రాయలసీమ వెనుకబాటుకు కారకులెవరు?

స్వార్థ రాజకీయమే సీమకు శాపం అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం ప్రచురిత మైంది. శీర్షికకు పెట్టిన పేరు అక్షరసత్యం. అయితే రచయిత వ్యాసం నిండా అర్థసత్యాలు, అసత్యాలు తప్ప ఏ ఒక్కటీ నిజం కాదు. చంద్ర బాబు అధికారానికి వచ్చిన తర్వాత అహరహం వెనుకబడిన సీమ అభివృద్ధి కోసమే కష్టపడుతు న్నట్లు చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, మౌళిక సదుపాయాల కొరకు ఆర్థిక ఇబ్బందులలో కూడా అడ్డంకులను అధిగమించి కృషి చేస్తున్నార న్నారు. ఆర్థిక వికేంద్రీకరణను గురించి ప్రస్తావిస్తూ రాయల సీమలో పారిశ్రామికీకరణకు కృషి చేస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు. గతంలో చంద్రబాబు పాలనలోనే రాయలసీమ లోని భారీ పరిశ్రమలైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు, కార్బైడ్‌ ఫ్యాక్టరీ లు, పేపర్‌ మిల్లులు, నిజాం సుగర్స్‌, ఆల్విన్‌ మొదలైనవి మూత వేయించిన ఘనత బాబుకు దక్కిన విషయం రచయితకు గుర్తు కు వచ్చినట్లు లేదు. గత పరిస్థితి అది కాగా నేడు విభజన చట్టం లో ఉన్న ఏ ఒక్క పరిశ్రమ స్థాపనకూ కనీస ప్రయత్నం లేకపోగా కడపలో నిర్మించాల్సిన భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూ లంగా లేదు. ఇనుప ఖనిజం లేదు అని సెయిల్‌ ప్రకటిస్తే కనీసం దాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖండించ లేదు. అధికారానికి వచ్చి 21 నెలలు అవుతున్నా కనీసం శంకుస్థాపనలకు కూడా సీమలో ఏ ఒక్క పరిశ్రమా నోచుకోలేదు. రచయిత వ్యాసంలో పేర్కొన్నట్లు 26.3 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉందని రాస్తే ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి తెలియదా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి సీమ అభివృద్ధికి, వికేంద్రీకరణకు కృషి చేయలేదు. వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధికి ఏ చర్యలూ లేవు. ప్రభుత్వం అభివృద్ధి అంటే అమరావతిలో 50 అంతస్తుల భవనాలు రాజధాని కోసం నిర్మించడం. అవసరం లేకపోయినా లక్ష ఎకరాలను రైతుల నుంచి మూడుకార్లు పంటలు పండే భూమిని బలవంతంగా లాక్కోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయించి తెలుగుదేశం నాయకులకు సంపాదన మార్గం చూపించడంగా రచయితకు కనబడినట్లుంది. ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడిన వారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దుబారా కనిపిస్తున్నట్లు లేదు. ఇక్కడే పట్టిసీమ గురించి ఒక మాట చెప్పాలి. రాయలసీమ కోసమే పట్టిసీమ అంటున్నారు. ఇది వాస్తవమా? కృష్ణా బ్యారేజీ వద్దకు గోదావరి నీటిని మళ్లించి ఆ మేరకు శ్రీశైలంలో నీటిని నిల్వ చేసి సీమకు పంపాలనే సదుద్దేశంతోనే చేశారన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సగటున 200 టిఎంసీలు సముద్రంలో కలుస్తుండే మరో 80 టిఎమ్‌సీలు అందులో ఇమిడి ఉన్నాయా చెప్పాల్సి ఉంది. పోలవరం కూడా రాయలసీమకే అంటున్నారు. ఇందులో నిజం ఎంత? 80 టింఎసీల గోదావరి నీరు కృష్ణకు మళ్లిస్తే అందులో 35 టిఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక కృష్ణ నీరు వాడుకునే అవకాశం ఉన్నట్లు బచావత్‌ ట్రిబ్యునల్‌ పేర్కొన్న విషయం తెలియంది కాదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో మనం గోదావరి నుంచి మళ్లించిన నీటిలో మన వాటా 45 టిఎంసీలు, తెలంగాణ వాటా 20 టిఎంసీలు అనుకున్నా మనకు మిగిలేది 25 టిఎంసీలు అనే విషయం తెలియదా? ఇన్నీ తెలిసి చంద్రబాబు సీమకు నీరు అందించడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ అని ఎలా చెప్పగలరు? ఇన్ని చెబుతున్న మీరు శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టం మెయింటెయిన్‌ చేయకుండా సీమకు చుక్కనీరు రావని తెలియదా? తెలిసి ఉంటే ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించ లేదు. ఇవికాక హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ప్రాజెక్టులను పూర్తి చేయించడం కోసం ముఖ్యమంత్రి అధికారులను పరుగులు తీయిస్తున్నారన్నారు. అందుకు నిధులిస్తే కాలువ పనులవుతాయి. అధికారులను పరుగెత్తిస్తు న్నారు అని పొంతన లేని రాతలు ఎందుకు రాసినట్లు.
చంద్రబాబుగారి గత ప్రవచనాలు ఒకసారి గుర్తుచేసు కోవడం మంచిది ''వ్యవసాయం దండగ'' అన్న బాబుగారు నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకపోయిన విషయం నిజం కాదా? హంద్రీ-నీవా ఫేజ్‌-1 ఎవరి కాలంలో పూర్తయింది, నీరు ఎప్పుడు వదిలింది తెలియదా? కరువు ప్రాంతమైన రాయలసీమలోని హంద్రీ-నీవా ప్రాజెక్టు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మోటార్లు పట్టిసీమకు రాత్రికి రాత్రే ఎందుకు తరలించారో చెప్పలేరు. ఇది కూడా సీమకు నీరు ఇవ్వడానికేనా, మీరు చెప్ప గలరా? చంద్రబాబు అధికారానికి వచ్చిన ఈ రెండు సంవత్స రాల్లో తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు వరుసగా 2014-15 లో రూ.294.74 కోట్లు, 2015-16 లో రూ.424.42 కోట్లు బడ్జెటు కేటాయింపులు చేశారు. నిజంగా సీమ మీద ప్రేమ, అభివృద్ధి మీద శ్రద్ధ ఉందని చెబుతూనే మూడు పంటలు సాగు చేస్తున్న ప్రాంతాలకు పట్టిసీమ కోసం రూ.1,300 కోట్లు కేటాయించి ఎనిమిది నెలల్లో ఖర్చుచేయించి తన వక్రబుద్ధిని చాటుకుంది ఎవరో అందరికీ తెలియదా?
రాష్ట్రంలోనే అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతాలు రాయలసీమలో ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎందుకు ఇప్పటికీ పరిహారం ఇవ్వరు. అప్పుల రద్దు గురించి మాట్లాడేవారు ఇప్పటికీ, ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పథకం ద్వారా లబ్ధిపొందిన రైతులకు రుణమాఫీ కంటే వడ్డీనే ఎక్కువ అయిన విషయం ప్రభుత్వానికి తెలియదా? ఇప్పటికైనా రాయలసీమ బిడ్డగా సీమ మీద ప్రేమానురాగాలు ఉంటే దివాళా తీసి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల అన్ని రకాల అప్పులను మాఫీ చేయాలని కనీసం ఎందుకు రచయిత కోరలేకపోయారో తెలియదు. చెరువులో పూడికతీత కారణంగా జలకళ వచ్చిందని, భూగర్భ జలాలు పెరిగాయని, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. అసలు ఖరీఫ్‌లో రాయలసీమలో మామిడి, చీనీ, బొప్పాయి, నిమ్మ, అరటి, లాంటి తోటలు నిట్టనిలువునా ఎండిపోయిన విషయం తెలియక పోయి ఉండవచ్చు. చివరిగా చెప్పాల్సింది ఏమిటంటే తెలుగుదేశం పాలించింది తక్కువ కాలం, కాంగ్రెసు పాలించింది ఎక్కువ కాలం అన్నారు రచయిత. అంతవరకు సమంజసంగానే ఉంది. కానీ కాంగ్రెసును ఓడించి తెలుగుదేశాన్ని అధికారానికి తెచ్చింది కాంగ్రెసు మీద నెపం వేసి మీరు తప్పించుకోవడానికి కాదు. మీరు కాంగ్రెసు బాటలో ప్రయాణం చేయవద్దని కోరుతున్నాము. అదే బాటలో ప్రయాణం చేసి రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తే మీకు ప్రజలు తగిన గుణపాఠం నెర్పుతారనే విషయం మరవవద్దని మాత్రం చెప్పగలం.
(వ్యాసకర్త సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు)
- బి నారాయణ