స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పుట్టిన రోజు నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది. 1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్ స్కూల్ సిస్టం, 10+2+3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు. బ్రిటీష్ పాలనలోని పరిమితులను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్వర ప్రగతిని సాధించేందుకు వివిధ స్థాయిల్లో విద్యారంగం పరిస్థితిని పరిశీలించి సరైన దిశా నిర్దేశాలు చేయటానికి విశేష కృషి చేశారు. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్‌లు నియమించారు. తొలి ఐదేళ్ళ కాలంలోనే యుజిసి, ఐసిసిఆర్, ఎఐసిటియు, సిఐఎన్‌ఆర్, తదితర అత్యున్నత సంస్థలతోపాటు ఖరగ్‌పూర్‌లో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థను, సంగీత, సాహిత్య, లలితకళా అకాడమీలను ఏర్పాటు చేశారు. దేశం గర్వించే విద్యాశాఖామాత్యులుగానే కాక బహుముఖ ప్రజ్ఞానా శాలిగా, సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడిగా, హిందూ, ముస్లిం సమైక్యతా సారథిగా మౌలానా ఆజాద్ స్వతంత్ర భారత నిర్మాతల్లో ప్రము ఖులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు మరణానం తరం 1992లో ''భారతరత్న'' బిరుదునిచ్చి గౌరవించారు.
ఆయన చనిపోయి 57 సంవత్సరాలు గడించింది. కానీ ఆయన తలపెట్టిన విద్యావిధానం ఇంకా అసమగ్రంగా, అనేక మందికి అందకుండా నిరాశా నిస్పృహలతో నిట్టూరుస్తోంది. జాతీయ సగటు అక్షరాస్యత 73.9 శాతంగానే ఉండిపోవటంతో ఏడు సంవత్సరాలు పైబడిన జనాభాలో 28.7 కోట్ల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం నిరక్షరా స్యుల్లో 37 శాతం మంది మన దేశంలోనే ఉండడం పాలకుల అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం. కనీసం 14 ఏళ్ళ ప్రా యం వరకైనా బాలబాలికలకు ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలనే మౌలానా ఆకాంక్షకు అనుగుణంగా ఎట్టకేలకు విద్యా హక్కు చట్టం వచ్చినా కేంద్రంలోని కాంగ్రెస్, బిజెపి పార్టీల పాలనా వైఫల్యాలతో అది కాగితాలకే పరిమితమయింది. పాఠ శాలల్లో చేరిన విద్యార్థులలో సగం మంది 8వ తరగతి కూడా చ దవకుండా మధ్యలోనే మానేస్తుండడంతో పాఠశాల విద్యా సా ్థయికి చేరుకోలేక పోతున్నారు. నిరక్షరాస్యుల్లో, మధ్యలోనే బడి మానేస్తున్న వారిలో అధికులు దళితులు, గిరిజనులు, మైనార్టీలే.
పాఠశాల విద్యను గట్టెక్కిన వారిలో కూడా అందరూ పై చదువులకు పోవటం లేదు. 15-18 సంవత్సరాల వయస్కుల్లో 22 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ జనాభాల్లో గ్రాడ్యుయేట్లు 4.5 శాతం మందే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెక్కిరిస్తున్నాయి. ఇక నాణ్యత విషయంలోనూ నాసికరమే. ప్రథమ్ సంస్థ ప్రకటిం చిన వార్షిక విద్యాస్థాయి-2014 నివేదిక ప్రకారం 5వ తరగతి విద్యార్థుల్లో సగం మంది, 8వ తరగతి విద్యార్థుల్లో నాల్గవ వం తు మంది రెండవ తరగతి తెలుగు వాచకాన్ని కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. అంతేకాదు 3వ తరగతి గణి తంలోని కూడికలు, తీసివేతలు, భాగహారాలు కూడా చేయలేక పోతున్నారని తేల్చింది. నిర్ణీత విద్యా ప్రమాణాలు లేకపోవడం అనేది పాఠశాలల స్థాయికే పరిమితంకాక అన్ని స్థాయిల్లోనూ అదే పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంజనీరింగ్ అర్హత కలిగిన వారిలో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు సరి పడిన సామర్థ్యం ఉంటున్నట్లు పారిశ్రామిక సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు గల 200 విశ్వ విద్యాలయాల్లో భారతదేశానికి చెందినవి ఒక్కటి కూడా లేదు.వివిధ దేశాల్లోని విద్యార్థుల స్థాయినీ బేరీజువేసే అంతర్జాతీయ సంస్థ (పిఐఎస్‌ఐ) జాబితా నుంచి భారతదేశం ఆరేళ్ల క్రితమే తప్పుకున్నది. ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపో తున్నందున మన దేశంలో విద్యా సంస్థల ప్రమాణాలను కొలిచే వ్యవస్థను మనమే ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల కేంద్ర ప్రభు త్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించుకున్నది. అమెరి కాలోని సిలికాన్ వ్యాలీలోని సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో అత్యధికులు భారతీయులేనని, దేశ దేశాల్లో మన డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం వల్ల ఒరిగేదే ముంది. ''ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత'' అన్నట్లుగా ఉంది.
కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో ప్రతికూల పరిణామాలు పెరిగిపోతు న్నాయి. సమాజాభివృద్ధికి తోడ్పడే శాస్త్ర సాంకేతిక రంగాలను విస్మరిస్తూ మూఢ విశ్వాసాలను ప్రచారంలోకి తెస్తున్నారు. పదమూడేళ్ళ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో మూ డేళ్ళ నుంచి జైలులో ఉంటున్న ఆశారాం బాపు జీవిత కథను ఆదర్శ పురుషుల జాబితాలో భాగంగా రాజస్థాన్‌లో ఉపవాచ కంగా ఉపయోగిస్తున్నారు. అదే పుస్తకాన్ని ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 10వ తగరతి విద్యార్థులకూ పంచిపెట్టారు. కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల ప్రార్థనా సమయంలో సూర్యనమస్కా రాలు చేయిస్తున్నారు. ఆ విధంగా చేయని మహారాష్ట్రలోని ఒక టీచర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి రక్షణ పొందాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బడిపిల్లల మధ్యా హ్న భోజన పథకంలో కోడిగుడ్డును నిషేధించింది. చీర, జాకెట్ మాత్రమే ధరించాలని గుజరాత్ ప్రభుత్వం మహిళా టీచర్ల వస్త్రధారణపై ఆంక్షలు విధించింది. ఈ విధంగా విద్యారంగం లో హిందూత్వ ఎజెండాను జొప్పిస్తూ దళితులూ, క్రిష్టియన్‌లు, ముస్లిం విద్యార్థులు, టీచర్లను లొంగదీసుకొనేందుకు హిందూ త్వ చర్యలు చాపకింద నీరులా అల్లుకుంటున్నాయి.
నూతన విద్యావిధానం-2015 పేరుతో కేంద్ర విద్యాశాఖ చేస్తున్న బూటకపు సంప్రదింపుల తతంగం మరింత ఆందోళన కరంగా ఉంది. ఉన్నత, సాంకేతిక విద్యలతోపాటు పాఠశాల విద్యను కూడా పబ్లిక్-ప్రయివేట్ పార్టనర్‌షిప్‌కు ఎగదోస్తు న్నది. విదేశీ విద్యా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకూ భారతీయ విద్యార్థులను బలిచేసే వినాశకర బిల్లులతో ఎదురుచూస్తోంది. విద్యారంగం నుంచి ప్రభుత్వాలను తప్పించేందుకు ఎన్నికల కమిషన్ లాంటి స్వయం ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయా లనే ప్రతిపాదనను ''శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్'' (ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ) అనే సంస్థతో ముందుకు తెస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో విద్యకు నిధులను భారీగా కోతకోయటం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత దివాళా తీసే పరిస్థితి తయారైంది. ప్రయివేట్ విద్యావ్యాపారం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. విద్యారంగంలో ప్రబలిపోతున్న మతోన్మాద ఎజెండాతో, ప్రయివేట్‌రంగంలోని విద్యావకాశాలతో అనైక్యతా పరిణా మాలు ప్రబలే అవకాశం ఉంది. హిందూత్వ పాఠాలతో మతాల మధ్య విభజనకు దారితీస్తుంది. ప్రయివేట్ కార్పొరేట్ కాలేజీల్లో సంపన్నులు, పై కులాల పిల్లలు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో దళితులు, గిరిజనులు, బిసిల పిల్లలే మిగిలిపోవటం విద్యారంగంలో ఆధునిక అంటరానితనంగా తేలిపోతోంది. ఈ రెండు పరిణామాలతో భావిభారత పౌరుల్లో సమైక్యతా భావజాలాన్ని ప్రోది చేయాల్సిన విద్యా విధానమే విచ్ఛిన్నకర శక్తిగా మారే ప్రమాదం పొంచివున్నది. అది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆకాంక్షలకు అపచారం చేసినట్లు కాగలదు. కనుక భారతీయుల సమైక్యతా సాధనంగా విద్యను వికసింపజేస్తేనే తొలి విద్యామంత్రికి నిండు నివాళి అర్పించినట్లు అవుతుంది. అందుకు అనువైన విద్యావిధానం కోసం ప్రత్యేక కృషి జరగాల్సిన అవసరం ఉన్నది.
- నాగటి నారాయణ
(వ్యాసకర్త ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు)