జిఎస్‌టి బిల్లును ఆమోదించేలా ఏకాభిప్రా యాన్ని తీసుకు రావడంలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశం విఫలమైంది. జిఎస్‌టి బిల్లుపై రాజ్యసభలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో జిఎస్‌టి బిల్లుకు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, పెండింగ్‌లో వున్న మిగిలిన ఆరు బిల్లులను చివరి మూడురోజుల సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలు సహకరిస్తామన్నాయి. గంటపాటు సాగిన చర్చల అనంతరం అన్సారీ మాట్లాడుతూ సమావేశం సానుకూలంగా సాగింద న్నారు. పార్లమెంట్ పనిచేయకపోవడంపై పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని పార్లమెంటరీ వ్యవహరాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి చెప్పారు. కీలకమైన జిఎస్‌టి బిల్లు పై కాంగ్రెస్ ఇంతవరకు తన వైఖరి స్పష్టం చేయనందున ఈ సమావేశాల్లో ఇది లేనట్టేనని చెప్పారు.