సిపిఎం ప్లీనం-బడా మీడియా పాక్షిక రూపం

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నిర్మాణంపై ప్రత్యేక ప్లీనం సమావేశం జయప్రదంగా ముగిసింది. ప్రతినిధుల నుంచి వచ్చిన కొన్ని సవరణలతో నిర్మాణంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్ని రాజకీయ పక్షాలూ అంతర్గత కలహాలతో అతలాకుతలమవుతున్న స్థితిలో-కమ్యూనిస్టు ఉద్యమం కూడా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో-సిపిఎం బలం లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయిన దశలో- ఈ అఖిల భారత సమావేశం ఇంత ఏకోన్ముఖంగా జరగడం ఒక విశేషం. అసలు సిద్ధాంతాలు విలువల వంటివి పూర్తిగా గాలికి వదిలివేసిన పాలక పక్షాలు అధికారమే ఏకైక సూత్రంగా కార్పొరేట్లకు సేవ చేస్తున్న స్థితిలో, సామ్రాజ్యవాదుల ముందు సాగిలపడుతున్న స్థితిలో అందుకు భిన్నమైన విధానాలను ప్రతిపాదించడం ఒక సాహసం. దాన్ని సాధించేందుకు అవసరమైన రాజకీయ నిర్మాణ బలాన్ని పెంచుకోవడంలో విలువలు విధానాల పరిధిలో ఆలోచించడం అసలే ఊహకందని విషయం. కొద్ది మంది నాయకులు నిధులూ ఎన్నికల కోణంలో మాత్రమే అన్నిటినీ నిర్ణయించే పద్ధతికి పూర్తి భిన్నం. ఆ క్రమంలో తన అంతర్గత లోపాలను వైఫల్యాలను కూడా నిర్మొహమాటంగా చెప్పుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం ఇప్పటి నేపథ్యంలో మరీ అసాధారణం. అలాటి ప్రత్యేకతలెన్నిటికో ప్రతిబింబమైన కోల్‌కతా ప్లీనం సమావేశాలను బడా మీడియా మొదటి నుంచీ ఒక దండగమారి తతంగంగా చిత్రించేందుకు ప్రయత్నించింది. ప్లీనం మొదలు కాకముందు నుంచే బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా, లేదా అనే దాని చుట్టూనే వార్తలన్నీ తిప్పి వాస్తవ చర్చల సారాంశాన్ని మరుగుపర్చింది. ముగింపు తర్వాత వచ్చిన సమీక్షలూ, సంపాదకీయాలు కూడా అదే ధోరణికి పరాకాష్టగానూ, ఉద్యమకారులను నిరుత్సాహ పర్చే వ్యాఖ్యలతో నిండి ఉన్నాయి.
తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్బంధ, నిరంకుశ పాలనలో పది లక్షల మందితో ప్రదర్శన బెంగాల్‌లో సిపిఎం ప్రజాబలాన్ని మరోసారి చాటిచెప్పింది. పాలకపక్ష నాయకులను సెలబ్రిటీలుగా చేసి వారు చిటికెన వేలు కదిల్చినా ప్రత్యక్ష ప్రసారాలతో ప్రచారమిచ్చే మీడియాకు ఈ ప్రదర్శన ప్రధానమైందిగా కనిపించలేదు. కొన్ని పత్రికల్లో ఒక మోస్తరుగా వార్త ఇచ్చినా చిన్న తోక వార్తలతో సరిపెట్టిన పత్రికలు కూడా ఉన్నాయి. పైగా దాంతో పాటే తృణమూల్‌ నిందారోపణలకు కూడా అంతే ప్రచారమిచ్చాయి. ఇక ప్లీనం మొదలైన రోజు నుంచి కాంగ్రెస్‌తో పొత్తు గురించిన ఊహాగానాలతోనే సరిపోయింది.
ఈ దేశంలో యుపిఎ, ఎన్‌డిఎ లేదా కాంగ్రెస్‌, బిజెపిలు, రకరకాల ప్రాంతీయ పార్టీలు ఒకే తరహా ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నాయని సిపిఎం విశాఖలో జరిగిన 21వ మహాసభలోనే నిశితంగా విమర్శించింది. వాటికి ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించేది వామపక్షాలేనని స్పష్టీకరించింది. అయితే అదే సమయంలో రాజకీయ బలాబలాల పొందికలో సిపిఎం వామపక్షాలకు గల పరిమితులను ఎన్నడూ విస్మరించింది లేదు. ఆ మాటకొస్తే ఏ దశలోనూ దేశ రాజకీయాలను మేమే శాసిస్తామని, ఒంటరిగా ప్రత్యామ్నాయం అందిస్తామని కమ్యూనిస్టులు చెప్పింది లేదు. కాకపోతే సైద్ధాంతికంగా పాలక పక్షాలతో భిన్నమైన ప్రజానుకూల విధానాలు మాత్రమే ముందుకు తెచ్చాయన్నది నిజం. 1991లో దేశంలో నూతన ఆర్థిక విధానాలు, అంతర్జాతీయంగా సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అనే రెండు కీలక ప్రతికూల పరిణామాలు సంభవించాయి. ఈ రెండింటితో పాటు దేశంలో మతతత్వ శక్తుల పెరుగుదల కూడా తీవ్రస్థాయికి చేరింది. ఈ ప్రతికూల పరిస్థితులలో సిపిఎం వంటి పార్టీ నిర్మాణ బలాన్ని, రాజకీయ ప్రభావాన్ని కాపాడుకోవడం పెద్ద పరీక్షే. ప్రభుత్వాలను కార్పొరేట్లు ప్రత్యక్షంగా శాసించే ప్రయివేటీకరణ విధానాలు, వర్థమాన దేశాలను విచ్చలవిడిగా కొల్లగొట్టే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ఈ రెండింటి కలయికగా సాంస్కృతిక కాలుష్యం, మత మార్కెట్‌ ఛాందసాలు సమాజ స్వరూపాన్ని, వ్యక్తిత్వ రూపాలను చిన్నాభిన్నం చేశాయి. విత్త వినిమయ విలాస వికృత సంస్కృతిని పెంపొందించాయి. స్వార్థం, స్వలాభం, సుఖలాలసల అధికార పిపాస వంటివి సర్వస్వమన్న కలుషిత వాతావరణం సృష్టించాయి. వీటన్నిటి మధ్యనే ప్రత్యామ్నాయం కోసం పోరాడటంలో కమ్యూనిస్టు ఉద్యమం దృఢంగా నిలబడింది. అయితే అదే సమయంలో సహజంగా వాటి ప్రభావం ఉద్యమంపైనా, శ్రేణులపైనా పడటంలో ఆశ్చర్యం లేదు. ఎప్పటికప్పుడు జరిగిన మహాసభల నిర్మాణ నివేదికల్లో వాటిని పొందుపర్చడం జరుగుతూనే ఉంటుంది. కాగా రాజకీయ విధానాన్ని ఖరారు చేసిన విశాఖ మహాసభ నిర్మాణ ప్రక్షాళన, ఉద్యమ పురోగతి కోసం తీసుకోవలసిన చర్యలను చర్చించేందుకు ఈ ప్లీనం జరపాలని ఆదేశించింది. ఆ పని పూర్తయింది. జరిగిన చర్చల తీరుతెన్నులూ, ముఖ్యాంశాలూ ఎప్పటికప్పుడు చెప్పడమే గాక చివరి రోజున మీడియాను ఆహ్వానించారు కూడా.
సిపిఎం నిర్మాణపరమైన లోపాలను గురించి చెప్పదల్చుకుంటే మీడియా గత, ప్రస్తుత నివేదికలను (విడుదల తర్వాత) పరిశీలించి ఎంతైనా రాయొచ్చు. విమర్శలూ చేయొచ్చు. కానీ వాటిని తనకు తానుగా చర్చకు చేపట్టిన ఒక రాజకీయ పార్టీ నిజాయితీని, నిక్కచ్చితనాన్ని గుర్తించక తప్పదు. అలాగే వాటి ఆధారంగా చేసిన నిర్ధారణలు, ఇచ్చిన పిలుపులు ముందున్నాయి గనక వాటిపైనా వ్యాఖ్యానించవచ్చు. కానీ అవేవీ పట్టనట్టు కేవలం కాంగ్రెస్‌తో పొత్తు చుట్టూనే కథలన్నీ తిరిగాయి. కోల్‌కతాలో పది లక్షల మందితో జరిగిన ర్యాలీని గురించి ఇచ్చిన వార్తల కంటే ఈ ఊహాజనిత పొత్తుపై విభేదాల గురించిన వార్తకు ఎక్కువ ప్రచారమిచ్చాయి. కొన్ని ఇంగ్లీషు పత్రికలైతే దీనిపైన కేరళ, బెంగాల్‌ మధ్య, సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌ల మధ్య విభేదాలున్నాయని ఏదేదో రాశాయి. ఈ కథనాలను కొన్ని తెలుగు పత్రికలు ఉత్సాహంగా పునర్ముద్రించాయి కూడా. అంతేగాని కమ్యూనిస్టులు కొన్ని పొరబాట్లు సరిదిద్దుకోవాలని తాము చేస్తూ వచ్చిన విమర్శలపై చర్చ జరిగిందన్న వాస్తవాన్ని దారి తప్పించాయి. చెప్పాలంటే 1978లో సాల్కియాలో జరిగిన ప్లీనం తర్వాత సిపిఎం శక్తి, ప్రభావం చాలా విస్తరించి దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశాయి. తర్వాత పైన చెప్పిన ప్రతికూలతలూ వచ్చాయి. ఈ ప్లీనంలో తీసుకున్న నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే మరోసారి ప్రజా ఉద్యమాలు ఉధృతం చేయడం, నిర్మాణాన్ని మెరుగుపర్చుకోవడం అసాధ్యం కాదు. దేశంలో ప్రధాన వామపక్షంగా ఉంటూ వామపక్ష ఐక్యతను, వామపక్ష ప్రజాతంత్ర సంఘటనకు కట్టుబడిన సిపిఎం విధానం ఇప్పటి పరిస్థితులలో ఎంతైనా స్వాగతించదగింది. స్వతంత్ర శక్తిని పెంచుకోవడం, నిరంతరం పాలకపక్షాలతో పొత్తుల చుట్టూ చర్చ తిరిగే పరిస్థితిని తప్పించడం నిన్నటి మహాసభలోనూ, నేటి ప్లీనంలోనూ ప్రధానాంశాలు. కానీ మన మీడియాకు కావలసింది అదే. కమ్యూనిస్టులు ఏదో ఒక పాలకపక్షంతో ఉండాలి. ఉన్నారని అపహాస్యమూ చేస్తుండాలి! అంతేగాని స్వతంత్ర శక్తిగా ఎదగకూడదు.
ప్రపంచీకరణ నేపథ్యంలో యువతను, సామాజిక తరగతులను ఆకర్షించేందుకు వినూత్న విశాల పద్ధతులను అనుసరించాలని ప్లీనం తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆకర్షించింది. రకరకాల కుల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడాలని, కలసి వచ్చే సామాజిక శక్తులతో కలసి పనిచేయడంపై శ్రద్ధ పెట్టాలని ఇచ్చిన నినాదం ఆలస్యమైందని ఎవరన్నా అనొచ్చు గాని పొరబాటని చెప్పడానికి లేదు. సమరశీల వారసత్వం, నిర్మాణాత్మక స్వరూపం ఉన్న కమ్యూనిస్టులు ఈ పంథా తీసుకుంటే సామాజిక ఉద్యమాలు మరింత శక్తి సమకూర్చుకుంటాయి. అదే సమయంలో ప్రపంచీకరణ ప్రభావిత సరళీకరణ, కార్పొరేటీకరణలపై పోరాటమూ బలోపేతమవుతుంది. సరిగ్గా సామాజిక ఉద్యమకారులు స్వాగతించే ఈ అంశాలు ఇష్టం లేదు బలాఢ్య, ధనాఢ్యవర్గాలకు. నయా ఉదారవాదం, ప్రయివేటీకరణలపై పోరాటం వంటి సిపిఎం నినాదాలు కాలం చెల్లినవని వారు ప్రవచిస్తారు! భగవద్గీతతో ప్రపంచ పర్యటన చేస్తూ వర్ణాశ్రమ ధర్మాలు వల్లెవేసె ఆరెస్సెస్‌, బిజెపి సంఘ పరివార్‌ వారికి మహాధునికంగా కనిపిస్తుంది! యాగాలుయోగాలు, జపతపాలు, మూఢ నమ్మకాలు ఇవన్నీ కాలానుగుణం! ప్రజల తరపున నిలబడి దేశ స్వావలంబనను, స్వయం పోషకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునివ్వడం సైద్ధాంతిక ఛాందసం! వాస్తవాలను తలకిందులుగా చూపడమంటే ఇదే. ఇలాటి కాలం చెల్లిన మూఢ మతతత్వాలను కాలానుగుణం పేరిట రుద్దబడే దేశ, విదేశీ కార్పొరేట్‌ పెత్తనాలను, డాలరు దొరల శాసనాలను ప్రతిఘటించడం కన్నా ఆధునికత ఏముంటుంది? విశిష్ట విధానం ఏముంటుంది? ఆ మాటలు చెబుతున్నది, ఆ బాటన పోరాడుతున్నది సిపిఎం, వామపక్షాలు మాత్రమేనన్నది వీరికి కంటగింపు. దాన్ని మరింత పదునెక్కించే విధంగా అంతర్గత లోపాలు దిద్దుబాటు, రాజకీయ నిర్మాణ విధానాల పునరుద్ఘాటన జరిగితే మరింత ఉక్రోషం. ఈ దేశంలో సిపిఎం, వామపక్షాలు చెప్పే నికరమైన లౌకిక విధానాల ప్రభావం ఏమిటో ఇటీవల అవార్డు వాపసీ నుంచి అన్ని సందర్భాలలోనూ తేటతెల్లమైంది. 2014లో తిరుగులేదన్న మోడీత్వ 2015 ద్వితీయార్థంలో తీవ్ర నిరనసను ఎదుర్కొన్నది. ఏడాది చివరకు దాని మేడిపండు స్వరూపం వెల్లడైంది. ప్రాచీన రాజధాని పాటలీపుత్రం నుంచి నవ భారత రాజధాని ఢిల్లీ వరకూ అనేక చోట్ల అవమానకరమైన అపజయం పాలైంది. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌తో సహా కేరళ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తదితర చోట్ల స్థానిక ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు తిన్నది. కేరళలో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయమన్న వాతావరణం ఏర్పడగా బెంగాల్‌లోనూ క్రూర నిర్బంధాన్ని తట్టుకుని వామపక్షాలు పోరాడుతున్నాయి. ఇందుకు అభినందించాల్సింది పోయి అపహాస్యం చేయడం, నిరాధారమైన పొత్తు కథనాలతో గందరగోళపర్చడం తగనిపని. బడా మీడియా పోకడలు ఏమైనప్పటికీ సిపిఎం శ్రేణులు, శ్రేయోభిలాషులు కోల్‌కతా ప్లీనం నిర్ణయాలు స్వాగతిస్తూ ఆ బాటలో పురోగమించేందుకు దీక్షబూనతారు. గతంలో అనేక అగ్నిపరీక్షలను తట్టుకున్న వీరోచిత వారసత్వం సిపిఎం స్వంతం. కనుక ఇలాటి కథనాలకు, కర్కశ పాలకుల క్రౌర్యాలకు అది తలవంచడం జరగదు. ప్లీనం నిర్ణయాలు, నివేదికలు పూర్తిగా వెల్లడైనాక, ఆ దిశలో నడిచి వాస్తవ విజయాలు సాధించాక రాజకీయ ద్వేషులు సహితం ఈ సత్యం గ్రహించక తప్పదు. అంతేగాని వారి దుర్బోధలతో విధానాలు మార్చుకునే దుర్గతి సిపిఎంకు ఎన్నటికీ పట్టదు.
- తెలకపల్లి రవి