కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు రెండో తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా ప్లీనం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, సమ్మెను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు బిజెపి అనుబంధ సంస్థ అయిన బిఎంఎస్ కూడా మద్దతిస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి 14వతేదీ వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని అన్నారు. రైతు సమస్యలు, విద్య, వైద్యం, దళితులు, మైనార్టీల కోసం సామాజిక న్యాయం, కార్మికులకు కనీస వేతనాలు, పట్టణ ప్రాంతాల్లోని పేదల సమస్యలపై కరపత్రాలు పంచి ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించాలని కోరారు. రాయలసీమ కరువు, రాజధాని సమస్యలపై పోరాడాలని సూచించారు. చంద్రబాబుకు కమ్యూనిస్టుల భయం పట్టుకుందని, అందుకే తాను ఎక్కడికి వెళ్లినా ముందస్తుగా సిపిఎం నాయకులను అరెస్టు చేయిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. ప్రజాపోరాటాలతోనే సిపిఎం బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి.శ్రీరాములు అధ్యక్షత వహించారు.