GST నష్టదాయకం..

 జిఎస్‌టి(గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌) వ్యవస్థకు మారటం వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించటం గురించి మాత్రమే ఇప్పటి వరకు చర్చ పరిమిత మైంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరిగినప్పుడు జిఎస్‌టిని అంతిమంగా ఉపయో గించుకునేవారు మాత్రమే కడతారు. దీనితో ఆ సరుకులను ఉత్పత్తి చేసే రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం రాదు. ఇది రాష్ట్రాల ఖజానాలకు నష్టదాయకం. అంతర్రాష్ట్ర వాణిజ్యం జరగనప్పుడు కూడా ప్రస్తుత పన్ను వ్యవస్థ నుంచి జిఎస్‌టి వ్యవస్థకు మారటం నష్టదాయకమే. రాష్ట్రాలకు వచ్చే అలాంటి నష్టాలకు పరిహారం చెల్లించనున్న కాల వ్యవధి, అలాంటి నష్టాలను అంచనావేసే పద్ధతి వంటి విషయాల గురించి చర్చ జరుగుతున్నది. రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించటం అనేది నిస్సందేహంగా చాలా ముఖ్యమైన విషయమే.
ఎంపికకు అవకాశం ఇవ్వకపోవటం
ఏమైనప్పటికీ ఈ పరిణామంలో చాలా విషయాలు మిళితమైవున్నాయి. వీటిలో నేను కేవలం రెండు విషయాలను గురించి చర్చిస్తాను. మొదటిది పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాలను రూపొందించుకునే స్వేచ్ఛను భవిష్యత్తులో రాష్ట్రాలు కోల్పోతాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీపడే సమాఖ్య వ్యవస్థలో అర్థవంతంగా ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకు తప్పకుండా ఉండితీరాలని ప్రజాస్వామ్యం డిమాండ్‌ చేస్తున్నది. సబ్బులను ఎంచుకునే తీరులో రెండు రాజకీయ పార్టీల మధ్య ఎంపిక ఉండకూడదు. అధికారంలోకి వచ్చినప్పుడు భావజాలపరంగా విభేదించే రెండు రాజకీయ పార్టీలకు ద్రవ్య విధాన సంబంధ వ్యూహాలతో సహా తమతమ ఆర్థిక వ్యూహాలను రూపొందించుకునే స్వేచ్ఛ ఉండాలి. నిర్ణీత రేట్లు గల జిఎస్‌టి ఉండటంవల్ల రాష్ట్రాలకు పన్నులపై ఆదాయాన్ని ఏ మేరకు పెంచుకోవాలనే విషయంపై స్వేచ్ఛ ఉండదు. కాబట్టి దీనితో ప్రజలకు ప్రాథమికంగా ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. ఇది ప్రజాస్వామ్యం బలహీనపడటానికి దోహదపడుతుంది. అంటే దీనితో ఎన్నికల్లో ప్రజలు ఎంచుకునే పార్టీ ఏదైనా తేడా ఏమీ ఉండదు. అంటే అదే ద్రవ్య విధానం, అదే ఆర్థిక విధానం కొనసాగుతాయన్నమాట.
వేరే మాటల్లో చెప్పాలంటే, ప్రస్తుత పన్నుల వ్యవస్థ స్థానంలో జిఎస్‌టి వ్యవస్థను ప్రవేశపెట్టటం వల్ల జరిగే నష్టానికి పరిహారం ఇవ్వటం అటుంచి, ఒక వేళ అసలు నష్టాలు అనేవే లేకపోయినా లేక నిరంతరం పూర్తి నష్ట పరిహారం ఇచ్చినప్పటికీ జిఎస్‌టికి మారటంలో సమస్యలున్నాయి. అవి అధికార కేంద్రీకరణకు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడటానికి సంబంధించినవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం ఉండే జిఎస్‌టి కౌన్సిల్‌కు నివేదించటం ద్వారా కొన్ని సరుకులపై వేసే జిఎస్‌టి పన్ను రేటును మార్చవచ్చని, ఈ సౌలభ్యాన్ని విస్మరించి ప్రజాస్వామ్యం దెబ్బతింటుందనే వాదనను ముందుకు తేవటమంటే అది అతి అవుతుందని కొందరు అనుకోవచ్చు. అయితే ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం తనకు భిన్నమైన భావజాలమున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం ఉన్న జిఎస్‌టి కౌన్సిల్‌కు తను ఎంచుకున్న ద్రవ్య వ్యూహాన్ని అనుసరించటానికి విజ్ఞాపన చేసుకోవలసిరావటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కానీ జిఎస్‌టి వ్యవస్థ ప్రతి సరుకుకూ ఒక ప్లోర్‌ రేటు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయజాలవు. అలాగే ఈ ఫ్లోర్‌ రేటుపై ఎంతైనా పన్ను విధించటానికి రాష్ట్రాలను అనుమతించి ఉంటే నేను చెబుతున్న ప్రమాదం ఉండేది కాదు. నిజానికి అలాంటి స్కీంను చాలామంది ఆర్థికవేత్తలు సూచించారు. ఇది చాలా దేశాలలో అమలులో కూడా ఉన్నది. అయితే ఇది ప్రతి సరుకుకూ దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పన్ను రేటును ఉండేలాచేసి తద్వారా జాతీయ మార్కెట్‌ను ఐక్యం చేస్తుందని దేశంలో జిఎస్‌టిని సమర్థించేవారు చెబుతారు. కాబట్టి మనం అనుసరించబోయే జిఎస్‌టి వ్యవస్థ 'ఫ్లోర్‌ రేట్‌ ప్లస్‌ వాట్‌ యు లైక్‌' వ్యవస్థ కాదు. ఆ విధంగా ప్రజాస్వామ్యానికి తూట్లుపడతాయనే భయం పూర్తిగా వాస్తవికమైనది.
జిఎస్‌టి వ్యవస్థ ప్రవేశపెట్టేందుకు దోహదపడే వాదనలు పూర్తిగా అప్రామాణికమైనవనే వాస్తవం అదే స్థాయిలో ఆందోళనకరమైనది. జిఎస్‌టిలోకి మారితే స్థూల జాతీయోత్పత్తి ఫలానా శాతం పెరుగుతుందని, అది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందని చెప్పటం హాస్యాస్పదం. అయినప్పటికీ అవే వాదనలను పదేపదే ముందుకు తెస్తున్నారు. గత సంవత్సరం వృద్ధి రేటుపై ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీలకే ఏకాభిప్రాయం లేదు. కానీ అవే ఏజెన్సీలు భవిష్య అభివృద్ధిని ప్రతి సంవత్సరం ఫలానా పాయింట్ల వరకు జిఎస్‌టి పెంచుతుందని ముక్తకఠంతో చెబుతున్నాయి. జిఎస్‌టిని ఇంతగా సమర్థించటం నిజంగా ఆశ్చర్యకరం. అయితే ఈ వ్యర్థ వాదనలను పక్కనబెట్టి జిఎస్‌టి ఒక ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టిస్తుందని చేసే వాదనను తీసుకుందాం. నిజానికి భారత్‌కు ప్రస్తుతం ఏకీకృత మార్కెట్‌ లేదని చెప్పటం, అందుకోసం జిఎస్‌టి అవసరం అనటం మూర్ఖత్వం. ఒకే సరుకుకు వివిధ రాష్ట్రాలలో అనేక విధాలైన పన్నులు ఉండటం చూసీచూడగానే 'అహేతుకం' అనిపిస్తుంది. అయితే దగ్గరగా చూసినప్పుడు ఈ వాదన పసలేనిదనే విషయం తెలుస్తుంది. దేశాలు నిర్మించే సంస్థలు పెట్టుబడిదారులకు, వారి ప్రతినిధులకు, నియంత్రిత మీడియాకు 'హేతుబద్దం'గా ఉన్నాయా, లేదా అనే ప్రాతిపదికన కాక అవి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయా, లేదా అనే ప్రాతిపదికన ఉండాలి. ఈ విధంగా పన్నులు వేసే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాన్ని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు నచ్చే 'ఏకీకృత జాతీయ మార్కెట్‌'ను సృష్టించటాన్ని అంగీకరించరాదు.
ఆ విధంగా జిఎస్‌టి వ్యవస్థకు మారటం అవసరమని, దాన్ని అనేక దేశాలు ఆచరిస్తున్నాయని, మనం వెనుక పడరాదని చేసే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఇది పూర్తిగా అసంబద్ధం. తమ దేశ ప్రజలకు ఏ ఆర్థిక విధానాలు లాభదాయకమో వాటినే ప్రభుత్వం అనుసరించాలి. అంతేగాని ఎవరో దేనినో అనుసరిస్తున్నారని గుడ్డిగా వాటిని అమలు చేయటం సరి కాదు. ఇప్పటి పరిస్థితులలో ఇతర దేశాలను అనుసరించటం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే జిఎస్‌టిని అనుసరించమని కోరేది ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి బ్రెట్టన్‌వుడ్స్‌ సంస్థలు. ఈ సంస్థలు తెచ్చే ఒత్తిడి కారణంగా తప్ప జిఎస్‌టికి అనుకూలంగా మరేవిధమైన మేధోపర వాదన లేదు. అందుకే అనేక దేశాలు ఈ పన్నుల వ్యవస్థను చేపడుతున్నాయి. ఇతర దేశాలు జిఎస్‌టిని అనుసరిస్తున్నాయి కాబట్టి మనం కూడా అనుసరించాలనటం అంటే ఇతర దేశాలు నయా ఉదారవాద విధానాలను అనుసరిస్తున్నాయి కాబట్టి మనం కూడా అనుసరించాలనటం లాంటిదే! క్లుప్తంగా చెప్పాలంటే జిఎస్‌టిని ముందుకు తేవటానికి అనేక పనికిమాలిన వాదనలను ముందుకు తెస్తున్నారు. దీని పర్యవసానంగా ప్రజల ఎంపికను నిరర్థకంచేసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్య చేస్తున్న తీరు గురించి జరగవలసినంత చర్చ జరగటం లేదు. ఇక్కడ అంతగా పట్టించుకోని మరో విషయం ఉన్నది. దీని గురించి అధికారికంగా ప్రకటించనప్పటికీ రాష్ట్రాలలో ఒకేవిధమైన పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టే జిఎస్‌టి సమర్థకులు సరుకులలో కూడా ఏకీకృతం జరగాలని కోరుకుంటున్నారు. వేరే మాటల్లో చెప్పాలంటే ఒకే విధమైన పన్ను రేట్లు ఉండాలని వారు కోరుకుంటున్నారు. అంటే ఎస్‌జిఎస్‌టికి ఒకటి, సిజిఎస్‌టికి ఒకటి అన్ని రాష్ట్రాలలో, అన్ని సరుకులకూ లేక మహా అయితే సరుకులకు పరిమిత సంఖ్యలో రేట్లు కావాలని వారు కోరుతున్నారు. జిఎస్‌టిని ఏ దేశాలలో ప్రవేశపెట్టారో అక్కడ సరుకులకు నిజంగా కొన్ని రేట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదే 'మంచిది' అనే అభిప్రాయం ఉన్నది.
ప్రతికూల ప్రభావం
దీని పర్యవసానాలను పరిశీలిద్దాం. మొదటిది, ఏకీకృత జిఎస్‌టి రేటు(సిజిఎస్‌టి ప్లస్‌ ఎస్‌జిఎస్‌టి). ఒకవేళ ఈ రేటు 'రెవెన్యూ న్యూట్రాలిటీ'ని ఆచరణలోకి తేవటానికే అయితే అంటే గతంలో లాగానే రెవెన్యూ(ఆదాయం) పరిమాణం ఉండేట్లయితే సరుకులకు ప్రస్తుతం ఉన్నట్లుగా కనిష్ట, గరిష్ట పన్ను రేట్లు ఉండాలి. అయితే అధిక పన్ను రేట్లు విలాస వస్తువులపై విధించటం, తక్కువ పన్ను 'నిత్యావసర' వస్తువులపైన, సేవలపైన విధించటం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి 'రెవెన్యూ న్యూట్రల్‌' ఏకీకృత పన్ను రేటును అమలులోకి తెచ్చినా నిత్యావసర వస్తువులకు పన్ను పెరిగి, విలాస వస్తువులకు పన్ను తగ్గుతుంది. దానివల్ల ప్రస్తుతం అమలులో ఉన్న సరుకులకు వివిధ పన్ను రేట్లు ఉండటానికి బదులు జిఎస్‌టి రూపంలో ఏకీకృత పన్ను విధానం రావటంతో పేదలపై పన్ను భారం పెరిగి, ధనికులపై పన్ను భారం తగ్గుతుంది. క్లుప్తంగాచెప్పాలంటే ఏకీకృత జిఎస్‌టి రేటు విధాన పున్ణపంపిణీ ప్రభావం ప్రగతి నిరోధకమైనది. మనకు ఒకే పన్ను రేటు కాకుండా కొన్ని విధాలైన పన్ను రేట్లు ఉన్నప్పుడు కూడా ఇదే నిర్ధారణ ఉంటుంది. జిఎస్‌టి విధానానికి మారటం ప్రగతి నిరోధకమైనదని, దీనికి కారణం అది ప్రత్యక్ష పన్నులకు బదులు పరోక్ష పన్నులపై ఆధారపడే ధోరణి కలిగి ఉంటుందనే వాదన ఉన్నది. అయినప్పటికీ దానికితోడు అలాంటి పరివర్తన పరోక్ష పన్నుల క్షేత్రంలో కూడా ప్రగతి నిరోధకమైనదే. ఎందుకంటే అనేక విధాలైన పన్ను రేట్లకు బదులు ఒకే ఒక్క రేటుగానీ లేక ఏవో కొన్ని రేట్లుగానీ అమలులోకి వస్తాయి.
ఒక సరుకు ఉత్పత్తి విలువకు భిన్నంగా జోడింపబడిన విలువకు పన్ను వేయాలనే ఆలోచన మెచ్చుకోదగినది. అయినప్పటికీ సమస్య ఏమంటే ఈ ఆలోచనను నయా ఉదారవాద ఎజెండాలో భాగమైన కేంద్రీకరణ, ప్రభుత్వాల అధికారాలను కుదించటం, ప్రగతి నిరోధక పున్ణపంపిణీని మార్చటంతో జతచేసే ఆలోచనతోనే సమస్య వస్తున్నది. నయా ఉదారవాదానికి సేవ చేయటానికి వ్యాట్‌ను ఉపయోగించకుండా చూడటం చాలా ముఖ్యం. దొడ్డిదారిన నయా ఉదారవాదానికి సేవ చేయటానికి 'ఈ విషయాలను జిఎస్‌టి కౌన్సిల్‌కు వదిలేద్దాం' అనే వాదనను ఉపయోగించే అవకాశముంది. దీనిని కూడా తప్పకుండా ప్రతిఘటించాలి.
ప్రభాత్‌ పట్నాయక్‌