రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూనుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్ కాల్పుల ఘటనకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యాన సోంపే టలో మంగళవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న విమానా శ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా తిరుగుతున్న సింగపూర్ అంతర్జాతీయ విమానా శ్రయం కూడా 1200 ఎకరాల్లోనే నిర్మించారని గుర్తుచేశారు. రైతులనుంచి తీసుకున్న భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ లక్షలాది ఎకరాల భూము లను సేకరించి, రైతాంగాన్ని భూములనుంచి తరిమేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఐదెకరాలు కావాల్సిన చోట 20 ఎకరాలు ఇచ్చేస్తున్నారని చెప్పారు.
సోంపేట థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించి 1107 జిఒను రద్దు చేసి, వారి భూములను వారికి అప్పగిస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ మాటను నిలబెట్టుకోకుండా రైతాంగ ద్రోహిగా ప్రజల ముందు నిలిచిపోయారన్నారు. టిడిపి ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని 1107 జిఒను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకా అనేక సోంపేటలు ఉన్నాయని, ప్రభుత్వ బలవంతపు భూ ఆక్రమణలకు వ్యతిరేకం గా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రమాదకర భూసేకరణ చట్టం ఉందని, అది ఆమోదం పొందితే రైతులకు రానున్నవి గడ్డు రోజులేనని తెలిపారు. పోలాకిలో నిర్మించ తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్‌ను అంతర్జాతీయ బిడ్‌లు లేకుండా జపాన్‌కు చెందిన సుమిటోమి సంస్థకు కట్టబెట్టేరన్నారు. సిపిఐ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు వల్లే వేస్తున్న సింగపూర్, జపాన్, అమెరికా దేశాలు థర్మల్ పవర్ ప్లాంట్లను ఆపేశాయని తెలిపారు. వాళ్ల బొగ్గు అమ్ముకోవడానికి మన రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షనేతగా సోంపేట అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా 1107 జిఒను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. అంతకుముందు సోంపేట థర్మల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.