వారి పోరాట బలం..త్యాగఫలం

అర్ధఫాసిస్టుల మారణకాండకు, భూస్వాముల హింసాకాండకు చిరునామాగా మారిన బెంగాల్‌లో బిగిసిన పిడికిళ్లు వారివి! వినిపించిన విప్లవ నినాదాలు వారివే! పీడిత, తాడిత ప్రజానీకపు విముక్తే లక్ష్యంగా ఎర్రజెండా ఎత్తిన ధీశాలులు వారు! దోపిడితో , పీడనతో విసిగిపోయి, బతుకులింతే అంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయిన నిరుపేద ప్రజానీకపు గుండెల్లో ధైర్యాన్ని నింపి, పోరుబాట నడిపిన మార్గదర్శులు వారు! వారే ముజఫర్‌ అహ్మద్‌, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌ గుప్తాలు! ఒకరు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నిర్మిస్తే, మరొకరు అద్బుతమైన పాలనదక్షతతో పేదల ఆకాంక్షలకు పట్టం గట్టి మార్క్మిస్టు మేరునగధీరుడిగా వినుతికెక్కారు. ఇంకొకరు విప్లవానికి వేగుచుక్కగా,కమ్యూనిజానికి నిలువెత్తు రూపంగా వాసికెక్కారు. వీరి నేతృత్వంలో బెంగాల్‌ ప్రజానీకం భూమికోసం, భుక్తికోసం జరిపిన ఉద్యమాల వెల్లువలో ఎర్రజెండా అధికారంలోకి వచ్చి 34 ఏళ్లు అప్రతిహతంగా పాలించింది. హింసాకాండకు చరమగీతం పాడిన 35 ఏళ్ల తరువాత మళ్లీ విజృంభించిన ఫాసిస్టు తరహా పాలనపై మరో పోరాటానికి బెంగాల్‌ ప్రజానీకం సిద్దమవుతున్నారు. ఉత్తమ బెంగాల్‌ నిర్మాణానికి ఆ పోరాట వారసత్వంతోనే కోట్లాదిమంది ప్రతినబూనుతున్నారు. పోరుగడ్డపై సిపిఎం నిర్మాణ ప్లీనం జరుగుతున్న సందర్భంగా ఆ మహానీయుల గురించి క్లుప్తంగా... 
ఈ శతాబ్ది ఆదర్శనేత జ్యోతిబసు
భారత దేశంలో ఆయనదొక శకం. ఈ శతాబ్దానికే ఆయన ఆదర్శవంతమైన నాయకుడు. ఏడు దశాబ్దాల ప్రజాజీవితంలో మచ్చలేని వ్యక్తిత్వం. ఉన్నత విలువలకు ప్రతిరూపం. విప్లవ యోధుడు. గొప్ప పరిపాలనాదక్షుడు. మార్క్సిస్టు మేరునగ ధీరుడు. పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు. ఆయన కోల్‌కతా (కలకత్తా)లో ఇప్పుడు 'మహాత్మా గాంధీ మార్గ్‌'గా మార్చబడిన ఆనాటి 'మారిసన్‌ రోడు'్డలో గల ఓ ఇంటిలో 1914 జులై 8న జన్మించారు. 1930లో జ్యోతిబసు ఎనిమిదో తరగతి చదివేటప్పుడు బెంగాల్‌లో ఉద్రిక్త వాతావరణం ఉండేది. విప్లవ కార్యకలాపాలు ముమ్మరంగా సాగేవి. రాజకీయాలతో సంబంధంలేని జ్యోతిబసు కుటుంబం కూడా వాటి ప్రభావం కింద ఉండేది.
1930లో గాంధీజీ నిరాహార దీక్ష పూనారు. ఏదో ఒకటి చేయాలని జ్యోతిబసు ఆరోజు కళాశాలకు వెళ్లడం మానేశారు. కొద్ది కాలానికి నేడు షహీద్‌ మీనార్‌ ఉన్న ప్రదేశంలో జరిగిన నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ శాసనోల్లంఘన ఉద్యమ ప్రారంభ కార్యక్రమానికి బసు తన పెదనాన్న కుమారుడితో కలిసి వెళ్లారు. ఖద్దరు ధరించి ఆ సభకు వెళ్లిన ఇద్దరూ పోలీసులు లాఠీలు ఝుళిపించినా అక్కడి నుంచి కదలలేదు. బసు 1935లో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇంగ్లీషు ఆనర్స్‌తో పాసయ్యాడు. తండ్రి కోరికపై బారిష్టరు చదివేందుకు 1935 చివరిలో లండన్‌ చేరుకున్నారు. బసు లండన్‌ చేరుకునేటప్పటికి శరవేగంతో వ్యాపిస్తున్న ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాలు బసును ఆకర్షించాయి. ఆనాడక్కడ భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఉద్దేశించిన 'ఇండియా లీగ్‌'ద్వారా బసుకు కృష్ణమీనన్‌తో పరిచయం ఏర్పడింది. కొంత కాలానికి భూపేష్‌గుప్తా (అనంతరకాలంలో భారత్‌లో సిపిఐ ప్రముఖ నేత)ను ఓ మిత్రుని నివాసంలో కలుసుకున్నారు. బ్రిటీష్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అది ఒక విధంగా బసు జీవితంలో ఒక మలుపు. ఆయనను రాజకీయాల్లోకి తెచ్చినవి ఈ ఘటనలే. 1940 జనవరిలో భారత్‌కు తిరిగి వచ్చారు. బసు ప్రభృతులంతా ఇండియాకు తిరిగి వెళ్లగానే పార్టీ హౌల్‌ టైమర్లుగా పనిచేయాలని ఇంగ్లండ్‌లోనే నిర్ణయించారు. ఈ నిర్ణయంతో బసు తండ్రి అసంతృప్తి చెందారు. అదే సమయంలో బసు వివాహ ప్రతిపాదన చేశారు. ప్రెసిడెన్సీ కళాశాలలో తనకు ఇంగ్లీషు అధ్యాపకుడుగా పనిచేసిన ప్రొఫెసర్‌ అనుకుప్‌ ఘోష్‌ కుమార్తె విమలా ఘోష్‌ను వివాహం చేసుకున్నారు. వివాహమైన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యంతో మరణించారు. 1941లో బసు తల్లి మరణించారు. నాటి నుంచి బసు పార్టీ కార్యకర్తగా యావత్‌ కాలాన్నీ వినియోగించడం ప్రారంభిం చారు. అక్కణ్ణుంచి బసు బెంగాల్‌ రాజకీయ యవనికపై అంచెలంచెలుగా ఎదిగారు. నాయకత్వ స్థాయీ పెరిగింది. 1941-43 మధ్య బెంగాల్‌, అస్సాం రైల్వే వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1946- 47లో బెంగాల్‌లో సాగిన తెభాగా పోరాటంలోనూ, కార్మిక వర్గ సమ్మెల్లోనూ, మత ఘర్షణల నిరోధంలోనూ గొప్ప పాత్ర వహించారు. 1948లో బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. ఆ సందర్భంగా బసు అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. 1950లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ బెంగాల్‌ రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1953 నుంచి 1961 వరకూ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1951లో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి పార్టీ మార్క్సిస్టు పథం నుంచి పక్కకు మళ్లి వక్ర మార్గం పట్టిన 1962లో జాతీయ కౌన్సిల్‌ నుంచి వాకౌట్‌ చేసిన 32 మందిలో జ్యోతిబసు ఒకరు. 1964లో సిపిఐ(ఎం) ఏర్పడిననాటి నుంచి పొలిట్‌బ్యూరో సభ్యునిగా, 2008 నుంచి ఆహ్వానితునిగా బాధ్యతలు నిర్వహించారు. 1948, 49, 53, 55, 63, 65 సంవత్సరాల్లో జైలు జీవితం అనుభవించారు. 1970 మార్చి 31న బీహార్‌ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో జ్యోతిబసు రైలు దిగుతున్నప్పుడు ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో సిపిఎం అభిమాని అలీ ఇమాం జ్యోతిబసుతో కరచాలనం చేసేందుకు ముందుకు రావడంతో తుపాకీ గుండు ఆయనకు తగిలింది. దానితో ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఆ సమయంలో జ్యోతిబసు నిశ్చలంగా ఉండిపోయారు. ఇమాం ఇంటికి వెళ్లి కుటుంబీకులను ఓదార్చి వారికి తగిన సాయం కోసం ఏర్పాట్లు చేశారు. 1971లో రెండుసార్లు కాంగ్రెస్‌ దుండగులు జ్యోతిబసుపై దాడికి యత్నించారు. దేశం మొత్తం మీద శాసనసభ్యుడిగానూ, ముఖ్యమంత్రిగానూ ఎక్కువ కాలం బాధ్యతలను నిర్వహించింది ఆయనే. స్వాతంత్య్రానికి పూర్వం ఒకసారి, స్వాతంత్య్రానంతరం 11 సార్లు శాసన సభ్యుడిగా పనిచేశారు. 1946లో తొలిసారిగా అవిభక్త బెంగాల్‌ శాసనసభలోకి అడుగుపెట్టారు. 1946 నుంచి 2000లో పార్లమెంటరీ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే వరకూ ప్రతి ఎన్నికలోనూ ఆయన విజయదుందుభి మోగించారు. (1972లో కాంగ్రెస్‌ అర్ధఫాసిస్టు బీభత్సకాండకు పాల్పడి సైన్యం సాయంతో ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటాన్ని నిరసిస్తూ పోటీ నుంచి తప్పుకున్నారు). 1977 జూన్‌ నుంచి 2000 సంవత్సరం నవంబర్‌ వరకూ సిపిఎం నేతృత్వంలోని వామపక్ష సంఘటన పక్షాన 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి భారత రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించారు.1977లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెలువరించిన తొలి ప్రసంగంలోనే . 'మా ప్రభుత్వం కేవలం రైటర్స్‌ బిల్డింగ్‌ (బెంగాల్‌ సచివాలయం) నుంచి గాక ప్రజల మధ్య నుంచి పాలన సాగిస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా లేదా శ్రామిక, రైతు పోరాటాలను అణచడానికి పోలీసులను ఉపయోగించ బోము' అని చెప్పారు. తదనంతర కాలంలో ఆ వాగ్దానాన్ని ఆయన నిజం చేశారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మన దేశ లౌకిక, ప్రజాతంత్ర స్వభావానికీ జ్యోతిబసు దృఢంగా కట్టుబడ్డారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులను నిలువరించడంలోనూ, బాబరీ మసీదు కూల్చివేత అనంతరం బెంగాల్‌లో ఎలాంటి ఘర్షణలూ చోటు చేసుకోకుండా జ్యోతిబసు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆధునిక భారత భావజాలానికి ఆయన అంతగా సన్నిహితమయ్యారు. 
నిర్మాణ రథసారథి ప్రమోద్‌ దా
పశ్చిమ బెంగాల్‌ను మార్క్సిస్టు పార్టీ కంచుకోటగా, దుర్భే ద్యమైన శక్తిగా రూపొందించడంలో ప్రమోద్‌ దాస్‌గుప్తా ప్రధాన పాత్రధారి. పార్టీ నాయకుడుగానే కాక, వ్యక్తిగా ఆయన నిరాడంబరత, అణకువ, వ్యూహరచనా నైపుణ్యం దేశవ్యాప్తంగా మెప్పును చూరగొన్నాయి. ప్రమోద్‌దాస్‌ గుప్తా పేరు వినగానే ముందుగా స్ఫురణకొచ్చేది నిర్మాణ దక్షత. సామాన్యులను సైతం నిర్మాణ రంగంలో తీర్చి దిద్దిన ఘనత ఆయనది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని ఫరీదాబాద్‌ జిల్లా బరిసాల్‌ గ్రామంలో 1910 జులై 7వ తేదీన ప్రమోద్‌దాస్‌ జన్మించారు. విద్యార్థి దశలోనే ఆయన అనుశీలన సమితి అనే విప్లవ గ్రూపులో సభ్యునిగా చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఈ సమితి బ్రిటీష్‌ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేది. ఈ ఆశయమే ప్రమోద్‌ను కలకత్తాకు చేర్చింది. విద్యార్థిగా 19 ఏళ్ల ప్రాయంలోనే ఆయనను మచువా బజార్‌ బాంబు కేసులో సహచరులతో సహా బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే దోషిగా రుజువు చేయలేక పోయిన ప్రభుత్వం ''బెంగాల్‌ క్రిమినల్‌ చట్టం'' కింద నిర్బంధించింది. ఈ సందర్భంగా ఎనిమిదేళ్లపాటు బెంగాల్‌లోని అనేక జైళ్లు, దివోలి డిటెన్యూ క్యాంపుల చుట్టూ ఆయనను తిప్పింది. తర్వాత 1937లో ఆయనను విడుదల చేసింది. అంటే 1929 నుంచి ఎనిమిదేళ్ల పాటు ఆయన నిర్ధోషిగానే జైలు జీవితం అనుభవించారు. 1938లో ప్రమోద్‌ కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా చేరారు. కలకత్తాలోని డాక్‌ ఉద్యోగులలో తన పని ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జిల్లా కార్యదర్శిగా పని చేస్తూ అజ్ఞాతంలోకి వెళ్లవలసి వచ్చింది. 1942లో అరెస్టయి పార్టీపై నిషేధం తొలగింపు తర్వాతనే విడుదలయ్యారు. ఆ సమయంలోనే పార్టీ పశ్చిమ బెంగాల్‌ కమిటీ ప్రచురణలను ప్రారంభించారు. బెంగాల్‌ వారపత్రిక ''జాన్‌యుధ్‌'', ఆ తర్వాత కొంత కాలానికి 'స్వాధీనత' వార పత్రికలను నడిపారు.
1948-51 మధ్య కాలంలో పార్టీపై పైశాచికమైన దాడులు జరిగాయి. ఆ కాలంలో ప్రమోద్‌ అజ్ఞాతంలో ఉండి పని చేశారు. వెంటాడిన ప్రభుత్వం ఆయనను మళ్లీ అరెస్టు చేసి 1951లో విడుదల చేసింది. విడుదలనంతరం ప్రమోద్‌ పశ్చిమ బెంగాల్‌లో పార్టీ పునర్మిర్మాణంలో, స్వాధీనత దిన పత్రిక పున్ణ ప్రారంభంలో కీలక పాత్ర పోషించారు. 1960లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యత స్వీకరించారు. 1964లో మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మృతిచెందే వరకూ ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉండి నిర్మాణం విషయంలో రాజీ లేని వైఖరిని కొనసాగించారు. 23 ఏళ్ల పాటు ఆయన బెంగాల్‌లో పార్టీ ప్రతిష్టకు నిరంతరంగా కృషి చేశారు. పార్టీలో ఎదురైన అతివాద, మితవాద ధోరణులకు ఎదురొడ్డి నిలిచిన చరిత్ర ప్రమోద్‌ది. 1,200 మంది పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్‌ గూండాలూ, పోలీసులూ పొట్టన పెట్టుకుని, ఎందరినో ఇళ్ల నుంచి తరిమేసి ఫాసిస్టు విధానాలను అమలు జరుపుతున్న కాలంలో పార్టీని నిలబెట్టడంలోనూ, దమనకాండను తిప్పి కొట్టడం లోనూ ప్రమోద్‌ వ్యూహ రచన అనన్యమైంది.
1962 అక్టోబరులో జరిగిన భారత్‌-చైనా యుద్ధ కాలంలో ప్రభుత్వం కొందరు నాయకులను అరెస్టు చేసింది. వారిలో ప్రమోద్‌ కూడా ఒకరు. జైలులో ఉండే ఇతర ప్రముఖ నాయకులతో కలసి పార్టీకి మార్గ దర్శకత్వం వహించారు. 1963 ఆఖరులో ఆయన విడుదలయ్యారు. 1964లో పార్టీ ఏడవ మహాసభ సన్నాహాలలో భాగంగా జరిగిన తెనాలి సదస్సుకు ప్రమోద్‌ హాజరయ్యారు. మహాసభకు కొద్దిరోజుల ముందు ప్రభుత్వం మళ్లీ ఆయనను అరెస్టు చేసింది. పార్టీ ఏడవ మహాసభలోనే ప్రమోద్‌ కేంద్రకమిటీ సభ్యులుగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ దమనకాండ అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో వామపక్ష సంఘటనను అగ్రగామిగా నిలపడంలో ప్రమోద్‌ పాత్రఅద్వితీయమైంది. ఆయన చనిపోవ డానికి ఆర్నెల్లు ముందు జరిగిన ఎన్నికలలోనూ పార్టీ విజయానికి ఆయన నిర్మాణ సారథ్యం వహించారు. సాధిం చిన విజయాలను సుస్థిరం చేసి పశ్చిమ బెంగాల్‌ను మరింత చైతన్యవంతం చేసేం దుకు తన అనారోగ్యాన్ని సైతం ఆయన లెక్కపెట్టలేదు. బెంగాల్‌ను పరిపాలిస్తున్న పాలక సంఘటనకు అధ్యక్షుడు అయినా ప్రమోద్‌ నిరాడంబర జీవన శైలి ఎందరికో మార్గదర్శకం. హరేకృష్ణ కోనార్‌ వీధిలోని ఒక చిన్న ఇల్లు ఆయన నివాసం. అన్ని పనులనూ అంత పనుల ఒత్తిడిలోనూ ఆయనే చేసుకునే వారు. అధికార వ్యవహారాలలో ఏ మాత్రం జోక్యం చేసుకోని ఆయన హుందాతనాన్ని పార్టీ వ్యతిరేక పత్రికలు సైతం ప్రశంసించాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థా నంలో ఎన్నెన్నో ఒడిదుడుకుల మధ్య జీవితాన్ని కొన సాగించిన ప్రమోద్‌ ఆరోగ్యం దెబ్బతింది. ఉబ్బసం వ్యాధితో పాటు ఇతర జబ్బులతోనూ ఆయన బాధ పడ్డారు. చికిత్స కోసం చైనా ఆహ్వానంపై బీజింగ్‌ వెళ్లిన ఆయన 1983 నవంబర్‌ 29వ తేదీన కన్ను మూశారు. ఆయన మృతి వార్త తెలియగానే సుందరయ్య ''మార్క్సిస్టు పార్టీ మహా నాయకుడైన ప్రమోద్‌దాస్‌ గుప్తా కన్ను మూశారు. ఆయన పార్టీలోనూ, 1964 నుంచి పొలిట్‌బ్యూరోలోనూ పనిచేసి, రెండు దశాబ్దాలకు పైగా కలిసిమెలిసి కృషి సాగించిన నాకు ఈ వార్త కలిగించిన ద్ణుఖాన్ని మాటల్లో వెల్లడించడం అసాధ్యమైన పని. ఆయన మన పార్టీ నిర్మాత. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పరచగల వామపక్ష సంఘటనకూ, ప్రజా ఉద్య మానికీ అధినేత'' అంటూ కొనియాడారు. ఆ మాటల్లోనే ప్రమోద్‌దాస్‌ గుప్తా రథ సారథ్యం వెల్లడవుతోంది.
భారత కమ్యూనిస్టు ఉద్యమ వేగుచుక్క ముజఫర్‌ అహ్మద్‌
భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వేగుచుక్క ఆయన. అసలుసిసలు కమ్యూనిస్టుకు ప్రతి రూపం. శ్రామికవర్గ అంతర్జాతీయత ప్రబోధించిన విప్లవ తేజం. రష్యన్‌ ఎర్రసేనలో చేరి విప్లవ పోరాటంలో పాల్గొన్న ధీశాలి. భారత దేశ విప్లవోద్యమానికి అంకితమై అలుపెరుగని పోరుసల్పిన యోధుడు. బ్రిటీష్‌ ప్రభుత్వమూ, ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వమూ మోపిన కుట్ర కేసుల్లో 20 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించినా, ఎనిమిదేళ్లు అజ్ఞాతవాసం చేసినా పట్టు సడలని కమ్యూనిస్టు కర్తవ్య దీక్ష ఆయనది. ఆయనే కామ్రేడ్‌ ముజఫర్‌ అహ్మద్‌.
ముజఫర్‌ అహమ్మద్‌ బెంగాల్‌లోని నొవాఖలి జిల్లాలోని సంద్వీప్‌లో 1889 ఆగస్టు 5న జన్మించారు. తండ్రి మన్సూర్‌ ఆలీ న్యాయవాదిగా పనిచేసేవారు. పాఠశాల విద్య అనంతరం ఆయన కళాశాల చదువు కోసం హుగ్లీ వచ్చారు. హుగ్లీ కళాశాలలోనూ, తరువాత కలకత్తాలోని వంగవాసి కళాశాలలోనూ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రైటర్స్‌ బిల్డింగ్‌ ముద్రణాశాలలో ఉద్యోగానికి కుదిరారు. తరువాత హోం శాఖలో అనువాదకునిగా పని చేశారు. ఆ సమయంలోనే 'వంగీయ ముసల్మాన్‌ సాహిత్య సమితి' సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 1916లో ఆయన జాతీయోద్యమంలోకి దూకారు. రాజకీయ సభల్లోనూ, ఊరేగింపుల్లోనూ పాల్గొనసాగారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. యుద్ధానంతర భారతదేశం సహాయ నిరాకరణ, ఖిలాఫత్‌ ఉద్యమాలతో అట్టుడికి పోతోంది. అలాంటి సమయంలో 1920లో బెంగాల్‌ ప్రొవిన్షియల్‌ ఖిలాఫత్‌ కమిటీ సభ్యునిగా ముజఫర్‌ నియమితులయ్యారు. అందులో భాగంగా 1920 ఏప్రిల్‌ 18న ఢిల్లీలో జరిగిన ఖిలాఫత్‌ మహాసభలకు హాజరయ్యారు. ఆ ఖిలాఫత్‌ మహాసభలో ఉపన్యాసాలన్నీ 'హిజ్రత్‌' మీదనే సాగాయి. 'హిజ్రత్‌' అనే మాటకు అర్థం నిరంతర పీడన నుంచి తప్పించుకొనేందుకు స్వదేశం విడిచిపోవడం. బ్రిటీష్‌వారి దురంతాలు అనుభవించడం సాధ్యం కాదనీ, దేశాన్ని విడిచిపోవడం తప్ప మరోదారి లేదనీ 'హిజ్రత్‌' ప్రచారకుల వాదన. అలా 'హిజ్రత్‌' పోతున్నవారిలో కాబూల్‌ చేరిన మొట్టమొదటి వ్యక్తి ముజఫరే. అక్కడి నుంచి జాబ్లూస్‌ సిరాజ్‌ పట్టణానికి వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయుడు అబ్దుల్‌ పెషావరీని కలుసుకున్నారు. రష్యా వెళ్లాలని ముజఫర్‌కు పెషావరీ సలహా ఇచ్చారు. రష్యాలో విప్లవం వచ్చిందనీ, అక్కడకు వెళ్తే ఎన్నో చూడొచ్చనీ, నేర్చుకోవచ్చనీ చెప్పారు. బ్రిటీష్‌వారిని భారత్‌ నుంచి వెళ్లగొట్టడానికి మార్గాలేమైనా దొరుకుతాయేమో తెలుసుకోవాలన్న ఊహ 'హిజ్రత్‌' పోతున్న వారిలో కొందరికి ఉంది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ముజఫర్‌తో సహా హజ్రత్‌ సభ్యులంతా జాబ్లూస్‌ సిరాజ్‌ నుంచి బయలుదేరి హిందూకుష్‌ పర్వతాలను కాలినడకన దాటి సోవియట్‌ భూభాగంలోని తిర్మిజ్‌లో అడుగు పెట్టారు. హిజ్రత్‌ సభ్యులను రష్యన్‌ ఎర్రసైన్యం అధికారులు భారతీయ విప్లవకారులనుకొన్నారు. వారిని తిర్మిజ్‌ కోటకు తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేశారు. కొన్ని రోజులు గడిచాక, వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ముజఫర్‌తో సహా 20 మంది హజ్రత్‌ బృందం సభ్యులు 'మాకూ ఆయుధాలివ్వండి, మేమూ యుద్ధం చేస్తాం' అని రష్యన్‌ సైనికాధికారులను అడిగారు. వారు కొన్ని రైఫిళ్లు ఇచ్చి ఆమూదర్యాకు ఎదురుగా ఉన్న యుద్ధరంగానికి వారిని పంపారు. అక్కడ వారు రష్యా సైన్యంతో కలిసి విప్లవ వ్యతిరేకులతో పోరాడారు. ఓ వారం గడిచింది. రష్యన్‌ కమాండెంట్‌ వారిని కలిసి 'విద్రోహుల దాడిని తిప్పికొట్టాం. మనకు సాయంగా ఓడపై అదనపు సైన్యం వచ్చింది. ఈ దాడిలో మీరు రానక్కర లేదు. వస్తే అభ్యంతరమూ లేదు' అని చెప్పాడు. వారిలో ముగ్గురు ముజఫర్‌, షౌకత్‌ అలీ, మసూద్‌ ఆలీషా దాడుల్లో పాల్గొనేందుకు రెడార్మీతో కలిసి వెళ్లారు. కొన్నాళ్లకు తుర్కుమెన్‌ విప్లవ వ్యతిరేకులు పూర్తిగా ఓడిపోయారు.
తరువాత ముజఫర్‌, మరో 18 మంది తాష్కెంట్‌కు పయనమయ్యారు. తాష్కెంట్‌ చేరుకున్న కొద్ది రోజులకే మానవేంద్ర నాథ్‌ రారు (ఎంఎన్‌ రారు), ఆయన భార్య ఎవెలిన్‌ రారు, అవనీ ముఖర్జీ, తదితరులు వారిని చూడ్డానికి వచ్చారు. ఎంఎన్‌ రారు వారితో అనేక విషయాలు చర్చించారు. ఆ రోజుల్లో వారికి కమ్యూనిస్టు పార్టీ గురించి అంతగా తెలియదు. అయినా ఎంఎన్‌ రారు నాయకత్వాన పనిచేయడానికి వారు అంగీకరించారు. 1920 సెప్టెంబర్‌లో ఇది జరిగింది. ముజఫర్‌ తాష్కెంట్‌లో ఇండియన్‌ మిలిటరీ స్కూలులో చేరి మర తుపాకీని, కొంత వరకూ ఫిరంగులనూ కాల్చడం నేర్చుకున్నారు. తాష్కెంట్‌లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ముజఫర్‌ మళ్లీ స్వదేశానికి తిరిగి వెళ్లాలని తహతహలాడసాగారు. వారిని స్వదేశం పంపడానికి కూడా నిర్ణయమైంది. పామీర్‌ పర్వతాల మీదుగా మధ్య ఆప్ఘన్‌ భూభాగం దాటి ప్రస్తుత పాకిస్థాన్‌లోని చిత్రాల్‌కు చేరుకున్నారు. ఈ ప్రయాణంలోనూ వారి వద్ద చిల్లిగవ్వలేదు. అనేక రోజులు అన్నపానీయాలు, నిద్రాహారాలు లేకుండా గడిపారు. చిత్రాల్‌ చేరుకున్నాక ఆ నగర పోలీస్‌ అధికారికి వారి రాక గురించి తెలిసింది. వారిని తన సిబ్బందితో వచ్చి అరెస్టు చేశాడు. ఈ కేసే పెషావర్‌ కమ్యూనిస్టు కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా ముజఫర్‌ తాష్కెంట్‌లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి స్వదేశంలో ఆ పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు. వీరోచిత రష్యా యాత్ర తరువాత భారత దేశం వచ్చిన ముజఫర్‌ 1920 జులై 12న 'నవయుగ్‌' పత్రిక సంయుక్త సంపాదకునిగా బాధ్యతలను చేపట్టారు. ఈ దినపత్రికలో ఆయన శ్రామికుల సమస్యల గురించి రాసేవారు. 1921 జనవరిలో ఆయన 'నవయుగ్‌' పత్రికను విడిచిపెట్టారు. తాష్కెంట్‌లో 1920లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీతోనూ, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతోనూ ముజఫర్‌ సంబంధాలు పెట్టుకుని విదేశీ పత్రికలనూ, పత్రాలనూ సేకరించసాగారు. పార్టీ తొలి ప్రచురణ 'ది వాన్‌గార్డ్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఇండిపెండెన్స్‌' 1922 మే 15న వెలువడింది. 1922 చివరిలో కామ్రేడ్‌ అబ్దుల్‌ హలీంను ముజఫర్‌ కలుసుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కర్తవ్యాన్ని వీరిరువురూ సంయుక్తంగా చేపట్టారు. ఆనాటికి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అనుబంధ శాఖగా భారత కమ్యూనిస్టు పార్టీ పనిని ప్రారంభించింది. శ్రామికవర్గ ఉద్యమాల్లో పనిచేస్తున్న ముజఫర్‌ అహ్మద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెసు పనిలో భాగస్వామి అయ్యారు. 1923 మే 17న ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. కాన్పూర్‌ కుట్ర కేసులో ఇరికించింది. 1924 ఫిబ్రవరిలో ఆయనకు నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. అయితే క్షయ వ్యాధి సోకటంతో ఆయనను 1925లో ప్రభుత్వం విడిచిపెట్టింది. తిరిగి 1929 మార్చి 20న మీరట్‌ కుట్ర కేసులో ఆయనను కలకత్తాలో అరెస్టు చేశారు. మొత్తం మీద ఆయన 20 సంవత్సరాలపాటు జైళ్లలో గడిపారు. జైలులో ఉన్న కాలంలోనే ఆయన రాజకీయ ఖైదీల హోదాను డిమాండు చేస్తూ రెండుసార్లు నిరహారదీక్షను పూనారు. 
అజ్ఞాతవాసంలో ఉంటూ పనిచేసే విధివిధానాలను ముజఫర్‌ చాలా చక్కగా ఆకళింపు చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కాలంలో ఆయన దాదాపు ఐదుసార్లు అజ్ఞాతవాసం చేశారు. పార్టీ కోసం, ఉద్యమాల కోసం ఆయన ఈ విధంగా చేయవలసి వచ్చింది. 1933 డిసెంబరులో కలకత్తాలో అఖిల భారత ప్రతినిధుల మహాసభ జరిగింది. దానిలో ఆయన పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. అప్పటికాయన జైలులోనే ఉన్నారు. 1948 నాటి పార్టీ మహాసభలో మినహా ప్రతి పార్టీ మహాసభలోనూ ఆయన కేంద్ర కమిటీకి ఎన్నికవుతూ వచ్చారు. 1938-40 మధ్య కాలంలో అవిభక్త బెంగాల్‌లోని మొత్తం 28 జిల్లాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ విస్తరించింది. వేల సంఖ్యలో ప్రజలు పార్టీలో చేరారు. ట్రేడ్‌ యూనియన్లలోనూ, కిసాన్‌ సభలోనూ అసంఖ్యాక ప్రజలు సభ్యులుగా చేరారు. ఐదవ దశకమంతటా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమం కొనసాగింది. చట్టసభల లోపలా, వెలుపలా పార్టీ జాతీయస్థాయిని అందుకున్నది. ఈ కార్యకలాపాలన్నిటా ముజఫర్‌ కేంద్రబిందువుగా ఉండేవారు. 1940 నుంచి 1943 వరకూ ఆయన పార్టీ బెంగాల్‌ ప్రొవిన్షియల్‌ కమిటీ కార్యదర్శిగా ఉండేవారు. 1937 నుంచి 1971 వరకు జరిగిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ ఆయన వినూత్న పద్ధతులను అనుసరిస్తూ చురుకైన నాయకత్వాన్ని అందించారు. రైతాంగ సమస్యలపై ఆయన రచించిన వ్యాసాలూ, 'భారత కమ్యూనిస్టు పార్టీ:1921-1933 సంస్థాపక సంవత్సరాలు', 'నేను-భారత కమ్యూనిస్టు పార్టీ' అన్న రచనలు వర్తమాన రాజకీయాలపై విశిష్ట ప్రభావాన్ని చూపాయి. 1973 డిసెంబరు 18న తన 84వ ఏట ముజఫర్‌ అహ్మద్‌ కన్నుమూశారు. చివరి శ్వాస విడిచే వరకూ ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అరవయ్యేళ్ల తన రాజకీయ జీవితంలో సుమారు 52 సంవత్సరాలపాటు ఆయన కమ్యూనిస్టు పార్టీలోనూ, సిపిఎంలోనూ పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. సిపిఎం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కమిటీ కార్యాలయానికి ముజఫర్‌ అహ్మద్‌ పేరు పెట్టారు.