మున్సిపల్‌ సమ్మె పట్ల దళిత సంఘాల వైఖరేంటి?

 రాష్ట్రంలో గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు, మున్సిపల్‌ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించమని కోరుతూ సమ్మె చేస్తున్నారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదించిన తరువాత, పలుమార్లు అధికారులతో చర్చలు జరిగిన తరువాత అధికారుల, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. మున్సిపల్‌ ఉద్యోగులు సంప్రదాయకంగా దళిత కులానికి చెందినవారే. ఒకప్పుడు నూటికి నూరు శాతం దళితులే పారిశుధ్య కార్మికులుగా పనిచేసేవారు. కానీ ఇటీవల ఇతర కులాల నుంచి కొంతమంది వేరే బ్రతుకుదెరువు లేక పారిశుధ్య కార్మికులుగా వస్తున్నారు. వీరు గనుక పారిశుధ్య పనులు చేయకపోతే పట్టణాల్లో చెత్త పేరుకుపోయి, కుళ్లిపోయి సూక్ష్మజీవులు విజృంభించి అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడానికి డబ్బు ఖర్చుచేసే కన్నా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే కార్మికుల జీవన పరిస్థితులు కొంతవరకు మెరుగవుతాయి. ప్రజలు అంటురోగాల బారి నుంచి బయటపడతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ దళితజాతి ఉద్ధరణకు అనేక పోరాటాలు చేశారు. దళితులు ఆత్మాభిమానంతో తల ఎత్తుకొని జీవించాలని పదే పదే చెప్పారు. కానీ నేటికీ ఆయన కన్న కలలు నెరవేరలేదు. అన్ని రకాల శ్రమలతో పోలిస్తే అత్యంత నికృష్టమైన శ్రమ పారిశుధ్య కార్మికుల చేస్తున్న పనే. తన కడుపున పుట్టినబిడ్డ మలమూత్రాలను తల్లి ఎత్తి పారబోసే సందర్భంలో విసుగుదల ప్రదర్శించడం అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ నాగరికత ఎంతగానో అభివృద్ధి చెందిన ఆధునిక సమాజంలో ఇప్పటికీ మలమూత్రాలను నెత్తినబెట్టుకొనే దౌర్భాగ్యపు పరిస్థితి దేశంలో ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటే యావత్‌ భారతజాతి సిగ్గుపడాలి. మన రాష్ట్రంలో మలమూత్రాలు శుభ్రంచేసే పరిస్థితి కొంతవరకు తొలగిపోయినా రాత్రింబవళ్ళు ఎండనకా, వాననకా చెత్తను తుడిసి గంపల్లోకెత్తి నెత్తినబెట్టుకుని మోసే పరిస్థితి నేటికీ పోలేదు. డ్రైనేజీ, మురికి కాలువల్లోకి దిగి కాలుష్యాన్ని చేతులతో ఎత్తివేసే దరిద్రపు బ్రతుకు ఇంకా తొలగనేలేదు. ఇంతకన్నా నరేంద్రమోడీ చెబుతున్న స్వచ్ఛ భారత్‌, చంద్రబాబు చెబుతున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ ఏముంటుంది? ఇంతగా జాతికి శుభ్రం చేస్తున్నవారు దళితులు, బలహీన వర్గాల వారే. ఇటువంటి వీరి కష్టం పట్ల ఇంగితజ్ఞానం ఉన్న ఎవరైనా వారి సమస్యలను తక్షణం పరిష్కరించడానికి ముందుకు వస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అటువంటి ఇంగితజ్ఞానాన్ని ప్రదర్శించలేకపోతున్నది.
రాష్ట్రంలో దళిత సంఘాలు చాలా సమస్యల పట్ల స్పందిస్తుంటాయి. మాల మహానాడు, మాదిగ దండోరా, రెల్లి కుల సంఘాల నాయకులు సమస్యలపై ప్రకటనలిస్తూ కార్యక్రమాలు చేస్తుంటారు. దళిత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు. కానీ పారిశుధ్య కార్మికులు దాదాపు అందరూ దళిత, గిరిజనులే కదా! అటువంటి దళితులు ఎంతగా శ్రమిస్తున్నా పొట్టగడవడంలేదని జీతాలు పెంచమని పోరాడుతూ ఉంటే దళిత సంఘాలు ఎందుకు స్పందించడంలేదు? సామాజిక న్యాయం కోసం పోరాడతాం, అంబేద్కర్‌ ఆశయ సాధనకై పోరు సల్పుతాం అనే దళిత సంఘాల నాయకులకు మున్సిపల్‌ కార్మికులు దళితులేనని, వారు చేస్తున్నది తమ ఆకలి తీర్చుకోవడానికి పోరాటమేనని దళిత నాయకులకు తెలియదా? వారు హుందాగా బ్రతకాలంటే శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కకుండా సామాజికంగా, ఉన్నతంగా జీవించలేరు కదా! మున్సిపల్‌ కార్మికులకు ఆత్మగౌరవం, సామాజిక న్యాయం దక్కాలంటే ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడటానికి ఆందోళన తప్ప మరొకమార్గం లేదు కదా! ''డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఏమని చెప్పారు? మేకలను బలిస్తారు కానీ సింహాలను బలివ్వరు. మీ హక్కుల సాధనకై సింహాల్లా పోరాడండి అని ఉద్బోధించారు కదా!'' వీరు పోరాడకుండా, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా సామాజిక న్యాయం దక్కుతుందా? దళిత సంఘాల నాయకులు, మేధావులు సానుకూలంగా దీన్ని అర్థం చేసుకోవాలి. సామాజిక పోరాటం ముందుగా చేయాలా? ఆర్థిక పోరాటం ముందుగా చేయాలా? అనే చర్చ నేటికీ దళిత మేధావులు చర్చిస్తుంటారు. సామాజిక పోరాటమే ముందుగా నిర్వహించాలని వాదిస్తుంటారు. మరి మున్సిపల్‌ కార్మికుల సమ్మె వెనుక అంతర్భాగంగా సామాజిక న్యాయం కోసం చేసే పోరాటం దళిత సంఘాల నాయకులకు కనిపించడం లేదా? సామాజిక న్యాయం కోసం పోరాడాలన్నా కడుపులో ముద్ద పడకుండా పోరాడలేరు కదా? కడుపు నిండిన వ్యక్తే సామాజిక న్యాయం కోసం పోరాడగలడు. అందుచేతనే మనదేశంలో నేటికీ దళితులపై ఎన్నో ఘోరకృత్యాలు జరుగుతున్నా ఎదురు తిరగకుండా మౌనంగా భరించడానికి కారణం ఇదే. ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకొని దళిత సంఘాల నాయకులు, మేధావులు సానుకూలంగా స్పందించాలి. వారుచేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపి ఆందోళనలో కలిసిరావాలి.
ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్‌సిని అమలుచేయమని పదే పదే డిమాండ్‌ చేశారు. పిఆర్‌సి అమలుచేయకపోతే పోరాటానికి సన్నద్ధమౌతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనివార్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం వేతనం పెంచవలసి వచ్చింది. ఆర్టీసీ కార్మికులు కూడా జీతాలు పెంచాలని మొరపెట్టుకుంటే ఏవో సాకులు చెప్పి జీతాలు పెంచడం సాధ్యంగాదని ప్రభుత్వం, ఆర్టీసీ ఎండి పదే పదే ప్రకటించాడు. పైగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని, జీతాలు పెంచితే ఆర్టీసీకి మరింత భారం అవుతుందని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగి ఆ సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికి ఉద్యమం ఉధృతం అవుతున్న పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం జీతాలు పెంచుతూ కార్మిక నాయకులతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. పై రెండు సమ్మెలకు సోదర కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల మద్దతు ద్వారానే సాధ్యమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించినా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మెను ఎందుకు పరిష్కరించడం లేదు? వీరు దళితులనే చులకన భావం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీ నాయకులకు ఉంది కాబట్టే సమస్యల పరిష్కారానికి పూనుకోవడంలేదని అనుకోవాల్సి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అన్ని రాజకీయ పార్టీలూ తప్పుపడుతున్నాయి. అయినా మున్సిపల్‌ మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ స్పందించడంలేదు. పైగా పోరాడుతున్న కార్మికులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు దాడులుచేసి దారుణంగా కొడుతున్నారు. మహిళలని చూడకుండా వీరిపై కూడా దాడిచేస్తున్నారు. కులం పేరుతో పచ్చిగా బండబూతులు తిడుతున్నారు. మహిళలను కులం పేరుతో తిడుతున్నా తెలుగుదేశం నాయకులపై పోలీసులు ఎందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసులు బనాయించడం లేదు? అధికార పార్టీకి ఒక న్యాయం, మిగిలినవారికి మరొక న్యాయమా? ఇంత దుర్మార్గం మరేదైనా ఉంటుందా? గతంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెచేస్తున్న సందర్భంలో మహిళా కండక్టర్లపై తెలుగుదేశం నాయకులు ఈ విధంగానే చేయిచేసుకున్నారు. వీరికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతున్నది.
మున్సిపల్‌ కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. మున్సిపల్‌ రంగంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు 10వ పిఆర్‌సి సిఫార్సుల ప్రకారం కనీస వేతనం డిఎతో కలిపి రూ.15,432లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వారి నైపుణ్యాన్ని బట్టి స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ జీతాలు ఇవ్వాలని, ఎన్‌ఎంఆర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇవేమీ ప్రభుత్వ తీర్చలేని సమస్యలు కాదే? రాష్ట్రంలో సుమారు 40 వేల మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. వీరికి వీరి పనిని బట్టి రూ.1,600 మొదలుకొని రూ.8,000 వరకు జీతాలు ఇస్తున్నారు. వీరు కోరుతున్నట్టు జీతాలు పెంచితే నెలకు రూ.28 కోట్లు, సంవత్సరానికి రూ.336 కోట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారమేమీ కాదు. మున్సిపల్‌ కార్మికులు దళితులు కాబట్టే. వీరంటే చులకనభావం ఉన్నది కాబట్టే సమస్య పరిష్కారం చేయడంలేదని అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా సమస్యలు పరిష్కరిస్తే అదనంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్కపైసా కూడా ఇవ్వరు. స్థానిక సంస్థల ఆదాయం నుంచే ఇస్తారు. మరి ప్రభుత్వ ఖజానాపై భారం లేనప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి స్పందించరు? ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇప్పుడున్న నెలకు లక్ష రూపాయలు సరిపోవని రెండు లక్షలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది కదా! మరి మున్సిపల్‌ కార్మికుల జీతాల పెంపుదల ఏపాటిది? కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి డబ్బులు లేవంటారు. కానీ మన రాష్ట్రంలో పెట్టుబడిదారులకు చంద్రబాబునాయుడు రూ.2,100 కోట్లు రాయితీలిచ్చారు కదా! చంద్రన్న కానుక పేరుతో రూ.350 కోట్లు, రంజాన్‌ తోఫా పేరుతో రూ.200 కోట్లు, ప్రస్తుతం జరుగుతున్న పుష్కరాలకు రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు కదా! పుష్కరాలకు పెడుతున్న ఖర్చు గోదావరిలో పోయడమే కదా. మనుషుల జీవితాలను నిలబెట్టడం కంటే చంద్రబాబు ప్రచార ఆర్భాటానికే వేల కోట్లు ఖర్చుబెడుతున్నారు. ఆయన సింగపూర్‌, జపాన్‌ దేశాలు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చుకావడం లేదా? ఇదంతా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామని చంద్రబాబు చెప్పగలరా?
మున్సిపల్‌ కార్మికులు పోరాడుతూ సమస్య పరిష్కారానికి అందరి సహకారాన్నీ కోరుతున్నారు. వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు స్పందించి సమ్మెకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా అండదండలందిస్తామని ప్రకటించారు. ఈ సమ్మె మరింత ఉధృతం కాకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వెంటనే పరిష్కరించాలి.
- దడాల సుబ్బారావు 
(వ్యాసకర్త కెవిపియస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు)