మోసపూరిత మోడీ

           ''అఖిల భారత ఇమామ్‌ సంస్థ'' ముఖ్యులు ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్యాసీ 30 మంది అనుచరులతో కేంద్ర సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి ఆధ్వర్యంలో ప్రధాని మోడీని కలిశారు. ఆ సందర్భంలో, ''... మతపరమైన భాషను నేను ఎప్పుడూ ఉపయోగించ లేదు. ... అర్ధరాత్రి కూడా మీ ఆర్తనాదాలు వింటాను'' అన్నారు మోడీ. మోడీయంలో గడిచిన వసంతమొక్కటే. గడవనున్న వత్సరాలలో నేతి బీరకాయ పటాటోప ప్రగల్భ ప్రకటనలెన్నో ప్రారంభం కానున్నాయి. అస్మదీయుల మత దాడులను, పరమత ద్వేష ప్రచారాలను సహించి, మౌనం పాటిస్తున్నందుకు మోడీని అంతర్జాతీయ సమాజం అసహ్యించుకుంటున్నది. అమెరికా పార్లమెంటులోని ''అంతర్జాతీయ మత స్వతంత్రత పరిరక్షణ కమిషన్‌'' తన నివేదికలో భారత దేశాన్ని తీవ్రంగా విమర్శించింది. మైనారిటీ వ్యతిరేక విధానం, మత మార్పిడులపై ఆవేదనను వ్యక్తంచేసింది. మోడీ ప్రభుత్వం, బిజెపి నాయకులు-మోడీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింఫ్‌ులపై మత విద్వేషం, మత అసహనం అభియోగాలను మోపింది. అమెరికా అధ్యక్షుల ఆలింగనం దృతరాష్ట్ర కౌగిలితో సమానమని మన పౌరాణిక ప్రచారకర్తలు గుర్తించాలి. సంఘ పరివారీయ మోడీ దేశంలో మత ప్రాతిపదికపై ప్రజలను చీలుస్తూ, భయభ్రాంతులను చేస్తున్నారు. విదేశాలలో శాంతి, సామరస్యం, సహకారం, మేక్‌ ఇన్‌ ఇండియా, విదేశీ పెట్టుబడులు అని ఊదరగొడుతున్నారు. దేశంలో సాగుతున్న విమర్శలు విదేశాలకు కూడా విస్తరించాయన్న మాట.

           మోడీ మత సామరస్య ప్రకటనలన్నీ దీని నుంచి బయట పడటానికి చేస్తున్న ప్రకటనలు తప్ప వాటిలో నిజాయితీ లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌ నియోజకవర్గ బిజెపి పార్లమెంటు సభ్యుడు, ఎన్నో సార్లు పరమతస్తులపై కాషాయ విషాన్ని చిమ్మిన ''యోగి'', సాక్షి మహారాజ్‌ ఈ నెల 7వ తేదీన తాజాగా, ''ఎన్‌డిఎ ప్రభుత్వ కాలంలోనే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తాం'' అన్నారు. అలవాటుగా మోడీ మౌనముద్ర వహించారు. మోడీ మత సామరస్య ప్రబోధనలకు ఇక అర్థమేముంది? న్యాయమూర్తి పిబి సావంత్‌, ''82 శాతం హిందువులున్న సమాజంలో హిందూ మతవాదాన్ని అనుసరించి భగవత్‌ భావజాల పద్ధతులలో దేశాన్ని పరిపాలించాలను కుంటున్నారు మోడీ. ఇతర మతాలను క్రమేపీ నాశనం చేయాలనుకుంటున్నారు'' అని అన్నారు. నక్వీయుల నష్టాలను నరేంద్రులు అపరాత్రి ఆలకించినా స్వామీయులకు భయముండదు. భాగవతుల భావాలను మార్చనిదే ప్రయోజనముండదు.
              సంఘ పరివారీయ సాధువులు, సాధ్వీమణులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ముఖ్యమంత్రులు పరమతాలపై కువ్యాఖ్యలను, దాడులను మాన లేదు. మానమని మోడీ వాళ్ళకు చెప్పడం లేదు. ''బిజెపి విజయం, మోడీ పదోన్నతి సంఘ భావజాలీయులైన సంతులకు, సన్యాసినులకు, ప్రచారకులకు పెద్ద ఊపునిచ్చాయి. ఫలితంగా వాళ్ళ గొంతులు, కండ బల ప్రదర్శనలు పెరిగాయి. సంఘ పరివారీయ మనోభావాలు నిర్భయంగా ప్రచారమవుతున్నాయి. వాళ్ళనుకున్న రీతిలో సమాజపు రూపురేఖలను మార్చే తమ అజెండాను అమలు చేయడానికి సమాజం నెత్తిన సుత్తితో బలంగా మోదే ధైర్యమొచ్చింది. ఎన్ని చేసినా తమను శిక్షించే నాథులు లేరన్న సంపూర్ణ విశ్వాసం కుదిరింది'' అని ఫస్ట్‌ పోస్ట్‌ ఆంగ్ల పత్రిక వ్యాసరచయిత సరోజ్‌ నాగి తన వ్యాసంలో వ్యాఖ్యానించారు. అందుకే ఎవరేమన్నా అల్పసంఖ్యాక మతస్తుల పైన, వారి మతాలయాల పైన దాడులు ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
              భారత రాజ్యాంగంలో భారతీయులకు భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించిన 19(1) అధికరణను, మత స్వేచ్ఛను ప్రసాదించిన 25(1) అధికరణను ప్రధాని మోడీ అవమాన పరిచారు. అదే సమయంలో రాజ్యాంగ అధికరణ 51(ఎ)(హెచ్‌)ను కూడా తుంగలో తొక్కారు. స్వమత తుపాను గాలిలో పరమతాలు కొట్టుకు పోయేలా చేయాలను కుంటున్నారు. మత విషయాలలో మోడీ మోసగిస్తున్నారా? మనమే మోసపోతున్నామా? 
- సంగిరెడ్డి హనుమంత రెడ్డి
(వ్యాసకర్త అఖిల భారత అభ్యుదయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)