మనం ఏ సంస్కృతిలో జీవిస్తున్నాం? ఏ అహంకారాల అభిజాత్యాల జాతరలో కొట్టుకుపోతున్నాం? మనం చూస్తున్నదంతా నిజమేనా? సత్యం కానిదాన్ని సత్యంగా.. సత్యాన్ని అబద్ధంగా అర్థం చేసుకుంటూ అంతా రివర్స్ గేర్‌లో నడుస్తున్నామా? రేవంత్ మహాశయుడు జైలు నుంచి బెయిల్ మీద తిరిగి వచ్చిన సంరంభం చూస్తే ఇప్పుడు ఏ కాలుష్యంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామో బోధపడక చాలా తికమకపడతాం. నిజమే గాంధీజీలాంటి మహానుభావుల, బుద్ధుడు, క్రీస్తులాంటి వారి పునరుత్థానం కూడా జనంలో ఇంత ఆనందాతిశయాన్ని రేకెత్తిస్తుందో, లేదో అనుమానమే. జైలు నుంచి మన నాయకుల పునరుత్థానం మాత్రం అదో అండపిండ బ్రహ్మాండ మహోత్సవంగా మారిపోయింది. పునరపి జైలు.. పునరపి బెయిలు.. ఇది అవినీతి భారత పొలిటికల్ స్టయిలు అనుకోవాలేమో. జైలుకెళ్ళే ముందు.. బైటకొచ్చిన తర్వాత మీసాలు ఊడిపోయేలా మెలేయడాలు.. తొడలు వాచిపోయేలా కొట్టు కోవడాలు.. జబ్బలు బొబ్బలెక్కేలా చరుచుకోవడాలు అన్నీ మన ఘనతవహించిన ప్రజాస్వామ్య ప్రాణ చిహ్నాలుగా మారిపోయిన తర్వాత ఇదంతా సహజమే అని సరిపెట్టుకోవాలా? ఎంత సరిపెట్టుకుందామన్నా కొన్ని సందర్భాలు మనసును తవ్వితోడక మానవు.
రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు వెళ్ళాడో.. ఏ కేసులో ఎలా ఇరుక్కున్నాడో.. ఎలా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడో దేశమంతా కళ్ళప్పగించి చూసింది.. చెవులప్పగించి విన్నది. ఆ యువ డైనమిక్ నేత మీద అభిమానం ఉన్న వారు కూడా పాపం ఇరుక్కుపోయాడు.. శిక్ష తప్పదేమో అని పెదవులు విరిచారు. కానీ ఇదంతా ప్రత్యర్థుల రాజకీయ కుట్రగా రేవంత్, ఆయన అనుయాయులు.. ఆయన పార్టీ అగ్ర నేతలు చిత్రీకరించిన కలర్ ఫుల్ సినిమాలు, డ్రామాలు చాలా చూశాం. పోనీ ఇదంతా శతృ పక్షాల పద్మవ్యూహాల ఫలితమే అని అనుకున్నా.. నిర్దోషిగా నిరూపించుకుని బయటపడినప్పుడే రేవంత్ గాని, ఆయన సమర్థకులు కానీ ఇంత పెద్ద ఎత్తున పండగ చేసుకోవడానికి హక్కుదారులవుతారు. అప్పుడు ఆయన్ని అభిమన్యుడి కంటె గొప్పవాడిగా అందరూ అభివర్ణిస్తారు. ఇది చాలా సింపుల్ లాజిక్కు. చిన్నపిల్లలు కూడా చేయగల ఆర్గ్యుమెంటు. కానీ మన యంగ్ డాషింగ్ లీడర్ ప్రస్తుత పొలిటికల్ సినిమాలో తానే హీరో అనుకున్నాడు. తొడకొట్టడం, మీసాలు తిప్పడం పొలిటికల్ హీరోయిజం అనుకున్నాడు. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ఇలాంటి అభినయాలు అనివార్యమని ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన జైలు నుంచి విడుదలై రావడాన్ని ఆ పార్టీ ఒక మహాసభ ర్యాలీగా నిర్వహించడం.. వేలాది కార్యకర్తల సమూహాల సంబరాల, నృత్యాల, అరుపుల, కేరింతల, ఈలల గోలల మెగా ఈవెంట్‌గా జరపడం మాత్రం ఆలోచనాపరులను కలవరపెట్టక మానదు. ఏ విలువల వైపు మనం పయనిస్తున్నాం? రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తిత్వానికి కిరీటాలు తొడుగుతున్నాం? రానున్న తరాలకు ఎలాంటి సందేశాలను అందిస్తున్నాం? ప్రశ్నలు ప్రశ్నలు. అనేకమనేకంగా ప్రశ్నలు. జైల్లోకి ఆరోపణల మీదే వెళతారు. దోషిగా నిరూపించడానికి విచారణ అవసరం. దానికి సమయం పడుతుంది. ఈ లోగా బెయిలివ్వడం చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ. బెయిలు నిర్దోషిత్వానికి ముందు మాట కాదు. ఇది కనీస జ్ఞానం ఉన్నవారికి కూడా తెలిసిన విషయమే. మరి మన నాయకులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు. నెల్సన్ మండేలాలు.. మహాత్మా గాంధీలు ఈ కాలం నాయకులకు ఎందులో ఆదర్శంగా నిలుస్తున్నారు? కేవలం వారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు జనం పట్టిన హారతులను అందుకోవడంలోనే ఆ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారా? గతంలో జగన్ జైలు నుంచి బెయిలు మీద బయటకొచ్చినప్పుడు కూడా భూనభోంతరాళాలు బద్దలైన సందర్భాలు చూశాం. బహుశా ఒకరి తర్వాత ఒకరు.. ఒకరికి మరొకరు ఈ తరం నేతలు వచ్చే తరం నేతలకు గొప్ప పాఠాలుగా నిలుస్తున్నారు కాబోలు.
ఇలాంటి దుర్మార్గమైన సంప్రదాయాలకు ప్రజలను క్రమక్రమంగా మన నాయకులు అలవాటు చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. తిమ్మినిబమ్మిని.. బమ్మిని తిమ్మిని చేయడమే పాలిటిక్స్ అని నూరిపోస్తున్నారు. ఓటుకు నోటు ప్రజాస్వామ్యంలో ఒక విడదీయరాని సత్యమని చాటి చెప్తున్నారు. అది ఏ స్థాయిలో ఎలా జరిగినా అంగీకారమే అని ప్రజలూ, నాయకులూ అంతా ఒక ఒప్పందానికి వచ్చినట్టు తేల్చిపారే స్తున్నారు. చట్టాలుంటాయి.. న్యాయస్థా నాలుం టాయి.. తప్పు తప్పు అంటాయి.. కానీ ఇదిగో ఇలా చేయకుంటే రాజకీయాల్లో బతికి బట్టకట్టడం సాధ్యం కాదని మాత్రం నాయకులు నొక్కివక్కాణిస్తున్నారు. అదే సబబు కాబోలని.. మరో మార్గం లేదని అందరూ తలొంచుకుని ఒప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఈ నీతిలో పాలకవర్గ పార్టీలన్నీ ఒక్క గీత కూడా దాటకుండా ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ఉదంతం మనకు బోధపరుస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. ఎందులో తగ్గినా అహంకారం.. అభిజాత్యంలో మాత్రం ఒక్క ఇంచి కూడా తొణక్కూడదనేది నాయకులు పాటిస్తున్న ధర్మసూత్రంగా అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్సీకి డబ్బులిస్తూ పట్టుబడినట్టు బయటపడిన వీడియోలో కొన్ని విషయాలు పెద్దగా చర్చకు రాలేదు. తెలంగాణలో రెడ్డి కులం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందులో ముఖ్యమైనవి. భవిష్యత్తులో తెలంగాణలో తమ పార్టీకే అవకాశాలున్నాయని.. అలా జరిగితే తమ కులం ప్రతినిధిగా తానే ఏకైక నాయకుడనని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇదే నిజమైతే మన నాయకుల్లో పైకి కనపడని కులాహంకారం ఎంత గడ్డ కట్టుకుని ఉందో మనకు తెలియజెప్పి ఆ వీడియో పుణ్యం కట్టుకుందని అనుకోవాలి.
వీరి హావభావాలు.. గర్వాతిశయాలు, చేసింది తప్పో, ఒప్పో సంబంధం లేకుండా తాము చెప్పిందే వేదమని, చేసిందే న్యాయమని దబాయించే లక్షణాలు అన్నీ ఏ భూస్వామ్య యుగావశేషాలో మనం ఊహించుకోగలం. జైలుకు పోవడం.. బెయిలుపై రావడం అంతా ఒక ఘనకార్యంగా అంగీకరించమని మనల్ని బలవంతం చేయడంలో ఆ అహంభావమే కనిపిస్తుంది. బహిరంగంగా నేరం చేస్తూ పట్టుబడినా రాజకీయాల్లో రాజకీయాలే ఉంటాయి కాని నేరాలంటూ ఉండవని మనల్ని ఒప్పుకుని తీరాలని మీసాలు మెలేస్తున్నారు. మరి అది ఏ అభిజాత్యానికి సంకేతంగా భావించాలి? ఆఖరికి హీరో అంటే ఇలా ఉంటాడని..
డైనమిక్ అంటే ఇలా మాట్లాడతాడని.. భావి మహానేత అంటే ఇలా వ్యవహరిస్తాడని ఒక కంక్లూజన్‌కి రావడం తప్పదని తీర్మానించేయడం వెనక కూడా ఇదే భావజాలం తొణికసలాడుతోంది. కరడుగట్టిన కులాహంకారానికి ఇది శిఖరప్రాయమైన ఉదాహరణగా గుర్తించాలి. దేశంలో రాజకీయాలు చివరకు ఏ మలుపు తీసుకుంటున్నాయో అర్థం చేసుకోవాలి. లల్లూప్రసాద్‌లు కావచ్చు, పప్పూ యాదవ్‌లు కావచ్చు.. జగన్‌లు కావచ్చు.. రేవంత్‌లు కావచ్చు. ఎవరైనా సరే బెయిలొస్తే చాలు వాడు హీరోనే అన్న సందేశాలు స్థిరపడుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఎదిగేంత వరకూ, వారి పట్ల ప్రజలకు విశ్వాసం ప్రబలి దేశం పునాదులు కదిలి ఒక నవీన యుగ మహోదయం జరిగే వరకూ ఇలాంటివి ఇంకెన్ని చూడాలో మరి. చూద్దాం. ఉదయం కోసం చీకటి రాత్రిని మోయాల్సిందే కదా..
- డాక్టర్ ప్రసాదమూర్తి