లౌకిక ప్రభుత్వాలకు తగని పని

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న గోదావరి పుష్కరాల శాస్త్రీయత, హేతుబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దగ్గరుండి మరీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం విమర్శలకు దారి తీస్తోంది. లౌకికవాదానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వాలు చాలా రోజుల ముందు నుంచే పుష్కరాలపై దృష్టి సారించాయి. కొద్దిరోజులుగా పుష్కరాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ రోజువారీ కార్యక్రమాలను విస్మరించడం సహేతుకం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నిరంతరం ప్రవహించే నదులకు ఫలానా కాలంలో మంచిరోజులు వస్తాయని, మిగిలిన కాలమంతా మంచివి కావని ఎలా నిర్ధారించగలుగుతారన్న వాదోపవాదాలు తలెత్తాయి. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది ప్రజలు ఒకే చోట ఒకే సమయంలో స్నానమాచరిస్తున్నారు. దీని వల్ల వైద్యపరంగా పలు ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దళితులు, గిరిజనులు నదులకు పరిరక్షకులుగా ఉంటున్నారని, వారి నుంచి నదులను దూరం చేయడానికే అగ్రవర్ణాలు పుష్కరాలను తెరమీదికి తెచ్చారన్న చర్చ కూడా సాగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో లౌకికవాద ప్రభుత్వాలు దగ్గరుండి పుష్కరాలపై గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం సహేతుకం కాదని, మూఢ నమ్మకాలను మరింత పెంచి పోషించేలా వ్యవహరిస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే...
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న నిత్య సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం గోదావరి పుష్కరాల పేరు తో ఆర్భాటం చేస్తోంది. ప్రభుత్వం తన వైఫల్యా లను కప్పిపుచ్చుకోవడానికి పుష్కరాలను సాధ నంగా వినియోగించుకుంటోంది. పాలకులు దగ్గరుండి మరీ ప్రజల్లో సైన్స్‌కు బదులుగా మౌఢ్యాన్ని పెంపొందిస్తున్నారు. దీనివల్ల మళ్లీ మనం వెనకటి రోజులకు వెళ్తున్నామా? అనే అనుమానం ఏర్పడుతోంది. ప్రశ్నించడాన్ని, పరిశోధించడాన్ని ప్రజలు అలవాటుగా మార్చు కోవాలి. పుష్కరాల వంటి కార్యక్రమాలను వ్యక్తిగతంగా చేసుకోవచ్చుగానీ లౌకికవాద ప్రభుత్వం దీన్ని నిర్వహించడం సరికాదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ఆదాయాన్ని పుష్కరాలకు ఖర్చు చేస్తోంది. పుష్కరాలను పర్యాటక రంగం రూపంలో చూడటంలో అర్థం లేదు. 'పుష్కరాలను విశ్వసించాల్సిందే.. విశ్వసించకపోతే చెడిపోతాం' అనే భావాన్ని ప్రభుత్వం ప్రజల్లో జొప్పించింది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఆలోచనా ధోరణి ఎలా ఉందనేది సులువుగా అర్థమౌతోంది. పుష్కరాల పట్ల విశ్వాసం ఉన్న మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్‌ సైతం పుష్కర స్నానం చేయొద్దనే చెబుతున్నారు. కోట్లాది మంది ఒకేచోట, ఒకే కాలంలో స్నానమాచరించడం వల్ల రోగాలు వ్యాపిస్తాయన్నది ఆయన ఉద్దేశం. 144 ఏళ్లకు ఒకసారి పుష్కరం వస్తుందని ప్రభుత్వం చేస్తోన్న ప్రచారం పట్ల ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పుష్కరం పనుల్లో నిమగం కావడం ఎంతవరకు సమంజసమన్నది ఆలోచించాలి. 21వ శతాబ్దంలో సైన్స్‌కు బదులుగా మౌఢ్యం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సబబు కాదు.
- డాక్టర్‌ జి.విజయం, ప్రముఖ హేతువాది.

పుష్కరాల ఖర్చు కరువు ప్రాంతంపై పెట్టొచ్చు
మనదేశంలో ఆర్యు లకు పూర్వమే నదీ నాగరికత వెల్లి విరిసింది. ఆర్యుల రాక కంటే ముందే నదులు మన దేశానికి మాతృస్వామి కమయ్యాయి. నదీ నాగరికతను సృష్టించింది కూడా దళితులు, గిరిజనులే. దీని నుంచి వారిని దూరం చేయడానికే అగ్రవర్ణాలు పుష్కరాలను తెరపైకి తెచ్చారు. దళితులు, గిరిజనులు కొండలు, నదులను సంర క్షిస్తున్నారు. శతాబ్దాల కాలం నుంచీ ఇది ఆనవాయితీగా వస్తోంది. దళితులు, గిరిజనులను ప్రకృతి ఒడి నుంచి వెళ్లగొట్టడానికి పాలకవర్గాలు పుష్కరాలను వినియోగించు కుంటున్నాయి. దళిత, గిరిజనుల నుంచి నదులను సొంతం చేసుకోవడానికి జరిగే ఇలాంటి ప్రయత్నాలకు లౌకికవాద ప్రభుత్వాలు ఎలా మద్దతు ఇస్తాయి? వేంకటేశ్వరుడు, కనకదుర్గమ్మ వంటి దేవతల పేర్లతో దళిత, గిరిజనులను కొండలకు దూరం చేశారు. పుష్కరాల్లో బ్రహ్మణులు, అగ్ర వర్ణాలదే ఆధిపత్యం కావడం వల్ల దళిత, గిరిజన వర్గాలు ఇందులో విలీనం కాలేరు. జైన, దళిత, ముస్లిం, క్రైస్తవ సంస్కృతిని కాదని, బ్రాహ్మణ సంస్కృతిని ప్రోత్సహించడం లౌకికవాదమని అనిపించు కోదు. పాలకులు బ్రాహ్మణులను వ్యవసాయం వైపు నడిపించకపోవడం వల్ల ఆ వర్గమే నష్టపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సామాజిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్కరాలను వేదికగా చేసుకున్నాయి. పుష్కరాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.1,600 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ మొత్తంతో కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాలకు నీటి సౌకర్యాన్ని కల్పించి ఉండొచ్చు.
- కత్తి పద్మారావు, ప్రముఖ సాహితీవేత్త, సామాజిక ఉద్యమనేత.

నమ్మకం కాస్తా మూఢనమ్మకమైంది
దేవుడు, పుష్కరాల పట్ల ప్రజల్లో నమ్మకం ఉంటే దాన్ని కాదనలేము. ఈ నమ్మకం కాస్తా మూఢనమ్మకంగా మారింది. మూఢ నమ్మకంలో భాగంగా పుష్కరాలు ఏర్పడ్డాయి. ఇందులో ఎలాంటి శాస్త్రీయతా లేదు. పర్వతాలు, అడవుల్లో వన మూలికల మీదుగా ప్రవహించే నీటికి ఔషధ గుణం ఉంటుంది. అలాంటి నీళ్లు చర్మాన్ని శుభ్రపరిచేవి. దీనివల్ల రోగాలు రాకుండా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. గౌతమ బుద్ధుడు కూడా గంగానది చుట్టే నివాసం ఉంటూ స్నానమాచరించినప్పటికీ అందులో పవిత్రత ఉందని ఎప్పుడూ చెప్పలేదు. పుష్కరాలపై లౌకికవాద ప్రభుత్వాలు ప్రచారం చేయడం ఎంతమాత్రమూ సరికాదు. ఏక కాలంలో ఒకే చోట కోట్లాది మందిని సమీకరించడం వైద్య పరంగా ప్రమాదకరం. ప్రభుత్వాలు దీన్ని చేపట్టకుండా ధార్మిక సంఘాలకు ఈ బాధ్యతను అప్పగించి ఉండాల్సింది. పుష్కరాల సమయంలో, ఫలానా సమయంలోనే నదీ స్నానం చేస్తేనే పాపాలు పోతాయని అనడంలో ఎలాంటి శాస్త్రీయత ఉంది? దీనివల్ల మంచికంటే చెడే జరిగింది. ఫలానా సమయంలోనే స్నానం చేయాలన్న ఉద్దేశంతో వేలాది మంది ప్రజలు మూకుమ్మడిగా రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీనికి స్వయంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మూఢ నమ్మకాలను రెచ్చగొడుతున్నాయి. పుష్కరాల ధ్యాసలో రోజువారీ కార్యక్రమాలను ముఖ్యమంత్రులు విస్మరించారు. పుష్కరాలు క్రమంగా రాజకీయ రంగు పూసుకుంటున్నాయి.
- కంచ ఐలయ్య, రచయిత, దళిత హక్కుల ఉద్యమనేత.
 

హేతుబద్ధత ఎక్కడీ
పుష్కరాల్లో హేతుబద్ధత ఎక్కడ ఉంది? సింహరాశిలో గురుగ్రహ ప్రవేశం అసాధ్యమని, సైన్స్‌ పరంగా కూడా ఇది రుజువైంది. సింహరాశికి ఎక్కడో 60 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గురుగ్రహం ఎలా ప్రవేశించగలుగుతుంది. శుభ్రతకు, మైలకు ఉన్న తేడా తెలుసుకోవాలి. మైల అనేది మత పరమైనది. నదీ జలాల్లో స్నానం చేస్తే మురికిపోతుందే తప్ప పాపాలు పోవు. మతపరమైన భావాలను లౌకికవాద ప్రభుత్వాలు ఎలా ప్రోత్సహిస్తాయి? కోట్లాది మంది స్నానం చేసిన తరువాత గోదావరి జలాలు మురికిగా మారతాయి. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయనడం సరికాదు. పాపాలను పోగొట్టుకోవడానికి వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని కోట్ల మంది ఒక నదిలో స్నానం చేయడం వల్ల వచ్చే కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. గోదావరి నీటిలో ఇప్పటికే ఈకోలి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. స్విమ్మింగ్‌పూల్‌ నీరు సైతం తాగటానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వమే నిబంధనలు రూపొందించింది. అలాంటి ప్రభుత్వమే గోదావరి నదీ స్నానాన్ని ప్రోత్సహించి, కాలుష్యానికి కారణమైంది. సైన్స్‌ను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది.
- బాబు గోగినేని, ప్రముఖ హేతువాది, లౌకికవాది.