సమాన విద్య-ఉపాధి గ్యారంటీ కోసం రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పలువురు సిపిఎం, సిపిఐ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. సమాన విద్య-ఉపాధి గ్యారెంటీ కోసం వామపక్ష పార్టీల రాజకీయ ప్రత్యామ్నాయంపై తిరుపతి యశోధనగర్‌లోని ఎంబి భవన్‌లోకోసం రౌండ్‌టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. దీనికి సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నంపెంచులయ్య అధ్యక్షత వహించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్, ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయ దివాళాకోరుతనానికి బిజెపి, రాష్ట్రంలో టిడిపిలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. విద్యారంగంలో ప్రయివేటీకరణ, మతోన్మాద విధానాలు చొప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన బిజేపి, టిడిపిలు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి దొరకక వలసలు పోతున్నారని, అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడం నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు. ఆగస్టు 6న రాష్ట్ర స్థాయి సదస్సులో యువకులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సుర్యారావు, ఎఐఎస్‌ఎఫ్ అఖిలభారత అధ్యక్షులు ఖాధర్‌వలి, సిపిఎం, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, జనసేన, సిపిఐ లోక్‌సత్తా నాయకులు, ఐద్వా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.