విలువైన సమయం వృథా..

పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ముందుగా ఊహించిన రీతిలోనే ఎలాంటి ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు నోచుకోకుండానే ముగిసిపోయాయి. లలిత్‌గేట్‌, వ్యాపమ్‌ సంబంధిత అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా కాలం హరించుకుపోవడమే కాక 260 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు రావాలనుకున్న భూ సేకరణ బిల్లు మొదలుకొని వస్తు సేవల పన్ను బిల్లు వరకు ఏదీ చర్చకు నోచుకోలేదు. ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ దాదాపు మూడు వారాల పాటు ప్రతిష్టంభన రాజ్యమేలింది. మున్నెన్నడూ లేనివిధంగా సభా కార్యక్రమాలకు ఆటంకంగా తయారయ్యారంటూ పాతికమంది సభ్యులను స్పీకర్‌ ఐదు రోజులపాటు సస్పెండ్‌ చేయడం, వారికి సంఘీభావంగా పలువురు ప్రతిపక్ష్ష సభ్యులు సమావేశాలను బహిష్కరించడం చర్చనీయాంశమైంది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పదవుల నుంచి వైదొలిగే వరకూ పార్లమెంటులో చర్చ జరగనివ్వబోమని కాంగ్రెస్‌ నాయకత్వం ముందుగానే స్పష్టం చేసింది. అదే సమయంలో కళంకిత మంత్రులకు అభయహస్తమిస్తూ వారు రాజీనామా చేసే ప్రసక్తి లేదని బిజెపి నేతలు తేల్చి చెప్పినప్పుడే పార్లమెంటు సమావేశాలు నిష్ఫలమౌతాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. 'న ఖావూంగా...న ఖానే దూంగా' (తినను, తిననివ్వను) అంటూ ఎన్నికల ప్రచారంలో నమ్మించి గద్దెనెక్కిన మోడీ తన మంత్రివర్గంలో అవినీతి, అక్రమాలు వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారు. సభలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడంలో చతికిలపడడమే కాక ఎదురుదాడికి దిగారు. ఈ మొత్తం ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండిపోవడం విశేషం.
గత సాధారణ ఎన్నికల్లో 'మోడీ గొప్ప మాటకారి, సమర్థవంతుడైన ముఖ్యమంత్రి, అభివృద్ధి సాధకుడన్న' ప్రచారంతో ఆయన ప్రధాని పీఠం ఎక్కడానికి మీడియా దోహదపడింది. విదేశీ పర్యటనల్లో సైతం అదే ఇమేజీతో అభినందనల మాలలు అందుకున్నారు. అయితే పార్లమెంటరీ సమావేశాలకొచ్చేసరికే ఆ ఇమేజీ గాలి తీసిన బుడగలా మారిపోయింది. వాయిదాల మీద వాయిదాలతో మోతమోగిపోతున్న పార్లమెంటును రాజనీతిజ్ఞతతో సజావుగా నడిపించాల్సింది పోయి మన్మోహనులవారి మార్గాన్ని ఎంచుకున్నారు. నిన్న మొన్నటి దాకా 'మౌన మోహన్‌ సింగ్‌' అంటూ అవకాశం వచ్చిన ప్రతిసారీ ఎద్దేవా చేసిన పూర్వ ప్రధానిలా మౌన మంత్రాన్ని పఠిస్తూ కూర్చున్నారు. వాస్తవానికి గత సంవత్సర కాలంగా పార్లమెంటులో ప్రధాని మాట్లాడిందే తక్కువ. పొరపాటున నోరు తెరిచినా అంతంత మాత్రంగానే. లలిత్‌గేట్‌ అంశం చర్చకు వచ్చినప్పుడు సైతం సమాధానం చెప్పాల్సిన భారాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపైనే మోపారు. కాంగ్రెస్‌ ఒకవేళ మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఎత్తుగడే తీసుకున్నప్పటికీ సమాలోచనలు చేసి సజావుగా సభ జరిపేందుకు ఆ పార్టీ సహకారం పొందడానికి మోడీ సర్కారు ఏమాత్రం ప్రయత్నించలేదు.
పార్లమెంటు సమావేశాలు ఇంత నిరర్థకంగా ముగియడానికి అధికారంలో ఉన్న బిజెపి ప్రధానంగా బాధ్యత వహించాలి. తాజా సమావేశాల్లో కాంగ్రెస్‌ పట్టువిడుపులు లేని వైఖరి అవలంబించిందని ఆరోపణలు చేస్తున్న బిజెపి గతంలో తాను కూడా ఇదే పని చేసింది. యుపిఎ-2 హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రుల రాజీనామాకై పట్టుబట్టి అత్యధిక రోజులపాటు పార్లమెంటు సమావేశాలను ఆటంకపరిచిన బిజెపి ఇప్పుడు గురివింద గింజలా పార్లమెంటరీ ఔన్నత్యం గురించి నీతులు వల్లించడమే విచిత్రం. వాస్తవానికి లలిత్‌గేట్‌, వ్యాపం కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కేంద్ర మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలన్న ప్రతిపక్ష డిమాండ్‌లో న్యాయం ఎంతైనా ఉంది. ఐపిఎల్‌ ఆర్థిక నేరగాడు లలిత్‌ మోడీకి, వసుంధరా రాజే కుమారుడికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు సాక్ష్యాధారాలున్నాయి. మధ్యప్రదేశ్‌ వ్యాపమ్‌ కుంభకోణంలో 35 మందికి పైగా మరణించినట్టు రుజువులున్నాయి. లలిత్‌ మోడీ పోర్చుగల్‌ వెళ్లడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతిస్తే దాని వల్ల భారత్‌తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేదని పూచీ ఇవ్వడమే కాక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడమే సుష్మాస్వరాజ్‌ చేసిన తప్పిదం. అన్నిటినీ మించి మానవత్వంతో సాయం చేశాననడం ఏమాత్రం సబబుకాదు.

ఒకవేళ ఒక నేరస్థుడికి మానవత్వంతో సాయం చేస్తే దేశంలోని నేరస్తులందరికీ ఏవో సమస్యలుండే ఉంటాయి. వారికి కూడా అదే విధంగా సాయం చేయాల్సి ఉంటుంది. పైగా సుష్మాజీ భర్త, కుమార్తె ఇద్దరూ లలిత్‌మోడీ దగ్గర న్యాయవాదులుగా ఉన్నారు. మాట సాయం చేసినందుకు వారికి లలిత్‌ నుంచి మూటలు అంది ఉంటాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక అవినీతికి క్రూర హత్యాకాండ తోడైన వ్యాపం స్కామ్‌కు ఆ రాష్ట్రప్రభుత్వాధినేతగా ఉన్న చౌహాన్‌ బాధ్యత వహించకపోవడం మరో విషాదం. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను ఉటంకించడమే పనిగా పెట్టుకున్నారు కమలనాథులు. నేరారోపణలు ఎదుర్కొన్న ఖత్రోచీ (బోఫోర్స్‌), ఆండర్సన్‌ (భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ) వంటి నిందితులు పరారీ కావడంలో ఆ పార్టీ పాత్రను ప్రశ్నించడంతోనే పుణ్యకాలం కాస్తా పూర్తిచేశారు. నేరం ఎవరు చేసినా నేరమే. దానికి ప్రాంతం, పార్టీలన్న బేధాలేం ఉండవు. ఏ పార్టీవారైనాసరే అవినీతిని గోప్యంగా ఉంచడం నేరం. పైగా అవినీతికి పాల్పడడం తమ హక్కు అనుకుంటే ప్రజలు గట్టి బుద్ధి చెప్తారు. అనేకానేక సమస్యలతో సతమతమౌతున్నా... అవేవీ పట్టకుండా తమ రాజకీయ ఎత్తులు, పైఎత్తులు, స్వప్రయోజనాలే ప్రధానంగా ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.