స్వంతవారు చేదయ్యారా!

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం విదేశీ కార్పొరేట్ల చేతిమీదగానే జరుగుతోందని వినిపిస్తున్న విమర్శలకు ప్రభుత్వ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్లాట్ల లేఅవుట్‌ రూపకల్పనను పరాయి కన్సల్టెంట్లకు అప్పగించేందుకు సిఆర్‌డిఎ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) అత్యుత్సాహం కనబరచడం ప్రభుత్వ వైఖరిలో భాగమే. ఇందుకోసం బహిరంగ టెండర్లు పిల్చినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రులవారి చూపంతా విదేశీ ప్లానింగ్‌ కంపెనీల మీదే ఉంది. సింగపూర్‌, జపాన్‌ వారు మినహా భారతీ యులు అందునా ఆంధ్రులు పనికి రాకుండా పోయారు బాబుగారికి. రాజధాని నిర్మాణానికి సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్న ఘటనలన్నీ వీటినే రుజువు చేస్తున్నాయి.
టెండర్లు మొదలుకొని కన్సల్టెంట్ల ఎంపిక వరకు విధించిన నిబంధనలన్నీ స్థానిక కన్సల్టెంట్లను తప్పించే విధంగా ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వెల్లడౌ తున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేందుకు టెండర్ల నిబంధనలను సైతం మార్చేందుకు వెనకాడలేదు. మరి అప్పుడే కదా చట్టబద్ధంగా విదేశీ కార్పొరేట్లకు, కన్సల్టెంట్లకు రెడ్‌ కార్పెట్‌ పరిచే వీలు కలిగేది! ఇటీవల సిసిడిఎంసిఎల్‌ (క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) పిల్చిన టెండర్లు, వాటి నిబంధనలు భారతీయులెవ్వరూ అందుకోలేని విధంగా, కేవలం విదేశీలయుల కోసమే వేసినట్టున్నాయి. టెండర్‌ సంపాదించాలంటే ఐదు వేల కోట్ల రూపాయలతో సిటీని నిర్మించిన అనుభవం కావాలట. 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో పలు రకాల మౌలిక సదుపాయాలతో కూడిన రెండు నగరాలు నిర్మించిన అనుభవం ఉండాలట. ఇలాంటి వారు దేశం మొత్తం మీద దుర్భిణి వేసి వెతికినా ఒక్కరు కూడా దొరికే అవకాశం లేదని ఆ రంగం మీద కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నవారికైనా ఇట్టే అర్థమౌతుంది. ఎందుకంటే దేశంలోని అన్ని నగరాలను ప్రభుత్వాలే నిర్మించాయి. అటువంటప్పుడు స్థానికులకు అవకాశమే రాదు. విదేశీ కంపెనీలకు పట్టం కట్టడానికే ఈ ప్రత్యేక ఏర్పాటు. ఏదేమైనప్పటికీ స్థానిక అంశాలపై ఇక్కడి అధికారులకు ఉన్న పట్టు విదేశీ కన్సల్టెంట్లకు ఉండదన్నది జగమెరిగిన సత్యం. అటువంటప్పుడు స్థానిక సెంటిమెంట్లను ఎలా అర్థం చేసుకుంటాయి? వాటితో ముడిపడిన బాధ్యతలను ఎలా నెరవేర్చుతాయన్న ప్రశ్నలకు జవాబులే లేవు. రావు కూడా. ఎందుకంటే రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌ పూలింగ్‌ కింద రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూమి నిజ విలువను, వారికి కేటాయించిన ప్లాట్‌ మార్కెట్‌ విలువను అంచనా వేసే పని కూడా కన్సల్టెన్సీలదే. భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు, కమర్షియల్‌ ప్లాట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో కూడా అవే నిర్ణయిస్తాయి. వాస్తవానికి రైతులు కోరిన విధంగా సొంత గ్రామాలున్న సెక్టార్లలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. రైతులకు భూమితో ఉన్న అనుబంధాన్ని, సెంటిమెంట్లను అర్థం చేసుకుంటూ... వారికి ప్రభóుత్వం ఇచ్చిన వాగ్దానాలను విదేశీ కన్సల్టెన్సీలు నెరవేర్చడం సాధ్యం కాదు.
కన్సల్టెంట్ల ఎంపికకే ఇంతలా కంగారు పడితే లాభం లేదు. ముందు ముందు అవి నిర్వహించాల్సిన అసలుసిసలు పనులను పరిశీలిస్తే అంతకంతకు కుంచించుకుపోతున్న ప్రభుత్వం పాత్ర దర్శనమిస్తుంది. మన రాజధానిని నిర్మించబోయేది విదేశీ కార్పొరేట్లే. అందుకు కావాల్సిన రోడ్లు, రవాణా, ఉమ్మడి సదుపాయాలకు అవసరమైన స్థలాలు, ఆసుపత్రులు, పాఠశాలలు మొదలుకొని డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్తు, వీధి దీపాలు, పార్కులు, వంతెనలు, పర్యావరణం, భూ వినియోగం, చెత్త తొలగింపు వంటి అన్ని రకాల సౌకర్యాల కల్పన, నిర్వహణ బాధ్యత వాటిదే. ఆ సుముహూర్తం ఎంతో దూరంలో లేదు. మరో నాలుగు రోజుల్లో కన్సల్టెంట్ల ఎంపిక అయిపోతుంది. రెండు దశల్లో అవి సింగపూర్‌ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయడానికి కావాల్సిన కంపెనీలను ఎంచుకొని రంగంలోకి దిగుతాయి.
ఇంత సుదీర్ఘ ప్రక్రియలో ఏ ఒక్క దశలోనూ స్థానిక అధికారుల స్థాయి చాలదన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం అవమానకరం. వెంచర్లు వేయడం, మాస్టర్‌ ప్లాన్లు, లేఅవుట్‌లు రూపొందించడంలో 'విజిటిఎం ఉడా'ది అపారమైన అనుభవం. అలాంటి సుదీర్ఘానుభవం కలిగిన ఆ సంస్థ ప్రస్తుతానికి సిఆర్‌డిఎలో అంతర్భాగంగా ఉందని, సిబ్బంది కొరత కూడా ఉన్నందున ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్లను వెతకాల్సి వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలా అనుకుంటే పట్టణాభివృద్ధిశాఖ విభాగం, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు ఉన్నదెందుకు? రాజధాని నిర్మాణం మొత్తం విదేశీ కంపెనీలే నిర్మించి, నిర్వహిస్తే ప్రభుత్వం ఉన్నదెందుకు? ముఖ్యమంత్రిగారికి ఆంధ్రుల మీద, భారతీయుల మీద, వెరసి స్థానిక ప్రతిభ మీద నమ్మకం లేదా అన్న అనుమానం తప్పక కలుగుతుంది. సింగపూర్‌తో తనకు లాలూచీ ఉందేమోనన్న సందేహ నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత బాబుగారిదే. ఎంతసేపూ సింగపూర్‌, జపాన్‌ వారిని పొగడ్తలతో ముంచెత్తడం కాక స్థానిక ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విదేశీ కన్సల్టెంట్లకే పట్టం కట్టజూస్తున్నారంటే సిఎంకు, ఆయన చుట్టూ ఉన్న పారిశ్రామికవేత్తలకు, విదేశీ కార్పొరేట్లకు మధ్య ఉన్న లాలూచీనే కారణమనుకోవాలి. వ్యక్తిగత కారణాలు, ప్రయోజనాలే అలా నడిపిస్తున్నాయనడానికి ఈ అంకం ప్రత్యక్ష సాక్షి.