జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానిది పెద్ద ఘాతుకం. ఒక వైపు చంద్రబాబు సర్కారు నవ్యాంధ్ర అభివృద్ధి నమూనా చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరిస్తుం డగా ఇంకో వైపు రైతుల బలవన్మరణాల పరంపర కొనసాగింపు రాష్ట్రంలో నెలకొన్న రెండు విభిన్న ధోరణులకు నిదర్శనం. అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రసీమలో కాడెత్తాల్సిన అన్నదాతలు ఉరితాళ్లకు వేలాడుతున్నా పంట పండించాల్సిన వ్యవసాయదారులు పొలంలోనే పురుగు మందు తాగి విగత జీవులవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పైగా తెలంగాణాతో పోలికపెట్టి ఎపిలో తక్కువని ఆత్మవంచన చేసుకోవడం క్షమించరానిది. రైతు ఆత్మహత్య వార్త లేకుండా దినపత్రికలు, టీవీ చానెళ్లు లేవంటే గ్రామాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో వేరే చెప్పనవసరం లేదు. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారిలో అత్యధికులు కౌలు రైతులే కావడం మరీ ఆందోళనకరం. ఆదివారం రోజునే ఐదుగురు కౌలు రైతులు చనిపో గా వారిలో ఇద్దరు బాబు కలల రాజధాని ప్రాంతానికి చెందినవారే. దీన్ని బట్టే బాబు అభివృద్ధి జపం ఎంత బూటకమో తెలుస్తుంది. నిరుడు ఎపిలో 160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) వెల్లడించే వరకు ఎపిలో అసలు ఆత్మహత్యలే లేవని ముఖ్యమంత్రి బుకాయించా రు. ప్రతిపక్షాలు, రైతుల ఆందోళనలతో ఎక్స్‌గ్రేషియా ఐదు లక్షలకు పెంచినట్లే పెంచి జూన్ 2 ముందు చనిపోయిన వారికి పాత ఎక్స్‌గ్రేషియా లక్షన్నరేనని మానవత్వం మరిచారు. ఇస్తానన్న ఆ పరిహారానికీ పలు ఆంక్షలు విధించారు. రైతు ఆత్మహత్యలను వ్యవసాయ, రెవెన్యూ, సంక్షేమ శాఖలే కాకుండా పోలీస్ నిఘా వర్గాలతో గుర్తించాలన్న దారుణ నిబంధన పెట్టి రైతుల పట్ల సర్కారు మదిలోని దురభిప్రాయాన్ని బయటపెట్టారు.
రైతుల ఆత్మహత్యలను దాచిపెట్టడంలో మోడీ, బాబు ప్రభుత్వాలు పోటీ పడ టం దుర్మార్గం. వ్యవసాయదారులను అనేక కేటగిరీలుగా వర్గీకరించి బలన్మరణాల సంఖ్యను తగ్గిస్తున్నారు. అందుకు ఎన్‌సిఆర్‌బి లెక్కలే సాక్ష్యం. ఎపిలో వాస్తవ సాగు దార్లలో అత్యధికులు కౌలు రైతులే. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో 80 శాతానికి పైగా భూమిని సేద్యం చేస్తున్నది వీరే. సాక్ష్యాధారాల్లేక కౌల్దార్ల బలవన్మరణాలు రైతు ఆత్మ హత్యలుగా గుర్తింపు పొందక ఎక్స్‌గ్రేషియా అందట్లేదు. వ్యవసాయ పనులపైనే ఆధారపడ్డ కూలీల ఆత్మహత్యల పరిస్థితీ అంతే. అప్పులు రైతులను బలితీసుకుం టుండగా సర్కారు అందరికీ రుణ మాఫీ చేశామనడం మోసం. రుణాలన్నీ ప్రభు త్వం తీర్చేస్తే రైతులెందుకు ప్రాణాలు తీసుకుంటారు? కౌలు రైతులకు బ్యాంకు లిచ్చిన అప్పులే తక్కువ కాగా మాఫీకి అర్హత సాధించినవి మరీ తక్కువ. అర్హత పొందిన వాటిల్లోనూ పలు వడపోతలతో మాఫీ చేసింది స్వల్పం. ఆ మొత్తం వడ్డీ లకు కూడా సరిపోదు. రాష్ట్ర రైతుల్లో 92 శాతం మంది రుణగ్రస్తులని నేషనల్ శాం పిల్ సర్వే వెల్లడించింది. ఆ సర్వేని సర్కారు తలకెక్కించుకుంటే మాఫీ పేర ఇత దగా చేసేది కాదు. కౌలు రైతులకు ఆర్‌ఎంజి, జెఎల్‌జి, భూమి హీన్, ఎల్‌ఇసి ఎన్ని పథకా లున్నా బ్యాంకుల సహాయ నిరాకరణ, సర్కారు చిన్నచూపు సంస్థాగత పరపతికి దూరం చేస్తున్నాయి. ప్రైవేటు అప్పుల వైపు మళ్లించి అప్పుల ఊబిలో నెడుతున్నాయి.
సేద్యాన్ని రైతుకు లాభసాటి చేస్తామన్న టిడిపి ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) సైతం దక్కని దారుణ పరిస్థితి రాజ్యమేలుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తికి కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పి క్వింటా రూ.4,100 కాగా 2,800 రావడం కనాకష్టమైంది. కందుల సంగతే చూస్తే నిరుడు ఎంఎస్‌పి రూ.4,350 కాగా అంతకంటే వంద తక్కువకే వ్యాపారులు కొని వినియోగదారులకు ఏకంగా రూ.20 వేలకు అమ్ముతున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు సర్కారు ఎవరి పక్షమో తెలియడానికి. రెండేళ్ల నుంచి కరువు కోరలు చాచినా ప్రభుత్వం నీరో చక్రవర్తినే తలదన్నింది. ఈ సంవత్సరం కరువు మండలాల ప్రకటనలో వడపోతలకు ఒడిగట్టింది. రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాలతో పాటు డెల్టాలోనూ పంట భూములు బీడులుగా మారినా, దిగుబడులు దారుణంగా పడిపోయినా సర్కారులో చలనం లేదు. వరుస కరువులతో అల్లాడుతున్న రైతులు ప్రభుత్వ భరోసా దొరక్క అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. వ్యవసాయ సంక్షోభంపై అధ్యయనం చేసిన స్వామినాధన్ కమిషన్ సిఫారసులను గత కాంగ్రెస్ విస్మరించింది. ప్రస్తుత బిజెపి ఆ సిఫారసులను ఆమోదించలేదని సుప్రీం కోర్టుకు ఏకంగా అఫిడవిట్ ఇచ్చింది. స్వామినాధన్ సిఫారసులు అమలు చేయాలంటూ ప్రతిపక్షంలో ఉండగా నిరాహారదీక్ష చేసిన బాబు బిజెపి తీరుపై మౌనం దాల్చారు. రైతుల విషయంలో బిజెపి, టిడిపి ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలో మరోలా వ్యవహరించడం రెండు నాల్కలకు నిదర్శనం. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోణంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధి విధానాలు చేపట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఒక్కరి ప్రాణ త్యాగం కూడా లేని జాతిని నిర్మించాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్య కనువిప్పు కావాలి.