అక్టోబర్‌ విప్లవ దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ

ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చడం వంటివి సోషలిజంతోనే సాధ్యమని అక్టోబర్‌ విప్లవ దినోత్సవ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్‌ విప్లవ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పెట్టబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని చూపించి, కార్మికవర్గం పరిపాలన చేయవచ్చని సోవియెట్‌ యూనియన్‌ ప్రపంచానికి నిరూపించిందని గుర్తుచేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలనను అధికారంలోకి తీసుకురావడంలో ఎర్రజెండా కీలకపాత్ర పోషించిందని తెలిపారు. దురదృష్టవశాత్తు స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని, త్యాగాలకు దూరంగా ఉండి, బ్రిటీషు వారికి ఊడిగం చేసిన ఆరెస్సెస్‌కు సంబంధించిన బిజెపి భారతదేశంలో నేడు అధికారంలోకి రావడం బాధాకరమన్నారు. ఆరెస్సెస్‌, బిజెపిలను గద్దె దింపితేనే స్వాతంత్య్రానికి అర్థం ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే ఆనాటి అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తితో, భారత కమ్యూనిస్టు ఉద్యమ ఆరంభ కాలంలో తొలితరం నాయకులు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలను ఐక్యపరిచే బాధ్యతను నవతరం స్వీకరించాలని కాంక్షించారు.