
విశాఖ కలెక్టరేట్ వద్ద సమస్యలపై శాంతియుతంగా మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళనలు నిర్వహిం చారు. పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా ఎప్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యాన విశాఖ జిల్లా పాడేరులో విద్యార్థులు ఐటిడిఏ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన నిర్వహించారు. ప్రదర్శనకు అనుమతి లేదంటూ ఎస్‌ఐ సూర్యప్రకాశరావు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అప్పారావును అరెస్టు చేశారు. అరకువేలీ, నర్సీపట్నంలో విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. అచ్యుతా పురంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ధర్నా, రాస్తారోకో జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కృష్ణాజిల్లా మైలవరంలోని అంబేద్కర్ సెంటరు, నూజివీడులో చిన్న గాంధీ బొమ్మసెంటరు, ఎ.కొండూరు మండలం కంభంపాడు సెంటరు, తిరువూరులో బోసుబొమ్మ సెంట రులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. మైలవరంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్‌ను పోలీసు అరెస్టు చేశారు. పలు కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.