UGC ముట్టడి ఎందుకు...?

ఆక్యుపై యుజిసి అనేది... ఢిల్లీ విద్యార్థి లోకం ఎత్తుకున్న ప్రధాన నినాదం. ఢిల్లీలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో నేడు యుజిసి ముట్టడి అనేది ఒక పెద్ద ఉద్యమంగా తయారయింది. దేశంలో గత రెండు దశాబ్దాలుగా వేగవంతమైన నయా ఉదారవాద విధానాల ఫలితంగా అన్ని రంగాలూ స్వరనాశనమయ్యాయి. అన్ని రంగాల్లో ప్రయివేట్‌ ఆధిపత్యం పెరిగింది. అందులో మరీ ముఖ్యంగా విద్య, వైద్యం అంగడి సరుకైనాయి. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ప్రయివేటు అనుకూల విధానాల ఫలితంగా ఉన్నత విద్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. ఇప్పటి వరకు విద్య జోలికి రాని ప్రభుత్వం ఒక్కసారిగా ఉన్నత విద్యలో సంస్కరణలు తెచ్చేందుకు పూనుకుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే విద్యపై విషపు దాడికి పూనుకున్నారు. విద్యా రంగంలో సమూల మార్పులు తెస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రాల విద్యా శాఖా మంత్రుల సమావేశంలో పేర్కొంటే... త్రిపుర, మరో రెండు, మూడు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలూ వంత పాడాయి. ఇటీవలి కాలంలో విద్యా సంస్థల్లో ప్రజాస్వామ్య హక్కులపైనా దాడి పెరిగింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య వ్యాపారీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణ చేస్తే... ప్రస్తుత ప్రభుత్వం కాషాయీకరణకు పూనుకుంది. బిజెపి కేంద్రంలో అధికారానికి వచ్చిన నాటి నుంచి ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. రూసా, సిబిసిఎస్‌, కామన్‌ యూనివర్శిటీల బిల్లు, తదితర విద్యా వ్యతిరేక విధానాలు తెచ్చి, వాటి నష్టాలను బహిర్గతం చేయకుండా అమలు చేస్తున్నది. సెంట్రల్‌ యూనివర్శిటీల బిల్లుకు సంబంధించి బ్లూప్రింట్‌ తయారైందని, అందులో కామన్‌ కరిక్యులమ్‌, కామన్‌ సిలబస్‌ను ప్రథమంగా కేంద్రం పేర్కొంది. దీని వల్ల ఆయా రాష్ట్రాల అవసరాలకు తూట్లు పొడిచినట్లవుతుంది.
జాతీయోద్యమాన్ని వక్రీకరించే ప్రయత్నంలో భాగంగానే చరిత్ర పుస్తకాలపై దాడికి పాలకులు పూనుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు సుదర్శన్‌రావును ఐసిహెచ్‌ఆర్‌ ఛైర్మన్‌గా నియమించిన తరువాత చరిత్రకా రుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ రచనలను నిషేధించడం తెలిసిందే. ఇప్పటికే హర్యానాలో పాఠశాల స్థాయిలో పాఠ్యాంశంగా సంస్కృతం తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పెనలా వచ్చిన విద్యార్థి ఉద్యమాల ద్వారానే మద్రాస్‌ ఐఐటిలోని అంబేద్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. లింగ్డో కమిషన్‌ విద్యా సంస్థల్లో ఎన్నికలతో ప్రజాస్వామ్య వాతావరణాన్ని బలోపేతం చేయవచ్చునని సిఫార్స్‌ చేస్తే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కాగితాలకు పరిమితం చేశాయి. ప్రయివేటుకు విద్యా రంగాన్ని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది.
'ఆక్యుపై' ఎలా వచ్చింది?
పరిశోధనలపై యుజిసి నిర్ణయానికి వ్యతిరేకంగా వాల్‌స్ట్రీట్‌ ఉద్యమ స్ఫూర్తితో 'ఆక్యుపై యుజిసి'ని ఢిల్లీ విద్యార్థి లోకం నిర్వహిస్తున్నది. గత పది రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. దేశంలోని అన్ని సెంట్రల్‌ యూనివర్శిటీల్లో ఈ ఉద్యమానికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మద్రాస్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ, ఇఫ్లూ, జోధపూర్‌ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీలకు ఆక్యుపై యుజిసి పాకింది.
పరిశోధనలపై కేంద్రం దాడి
దేశ పట్టుగొమ్మలైన యూనివర్శిటీలను సంక్షోభంలోకి నెడుతున్నారు. ఇటీవలి యుజిసి తీసుకున్న నిర్ణయం మూలాన ఏళ్ల తరబడి జరుగుతున్న పరిశోధనలపై దాడి చేసినట్లయ్యింది. దేశ చారిత్రక, భౌగోళిక, రాజకీయ, సైన్స్‌, తదితర విభాగాల్లో జరుగుతున్న పరిశోధనలు అంతం కాబోతున్నాయి. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు నెట్‌యేతర ఫెలోషిప్‌ కింద ఎంఫిల్‌ విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున 18 నెలల పాటు, పిహెచ్‌డి విద్యార్థులకు నెలకు రూ.8 వేల చొప్పున నాలుగేళ్లు ఆర్థిక సహాయం కేంద్రం ఇప్పటి వరకు అందజేస్తున్నది. ఈ ఫెలోషిప్‌ను రద్దుచేస్తూ యుజిసి గత సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రష్యా, జపాన్‌, జర్మనీ, చైనా, అమెరికా లాంటి దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదగడానికి ప్రధాన కారణం అక్కడ జరిగే పరిశోధనలే. ఏటా ప్రపంచ అత్యున్నత పరిశోధక పురస్కారం 'నోబెల్‌ బహుమతి' అత్యధికంగా ఈ దేశాల వారికే వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆయా దేశాలు పరిశోధనలకు ఇస్తున్న ఊతమే కారణం. దేశంలో 32 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో 46 కేంద్రీయ విశ్వ విద్యాలయాలున్నాయి. ఢిల్లీ లాంటి కొన్ని రాష్ట్రాలు మినహా యిస్తే, ప్రతి రాష్ట్రంలో ఒకటి ఉంది. ఈ విద్యాలయాల్లో జరిగే పరిశోధనలకు నెట్‌యేతర ఫెలోషిప్స్‌ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రస్తుతం వాటిని రద్దు చేయాలని యుజిసి నిర్ణ యించింది. దీని ఫలింగా దేశంలో పరిశోధనలు చేస్తున్న వేలాది పరిశోధకుల నోట్లో మట్టి కొట్టినట్లవుతుంది. ప్రతి ష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో యుజిసి, సిఎస్‌ఐఆర్‌, ఐసిఎస్‌ఎస్‌ఆర్‌, ఐసిఎంఆర్‌, ఐసిహెచ్‌ఆర్‌, ఐసిసిఆర్‌, డిఎస్‌టి, డిబిటి, పలు ఇతర సంస్థలు దాదాపు 300 రీసెర్చ్‌ ప్రాజెక్టుల్లో పరిశోధనలు చేసేందుకు ఫెలోషిప్స్‌ ఇస్తున్నాయి. వాటిలో యుజిసి దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ అన్ని విభాగాలకూ ఫెలోషిప్స్‌ ఇస్తుంది. ఈ నిర్ణయంతో చాలా మందికి యుజిసి ఇచ్చే ఫెలోషిప్‌ రద్దవుతుంది. ఇప్పటికే సామాజిక తరగతులకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమౌతున్నారు. అందులో ఎంఫిల్‌, పిహెచ్‌డి వంటి పరిశోధనలకు వచ్చే వారు రెండు నుంచి మూడు శాతం ఉంటారు. ఇట్లాంటి చర్యల వల్ల ఆ సంఖ్య మరింత తగ్గుతుంది.
'ఆక్యుపై యుజిసి' ఆవశ్యకత
గత ప్రభుత్వాలు విద్యా రంగ అంశాలపై దాడి చేస్తే, ఇప్పుడు నేరుగా విద్యార్థులు, పరిశోధలకులపై దాడి చేస్తున్నారు. వారు పొందాల్సిన ఫెలోషిప్‌లను, ఇతర అవకాశాలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)యేతర ఫెలోషిప్‌ను రద్దుచేస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యుజిసి) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత వారం రోజులుగా ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర విద్యార్థి సంఘాలు 'ఆక్యుపై యుజిసి' తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ(డియు), జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ(జెఎన్‌యు), అంబేద్కర్‌ యూనివర్శిటీలకు చెందిన వేలాది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు గత పది రోజులుగా యుజిసి ప్రధాన ద్వారం వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునందుకొని సుమారు రెండు వేల మంది విద్యార్థులు మధ్యాహ్నం రెండు గంటలకే యుజిసి కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు పట్టువదలకుండా ఆందో ళన చేపబడుతున్నారు. అలాగే మరోవైపు వందలాది మంది సెంట్రల్‌ రిజర్వర్డ్‌ పోలీస్‌ ఫోర్సు(సిఆర్‌పిఎఫ్‌), ఢిల్లీ పోలీ సులు అక్కడకు చేరుకున్నారు. కార్యాలయం లోపల యుజిసి అధికారులను కలిసేందుకు వెళ్ళేందుకు ప్రయత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎంత వారించినా పోలీసులు అత్యుత్సాహం చూపించి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులపై దాష్టీకానికి ఒడిగట్టారు. ఒకానొక దశలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను టార్గెట్‌ చేసి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఢిల్లీ యూనివర్శిటీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ప్రశాంత్‌ ముఖర్జీకి ఎడమ భుజంపై పెద్ద గాయమవ్వగా, జెఎన్‌యు ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శికి కుడి చేయి విరిగింది. యుజిసి నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన ఆగదని, నిరసనలను వీడబోమని స్పష్టం చేశారు. పరిశోధనలు జరగకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని మేధావులు చెబుతున్నారు. ఈ ఉద్యమంలో అనేక విద్యార్థి సంఘాలు, మేధావులు పాల్గొని మద్దతు నిచ్చాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తున్నారు.
మాట మార్చిన యుజిసి
నెట్‌యేతర ఫెలోషిప్‌లను రద్దు చేయాలని నిర్ణయించిన యుజిసి దానికి సంబంధించి ఒక సమీక్షా కమిటీ వేసింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తను తీసుకున్న నిర్ణయాన్ని త్వరితగతిన అమలు చేయాలని యుజిసి కృతనిశ్చయంతో ఉంది. అయితే ఆదిలోనే హంస పాదు అన్నట్లు దానికి గట్టి దెబ్బ తగిలింది. ఢిల్లీ విద్యార్థి కెరటం ఆక్యుపై యుజిసి నిర్వహించిన తరువాత దానికి దేశంలో పెరుగుతున్న మద్దతును పసిగట్టిన యుజిసి మాటమార్చింది. తాము ఎటువంటి సర్క్యులర్‌ జారీ చెయ్యలేదని, కేవలం సమావేశంలో నిర్ణయించామని తెలిపింది. అయితే ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు మాత్రం అధికారికంగా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తున్నారు.
ముఖం చాటేసిన ఎబివిపి
అన్ని విద్యార్థి సంఘాలూ ఒకపక్క పోరు కెరటాలై ఉద్యమిస్తుండగా మరోపక్క విద్యార్థుల సమస్యలను పరిష్కారిస్తామని, విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తా మని అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఎబివిపి) ఢిల్లీ యూని వర్శిటీ గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. ఈ నిర్ణయా నికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆక్యుపై యుజిసిలో ఎబివిపి ముఖం చాటేసింది. దీన్ని వ్యతిరేకించిన పాపాన పోలేదు.
- జె జగదీశ్‌ 
(వ్యాసకర్త ప్రజాశక్తి న్యూఢిల్లీ ప్రతినిధి)