిటోమి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సిక్కోలు భూమి, ఆస్ట్రేలియా బొగ్గు, జపాన్‌ వారి శాస్త్ర సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలను అభివృద్ధి చేస్తుందట! ఇప్పటికే సోంపేట, కాకరాపల్లిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గత ప్రభుత్వం ముగ్గురేసి చొప్పున ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. అయినా, పాలకులు వెనక్కి తగ్గడం లేదు. ఆరు థర్మల్‌ ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి తోడు 'అణు విద్యుత్‌' కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇన్ని ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఒక్క యూనిట్‌ను కూడా ఈ ప్రాంతానికిగానీ, ఈ జిల్లాకుగానీ కేటాయించరు. ఇతరులకు అమ్ముకుంటారు.
             
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో కుశెంపోలవలస, దీర్ఘాసి, గొల్లలవలస, సంతలకీëపురం, గంగివలస, చెల్లాయివలస, పిరువాడ, చీడివలస, గాతలవలస, వైబి వలస (యాట్లబసివలస) పంచాయతీలను థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రభావిత పంచాయతీలుగా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో సన్యాసిరాజుపేట, కోరాడ లచ్చయ్యపేట, ఓదుపాడు, చీడివలస, కొండలక్కివలస గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయాల్సిందేనని, తోడాడ 50 శాతం వరకూ పోతుందని ఒక అంచనా. పై గ్రామాల పరిధిలో సుమారు 1,050 ఎకరాల భూమిలో దాదాపు 300 ఎకరాలు డి-పట్టా భూమి, 450 ఎకరాలు కొండపోరంబోకు ఉన్నాయి. వీటిని రైతులు సాగు చేస్తున్నారు. మిగతా 300 ఎకరాలు కూడా రైతుల సాగులో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక్కొక్కటీ వెయ్యి మెగావాట్లు సామర్థ్యంగల నాలుగు యూనిట్ల స్థాపనకు గత సంవత్సరం నవంబర్‌లో సుమిటోమి కార్పొరేషన్‌ ముందుకొచ్చింది.
ఇందుకు సంబంధించి ఆ సంస్థకు, ఎపి జెన్‌కోకు ఎంఒయు జరిగింది. సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌గా దీన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే అందులో నుంచి వచ్చే బుగ్గిని కూడా శుద్ధి చేసే టెక్నాలజీలను ఉపయోగిస్తారట. ఈ ప్లాంట్‌కు సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. పైన తెల్పిన 1,050 ఎకరాలతో ఆగకుండా మరో 2,500 ఎకరాలను కూడా సమీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఏ భూమినైతే ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిందో ఆ కొండ ప్రాంతంపై గొర్రెలు, మేకల పెంపకందారుల కుటుంబాలు 400, కల్లుగీత కార్మిక కుటుంబాలు 200లకు పైగా, రాళ్లు కొట్టే కుటుంబాలు వెయ్యి వరకూ ఉన్నాయి. ఈ కుటుంబాల వారితో పాటు పశువుల పెంపకందారులు కూడా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం ఉన్న సమయం ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకూ పైన తెలిపిన ఎనిమిది పంచాయతీలతో పాటు రాళ్లపాడు, దీర్ఘాసి, ఉర్జాం, డోల, తదితర పంచాయతీల్లోని పశువులు, గొర్రెలు, మేకలకు కూడా స్థావరంగా ఉపయోగపడుతోంది. వీరితోపాటు చీడివలస గ్రామానికి చెందిన 120 కుటుంబాల కుమ్మరి వృత్తిదారులకు ఈ కొండ నుంచే మట్టి, కుండలు కాల్చేందుకు వంట చెరుకు లభిస్తోంది.

                   ఈ కొండ జాగీరు భూమిలో చాలా మంది రైతులు తరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఈ భూముల్లోనే వంశధార ఇరిగేషన్‌ కాలువ కూడా ఉంది. ఈ వ్యవసాయదారులందరినీ ఖాళీ చేయించేందుకు కలెక్టర్‌ సహా జిల్లా, మండల స్థాయి అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టును ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం కోసం పంపినట్లు జెన్‌కో వర్గాల సమాచారం. ఈ ప్లాంట్‌కు జైకాతో పాటు మరికొన్ని బహుళపక్ష ఆర్థిక సంస్థలు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. జైకా 0.3 శాతం వడ్డీతో 40 ఏళ్ల గడువుతో రుణం ఇస్తుందని చెబుతున్నారు. అయితే జైకా సిఫార్సు చేసే కంపెనీల నుంచే పవర్‌ ప్లాంట్‌ పరికరాలు కొనాలని షరతు విధించింది. ఖరీదైన యంత్ర పరికరాలు, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, క్యాపిటల్‌ కాస్ట్‌ టు నిర్వహణ వల్ల వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఈ భారం అంతిమంగా వినియోగదారునిపై పడుతుంది. హర్యానాలో ఇదే తరహా ప్లాంటు ఏర్పాటును సుమిటోమి కంపెనీ గ్లోబల్‌ టెండర్ల ద్వారా సాధించుకోగా, పోలాకిలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ఏకపక్షంగా కట్టబెట్టింది. ఈ ప్రాంత ప్రజలు అమాయకులని కాబోలు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలను 'పీపుల్స్‌ మానిటరింగ్‌' కన్వీనర్‌ తిమ్మారెడ్డి తప్పు పట్టారు. ఇండియా కంపెనీలు గ్లోబల్‌ టెండర్ల ద్వారా ఇతర దేశాల్లో పవర్‌ ప్లాంట్లు నిర్మిస్తుంటే, ఎపి ప్రభుత్వం మాత్రం విదేశీ మారక ద్రవ్యం భారం పడే జపాన్‌ కంపెనీని పోలాకి ప్లాంట్‌కు ఎంచుకోవడం విచారకరం.
సోంపేట, కాకరాపల్లిలో (పోలాకి ప్లాంట్‌కు 15 కిలోమీటర్ల దూరం) ప్రజా నిరసన చవిచూసినా భూ సమీకరణే ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం ముందుకు తెస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ, డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌, డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ చేయాల్సి ఉన్నా ఈ నిబంధలను పాటించడం లేదు. చట్టానికి విరుద్ధంగా నిర్బంధంగా ఆ భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్రంలో రోజుకు విద్యుదుత్పత్తి దాదాపు 14 వేల మెగావాట్లు. కానీ, రాష్ట్రంలో వినియోగించుకుంటున్నది సుమారు 3,940 మెగావాట్లు. శ్రీకాకుళం జిల్లా అవసరాలకు వినియోగిస్తున్నది 350 మెగావాట్లు. రాష్ట్రంలో రోజుకు దాదాపు 9,710 మెగావాట్ల మిగులు విద్యుత్తు ఉంది. మరో నాలుగు వేల మెగావాట్లను ఉత్పత్తి చేసి బహుళజాతి కంపెనీలకు అమ్ముకోవడమే సుమిటోమి సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు మర్చంట్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులను, విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజాహక్కుల సంఘాలు మద్దతు పలకాలి. సోంపేట పోరాట ఫలితంగా అక్కడ థర్మల్‌ ప్రాజెక్టు ఆగింది. ఆ పోరాట స్ఫూర్తితో పోలాకి థర్మల్‌ వ్యతిరేక ఉద్యమం ఊపందుకోవాలని కోరుకుంటున్నాం.
(వ్యాసకర్త సిపిఎం శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు)
- తమిరి తిరుపతిరావు