పెట్టుబడిదారుల దోపిడీ వల్లే కొన్ని ప్రాంతాలు వెనుకబడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. వారి దోపిడీని అరికట్టి అభివృద్ధికి పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్య వ్యవస్థను, భూస్వామి వ్యవస్థను వ్యతిరేకించే వారిని కలుపుకుని ఉద్యమించాలన్నారు. గ్రామీణ వ్యవస్థలో నెలకు ఐదువేల రూపాయలకు మించి ఆదాయం రాని వారు 50 శాతానికి పైగా ఉన్నారన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు అడుగులేస్తున్నారని, కలిసొచ్చేవారిని కూడగట్టుకుని ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుండడంతో సుమారు 70 శాతం మంది పేద రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో 15 లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పడమటి మండలాల్లో కనీసం తాగేందుకు నీరులేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపడతామని చెప్పారు.