రైతు సమస్యలపై కుప్పంలో పర్యటన..

కుప్పంలో ఏకపక్షంగా జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగిస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్న కుప్పం నియోజక వర్గంలోని కడపల్లి, పాడుచేన్లు, తిమ్మరాజుపల్లి, కనుమలదొడ్డి, బీర్నకుప్పం గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములను ఆయన సందర్శించారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కడపల్లిలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బ్యాంకు పేరిట పది లక్షల ఎకరాలను ఏకపక్షంగా సేకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భూములు కోల్పోతున్న రైతులు ఎక్కడికక్కడ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలన మొత్తం వ్యాపారమయంగా మారిందని విమర్శించారు. నిరుపేద రైతులకు చెందిన భూములను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. 60 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు విమానాశ్రయం ఉండగా కుప్పంలో ఎందుకని ప్రశ్నించారు. కుప్పం విమానాశ్రయం కోసం వెయ్యి ఎకరాల భూము లను సేకరిస్తున్నారని, ఫలితంగా వందలాది నిరుపేద రైతులు నిరాశ్రయులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.