
2015 సెప్టెంబరు 2
దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు మేం వ్యతిరేకం అని కార్మికవర్గం చాటిచెప్పింది. నేడు దేశవ్యాపితంగా అఖిలభారత సమ్మెలో విశాఖనగర కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేసింది.
నేడు విశాఖనగరంలో తెల్లవారి జామున 5 గంటలకే ఆటో కార్మికులు బంద్‌ను నిర్వహించడంతో బంద్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో పూర్తిగా సమ్మె జరిగింది. చివరకు ప్రైవేట్ గంగవరం పోర్టులో కూడా కార్మికులు సమ్మెలో పాల్గొని యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిబడ్డారు. ముఠా, ఆటో, బిల్డింగ్, తోపుడుబండ్లు, జివిఎంసి పారిశుధ్యకార్మికులతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌రంగంలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు పెద్దఎత్తున సమ్మెచేసారు.
ఈ సమ్మె సందర్భంగా నగరంలో జగదాంబ వద్ద గల సిఐటియు కార్యాలయానికి వందలాది మంది కార్మికులు ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. అక్కడ నుండి సరస్వతీ పార్కు, డాబాగార్డెన్, ఎల్.ఐ.సి, ఆర్టీసి కాంప్లెక్స్ మీదుగా జివిఎంసి గాంధీ బొమ్మవద్దకు చేరుకుని సభ ముగిసేవరకు క్రమశిక్షణతో పాల్గొన్నారు.
సమ్మె సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్.నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ మంచి రోజులు తెస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ, చంద్రబాఋ కార్మికులకు కాళరాత్రులు చూపిస్తున్నారని అన్నారు. బ్రిటీష్ పాలనా కాలం నుండి భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టపరమైన హక్కులన్నీ కారాస్తున్నారు. మరలా కార్మికులను కట్టుబానిసలుగా యజమానుల దోపిడీకి బలి చేస్తున్నారు.
బ్రిటీష్ పాలకులపై భారత కార్మిక వర్గం వీరోచితంగా పోరాడిరది. అశేష త్యాగాలు చేసింది. 1926 సంవత్సరంలోనే ఏడుగురితో సంఘం పెట్టుకునే హక్కు సాధించింది. 1947 పారిశ్రామిక వివాదాల చట్టంతో ఉద్యోగ భద్రత సాధించింది. కార్మికుడు తప్పు చేసినట్లు రుజువైతే తప్ప ఉద్యోగం నుంచి తీసివేసే హక్కు యజమానికి లేకుండా పోయింది. స్వాతంత్య్రానంతరం పెన్షన్, కార్మిక భవిష్యనిధి (పిఎఫ్), ఇఎస్‌ఐ చట్టం, బోనస్‌చట్టం ఇలా అనేక చట్టాలను కార్మికవర్గం పోరాడి సాధించుకున్నది.
నేడు మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు.... కార్మికుడి ఉద్యోగ భద్రతకు ముప్పుతెస్తున్నది. కార్మిక సంఘాలు సమిష్టిగా బేరమాడే హక్కును లేపేసి యజమాని ఇచ్చింది పుచ్చుకోమంటున్నది. మహిళలు సైతం రాత్రిపూట పని చేయాలని నిర్ణయించింది. రోజుకు 8గంటలకు బదులు 12గంటలు పని చేయాలంటున్నది. సంఘం పెట్టుకునేందుకు హక్కు లేకుండా చేస్తున్నది. అన్ని సమ్మెలను చట్ట విరుద్దం చేస్తున్నది. సమ్మె చేసిన కార్మికులపై 20వేల నుంచి 50వేల వరకు జరిమానా విధిస్తానంటున్నది. 300మంది కార్మికులు లోపున్న ఫ్యాక్టరీలు మూసి వేయడానికి, కార్మికులను తీసివేయడానికి యజమానికి స్వేచ్ఛనిచ్చేసింది ఫ్యాక్టరీల్లో లేబర్ చట్టాలు అమలును ఇన్‌స్పెక్షన్ చేసే అధికారం లేబర్ డిపార్టుమెంట్‌కు తీసేసింది. బ్రిటిష్ నాటి పరిస్థితులను మోడీ ప్రభుత్వం పునరుద్ధరించి కార్మికులను కట్టుబానిసలుగా మార్చేస్తున్నది.
గనులు, ఖనిజాలు,భూమి,నీరు, ప్రభుత్వ పరిశ్రమలు, బ్యాంకు, ఇన్సూరెన్సు, టెలికం, రైల్వే, పోస్టల్, రోడ్లు, పౌర విమానయానం, నీటిపారుదల, విద్య, వైద్యం, వ్యవసాయం, మందు, రసాయనాలు, బొగ్గు,విద్యుత్, చమురు, రక్షణ ఉత్పత్తులతొ సహా మన దేశ సర్వ సంపదలు దేశ, విదేశీ పెట్టుబడిదార్లకు మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి.
ఈ విధానాలు సరైనవి కావు.మీ విధానాలు మార్చుకొండని మోడీ, చంద్రబాబులకు నేడు సమ్మె ద్వారా హెచ్చరించాయి. కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశ సంపద పరిరక్షణకు, కార్మిక హక్కులపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం చేయిచేయి కలిపి విజయవంతంగా సమ్మెను చేసాయి.