మోడీ వైఫ‌ల్యాల‌ను వాడ‌వాడ‌లా చాటుదాం: ప్ర‌చారోద్య‌మం ప్రారంభ‌స‌భ‌ గుంటూరులో క‌ర‌త్

కేంధ్రంలో బీజేపీ ప్ర‌భుత్వ‌ ఏడాది పాల‌న‌లో అన్ని ర‌కాల అవినీతి పెర‌గిపోయింద‌ని సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యుడు ప్ర‌కాష్ క‌రత్ విమ‌ర్శించారు. కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై దేశ‌వ్యాప్త ప్ర‌చారోద్య‌మాన్ని గుంటూరులో ఆయ‌న ప్రారంభించారు. ఆగ‌ష్టు 1 నుంచి 15 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారోద్య‌మం ద్వారా ప్ర‌భుత్వవిధానాల వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని తెలిపారు. ఏడాది పాల‌న‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ధ‌ర‌ల పెరుగుద‌ల‌, మ‌తోన్మాదుల దాడులు వంటి విష‌యాల్లో త‌ప్ప ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఏవిధంగానూ నెర‌వేర‌డం లేద‌ని క‌ర‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేంధ్ర‌మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు అన్న‌దాత‌ల‌ను కింప‌రిచే రీతిలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ధ‌ర‌ల పెరుగుల‌తో సామాన్యుల జీవ‌నం దిగ‌జారిపోతున్న విష‌యాన్ని అనేక నివేద‌క‌లు వెల్ల‌డిస్తున్నాయ‌న్నారు. అయినా స‌ర్కారులో చ‌ల‌నం లేద‌ని విమ‌ర్శించారు. మార్కెట్ లో ఉల్లి స‌హా అన్నిర‌కాల ధ‌ర‌లు దారుణంగా పెరిగిపోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు మ‌తోన్మాదులు పెట్రేగిపోతూ దేశంలో మ‌త‌సామ‌రస్యాన్ని దెబ్బ‌తీయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు.

కాంగ్రెస్ విధానాల‌ను అనుస‌రిస్తూ బీజేపీ దేశ గౌర‌వాన్ని దిగ‌జారుస్తోంద‌ని విమ‌ర్శించారు. వామ‌ప‌క్ష ప్ర‌జాతంత్ర శ‌క్తుల ఐక్య‌త‌తో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పిలుపునిచ్చారు. గ్రామ‌గ్రామాన ప్ర‌చారోద్య‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో కార్య‌క‌ర్త‌లంతా కృషిచేయాల‌ని విజ్ఞ‌ప్తిచేశారు. ప్ర‌జాస్వామ్యం కార్పోరేట‌ర్ రాజ‌కీయాలు అన్న అంశంపై నిర్వ‌హించిన ఈ స‌ద‌స్సులో సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి మ‌ధు, రాష్ట్ర కార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యుడు వి కృష్ణ‌య్య‌, సీపీఎం గుంటూరు జిల్లా కార్య‌ద‌ర్శి పాశం రామారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.