కౌలు రైతుకు భరోసా ఏదీ?

రైతు భరోసా నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఒబిసి మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు మాత్రమే సహాయం అందుతుంది. అగ్ర కులాల్లోని పేద రైతులు ముందుగా మినహాయించబడ్డారు. తరువాత మిగిలిన వారిలో ఆ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా ఈ సహాయం అందదు. అన్నదమ్ములో, తండ్రీ కొడుకులో ఒకే కుటుంబం అన్న పేరుతో కోత పెడుతున్నారు. దరఖాస్తులన్నీ ఇలా ఒడపోసి ఐదవ వంతుకు తగ్గిస్తే ఉన్న వాటికి భూ యజమాని సంతకం లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేశారు. ఈ అవాంతరాలన్నీ దాటుకొని ఎంత మందికి భరోసా సహాయం దక్కుతుందో చూడాలి. ఇప్పటి వరకు నమోదు కానివారు నవంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కౌలు రైతుల్లో ఉన్న ఆందోళనను తాత్కాలికంగా తగ్గించవచ్చుగానీ పరిష్కారం చూపదు. నేడు కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ నెలలోగా పరిష్కారం అవుతాయన్న గ్యారంటీ లేదు. సహాయాన్ని కుదించాలన్న ప్రభుత్వ వైఖరి ముందుగా మారాలి. మొదట చేసిన వాగ్దానం ప్రకారం భూమి లేని కౌలుదార్లందరికీ బేషరతుగా ఎలాంటి మినహాయింపు లేకుండా సాగుదార్ల హక్కు చట్టం కింద కౌలుదారు గుర్తింపు కార్డులివ్వాలి. రైతు చెంతకే ప్రభుత్వం వచ్చి కౌలుదార్లకు విశ్వాసం కల్పించాలి. భూయజమాని సంతకాన్ని తప్పనిసరి చేయకూడదు. కౌలు రైతు ఇచ్చే స్వీయ అఫిడవిట్‌ ఆధారంగా నమోదు చేయాలి. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే బహిరంగ విచారణ జరిపి నిగ్గు తేల్చాలి. తుది జాబితాలను బహిరంగంగా ప్రకటించాలి. అప్పుడే కొంత ఆలస్యమైనా కౌలు రైతులకు విశ్వాసం కలుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చట్టం లోని తప్పుడు నిబంధనలను తక్షణం సవరించి కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. లేకుంటే నవరత్నాల్లోని ఒక రత్నం చేజారినట్లే. జగన్‌ ప్రభుత్వం విశ్వసనీయతకు ఇది పరీక్ష.

..వి శ్రీనివాసరావు  ( వ్యాసకర్త, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు )