CPM ఆధ్వర్యంలో భూములు దున్నిన పేదలు..

నూజెండ్ల మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం 5-1లోని ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం గ్రామంలోని ప్రభుత్వభూములను ట్రాక్టర్‌తో దున్ని ఎర్రజండాలు పాతి ఆక్రమించారు. పాలక పార్టీలు ఎన్నికలకు ముందు పేదలందరికీ ఇళ్లస్థలాలు, సాగుభూములు ఇస్తామని వాగ్దానం చేసి, నేడు భూములన్నీంటిని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనేక చోట్ల ప్రభుత్వ భూములకు పెత్తందార్లు పట్టాలు పుట్టించి లక్షలరూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు పట్టాలివ్వాలని లేనిచో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. భూమిని దున్నే సమయంలో కొందరు భూమి మాది అని అడ్డంపడే ప్రయత్నాలు చేయగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యకాస జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ పేదలకు భూములు దక్కేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ 21న భూసమస్యలపై పెద్దఎత్తున కలెక్టరేట్‌ వద్ద ధర్నా జరుగుతుందని, పేదలు, భూమిలేనివారు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.