దేశ న్యాయవ్యవస్థ విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోం దంటూ సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరోమారు న్యాయవ్యవస్థ పనితీరును చర్చనీయాం శం చేశాయి. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిజానికి ఈ తరహా చర్చ ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్నోసార్లు ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇలా చర్చ జరిగిన ప్రతిసారీ కాయకల్ప చికిత్సతో సరిపుచ్చడం అలవాటుగా మారింది. అయితే, గతానికి ఇప్పటికీ పెద్ద తేడానే ఉంది. అన్ని రంగాల్లోనూ అవినీతిని వ్యవస్థాగతం చేసిన ఆర్థిక సంస్కరణలు న్యాయవ్యవస్థనూ వదలలేదన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టంగా రుజువవుతోంది. గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ ఉదంతాన్ని ఉభయ రాష్ట్రాల ప్రజలు దగ్గర నుండి చూశారు. అదే తరహాలో కాకపోయినా పలువురు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు న్యాయమూర్తులు నాట్ బిఫోర్ ను ఎంచుకుని కేసుల విచారణ నుండి తప్పుకుంటున్న తీరూ సందేహాలకు దారితీస్తోంది. వ్యక్తిగత ఆపేక్షలకూ దూరంగా ఉండాలన్న గతకాలపు నైతిక సూత్రానికి కట్టుబడి ఉంటే ఈ తరహా పరిస్థితి రాదన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. విజయమాల్యా వంటి కార్పొరేట్ శక్తుల కుయుక్తులను సకాలంలో అడ్డుకోలేకపోవడం కూడా న్యాయవ్యవస్థ బలహీనతకు నిదర్శనమే! ఈ పరిస్థితులే పేదవాడికి ఒక న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అమలు జరుగుతోందన్న అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. అలాగని మన న్యాయవ్యవస్థకు గర్వంగా చెప్పుకునే ఘనచరిత్ర లేదని కాదు. తప్పు జరిగిందని నిర్ధారణ అయినప్పుడు ఎంత పెద్దవారినైనా జైలుకు పంపిన ఘనత మన న్యాయవ్యవస్థది! ప్రభుత్వాలు పక్కదారి పడుతున్నప్పుడు రాజ్యాంగంలోని సంక్లిష్ట అంశాలను నిర్వచించి మార్గదర్శిగా నిలిచిన న్యాయమూర్తులూ ఉన్నారు. అయితే, ఈ మెరుపుల కన్నా, మరకల ప్రభావమే ఎక్కువ కావడం విచారకరం. భారతీయ న్యాయవ్యవస్థలో అనేక బలాలున్నప్పటికీ, ప్రజల ఆకాంక్షల స్థాయికి పూర్తిగా చేరుకోలేదన్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాటలను ఇదే కోణంలో చూడాలి.
ఆలస్యంగా జరిగే న్యాయం, తిరస్కరించడంతో సమానమన్నది న్యాయవిద్యార్థులకు చెప్పే తొలిపాఠం. అయితే, ఆచరణలో జరుగుతున్నది భిన్నం. కోట్లాది కేసులు పరిష్కారానికి దూరంగా మిగిలిపోతున్నాయి. రాష్ట్రపతి చెప్పిన లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 3 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఫలితంగా చిన్నచిన్న కేసులకు సంబంధించి బెయిల్‌కు అవసరమైన కనీస మొత్తాన్ని కట్టలేక, న్యాయవాదులను సమకూర్చుకోలేక పెద్దసంఖ్యలో నిరుపేదలు జైళ్లలో మగ్గుతుండగా, ధనవంతులు, పలుకుబడి కలిగినవారు అత్యంత సులభంగా బెయిల్ పొందుతుండడం న్యాయవ్యవస్థ బలహీనతకు నిదర్శనం. కేవలం ఆర్థికస్థోమత లేదన్న కారణంతో స్వేఛ్చను హరించడం ఏ మాత్రమూ సబబుకాదు. ఈ విషయం చర్చకు వచ్చినప్పుడల్లా జడ్జిల నియమాకం, కొత్త కోర్టులను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడడం, ఆ తరువాత దానిని మరిచిపోవడం ఏళ్లతరబడి సాగుతోంది. తాజాగా అదనపు గంటలు పనిచేయడాన్ని ఈ సమస్యకు పరిష్కారంగా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. దీనికి బార్‌కౌన్సిల్ సహకరించడం లేదని ఆయన అన్నట్లు వార్తలొచ్చాయి. అదే నిజమైతే బార్‌కౌన్సిల్‌తో చర్చించాలి. వారి సమస్యలేమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. అత్యున్నతస్థాయిలోనే ఈ దిశలో చొరవ చూపితే సమస్య పరిష్కారం కాకపోదు. ఇది తాత్కాలిక చర్య మాత్రమే. శాశ్వత పరిష్కార మార్గాలు వెతకాలి.
పారదర్శకత లేకపోవడం కూడా మన న్యాయవ్యవస్థను వెంటాడుతున్న మరో లోపం. అన్ని వ్యవస్థలూ పారదర్శకంగా ఉండాలని నిర్దేశిస్తున్న సమయంలోనే ఈ పరిస్థితి కొనసాగుతుండడం విచారకరం. సమాచార హక్కు చట్టం కూడా న్యాయవ్యవస్థను బయటే ఉంచింది. ప్రజల్లో విశ్వాసం పాదు కోవాలంటే ఈ పరిస్థితి మారాల్సి ఉంది. చిత్రమైన అంశమేమిటంటే ఎవరి నమ్మకం, విశ్వాసమైతే కీలకమో వారితోనే న్యాయమూర్తులకు సంబంధాలు లేకపోవడం. చాలా దేశాల్లో న్యాయమూర్తులు ప్రజలతో మమేకమవుతున్నారు. వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన మార్పులూ చేర్పులూ చేసుకుంటున్నారు. బ్రిటిష్ వలసవాదుల నుండి వచ్చిన సంప్రదాయమే మన దేశంలో ఇప్పటికీ కొనసాగుతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా న్యాయవ్యవస్థలో మార్పులు రావాల్సి ఉంది. అ దిశలో జరిగే విస్తృత చర్చే న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని సుస్థిరం చేస్తుంది.